జీవనరమణీయం-5

    0
    4

    [box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవనరమణీయం‘ ఈ వారం. [/box]

    [dropcap]చి[/dropcap]వరకి స్టేట్‌హోంకి దగ్గరగా ఉన్న వెంకటేశ్వర నగర్‌లో ఉన్న ఇంటికి మారిపోయాం. ఆ వీధంతా పెద్ద పెద్ద గేట్లున్న భవనాలు. మేం అద్దెకున్న ఇల్లే చిన్నది. ఇంటివాళ్ళు, పక్కగా ఉన్న థర్డ్ బెడ్‌రూమ్‌కి ఓ చిన్న కిచెన్ కట్టించి అద్దెకిచ్చారు. ఆయన రావు గారు, ఆవిడ సీతాదేవి. ఏ.జి. ఆఫీసులో చేసేది. ముగ్గురు ఆడపిల్లలూ, ఒక మగపిల్లాడు. ఆడపిల్లలని ఓలాగా, మగ పిల్లాడిని ఓలాగ చూడడం అక్కడే చూశాను నేను. ఆ పిల్లాడికి అపరిమితపు గారాబాం. వాళ్ళ ఆఖరు పిల్లలిద్దరికీ, అమ్మాయికీ అబ్బాయికీ నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని! అశ్విన్ మొదటి పుట్టినరోజు ఆ ఇంట్లోనే చేశాం. పక్కింట్లో మినిస్టర్ కె.ఇ. కృష్ణమూర్తిగారి మేనకోడలు శ్రీదేవి వుండేది. ఒక పిల్లవాడు చేతన్.

       

    ఆ పిల్లాడికి బయటకి వెళ్తే, గీజర్ కింద పెట్టి నల్లా తిప్పేస్తే, తొక్క ఊడి వచ్చేసిందట పాపం… నేనెళ్ళేసరికే బ్యాండేజెస్‌తో వున్నాడు ఆ బాబు. మరి శ్రీదేవికి పెళ్ళి కాకముందు ఇంటి నిండా పనివాళ్ళుండేవారట. అందుకని పని అలవాటు లేదుట. కానీ చాలా మంచి స్నేహశీలి.

    ఆ వీధిలో ఎవరూ కూడా పలకరింపుగా నవ్వేవారు కూడా కాదు. గొప్పవాళ్ళు అంతేనేమో అనుకునేదాన్ని! తరువాత తెలిసింది, ఇంటివాళ్ళకి ఎవరితోటీ సత్సంబంధాలు లేవు! వాళ్ళకి ఎందుకనో అందరూ తమ గురించే మాట్లాడుకుంటున్నారనీ, తమ ఇంటి విషయాలు ఆసక్తిదాయకమనీ నమ్మకం! నన్నూ పిలిచి, “ఎవరింటికీ వెళ్ళకండి.. ఎవరితోటీ మాట్లాడకండి” అని హెచ్చరించారు.

    ఇంటి ముందుకి టోపీ పెట్టుకుని తోపుడు బండి మీద లక్ష్మి అనే అమ్మాయి కూరగాయలు తెచ్చేది! నాకు అక్కడ ఫ్రిస్‌బీ అనే అద్దె పుస్తకాల షాపు దొరికింది. ఎల్లారెడ్డిగూడ మార్కెట్‌కి పిల్లాడిని ఎత్తుకుని వెళ్ళి కూరలు తెచ్చుకునేదాన్ని. ఇంటావిడకి ఉప్మా చేయడం కూడా నేనే నేర్పాల్సొచ్చింది. ఆవిడకి వంట రాదు.

    ఆ ఇంట్లో నేనెప్పుడూ పెద్ద ఆనందంగా లేను! ఆనంద్‍బాగ్ జ్ఞాపకాల్లోనే వుండేదాన్ని.  ‘మై ఆనంద్‌బాగ్ డేస్’ అని నిట్టూరుస్తూ వుండేదాన్ని. కానీ ఈయన ఆఫీసుకుకి ఇల్లు దగ్గర. లంచ్‌ టైమ్‍‌లో భోజనానికి ఇంటి కొచ్చేవారు. అదొక్కటే ఎడ్వాంటేజ్.

    అప్పుడప్పుడూ ఇంటి వాళ్ళ పిల్లల్ని వేసుకుని సత్యంలో ‘స్వర్ణ కమలం’లాంటి సినిమాలకి వెళ్ళేదాన్ని.

