[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]ప[/dropcap]క్కింటి శ్రీదేవి రోజూ “పాపోడ్ని ఇవ్వండి” అని కంచె మీద నుంచి అందుకునేది. ఇంటి వాళ్ళ పిల్లలు శ్రీనందా, మల్లికా, శ్రీకాంత్ చిన్నాడినీ పెద్దాడినీ వదిలి వెళ్ళేవారు కాదు బడి అయ్యాకా. మధ్యాహ్నాలు నేను మంచం మీద పడుకోబెట్టి, పెరట్లో బట్టలు ఆరేసుకోవడం, పిల్లాడి బట్టలు తీసుకొచ్చి మడత పెట్టడం చేస్తుండేదాన్ని.
ఓనాడు మధ్యాహ్నం పూట పిల్లాడ్ని మంచం మీద పడుకోబెట్టి పని చేసుకుంటున్నా. పెద్ద పెద్ద చప్పట్లూ, కేకలూ. హడలిపోయి వెళ్ళి చూస్తే కొజ్జావాళ్ళు దండుగా వచ్చి, చప్పట్లు కొడ్తూ “థెరిసా ఆస్పత్రి వాళ్ళు ఎడ్రెస్ ఇచ్చారు… ఈనాం ఇయ్యి… అసలే మగపిల్లాడు” అని ఏవో పాటలు డోలక్‌తో పాడ్తూ, చీరలు పైకి ఎత్తుకుంటూ అరుస్తుంటే నేను భయపడి వెనక తలుపు వేసుకున్నానే కాని, ముందు తలుపు తెరిచి వుంది. ఉయ్యాల్లో బిడ్డ గుక్క పట్టి ఏడుస్తుంటే, ఒకడు ఎత్తుకున్నాడు. బిడ్డని ఎత్తుకుపోతున్నారని నేను అనుకుని ఏడుస్తూ, బీరువా తెరిచి వున్న డబ్బులన్నీ, బహుశా అప్పుడు మరచెంబులో ఏ వెయ్యి రూపాయలో వుండి వుంటాయి, వాళ్ళకి ఇచ్చేయడానికి వెంట పరిగెత్తాను. వాళ్ళకి అది వినోదంగా కనబడి బిడ్డని ఒకరి చేతుల్లో నుండి ఒకరు తీసుకుంటూ నన్ను ఏడ్పించారు.
నడి రోడ్డు మీద నేను బిడ్డ కోసం ఏడుస్తుంటే, ఆ హై క్లాస్ సొసైటీలో వున్న ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, గేట్ దగ్గరున్న వాచ్‌మెన్‌లు కానీ నాకు ఆసరాగా రాలేదు! వినోదం చూశారు కిటికీలలో నుండి.
ఓ అరగంట నన్ను ఏడిపించి, డబ్బులు తీసుకుని, బిడ్డనిచ్చి దండెం మీదున్న నా కొత్త చీర కూడా తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు!
ఇంటివాళ్ళు పలకరించినా, ఎదుటివాళ్ళు పలకరించినా నేను మాట్లాడలేదు. ‘ఈ దిక్కుమాలిన కాలనీలో ఇంక చచ్చినా వుండను, మా ఆనంద్‌బాగ్ వెళ్ళిపోతాను’ అని ప్రతిజ్ఞ చేసుకుని, తలుపులన్నీ వేసుకుని ఏడుస్తూ కూర్చున్నాను. మూడింటికి బిడ్డనెత్తుకునే వెళ్ళి అశ్విన్‌ని బడి నుండి తీసుకుని రావడానికి వెళ్ళాను. వాడి టీచర్ “అశ్విన్ చాలా లీవ్‌లు తీసుకుంటున్నాడు. క్లాస్ టెస్ట్‌లు కూడా రాయలేదు! వాడు మళ్ళీ ఎల్.కె.జి. చదవాల్సిందే… ఫెయిల్ చేస్తాను” అంది. పాలుగారే పసిబిడ్డ మొహం చూశాను…
“మీ బడికి రానని ఏడుస్తున్నాడు. సంవత్సరం చివరిదాకా మీరు వాడిని ఆకట్టుకోలేకపోయారు. చెడ్దీలు పాడు చేస్తే ఆయాలు క్లీన్ చేయడం లేదు… మీరు చదువు చెప్పకపోయినా నా బిడ్డకి నేను చెప్పగలను, ఒక్కసారి చెప్తే అర్థం చేసుకుంటాడు… నేనే మా అబ్బాయిని మీ స్కూల్‌లో నుండి తీసేస్తున్నాను… టీ.సీ. ఇవ్వండి” అని హెడ్ మిస్ట్రెస్ రూమ్‌లోకి వెళ్ళను.
