Site icon Sanchika

జీవన రమణీయం-45

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]కా[/dropcap]నీ, చిత్రంగా ఒకనాడు, ఫిలిం ఛాంబర్‌లో పైన, మెట్లు ఎక్కగానే కుడి వైపు నుండే కె.ఎస్. రామారావుగారి ఆఫీసులో నేను పని చేసుకుంటున్నాను. దాని వెనకాల మోహన్‌బాబుగారి ఆఫీస్ వుంటుంది! ఇప్పటికీ అంతే! అలా ఆ రోజున కూడా పని చేసుకుంటుండగా, “అమ్మా బలభద్రపాత్రుని రమణేనా? నేను పరుచూరి గోపాలకృష్ణని” అని కంచు కంఠంలా మోగింది. నేను అప్పటికి సెల్‍ఫోన్ వాడడం మొదలుపెట్టి, ఒకటి రెండేళ్ళు అయింది. “అవునండీ, నమస్కారం” అన్నాను.

“నేను ఛాంబర్ కింద వున్నాను. నువ్వు కిందకి రావద్దులే అమ్మా. నేనే పైకి వచ్చి మాట్లాడ్తాను” అన్నారు.

సింబాలిక్‌గా ‘నన్ను జీవితంలో పైకి రమ్మని దీవించినట్టు’ ఆ మాటలు ఇప్పటికీ ఆయనకి చెప్పి వెక్కిరిస్తూంటాను గురువుగార్ని. అప్పుడూ అసోసియేషన్‌కి ఆయనే ప్రెసిడెంట్!

కాసేపటికే ఆయన వచ్చి, నేను నమస్కారం పెట్టాకా, కూర్చుని, “మన రైటర్స్ అసోసియేషన్‍లో జాయిన్ అవవేంటమ్మా?” అన్నారు. నేను “పదకొండువేలు కట్టలేక సార్” అన్నాను. “సినిమాలు చేస్తున్నప్పుడు కట్టాలి కదమ్మా… లేకపోతే సినిమా ఆగిపోదూ?” అన్నారు.”ప్రొడ్యూసర్ గారికే కదండీ ఆ విషయం ముఖ్యం” అన్నాను. “అమ్మదొంగా… అలా వచ్చావా? సరే.. అయితే… ఆయన చేతే కట్టిస్తా” అని వెళ్ళిపోయారు. అలా కె.ఎస్.రామారావు గారిని అడిగి నా మెంబర్‌షిప్ తెప్పించి కార్డ్ నా చేతికిప్పించారు. ఆ కార్డ్ వల్లే ఇప్పుడు చిత్రపురిలో నాకిల్లు వచ్చింది! అందుకు పరుచూరి గారికి కృతజ్ఞతలు.

ఆ తరువాత పరుచూరి బ్రదర్స్ ఇద్దరితో శిష్యురాలిగా నాకు చనువూ, అనుబంధం ఏర్పడ్డాయి. “మా అమ్మాయే” అని చెప్తుంటారు. ఇదొక మలుపు అయితే, ఇంకొక మలుపు అల్లు అరవింద్ గారిని కలవడం. నేను అక్కడ వుండగానే ఒకరోజు అరవింద్ గారు, రామారావు గారికి ఫోన్ చేసారు. ఆయన బన్నీని హీరోని చేసే ప్రయత్నాలలో వున్నారు అప్పుడు. “ఎవరో కొత్త రచయిత్రి కథటగా?” అని అవతల నుండి అడిగినట్లున్నారు. ఈయన “ఔను. బలభద్రపాత్రుని రమణి గారనీ, మంచి నవలా రచయిత్రి” అని చెప్తున్నారు.

అప్పుడు కె.ఎస్. రామారావుగారు, చిరంజీవి గారి ఇంటి పక్కనే వుండేవారు. చిరంజీవి గారు కొత్త ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయాకా, అందులోకి అరవింద్ గారొచ్చారు. వీళ్ళకీ, వాళ్ళ ఇంటికీ మధ్యన పొడుగాటి బాంబూలు రంగులేసి వుండేవి. నేను అప్పుడప్పుడూ ఆ ఇంటికేసి చూస్తూండేదాన్ని!

ఫోన్ పెట్టేసాకా, “మీ నెంబరు ఇచ్చాను, అల్లు అరవింద్ గారు ఓ సారి కలిసి  మాట్లాడ్తానన్నారు” అన్నారు రామారావు గారు. నేను నిర్భావంగా ‘సరే’ అన్నాను.

భానూ రోజుకో పెద్ద ప్రొడ్యూసర్ పేరు చెప్పి, “అక్కయ్యగారూ, మీ పేరు చెప్పాను. మిమ్మల్నోసారి తీసుకురమ్మన్నారు. మీ స్టార్ తిరిగిపోయినట్టే అనుకోండీ ఇక” అనేవాడు.

