[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]ఈ[/dropcap]లోగా అనూహ్యమైన సంఘటనలు జరిగి, ఈటీవీలో ‘పద్మవ్యూహం’ అనే హిట్ సీరియల్‌కి రైటర్‌నీ, డైరక్టర్‌నీ ఒక్కసారిగా రీప్లేస్ చేస్తూ, అనిల్ కుమార్ గారిని (విధి డైరక్టర్, ఉషాకిరణ్‌లో జగన్నాథం అండ్ సన్స్, బంగారు చిలక, దొంగ రాస్కెల్ వంటి సినిమాలు కూడా చేసారు) పిలిచి, మీకే రైటర్ కావాలంటే?, ఆయన “బలభద్రపాత్రుని రమణి గారిని పెట్టండి… గిరిధర్ దగ్గర ‘అనూహ్య’కి చేసేడప్పుడు ఆవిడ స్క్రిప్ట్ చూసాను, నచ్చింది” అన్నారట.
నన్నూ, ఆయన్నీ మీటింగ్‌కి సోమవారం నాడు పిలిచి కె.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ గారు “గురువారం మీ ఇద్దరూ సీరియల్‌కి ఎపిసోడ్ అందించాలి… బుధవారం వరకూ పాతవాళ్ళు చేసిన ఎపిసోడ్స్ వున్నాయి… రేపూ ఎల్లుండీ… జరిగిన కథంతా గబగబా చూసేయ్యండి” అన్నారు. అప్పటికి 335 ఎపిసోడ్స్ జరిగిపోయాయి. మేం అవన్నీ ఒక్కరోజులోనే ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తూ, ముఖ్యమైన పాయింట్స్ రాసుకుంటూ చూసేసాం… ప్రసాద్ గారే ‘వారెవా’ అనేటట్లు మంగళవారం స్క్రిప్ట్ రాసుకుని, బుధవారం ఎపిసోడ్ షూట్ చేసి, గురువారం టెలీకాస్ట్‌కి అందించాం…
చెప్పడం మరిచిపోయా… ఈ ప్రాజెక్ట్ నాకిచ్చేముందే సుమన్ గారు పిలిచి, “నా కథ ‘పద్మవ్యూహం’ బాగా చెయ్యాలి. డైలాగ్స్ బాగా రాయాలి. వెయ్యి ఎపిసోడ్స్ నా టార్గెట్…” అని ఒక తెల్ల కాయితంలో సగం వరకూ టైప్ చేసి వున్న కథ ఇచ్చారు. నేను తెల్లబోయాను… ఇది వెయ్యి ఎపిసోడ్లు చెయ్యాలా? అని. కానీ “చేస్తాను” అన్నాను. సుమన్ గారితో ఆ పరిచయం, ఎన్నో నాటకీయం అయిన ట్విస్ట్స్ తర్వాత నన్ను ‘అక్కా’ అని పిలిచే వరకూ వచ్చింది.
బంజారాహిల్స్‌లో వున్న ఉషాకిరణ్ గెస్ట్ హౌస్‌లో మా సిట్టింగ్స్ జరిగేవి! నా అదృష్టమేమో, పూర్వజన్మ పుణ్యఫలమో కానీ అక్కడే భాగవతం సిట్టింగ్స్‌కి బాపుగారూ వుండేవారు అని తెలిసింది. నేను ఆ విషయం వినగానే మేఘాలలో తేలిపోతూ ఆనందంగా వెళ్ళి చూస్తే, బోయ్ “షూటింగ్‍కి వెళ్ళారు” అన్నాడు. నిస్పృహతో వెనక్కొచ్చేసాను. ఆ తరువాత ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడల్లా బోయ్‌ని “రూమ్‌లో వున్నారా బాపూగారు?” అంటే “ఇప్పుడే బయటకి వెళ్ళారు మేడం” అని చెప్పడం ఓ రెండు మూడు సార్లు జరిగింది.
ఓనాడు నేను భోజనానికి ఒక్కదాన్నే వెళ్ళాను… అనిల్ కుమార్ గారు రాలేదు. “అమ్మా… మీరేనా బలభద్రపాత్రుని రమణి?” అని నెమ్మదిగా అడుగుతూ, అతి సాదా బట్టల్లో బాపూగారొచ్చి, ఎదురుగా కూర్చున్నారు. గభాల్న లేచి ఆయన కాళ్ళకి దణ్ణం పెట్టాను. నా జీవితంలో అలా నేను దణ్ణం పెట్తిన వ్యక్తులు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. నా జీవితంలో… మనస్ఫూర్తిగా పెట్టిన దణ్ణం అది! “మీరంటే నాకు ఎంతో ఇష్టం…” ఆపైన మాటలు రాలేదు. మనసంతా అభిమానం నిండిపోయినప్పుడు మాటలు కరువౌతాయి కదా! ఆయన నవ్వి “ఏం నవలలు రాసావమ్మా? ఏం ప్రాంతం వాళ్ళూ?” అంటూ అన్ని వివరాలూ అడిగి తెలుసుకున్నారు. కలిసి భోం చేసాం. అది నా జీవితంలో ఇంకో తీపి గుర్తు!
