Site icon Sanchika

జీవన రమణీయం-46

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]అ[/dropcap]ల్లు అరవింద్ గారిని కలవడానికి ఆ ఆఫీస్‌లో కాలు పెట్టినప్పుడు అనుకోలేదు… ఆ ఆఫీస్‌కి నా జీవితంలో చాలాసార్లు వెళ్తానని… ఆ నిమిషం అనుకోలేదు… ఈ కనిపించే వ్యక్తి నా జీవితంలో వేళ్ళ మీద లెక్క పెట్టగలిగేటంతమంది ఆప్తుల్లో ఒకరౌతారని! ఆ రోజున అనుకోలేదు… ఈయన నాకు ఎన్నడూ ఈ గీతా ఆర్ట్స్‌లో సినిమా ఇవ్వడని… ఆ నిమిషం అస్సలు అనుకోలేదు… నాకే కాక నా కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడంటే అప్పుడు సలహాలూ సాయాలు చెయ్యడానికి భగవంతుడు చూపిస్తున్న ఓ స్నేహ హస్తమని!

చివరిగా… నేనెప్పుడూ సినిమా టికెట్ కొనక్కరలేకుండా ఆయన ఆఫీసుకు ఫోన్ చేస్తే నాకు సినిమా టికెట్లు ఏర్పాటు చేస్తారని… ప్రపంచంలో ఏ మూలనున్నా… ఆయన నెంబర్ వుంటే చాలు ‘నా దగ్గర’ అన్న ధీమా ఇస్తారని!

ప్రపంచంలో ఏ వ్యక్తిని కలవబోతున్నా నాకు వుద్విగ్నత వుండేదేమో కాని భయం లేదు! ఆ లక్షణం నేను కలిసిన పెద్దవాళ్ళందరికీ, దాసరిగారితో సహా అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం అయితే, నా మాట్లాడే ముక్కుసూటితనం కుతూహలం కలిగించేదై వుంటుంది… మగవాళ్ళు ఏమీ పట్టించుకోరు… ఏవీ తెలీదు… ఏవీ గుర్తుండవు అనుకుంటున్నారా? కాదు… మన చెప్పులూ, చీరా, జడా, వాలకం, మాటతీరూ, నడక తీరూ అన్నీ వాళ్ళు గమనిస్తారు! అందులోనూ అరవింద్ లాంటి మేధావులు… నాకు మొదటిసారి కలిసినప్పుడేం తెలీదు… ఆయన మేధావని! కానీ… పోను పోనూ తెలిసింది…

ఆయనకి ఏవో కొన్ని లైన్స్ చెప్పాను. ఆయన నన్ను గమనించారని ఎలా చెప్పానో… ఆయన్ని కూడా నేను అలాగే గమనించాను… కళ్ళల్లో డ్రాప్స్ వేసుకున్నారు… టిష్యూ పేపర్లు ఓ ఇరవై అన్నా వాడి కళ్ళూ, పెదవులూ తుడుచుకునుంటారు ఆ ఇరవై నిమిషాల్లో… మొత్తానికి చాలా హాస్యరసరంజకంగా, చణుకులతో మాట్లాడ్తారనీ, ఎదుటివారిలో బెరుకు పోగొడ్తారనీ అర్థమైంది!

ఆయన స్వంత విషయాలు, భార్యా, చెల్లెళ్ళూ, పిల్లల గురించి ఎక్కువగా మాట్లాడతారు… అదీ అందరి దగ్గరా కాదుట… ఎందుకో నా దగ్గరే అలా మాట్లాడారు! అప్పుడాయన ‘జానీ’ సినిమా పవన్‍కళ్యాణ్‌తో తీస్తున్నారు… నిర్మాణంలో వుంది. ఆ విషయాలు కొన్ని చెప్పారు. రాకీ సిరీస్ గురించి నాకు తెలిసింది నేను చెప్పాను… అలా చాలాసేపు మాట్లాడుకున్నాకా, ఆయన అన్నారూ “మీతో స్పెండ్ చేసిన నా సమయం వ్యర్థం కాదు… మంచి స్నేహితురాలిని చాలా ఏళ్ళ తర్వాత కలిసిన ఫీలింగ్ వచ్చింది… ఇంకా కూడా మీ దగ్గర సబ్జెక్ట్‌లు వింటాను… కలుస్తూ వుండండి…” అని. ఆ మాటలు పాజిటివ్‌గా తీస్కోవాలో నెగటివ్‌గా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు… నేనేం ఆశాభంగం చెందలేదు. ఎందుకంటే నాకు పెద్ద ఎక్స్‌పెక్టేషన్ లేదు! నాకు ఈయనకన్నా ముందు ఇండస్ట్రీలో పరిచయం అయిన ఫ్రెండ్స్ అందరూ ‘ఆ చిరంజీవి కాంపౌండ్‌లోకి అల్లు అరవింద్ అడుగు కూడా పెట్టనీడు… పెద్ద ముదురు… చాలా లౌక్యుడూ, తెలివైనవాడూ, కొంత కుటిలుడూ’ అని చెప్పారు. I know he is very shrewd… ఇవన్నీ నాకు అందరూ ముందే చెప్పి వున్నారు! అందుకే నేనేం ఆశించలేదు… ఆశలు లేని చోట ఆశాభంగాలు వుండవు… నా టీ.వీ. సీరియల్స్, నవలలూ చాలు అనుకునే పరిస్థితిలో వున్నాను అ రోజున. అందుకే అంత నిర్భయంగా కాటన్ చీర కట్టుకుని, రెండొందల రూపాయల ఆర్డినరీ చెప్పులతో, “మీ కారు పంపిస్తేనే రాగలను… ఆటోవాళ్ళు ఆ ప్రదేశాలకి రారు” అని చెప్పి కూడా ఎంతో సహజంగా, నిర్భయంగా ఆయనతో రెండు మూడు సెటైర్లు కూడా వేస్తూ మాట్లాడాను!

