[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
రామానాయుడుగారే సినిమాకి ఓ విశ్వవిద్యాలయం. ఆయన జడ్జిమెంటు, దీక్షా, పనిచేసే పద్ధతీ, ముఖ్యంగా సమయ పాలనా ప్రతి ఒక్కరూ అనుసరించదగ్గవి, జీవితంలో పైకి రావాలాంటే. అందరూ టైమ్‌కి వస్తున్నారా లేదా అన్నది ఆయనకి చాలా ముఖ్యం. నాకు కారు పంపేవారు. నేను బయల్దేరానా లేదా అని ఎనిమిదింటికి నాకు ఫోన్ చేసేవారు, నేను ఎక్కానా లేదా? అని ఎనిమిదింపావుకి డ్రైవర్‍కి ఫోన్ చేసేవారు. తొమ్మిదిన్నరకి స్టూడియోలో మేనేజర్‌కి ఫోన్ చేసి కారు వచ్చిందా లేదా అని కనుక్కునేవారు!
ఒక డయిరీలో మా అందరి పేర్లూ, ఎదురుగా నెంబర్లూ వుండేవి. రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, కాజోల్, డింపుల్ కపాడియా, కరిష్మా కపూర్ ఇలాంటి పేర్లున్న డయిరీలో నా పేరు కూడా వుండడం, ఆయన పోయేంత దాకా ఎప్పుడో ఓనాడు తప్ప, క్రమం తప్పకుండా నా సెల్‌ఫోన్‌లో ‘రామానాయుడు గారు’ అన్న అక్షరాలు రోజూ రావడం నా పూర్వజన్మ సుకృతం.
సెల్‌ఫోన్‌లో నెంబరులు ఫీడ్ చేసుకోవడం, మెసేజ్‌లు చూడడం, మిస్‌డ్ కాల్స్ చూడడం… ఇవేవీ ఆయన నేర్చుకోలేదు. ఆయన డయిరీ తీసి, వెతుక్కుని నెంబర్లు ఫోన్ చేసేవారు! ఆయన పెద్దగా గ్రామర్ లేకుండానే ఇంగ్లీషులో ధారాళంగా ఎంతసేపైనా రాష్ట్రపతితో కాని యాష్ చోప్రాతో కాని మాట్లాడేసేవారు. విషయం వారికి బోధపడేది. ఏ దేశం వాళ్ళతో అయినా అనర్గళంగా, కాన్ఫిడెంట్‌గా మాట్లాడేసేవారు. అందుకే ఆయన మూవీ మొగల్ అయ్యారు. ఆయన ఎంతోమంది హీరోలని, హీరోయిన్‌లని ఇండస్ట్రీకిచ్చారు… హీరోయిన్స్ అయితే కరిష్మా కపూర్, మోనికా బేడీ, దివ్యభారతి లాంటి అందగత్తెలు. ఇంక డైరక్టర్స్ అయితే చెప్పనే అక్కర్లేదు. స్టూడియోలో ఓ పక్కనంతా ఆయన బ్యానర్‌లో చేసిన హీరో, హీరోయిన్స్, డైరక్టర్స్ వుంటే, రికార్డింగ్ స్టూడియోలో మ్యూజిక్ డైరక్టర్స్ ఫోటోలుండేవి. అది నాకో దేవాలయంలా వుండేది! ఎందుకంటే హిందువులు గుడికెళ్తే, ముస్లింలు మాస్క్‌కి వెళ్తే, క్రిస్టియన్స్ చర్చ్ కెళ్తే…. అందరూ కామన్‌గా వెళ్ళేది మాత్రం సినిమాకి! ఎంతోమంది మహానుభావుల కృషి ఈ తెర మీద కదిలే బొమ్మల పుట్టుక!
నేను అడిగేదాన్ని “మీకు ఇదంతా గొప్పగా వుంటుందా? ఇలా మీ పేరు ప్రతి చోటా అందరూ చెప్పుకోవడం… రాసుండడం…” అని.
దానికి ఆయన “రమణీ… వెంకటేశ్వరస్వామి చలవమ్మా… నాకు ఎవరైనా వచ్చి నమస్కారం పెడ్తే ‘వీళ్ళకి నేనేం చేసాను? ఎందుకింత అభిమానం చూపిస్తున్నారు నా మీద?’ అని వాళ్ళ మీద ఎంతో ప్రేమ కలుగుతుంది” అనేవారు.
స్టూడియో ముందు చాలా జనం వుండేవారు. ఒకవేళ లోపలికి రాగలిగితే కనుక, ఆయన సిట్టింగ్ మధ్యలో వున్నా, ఎంత పెద్ద మీటింగ్‌లో వున్నా లేచెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చేవాళ్ళు. కొంతమంది పేద కళాకారులు సాయం అర్థించి వస్తే ఇచ్చేవారు. వేషం అడిగితే, నా కథ అయితే నాకు ఫోన్ చేసి, “ఈ అమ్మాయికి ఓ వేషం చూడు” అనో, “ఈయనకి తగ్గదేదయినా వుందా?” అని వాళ్ళముందే అడిగి, వుంటే ఖరారు చేసేసేవారు.