అంత మధురమైన స్మృతులిచ్చిన ఆ గెస్ట్ హౌస్‌లోనే చేదు వార్తలూ విన్నాను. ఓనాడు ఉత్తేజ్ ఫోన్ చేసి, “మీ సినిమా శేఖర్ బాబుతో, రవితేజ హీరో అన్నారు కదూ!” అన్నాడు.
అంతకుముందే రికార్డింగ్ జరిగి, కథ బలభద్రపాత్రుని రమణి అని ప్రెస్‌కి రిలీజ్ చేసారు రవితేజా, కిషోర్, మ్యూజిక్ డైరక్టర్ ఎవరో గుర్తు లేదు! అందుకే “ఔను ఉత్తేజ్… మార్చి నుండి షూటింగ్, చార్మీ హీరోయిన్ అన్నారు” అన్నాను. మెహర్ రమేష్‌తో సిట్టింగ్స్ కూడా చేసాను కొన్నాళ్ళు!
“మీకు చెప్పచ్చో చెప్పకూడదో… వాళ్ళు కథ మార్చేసుకుని ‘భద్ర’ అని మెహర్ రమేష్‌తో చేస్తున్నారు” అన్నాడు.
నేను తల మీద పిడుగుపడ్డట్టు ఫీల్ అయ్యాను. ‘మొగుడే రెండో ప్రియుడు’ సినిమా కాన్సిల్ అవడం మొదటి దెబ్బ… ఇది రెండో దెబ్బ! నేను స్క్రిప్ట్ రాస్తున్నాను… అందుకే అప్పుడు శేఖర్ బాబు గారికి కూడా వెంటనే ఫోన్ చెయ్యలేదు… అనిల్ కుమార్ గారితో కూడా జరిగిన విషయం చెప్పి డిస్కస్ చెయ్యలేదు! లంచ్ టైమ్‌లో యార్లగడ్డ శైలజ, విజయవాడలో పరుచూరి గోపాలకృష్ణ గారితో ‘రెండు నిమిషాలు ఆగకుండా తెలుగు మాట్లాడుదాం, ఆంగ్ల పదాలు లేకుండా’ అన్న ప్రోగ్రామ్‌కి, ఆవుల మంజులత గారితో, పరుచూరి గోపాలకృష్ణ గారితో కలిసి వెళ్ళినప్పుడు ఈవిడ అక్కడ డీ.డీ. డైరక్టరుగా అన్ని ఏర్పాట్లు చేసారు. ఆ పరిచయం.. తో ఆవిడ్ని కలిసాను. ఆవిడకి చెప్పాను. కళ్ళెమ్మట నీళ్ళొచ్చాయి. ‘ఇలా ఆడపిల్లని మోసం చెయ్యొచ్చా?’ అనుకున్నాను. ఇంకా సినీమాయ తెలీని అమాయకత్వం. రాత్రికి రాత్రి డైనమిక్స్, ఎథిక్స్ మారిపోయే వింత విచిత్ర సినిమా అని తెలియడానికీ, వెనుకా ముందూ, ఇంట్లో బయటా ఎవరైనా ఈ ఫీల్డ్ వాళ్ళు వుంటేగా?
ఆ రోజంతా స్క్రిప్ట్ వర్క్ చేసి, సిట్టింగ్ అయ్యాకా, వచ్చేడప్పుడు కారెక్కి శేఖర్ బాబు గారికి ఫోన్ చేసాను. ‘పద్మవ్యూహం’ చేసే రోజుల్లోనే ‘ఆల్టో’ కారు కొన్నాను.
ఆయన “స్నానం చేస్తున్నానమ్మా… మళ్ళీ మాట్లాడ్తా” అని ఫోన్ పెట్టేసారు. బహుశా ఆ గేప్‌లో ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యారేమో…
వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, శారద గారినీ, ఆయన భార్య కమలాదేవి గారినీ, కోడల్నీ (శారదగారు పెంచుకున్న తమ్ముడి కూతురు) పరిచయం చేసి, “మంచి నవల రాసారీవిడ” అని నా ‘నీకూ నాకూ మధ్య’ కాపీలిచ్చి ఎంతో ప్రేమ చూపించిన మంచి మనిషాయన. ‘ముఠామేస్త్రీ’తీసిన పెద్ద ప్రొడ్యూసర్!
రెండు నిమిషాల్లో ఫోన్ చేసి, “అమ్మా క్షమించు! నా కొడుకు చేసిన పని… నా మాట వినలేదు… ఏం చెయ్యలేను… సారీ” అన్నారు.
(సశేషం)