Site icon Sanchika

జీవన రమణీయం-50

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నా[/dropcap]కసలు చాలా విరక్తి కలిగింది. ఎవరినీ నమ్మలేం… సాంగ్ రికార్డింగ్ కూడా చేసి నాకు ఫొటో పంపించాడు వాళ్ళ అబ్బాయి కిషోర్. ఇలా చేసారు… అని చాలా బాధపడ్దాను. ఒద్దు! మనకీ ఫీల్డ్, సీరియల్స్, నవలలు రాసుకుందాం అని డిసైడ్ అయిపోయాను. మా అమ్మ నాకన్నా డిజప్పాయింట్ అయింది. “పోనీ రవితేజతో మాట్లాడు” అంది అమాయకంగా. అప్పటికే నాకు కొంచెం తెలివితేటలు అలవడ్డాయి… స్వంత మేనల్లుడైనా సరే… డబ్బూ, బిజినెస్ ముఖ్యం ఇక్కడ… తర్వాతే బంధం… మాటా! ఇదేం కె.వీ.రెడ్డీ, బీ.ఎన్.రెడ్డిగార్ల కాలం కాదు కదా!

నా సీరియల్ కొనసాగిస్తున్నాను. ‘పద్మవ్యూహం’ మంచి రేటింగ్‌తో సాగిపోతోంది. నేను ఓ ఎనభై సీన్స్ రాసుకుని, సుమన్ గారి అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్ళి, ఒక్కసారే చెప్పి వచ్చేదాన్ని! చంద్రశేఖర్ అని తెలుగు షార్ట్‌హ్యాండ్ తెలిసిన ఆయన పి.ఎ. పక్కనే వుండేవారు.

ఉదయం పది గంటలకి మొదలయితే, మీటింగ్ సాయంత్రం ఆరు గంటలదాకా, ఒక్కోసారి ఏడు గంటల దాకా కూడా జరిగేది. టీవీ ముందు కూర్చుని సీరియల్స్ చూసే ప్రజలకి దాని వెనుక మేము పడే కష్టం తెలీదు! ఒక సీన్ చెప్పగానే అయన నన్ను ఆపి, తన బాల్యంలోవీ, తన కళలని ఎవరూ గుర్తించకపోవడం పట్ల బాధనీ చెప్తుండేవారు. అంతా విని కొనసాగించాల్సి వచ్చేది! ఆయనకి నా స్క్రీన్‌ప్లే మాత్రం చాలా బాగా నచ్చేది. ఏమీ ఎక్కువగా వంకలు పెట్టేవారు కాదు పాపం. నాకు స్పెషల్‌గా మంచి హోటల్ నుంచి భోజనం కూడా తెప్పించేవారు ఆ రోజున. ఇలా  ప్రతి పది రోజులకీ ఓసారి వెళ్ళి సుమన్‌గారిని కలుస్తూ వుండేదాన్ని. అప్పుడు చిన్నప్పుడు మా కాలనీలో వుండే శైలజ అనే అమ్మయి గేట్ దగ్గర నిలబడి వుండడం, తనను పైకి ఆయనను కలవడానికి పంపించకపోవడం ఓసారి చూశాను.

ఆగి… “ఏమిటి విషయం?” అని అడిగాను.

“నేనిక్కడే కాప్షనింగ్ సెక్షన్‌లో పని చేసేదాన్ని, మా ఆయన రాజమండ్రి వెళ్ళిపోదాం, బిజినెస్ పెడదాం అంటే రిజైన్ చేశాను… ఇప్పుడు ఓ పాప సెవెన్త్ క్లాస్ చదువుతోంది. ఆయన వదిలేసాడు… వుద్యోగం కావాలి” అని మొత్తం వివరించింది.

“నేను ట్రై చేస్తాను” అని చెప్పి, నేను పైకి వెళ్లినప్పుడు సుమన్‍గారితో చెప్పాను. పేరు చెప్పగానే, “ఆవిడ నాకు గుర్తుందండి… రిజైన్ చేసి వెళ్ళిపోయారు.. ఏ కారణానైనా మేం తీసేస్తే కార్పోరేట్‌లో మళ్ళీ పెట్టుకోగలం… కానీ ఆవిడ నాకీ జాబ్ వద్దు అని రాసిచ్చి వెళ్ళిపోయారు… మళ్ళీ తీసుకోవడానికి రూల్స్ ఒప్పుకోవు!” అన్నారు.