“ఎవరినైనా వీపు మీద కొట్టచ్చు రమణీ… కడుపు మీద కొట్టకూడదు” అనేవారు.
ఆయన సునిశిత దృష్టిని స్టూడియోలో జరిగే ఏ చిన్న విషయం దాటిపోయేది కాదు.
ఓసారి నేను చంద్ర సిద్ధార్థ, సత్యానంద్ గార్లం, ఆయన ఆఫీస్ పక్కన ఓపెన్ ఎయిర్‌లో కూర్చుని సాయంత్రం టీ తాగుతున్నాం.
మాతో మాట్లాడ్తూ, నన్ను ఆటపట్టిస్తున్న నాయుడుగారు సడెన్‌గా బోయ్‌ని పిలిచి, “రేయ్, ఆ గుడి వెనుక పూజారి ఎవరితోనో, కాయితాలు చూపించి ఏదో మాట్లాడుతున్నాడు… అప్పుల వాళ్ళా? ఏం జరుగుతోందో కనుక్కుని రా” అని పంపించారు.
సత్యానంద్ గారు జోక్‌గా, “స్టూడియోని ష్యూరిటీ పెడ్తున్నాడో, తన ఇల్లు స్థలం అమ్ముతున్నాడో?” అన్నారు. “అలా కూడా జరిగినా ఆశ్చర్యం లేదు సత్యానంద్ గారూ?” అన్నారాయన నవ్వుతూ. అంతటి సూక్ష్మదృష్టి ఆయనది. కొండ మీద కూర్చుని, దూరంగా ఎక్కడో కనిపించిన మనుషుల గురించి ఆరా తీశారు.
ఉదయం వెళ్ళగానే, “రండి కవిగారు!” అని, పనివాడు తెచ్చిన టీ అందుకుని ఆయన చేతులతో నాకు ఇచ్చేవారు. మధ్యాహ్నం లంచ్‌కి వెళ్తూ పైకొచ్చి, “మీరు భోజనం చెయ్యండి… టైం మించిపోకూడదు” అని మాతో చెప్పి వెళ్ళేవారు. సరిగ్గా టైం మూడు కాగానే, మంచి పెర్‍ఫ్యూమ్‌తో, ప్రొద్దుట వేసుకున్నది కాకుండా ఇంకో చొక్కాలో, ట్రిమ్‌గా తయారయ్యి వచ్చేవారు. వస్తూనే మమ్మల్ని అందరినీ ఆయన రూమ్‌కి పిలిచి, మాతో టీ తాగేవారు. ఆ రోజు మేం ఏం చర్చ చేశాం? ఏం మార్పులూ చేర్పులూ చేసాం? అడిగి తెలుసుకునేవారు.
సాయంత్రాలు సాధారణంగా ప్రివ్యూ థియేటర్‌లో ఏదైనా కొత్తగా రిలీజయిన సినిమా తెప్పించి వేసేవారు. ముందే నాతో “రమణీ… ఈరోజు ఫలానా సినిమా… చూసి వెళ్ళు” అనేవారు.
సినిమాకి ఆయన ధర్మపత్ని రాజేశ్వరి గారూ, కోడళ్ళు లక్ష్మీగారు (సురేష్ బాబు భార్య), నీరజ గారూ (వెంకటేష్ గారి భార్యా) వచ్చేవారు. ఈయన మాత్రం మా క్రూ వుంటే, మా పక్కనే కూర్చునేవారు. ఆయనది సింహాసనం లాంటి కుర్చీ. ఆ సినిమా ఎలా వుందీ? ఏం బావుందీ? ఏం బాలేదూ మమ్మల్ని అడిగి చెప్పించేవారు. తర్వాత తనకి ఏం అనిపించిందో చెప్పేవారు. ఎప్పుడూ ఒకరి గురించి తప్పుగా మాట్లాడేవారు కాదు.
ఒక్కొక్కసారి “రమణీ… నానక్‌రామ్‌గుడా పోదాం… రా! తోటలో నీకు ఇష్టమైన కూరగాయలు కోసుకుందువు గాని…” అనేవారు. అక్కడ ఓ ఆవూ, దూడా, చుట్టూ చిన్న తోట; గోంగూరా, వంకాయాలు, తోటకూర, పచ్చిమిరపకాయలూ మొదలైనవి కాసేవి. వాటిని స్వయంగా కోసి, మా డ్రైవర్‍కిచ్చి, నా కారులో పెట్టించేవారు. మామిడి పండ్ల కాలంలో కూడా నాకు గంపలతో పండ్లు పంపేవారు!
(సశేషం)