“ఏమైందమ్మా?” అందావిడ. అన్నీ ఏకరువు పెట్టి టీ.సీ. అడిగాను.
“ఒద్దు. వుంచండి… ఆ టీచర్‌ని పనిష్ చేస్తాను… మీకు ఉద్యోగం ఇస్తాను” అంది.
“టీచర్స్‌ని కాదు… స్కూల్లో కనీసం ప్లే గ్రౌండ్, శానిటేషన్ లేనందుకు మిమ్మల్ని పనిష్ చెయ్యాలి. మీ ఇంతోటి టీ.సీ. నాకు అక్కర్లేదు” అని వాడిని తీసుకుని ఇంటికి వచ్చేశాను.
మా వారు ఇంటికి రాగానే ఏడుస్తూ జరిగినది చెప్పాను. మా వారు నన్ను దగ్గరికి తీసుకుని, “యూ ఆర్ రైట్. మనుషులు వుండే సమాజంలోకి వెళ్దాం… అక్కడ మన ఇంట్లో ఏ కూర వండుకుంటున్నామో… మన ఇంటికెవరు వచ్చారో కూడా చుట్టుపక్కల వాళ్ళు ఆరా తీసేవారు… అప్పుడు విసుగనిపించినా, ఇప్పుడు అదే సొసైటీ అంటే అని తెలుస్తోంది… వెళ్ళిపోదాం” అన్నారు.
సాయంత్రం ఇంటి ఓనర్, పక్కింటాయన వచ్చి, “ఏమైందీ?” అని పరామర్శ చేశారు.
“మీ ఆవిడని అడగండి… అంతా చూసి తలుపేసుకుంది. చెప్తుంది!” అన్నాను.
సాయంత్రమే మా అమ్మా వాళ్ళింటికొచ్చేశాను. మా అత్తగారూ, అమ్మా ఆ దిక్కుమాలిన ఏరియాకి ఇంక జన్మలో పోవద్దన్నారు. నాన్న అయితే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు… అంతా విని.
ఆ ఆదివారం మళ్ళీ ఆనంద్‌బాగ్ వెళ్ళి ఇల్లు వెతికాము.
ఈసారి కొంచెం సౌకర్యాలతో ఇంట్లోనే మునిసిపల్ ట్యాప్ అదీ వున్న మేడ మీద వాటా కమలమ్మ గారింట్లో దొరికింది. వాళ్ళు గొప్ప సత్యసాయి భక్తులు.
ఈ రెండోవాడు పుట్టినప్పుడే మా ప్రియకి కార్తీక్ పుట్టాడు. వీడు కృష్ణకాంత్, వాడు క్రిష్ణకార్తీక్. అది మా వీధి వెనకాలే వున్న ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మిగారి ఇంట్లో అద్దెకుండేది. అప్పుడే ఆవిడ చిన్న చిన్న కథలవీ రాస్తుండేవారు అనుకుంటా!
మా సత్యప్రియ ఇంటర్‌మీడియట్‌లో నా క్లాస్‌మేట్. ఇద్దరం చాలా క్లోజ్‌గా వుండేవాళ్ళం. వాళ్ళ భార్యాభర్తలు ఆర్.టి.సి. కాలనీలోని మా ఇంటికొస్తే మా అమ్మ స్వంత కూతురూ అల్లుడులా చూసేది. నేనూ, అదీ కాలేజీలో వున్నప్పుడు కబుర్లు చెప్పుకుంటూ, సికింద్రాబాద్ స్టేషన్ నుండి బోయిగూడా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అది వాళ్ళ పెద్ద అక్క సర్వమంగళ గారింట్లో చిన్నన్నయ్య విద్యాధర్ చక్రవర్తితో వుండేది – మా లక్ష్మి అక్క ఇంటి ఎదురుగా. అందుకే తరచూ వెళ్ళేదాన్ని. తరువాత ఆనంద్‌బాగ్‌లో… నా పెళ్ళయ్యాకా చాలా క్లోజ్‌గా వుండేవాళ్ళం వాళ్ళూ, మేమూ. కాని అశ్విన్ పుట్టాకా ఏం జరిగిందో తెలీదు, కొంత గ్యాప్ వచ్చింది. ఎందుకని అని నేను అడగలేదు.
మా ఉమ నేను ఏ ఇంట్లో ఉన్నా వచ్చేది. వాళ్ళు ఆర్థికంగా బాగా ఎదిగారు. మారేడ్‌పల్లిలో మంచి అపార్ట్‌మెంట్ కొనుక్కున్నారు. వాళ్ళ చెల్లెలు పి.వి.సింధుకి తల్లి. తనకి అప్పుడే సింధు పుట్టడం, అక్కకి దగ్గరగా తనూ ఇల్లు కొనుక్కోవడం జరిగింది.
(సశేషం)