నేను సీరియల్ కథ చెప్తూ చెప్పాను “ఈ సీన్‌లో హీరో, ఆఫీసు రూల్స్ ప్రకారం కాదు, కాసేపు అవి పక్కనపెట్టి మానవత్వపు విలువలతో ఆలోచిద్దాం అంటాడు… సుమన్ గారూ, కొన్నిసార్లు ఆ రూల్స్ చేసేటప్పుడు ఆలోచించలేని ఎన్నో కోణాలు మానవ జీవితంలో వుండడం వల్లే మనం ఇన్ని కథలూ, ఇన్ని జీవితాలు ఆవిష్కరించగలుగుతున్నాం… ఆ అమ్మాయి అందరిలాగే భర్త అంటే భరిస్తాడు, పోషిస్తాడు, నాకేం లోటు వుండదు అని నమ్మి ఆయనతో వెళ్ళిపోయింది. వెళ్ళాకా, అతను తాగుబోతు, వ్యభిచారి, ఇంటికి డబ్బులివ్వడు. కనీసం తిండి కూడా పాపకి రోజూ పెట్టలేక, వాళ్ళనీ వీళ్ళనీ అడుక్కునే పరిస్థితికి రావడంతో, తిరిగి వచ్చి ఒకప్పుడు అన్నం పెట్టిన ఈనాడు సంస్థనే వేడుకుందాం అని వచ్చింది. మీ ఇష్టం… ఇలా చెప్పినందుకు క్షమించండి…” అని నా పని కొనసాగించాను.

నేను మళ్ళీసారి వెళ్ళేసరికి శైలజ విప్పారిన వదనంతో అక్కడ పని చేసుకుంటూ కనిపించింది! ఆయనలో మానవత్వం అది! నేనెప్పుడూ మా అమ్మమ్మ చెప్పిన ఒక మాట మరిచిపోను… “ప్రయత్నించు… ఫెయిలయితే మళ్ళీ ప్రయత్నించు, అంతే కాని ‘అవదు’ అనే మైండ్‌సెట్‌తో వుండకు. ఏదైనా జరగవచ్చు, ఈ విశ్వం పెద్ద అద్భుతం“. ఈ సిద్ధాంతం నమ్ముకున్న నేను, ఎప్పుడూ నా చుట్టూ వున్నవాళ్ళకి ఏదో ఒకటి చేస్తూ, సాయపడడానికే ప్రయత్నిస్తాను. కానీ అనర్హులకి ఎక్కువగా ఇచ్చి ఇదివరలో దెబ్బతినడం వల్ల అన్నం పెడ్తాను కాని కష్టాలు చెప్పగానే వెంటనే డబ్బులు ఇవ్వను. “స్కూల్ ఫీజా? సరే… పాప స్కూల్ అడ్రస్ ఇవ్వు…. వెళ్ళి కడ్తాను…”, “హాస్పిటలా? నేనెళ్ళి చూసి కట్టొస్తాను..” అంటాను.

ఇలా ఈటీ.వీ.లో సాగుతూ వుండగా, రాష్టంలో రాజకీయ పరిణామాలు మారి వై.యస్.రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయి పదవీ స్వీకారం చేసారు.

ఆ సందర్భంగా మా చలనచిత్రసీమ కూడా ఓ అభినందన సభ ఓపెన్ ఆడిటోరియం లలితకళాతోరణంలో ఫంక్షన్ ఏర్పాటు చేసారు!