నేను ఓవర్‍నైట్ సక్సెస్ వచ్చేస్తుందనీ అనుకోలేదు. అసలు ఈ పెద్ద ప్రొడ్యూసర్‌ల రేంజ్ తెలిసినదాన్నీ కాదు! ఎక్కువ కృషి చేసి వుంటే అప్పట్లో కథ వేరేగా వుండేదేమో!

చివరికి ఓ నాడు అరవింద్ గారి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. నేను ఇంట్లో వంట చేస్తున్నాను, ఇంకో పక్క పిల్లల్ని స్కూలుకి తయ్యారు చేస్తున్నా. ఆ సమయంలోనే అమ్మాయి గొంతు…”గీతా ఆర్ట్స్ నుండి అండీ… అల్లు అరవింద్ గారు మాట్లాడ్తారటండీ…” అంది. నేను ఫోన్ పట్టుకుని నిలబడ్డా. ఏదో మ్యూజిక్ వినబడింది. ఓ నిమిషం పట్టుకుని, కుక్కర్ విజిల్ రావడంతో, ఫోన్ పెట్టేసి, వెళ్ళి పని చూసుకోసాగాను. మళ్ళీ ఫోన్ మోగింది. తీస్తే ఆ అమ్మాయే. “అరవింద్ గారు మాట్లాడ్తాన్నారు కదండీ… కొంచెం వెయిట్ చెయ్యండి” అంది. “అమ్మా, నేను నేనుగా ఫోన్ చేస్తే మ్యూజిక్ కాదు, కేసెట్ మొత్తం పెట్టు, వెయిట్ చేస్తూ నిలబడ్తా… కానీ మీరు ఫోన్ చేసారుగా…  నేనే పరిస్థితుల్లో వున్నానో, ఏం చేస్తున్నానో మీకు తెలియదుగా? మ్యూజిక్ పెట్టకూడదు” అన్నాను.

ఆ అమ్మాయి “సరేనండీ… మళ్ళీ చేస్తారు సార్… ఇంకో ఫోన్‍లో వున్నారు” అని పెట్టేసింది.

ఈసారి ఫోన్ మోగినప్పుడు తీస్తే అరవింద్ గారే మాట్లాడారు. “సారీ… ఏదో ఆడిటర్ సడెన్‍గా కొంపలు మునిగే పనంటేనూ… మిమ్మల్ని వెయిటింగ్‌లో పెట్టా… ఏం అనుకోకండి” అంటూ మొదలుపెట్టి ఒకటి రెండు జోక్స్ వేసారు. నెక్స్ట్ శనివారం రమ్మన్నారు. “మీరు వెహికల్ పంపిస్తే వస్తా! మా ఏరియా నుండి ఆటో వాళ్ళు అంతంత దూరాలకి రారు” అని చెప్పా. ఆయన నవ్వి, “సరే” అన్నారు.

నేను ఆ కొండల్లో, గుట్టల్లో అడ్రెస్‌లు వెతుక్కోలేక, అందరికీ అలాగే చెప్పేదాన్ని. 2006లో కారు కొనుక్కునేదాక, ప్రొడ్యూసర్ కార్‌లలోనే సిట్టింగ్‌లకి వెళ్ళేదాన్ని. ఓ అంబాసిడర్ కార్ వచ్చి గుమ్మంలో నిలబడి వుండడం, దాని వెనుక ఆ బ్యానర్, లేదా వాళ్ళ కొత్త సినిమా పోస్టరూ ఓ హోదాగా వుండేది.

శనివారం నాడు ఓ మారుతీ కారొచ్చింది. “అరవింద్ గారు పంపించారు” అని చెప్పాడా డ్రైవరు. నేను తయ్యారయి వచ్చి ఎక్కుతుంటే, “ఏవైనా కేసెట్స్ వుంటే తీసుకురండమ్మా… దారిలో విందాం” అన్నాడు. నేను బుద్ధిగా తల వూపి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాను. ఇక్కడ సైనిక్‌పురిలో స్టార్ట్ అయి, అక్కడ ఫిల్మ్ నగర్‌లో దిగేదాక, అరవింద్ గారి పిల్లలూ, కుటుంబం గురించి పూస గుచ్చినట్లు చెప్పాడు. నేను “ఇక చాలు” అనడానికి కూడా భయపడి వింటూ కూర్చున్నాను. ఆ రోజు ఇచ్చిన కేసెట్లు కూడా అతను మళ్ళీ వెనక్కి ఇవ్వలేదు.

అరవింద్ గారి అద్దాల మహల్‌కి వెళ్ళాను.

(సశేషం)

Exit mobile version