జీవన రమణీయం-60

0
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఆ[/dropcap] గొడవకి ఇంకా టైం వుంది కానీ మధ్యలో జరిగినవి చెప్పాలి. ఆర్ట్ డైరక్టర్ నారాయణ రెడ్డి గారికీ, మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ గారికీ కథ చెప్పాను. కెమెరామాన్‌గా జయరాం గారినో, తన మేనల్లుడు రవి గారినో పెట్టుకోమని నాయుడుగారు చంద్రసిద్ధార్థని ఒప్పించ చూసినా, చందూ వినలేదు. పూనా ఇన్‌స్టిట్యూట్ నుండి ఫొటోగ్రఫీలో డిగ్రీ చేసిన సుధాకర్‌ యక్కంటినే పెట్టుకోవాలని పట్టుబట్టాడు. సుధాకర్ 2018లో మరాఠీలో ‘నాళ్’ అనే సినిమా తీసి దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ‘ఝుండ్’ సినిమాకి కెమెరామాన్‌గా వ్యవహరిస్తున్నాడు. నాయుడుగారు సాధారణంగా ఎవరి మాటా వినరు కానీ, చందూ కాన్ఫిడెన్స్ చూసి ‘సరే, కానీ’ అన్నారు! అలా స్నేహకీ, పార్వతీ మెల్టాన్‌కీ కూడా కథ చెప్పాను.

తర్వాత కోడైరక్టర్ హరికృష్ణ షెడ్యూల్ వేసాడు. ఎడిటింగ్ మార్తాండ్ వెంకటేష్ గారు. వారి తండ్రిగారితో తన అనుబంధం గురించి నాయుడుగారు చాలాసార్లు ప్రస్తావించేవారు.

కాస్టింగ్, క్రూ మొత్తం సెటిల్ అయ్యాకా, పాటలు మలేషియాలో ప్లాన్ చేసారు. మణిశర్మగారికి చంద్రసిద్ధార్థ గైడ్‌లైన్స్‌లా కొన్ని ట్యూన్స్ కావాలని అడగటం, ఆయన అలాగే చెయ్యడంతో అవి మధురంగా వున్నా, పాడటానికి సులభతరంగా వుండని పాటలుగా వచ్చాయి. కాని చాలా స్పెషల్‌గా వుంటాయి.  సుద్దాల అశోక్ తేజ గారు రాసిన “ఓణి మెరుపులు అటు… గుండె తలపులు ఇటు” పాటని బ్లాక్ అండ్ వైట్‍లో, రామానాయుడుగారు కెమెరా ఆన్ చేయడంతో చిత్రీకరిస్తూ, మధ్యలో కలర్‍లో స్నేహ మొదలైన వాళ్ళ మీద తియ్యడం ప్రత్యేకత. ఆ పాట పీరియాడికల్‌గా, నాయుడు గారి పాత రోల్స్ కార్లో, సుమంత్‌కి నాగేశ్వరరావుగారి యంగ్ గెటప్ వేసి తీయడం విశేషం.

వేటూరి సుందరరామ్మూర్తి గారొచ్చారు… ఆయనకీ నా చేతే సిట్యుయేషన్ చెప్పించారు… అది నా సుకృతం. ప్రియురాలు దూరమయ్యాకా ప్రేమ అంటే తెలిసే సిట్యుయేషన్ అది!

“వసంతం వాయిదా పడైనా రాదుగా” అని సాయంత్రానికే రాసి పంపించారు ఆయన.

ఇంకో పాట చంద్రబోస్‌కీ, నేనూ, చందూ ఇంగ్లీషు మాటలలో కావాలని చెప్తూ, వాలెంటైన్స్ డే వచ్చినప్పుడల్లా మన పాట వినిపించాలని చెప్పాం. చంద్రబోస్ గారు అలాగే ‘వాలంటైన్ వాలెంటైన్…’ అనే పాట రాసుకొచ్చారు. మిగతా రెండూ మెలోడీస్.

మలేషియా షెడ్యూల్ వేసేటప్పుడే నాయుడు గారు అడిగారు. “రమణీ ఎప్పుడైనా ఫారెన్ కంట్రీ వెళ్ళావా?” అని. “లేదండీ” అన్నాను. “పాస్‌పోర్ట్ వుందా? రాజాకివ్వు… వీసాకి అప్లై చేస్తాడు” అన్నారు.

నేను అసలు నమ్మలేదు! నేనేంటీ? వేరే కంట్రీ వెళ్ళడం ఏమిటీ? తీసుకెళ్తే డైలాగ్ రైటర్‌ని తీసుకెళ్తారు కానీ స్టోరీ రైటర్‌ని తీసుకెళ్తారా అని! కానీ అప్పుడు నాయుడుగారు నాకు గుర్తు చేసారు. “నువ్వు ఏం అన్నావ్, కథ చెప్పి, ఓకే అయ్యాకా నా కథకి డబ్బులేం ఇస్తారో కానీ, నన్ను దగ్గరుండి సినిమా షూటింగ్, ఎడిటింగ్, అన్నీ చూడనీయండి, పాల్గొననీయండీ అన్నావ్. ఆ మాట నాకెంతో నచ్చింది. అనురాగం సినిమా అప్పుడు నేను కూడా ‘డబ్బులు పెడ్తాను, కానీ నన్ను అన్ని డిపార్ట్‌మెంట్‌లలో ఎలా పనిచేస్తారో గమనించనీయాలి’ అన్న కండీషన్ మీదే డబ్బు పెట్టుబడి పెడ్తాను అన్నాను” అన్నారు.