మొదట నేను వెళ్ళొద్దు అనుకున్నాను. కానీ, మరి అప్పట్లో మా సినీ రచయితల సంఘంలో మిసెస్ పరుచూరి గోపాలకృష్ణ గారు కాకుండా నేనొక్కదాన్నే లేడీ మెంబర్‍ని కనిపించేదాన్ని. పరుచూరి గోపాలకృష్ణ గారు ఫోన్ చేసి, “నువ్వే మన సంఘం తరఫున స్టేజెక్కి దండ వెయ్యాలమ్మా” అన్నారు. లేకపోతే వెళ్ళకపోదును… చాలా కథ వేరేగా వుండేది! కొన్ని మలుపుల కోసం ఇన్సిడెంట్లు జరుగుతాయనుకుంట!

చక్కగా పట్టుచీరలో తయ్యారయి వెళ్ళాను. రాజశేఖరరెడ్డి గారు ఉపన్యసిస్తున్నారు. నాకు రెస్ట్‌రూమ్‌కి వెళ్ళాల్సొచ్చి, కాస్త దూరంగా వున్న అటు వెళ్ళాను. కొద్ది దూరంలో పోలీసులు వున్నారు… నేను డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే, అందులో ఒకడు నగ్నంగా నిలబడి వున్నాడు… నేను పెద్దగా అరిచి వెనక్కి పరిగెడుతున్నప్పుడు, ఇంకో డోర్ తెరుచుకుని ఇంకోడు పరిగెత్తుకొస్తూ కనిపించాడు… నేను పక్కకి తిరిగి చూసి, అక్కడున్న స్టీలు బక్కెట్ కనిపిస్తే, అది అందుకుని మొదటివాడి కేసి కొట్టి పరిగెత్తాను… మెయిన్ డోర్ దూరంలో వుంది! అది తెరిచి పరిగెత్తే లోపు ఇంకోడు నా పయిట కొంగు పట్టుకున్నాడు. అంత బలం, తెగువా ఎక్కడి నుండొచ్చాయో కానీ వాడ్ని మోచేత్తో కంట్లో పొడిచి, బయటకి పరిగెత్తుకొచ్చా… పోలీసు నేను పరిగెత్తుకు రావడం చూసి, “ఏమైందమ్మా?” అంటూ నా దగ్గరికొచ్చాడు. “అక్కడ… జెంట్స్…” అని లేడీస్ టాయ్‌లెట్ వైపు చూపించాను వగరొస్తూనే! వాళ్ళు పారిపోతున్నారు… పోలీసులు వెళ్ళి పట్టుకోవడం, వాళ్ళని చితకబాడదం, బ్యాక్‍స్టేజ్‍లో జరిగింది… ఇక్కడ ముఖ్యమంత్రి గారు “మహిళలకి ప్రాధాన్యతనిస్తాం… వారిని ముందుకు నడిపిస్తాం…” అని స్పీచ్ ఇస్తూనే వున్నారు!

నేను నా అలుపు తీర్చుకునేలోపే… “రమణీ… రమణీ” అని మా గురువుగారు గోపాలకృష్ణ గారు పిలవడం, నేను లేచి వెళ్ళడం, నా చేతికి పూలదండ ఇచ్చి స్టేజ్ మీదకి పంపించడం చకచకా జరిగిపోయాయి!

నేను ఏదో లోకంలో వున్నట్లు స్టేజ్ ఎక్కి ఆయనకి దండ వేసాను. ‘ఎవర’ని ఆయన అడగడం, పక్కనున్నవాళ్ళు సినిమా రచయిత్రి అని చెప్పడం విన్నాను. ఇంక స్టేజ్ దిగాకా, అక్కడ వుండబుద్ధి కాలేదు. గబగబా బయటకి వెళ్ళే ద్వారం వైపు వస్తుంటే, మా రైటర్స్ అసోసియేషన్‌లో ఒక సభ్యుడు వెంకట రమణ అనే అతను “అక్కయ్యా వెళ్లిపోతున్నారా? ఇది తీసుకోండి…” అంటూ జేబులోంచి రెడీగా వుండే ఓ సాయిబాబా ఫొటో, విబూదీ ఇస్తూ వెంటపడ్డాడు.

నేను అన్యమనస్కంగా వెళ్తున్నప్పుడు ఓ సంఘటన జరిగిందిట!

(సశేషం)

Exit mobile version