    చిన్నప్పుడు కూడా మా కాలనీలో ఇంటిపక్క నుండే అన్నపూర్ణావాళ్ళు వెంగళ్రావు నగర్‌లో ఇల్లు కట్టుకుని వుంటే అక్కడికి వెళ్తూ వుండేదాన్ని. అన్నపూర్ణని ఒకసారి ‘చింతకాయ’ పచ్చడి అడిగితే, “ఏమిటి సంగతి?” అంది. నేను కాస్త అయోమయంలో వుంటే రాజా నర్సింగ్‌హోమ్‌కి తీసుకువెళ్ళి డా. అరుణ చేత చెకప్ చేయించింది. మూడో నెల అని తెలిసింది.

    మా క్రిష్ణ ఆ ఇంట్లో వుండగానే కడుపున పడ్డాడు. అశ్విన్‌ని ఎమ్.జి.ఎమ్ స్కూల్లో చేర్పించాము. రోజూ వాడు ఏడిస్తే “రేపటి నుండీ పంపుతాలెండి” అని ఇంటికి తెచ్చేసేదాన్ని. నాకెంత అసహ్యమో స్కూల్‌లో పిల్లల్ని నిర్బంధించి చేసే విద్యాబోధన అంటే.

    చలం గారు “బడిలో మేజా బల్లకు కూడా వసంతం రాక చూసి చిగురిస్తాయేమో పూర్వజన్మ సువాసనలతో” అంటారు. “హాయిగా ఆడుకునే పిల్లల్ని అలా బెత్తాలతో బెదిరించి నిర్బంధించడం ఎంత అమానుషం? కొట్టడం తిట్టడం ఇంకా దారుణం కదూ!

    అక్కడ మా వదిన కూడా కాంపిటీషన్‌గా రెండవసారి నెల తప్పింది.

    మా అత్తగారు రెండవసారీ ‘మగపిల్లాడే కావాలి’ అనే సరికి నాకొళ్ళు మండింది!

    “నాకు ఆడపిల్లే కావాలి” అని వాదించేదాన్ని. ఇంటివాళ్ళతో పెద్ద చిక్కులేవీ లేవు కానీ, నాకు స్నేహం కాలేదు!

    నాకు భయంకరమైన వేవిళ్ళు! మళ్ళీ పురుడు టైమ్‌కి మా వదినా వాళ్ళమ్మ, నా మేనత్తా శారదత్తయ్యని బతిమాలి తీసుకొచ్చింది అమ్మ. నాకు మొదటిసారి ఆసుపత్రికి ఎప్పుడెళ్ళినా ‘ఇవి నొప్పులు కావు’ అని పంపించెయ్యడంతో, ఈసారి నొప్పులొస్తున్నా, పట్టించుకోకుండా జంతికలు చేస్తూ కూర్చున్నాను! చివరికి మా అమ్మకి అనుమానం వచ్చి, “ప్రభాకర్ ఆస్పత్రికి తీసుకెళ్దాం… ఇది ఇబ్బంది పడుతోంది” అంటే థెరిసా ఆసుపత్రికి తీసుకెళ్ళి మా అత్తయ్యని దగ్గర పెట్టారు.

    అలా నేను చేరగానే ఇలా వంగవీటి మోహన రంగా పోయి, గొడవలూ, కర్ఫ్యూ మొదలైంది. ఎక్కడివాళ్ళు అక్కడే బంధింపబడ్డారు.

    ఆస్పత్రిలో డాక్టర్లు లేరు. రావడానికి లేదు. నాకేమో డిసెంబరు 25న చేరితే, డిసెంబరు 27 దాకా పురుడు రాలేదు. నన్స్ వున్నారు. వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. మా రాము అన్నయ్య అనస్థటిస్ట్ వచ్చాడు, ఇంక సిజేరియన్ చెయ్యాలని అనుకుంటుండగా, అప్పుడు మధ్యాహ్నం రెండున్నరకి క్రిష్ణకాంత్ పుట్టాడు.

    అమ్మయ్య ఏదో ఒక బిడ్డ అనుకున్నారు అందరూ.

    మా అత్తగారు చాలా సంతోషించారు. శారదత్తయ్య ఆస్పత్రిలో ఆరు రోజులు వుంది.

    మేం శ్రీనగర్ కాలనీలో ఇల్లు ఖాళీ చెయ్యడానికి మాత్రం ఓ భయంకరమైన సంఘటన కారణం.

     (సశేషం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here