నాకెంతో సంతోషం అనిపించింది. మావారు ఎందుకనో ఆ ముందు ఏడే నాకూ, మా అమ్మకీ, తనకీ పాస్‌పోర్ట్‌లు తెప్పించారు. తీసుకొచ్చి మరునాడే రాజాకి ఇచ్చాను.

ఇంట్లో ఈ సంగతి చెప్పగానే మావారు చాలా సంతోషించి అభినందించారు. “మొదటగా మన ఇంట్లో నుండి నువ్వే ఫారిన్ వెళ్తున్నావ్” అన్నారు. అమ్మ ఆనందం అయితే చెప్పనలవి కాదు!

అందరికన్నా ఎక్కువగా నా ఆనందాలకీ, అనుభూతులకీ కారణభూతులు నా పిల్లలు. “అమ్మా… మేమూ వస్తాం” అని కానీ, “ఎందుకు వెళ్తున్నావ్” అని కానీ ఒక్క మాట కూడా అనేవారు కాదు! చిన్నప్పటి నుండీ తమ పనులు స్వయంగా చేసుకోవడం, బుద్ధిగా చదువుకోవడం, ఆటలాడుకోవటం, జట్టీలూ పట్టీలూ ఇంటి మీదకి తేకపోవడం ఇవన్నీ నా అదృష్టాలు! లేదా కెరీర్  కోసం పిల్లల్ని పట్టించుకోలేదనే బాధ నన్ను తొలచి వేసేది! మావారే కాదు, అత్తగారు కూడా నేను మలేషియా వెళ్తున్నాను పది రోజులు అంటే ఒక్క మాట కూడా అనలేదు!

పిల్లల్ని చూసుకోవడానికి అమ్మ వుండనే వుంది ఇంట్లో. అమ్మ నాకిచ్చిన సపోర్ట్ వల్లనే నేనేమైనా సాధించాను అంటే… అని తలుస్తాను.

మలేషియాకి డాన్స్ మాస్టర్‌తో ఒక అసిస్టెంట్ ప్రేమ అనే అమ్మాయి, స్నేహ, స్నేహతో ఆమె తల్లీ, అక్క కొడుకు మూడేళ్ళ వాడూ, సుమంత్, కెమెరామాన్‌తో అతని అసిస్టెంట్లు ఇద్దరూ, డైరక్టర్‌తో కోడైరక్టర్ గోగూ, నాయుడు గారూ, నేనూ, ఇంకో ఇద్దరు వెళ్తున్నట్టు వీసాలొచ్చాయి. చంద్రసిద్ధార్థ నన్ను మాటిమాటికి “మీ వీసా కాన్సిల్ అయింది. మలేషియా వాళ్ళు ఒప్పుకోవడం లేదు” అంటూ ఏడిపించడం, నేను ‘నిజం’ అని నమ్మడం జరుగుతుండేది. మా క్రూ మొత్తం నన్ను ఏడిపిస్తూండేవారు.

నేను డైలాగ్ పేపర్ ఇచ్చాకా, షూట్ చేస్తూ చందూ పెన్‌తో గీత పెడ్తే కూడా నేను “ఎందుకు కొట్టేసావని” అని అడిగానని అందరికీ ఇప్పటికీ చెప్తూ వుంటాడు.

‘రేపల్లెలో రాధ’కి అమ్మనీ, నాన్ననీ, పిల్లల్నీ, అన్నయ్యా వదినలని ముహూర్తం ఫంక్షన్‌కి తీసుకెళ్ళాను కానీ, మధుమాసానికి మాత్రం ఎవరినీ తీసుకెళ్లలేదు! ‘నీకూ నాకూ మధ్య’ అనే నా నవలకి పేరు మార్చాలన్నప్పుడు, నేనెంతో బాధపడ్డాను. కానీ దర్శకుడు ‘ఈ మధుమాసంలో’ అన్నప్పుడు, అతని భావుకత్వానికి సంతోషించి, సరే అన్నాను. ‘ఎల్లప్ప శాస్త్రి’ అనే జ్యోతిష్య పండితుడు, నా ఫ్యాన్ అరుణా ప్రభాకర్ ద్వారా నాకు తెలుసు. ఆయన్ని ‘పేరు బలం’ బావుందా?” అని అడిగితే, ఆయన ‘ఈ’ తీసేసి ‘మధుమాసం’ అని పెట్టమన్నారు. రామానాయుడుగారూ, చంద్రసిద్ధార్థలు ఆ పేరుకి అన్నే అక్షరాలుండాలి అన్నారు. సరే అని ‘మధుమాసం’ అని పేరు నిర్ణయించారు. నాకెంతో నచ్చింది. పాటల్లో వాడే ఆ పదం, ఎవరూ సినిమాకి పేరుగా పెట్టుకోకుండా మా కోసమే వుంచారు అనుకున్నాం.