ఇరవై నిమిషాలు అనుకున్న మీటింగ్, ఓ గంట కాలం గడిచాకా, వసంతగారు తలుపు తోసుకుని వచ్చారు. “రా… రా… ఆదివారం పూటా ఇలా వచ్చావేంటి?” అని ఈయన పలకరించి, నాతో “వసంత నా పెద్ద చెల్లెలే కాదు, చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా!” అని నాకు వసంతలక్ష్మి గారిని పరిచయం చేసారు. వెంకటేశ్వరరావుగారనే ఈవిడ భర్తని ఇండస్ట్రీ మొత్తం డాక్టరుగారని వ్యవహరిస్తారు! ఆవిడ ఎంతో మర్యాదగా “మీరు మీటింగ్‌లో వుండబట్టి, బయట విషయాలు ఏవీ మీకు తెలియదనుకుంటాను… బాలయోగిగారు మరణించారు, హెలికాప్టర్ ఫెయిల్ అయి…” అని చెప్పారు. దాంతో అరవింద్ గారు, “అరె… నాకు మంచి మిత్రుడు… నేను వెళ్ళాలి… మనం త్వరలో మళ్ళీ కలుసుకుందాం” అని చేతులు జోడించారు. నేనూ, ఆ ఇద్దరికీ నమస్కారం చేసి బయటకి నడిచాను. గంధం రంగు మీద ఎర్రటి చక్రాల డిజైన్ వున్న చీర కట్టుకుని వెళ్ళాను…. నాకు చాలా బాగా జ్ఞాపకం! వసంతలక్ష్మిగారు మాట్లాడ్తూ వుంటే, ఆవిడ వేళ్ళ నెయిల్ పాలిష్ ఎంత బావుందో అని చూస్తూ వుండిపోయాను. నాకు బాగా జ్ఞాపకం! అప్పుడు నేను ఒక స్కూల్ టీచర్‌నే అని గుర్తుంచుకోండి. అంతకన్నా అరవింద్ గారి మాటలనీ, జ్ఞాపకాలనీ నేనేం ఇంటికి మోసుకుపోలేదు… పైగా ఆయన పంపిన ఇరిటేటింగ్ డ్రైవర్ ఒకడూ! అతి వాగుడు…

ఇంటికొచ్చాకా కూడా అరవింద్ గారితో జరిగిన ఈ మీటింగ్ గురించి మా వారితో నేను పెద్ద ఆసక్తిగా చెప్పలేదు… “పనికి వచ్చే మీటింగ్ కాదు…” అని మాత్రం చెప్పాను. ఆయనా పెద్దగా ఏవీ గుచ్చి గుచ్చి అడిగే మనిషి కాదు! చెప్తే వింటారంతే… నా పిల్లలది ఎదుగుతున్న వయసు… వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం… కాబట్టి ‘జానీ’ చిత్ర కథా, ఆ విశేషాలు చెప్పాను. ఆసక్తిగా విన్నారు. సినిమా ఫీల్డ్ అంటే పెద్ద ఎక్సైట్‌మెంట్ ఇద్దరికీ ఏనాడూ లేదు!

నా అనుభవాలన్నీ ఫోన్‌లోనో, కలిసినప్పుడో మొదట మా ఉమకీ, తర్వాత లలితకీ సుశీలకీ చెప్పుకునేదాన్ని. ఈనాటికీ వుంది ఆ అలవాటు… లలితా, సుశీలా “జాగ్రత్త!” అన్నారు. ఉమ మాత్రం “అరవింద్ గారిని తక్కువ అంచనా వెయ్యకు… ఇండస్ట్రీలో ఒక్కరైనా మనకి తెలిసిన పెద్దవాళ్ళు వుండాలి” అని సలహా ఇచ్చింది. దాని సలహాలు నేనెప్పుడూ తీసి పారెయ్యలేదు… దాని చెల్లెలి కూతురే పి.వి. సింధూ అని చెప్పాను కదా! నాకు దగ్గరగా మారేడ్‌పల్లిలో వుండేది కాస్తా, జూబ్లీహిల్స్‌లో వున్న సాగర్ సొసైటీలో సరళా ఎపార్ట్‌మెంట్స్‌లో ఇల్లు కొనుక్కోవడం వల్ల షిఫ్ట్ అయిపోయింది. ఆ ఏరియాలో పని పడ్డప్పుడల్లా, దాని ఇంటికి వెళ్ళి, ఆ టైంని బట్టి భోజనం చేసే, కాఫీ తాగో… కాసేపు రెస్ట్ తీసుకునేదాన్ని! నేను ఎక్కడా మెన్షన్ చెయ్యకపోయినా, నా స్పైనల్ కార్డ్ సర్జరీ అయినప్పటినుండీ… నడక మామూలుగా వచ్చింది కానీ నా నడుము నెప్పికి ఉమశమనం రాలేదు. గంట తర్వాత నెప్పొచ్చి, ఎక్కడైనా ఫ్లాట్‌గా నడుము వాల్చాల్సిన పరిస్థితి! సిట్టింగ్‌లలోనూ అదే పరిస్థితి. ఈ అరవింద్ గారిని కాసేపు పక్కకి పెడదాం…

(సశేషం)

Exit mobile version