ముహూర్తం ఫంక్షన్‌కి నాయుడుగారు బయటి నుండి ఎవర్నీ పిలవలేదు. వెంకటేష్ బాబూ, సురేష్ బాబూ, రానా, అభిరామ్, ‘తులసి’ సినిమా చేస్తున్నారు కాబట్టి బోయపాటి శ్రీనూ, రైటర్ బి.వి.ఎన్.రవీ, మా సత్యానంద్ గారూ, మిగతా క్రూ మెంబర్స్… అంతే వచ్చారు.

  

నా చేత పూజ చేయించి నాయుడు గారు, వెంకటేష్ బాబూ, మధుమాసం స్క్రిప్ట్ మేం రాసినదాన్ని నా చేతిలో నుండి రామనాయుడి గారి ఇప్పిస్తూ మంత్రాలు చెప్తున్నప్పుడు, అమ్మని తీసుకొచ్చి ఈ దృశ్యం చూపిస్తే బావుండేది అనిపించింది. ఆ తరువాత ఎప్పుడూ అమ్మని తీసుకెళ్ళడం మిస్ అవలేదు!

అమ్మకి సినిమా అంటే ఇష్టం! సినిమాల్లో పాటలు పాడాలనుకుంది. నేను చిన్నపిల్లగా వున్నప్పుడు, పదేళ్ళ నన్ను తీసుకుని మద్రాసు వెళ్ళింది. ఆమెకి మావయ్య వరుస అయిన కృష్ణుడి మావయ్య అన్న ఆయన ఇంట్లో పది రోజులున్నాం. వీణ రంగారావు గారని ఓ దూరపు బంధువు వుంటే ఆయన్నీ కలిసాం. నన్ను తీసుకుని పొద్దుటే ఒకనాడు పెండ్యాల నాగేశ్వరరావు గారింటికి వెళ్లింది. ఆ ఎడ్రెసులు ఎవరిచ్చారో మరి! నేను తమిళనాడు అగ్గిపెట్టెల మీద కవర్లూ, అట్టలూ కలెక్ట్ చేసుకుంటూ మహదానందంలో వుండేదాన్ని! పెండ్యాల గారేమో మరునాడు స్టూడియోకి రమ్మన్నారు.

స్టూడియోకి వెళ్తే త్రివిక్రమరావుగారు వున్నారు. దానవీరశూరకర్ణ రికార్డింగ్ జరుగుతోంది. అమ్మ అక్కడ కూర్చుని వుంది. నేను బయట ఆడుకుంటున్నాను… ఒక తెల్లని రాజహంస లాంటి కారొచ్చి ఆగింది. అందులోంచి, మెడల దాక వున్న చక్కని వుంగరాల జుట్టుతో, తెల్లని లాల్చీ పైజామా వేసుకుని ‘నందమూరి తారక రామారావు’ గారు దిగారు. నన్ను దగ్గరికి పిలిచి, బుగ్గ మీద మునివేళ్లతో తాకి, “ఎవరీ పాప?” అన్నారు. పనివాళ్ళు ఏదో చెప్పారు.

ఆయన ఎంత అందంగా వున్నారంటే… ఈనాటికీ నాకా స్ఫురద్రూపం, రాజసం, నడక గుర్తున్నాయి.

పెండ్యాల గారితో బాటు హార్మోనియం ముందు కూర్చుని తాళం వేస్తూ పాడటం నేను విన్నాను. నా జన్మ తరించింది.

ఆ తరువాత అమ్మకి శలవైపోయింది. ఆర్‌టిసీలో పని చేస్తుందిగా! అందుకే మళ్ళీ వెనక్కొచ్చేసాం. ఏ ప్రయత్నమూ ఫలించలేదు! ఇప్పుడైతే నాకు పెద్ద పెద్ద నిర్మాతలూ, రచయితలూ, మ్యూజిక్ డైరక్టర్లూ అందరూ తెలుసు.. మా అమ్మకి వయసైపోయింది. ఆ గాత్రం ఇప్పుడు లేదు! కానీ నాకొచ్చిన పేరుకీ, అవకాశాలకీ, పెద్ద పెద్ద వారితో పరిచయాలకీ అమ్మ చాలా సంతోషిస్తుంది. తనకే ఆ గౌరవాలు లభిస్తున్నట్లూ, తనే వారితో మాట్లాడుతున్నట్లూ మురిసిపోతుంటుంది. మొన్న మనవడి పెళ్ళికి మహామహులొచ్చారని, తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుని, చెప్పుకుని మురిసిపోయింది. అమ్మని సంతోషపెట్టాను. ఈ జీవితానికిది చాలు అనుకుంటూ వుంటాను!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here