జీవన రమణీయం-63

0
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]’మ[/dropcap]ధుమాసం’ సినిమాలో ఎక్కడా కామెడీకి ప్లేస్ వదల్లేదు చంద్రసిద్ధార్థ. కానీ నాయుడుగారు కామెడీ ట్రాక్ లేకుండా సినిమా తియ్యరు. ఆయన పాత సినిమాల్లో కూడా అప్పలాచారిగారితో ఓ ట్రాక్ రాయించి, సినిమాలో పెట్టించేవారు. ఆ సంగతి సత్యానంద్ గారు మొదటి నుండీ చెప్తూనే వున్నా చంద్రసిద్ధార్థ పట్టించుకోలేదు. నేను కథలో అప్పటికీ స్నేహది టీ.వీ. ఛానెల్ వుద్యోగం కాబట్టి, కథ చెప్పడానికి జయప్రకాశ్‌రెడ్దీ, ఎం.ఎస్. నారాయణ వచ్చే రెండు సందర్భాలూ, హాస్టల్ వార్డెన్‌గా ఎల్.బి. శ్రీరాం గారినీ పెట్టి నరేష్‌ని కూడా కామెడీ చేయించి వాడుకున్నాం. అది చాలు, సెపరేట్‌గా కామెడీ డిమాండ్ చెయ్యదు ఈ సినిమా అని డైరక్టర్ వాదన! నేనూ అతనితో 100% ఏకీభవించాను… కానీ నాయుడుగారు కావాలని పట్టుపట్టారు. ఆయన నాకు పితృసమానులు… ఎంతో మంచివారు. ఇప్పటిదాకా ఏ ఆర్టిస్ట్‌ని పెడదామన్నా, టెక్నీషియన్‌ని సజెస్ట్ చేసినా కాదనలేదు! ఆయన మాట వినాలిగా! వినక తప్పదు, ఆయన ప్రొడ్యూసర్. అందుకే నేను కామెడీ ట్రాక్ రాయడానికి కూర్చున్నాను. నేను కామెడీ ట్రాక్ రాసి సీన్స్ చూడమన్నా, చంద్రసిద్ధార్థ “అవి మీరే షూట్ చేసుకోండి… నేను చెయ్యను” అనేసాడు. నాకేం చెయ్యాలో తెలియని పరిస్థితి! చందూ మంచి స్నేహితుడు. అప్పటికే నేను ‘అందరి బంధువయా’ కథ చెప్పి వున్నాను. అతను నెక్స్‌ట్ అదే తీస్తా అన్నాడు. ఇంత మంచి ఫ్రెండ్‌షిప్పూ ఈ విషయంగా పాడవవలసిందేనా? అని బాధపడ్డాను. కానీ రాయడం మాత్రం పూర్తి చేసేసా! చందూ కన్నా అతని చుట్టూ వుండేవాళ్ళు ఎక్కువ వ్యతిరేకంగా వుండి అతనికి బాగా చెప్పి ఎక్కించేవాళ్ళు. అతను అవి బాగా వినేవాడు! నాయుడుగారూ నేనూ కలిపి అతన్ని డామినేట్ చేస్తున్నాం అనే భ్రమలో అతన్ని వాళ్ళు  పెట్టారు. నాతో ఫోన్‌లో మాట్లాడ్డం కూడా మానేసాడు. కన్విన్స్ చేస్తానని భయం! అంతేగాక నేనంటే చాలా రెస్పెక్ట్!

చాలాసార్లు మనతో కొంతమంది మాట్లాడ్డం మానెయ్యడానికి కారణం, కోపం కొద్దీ నోరు జారుతామేమోనని. అది విముఖత కాదు రెస్పెక్ట్. తర్వాత తర్వాత తెలుసుకున్నాను నేనిది.

నానక్‌రామ్‌గూడా స్టూడియోలో పోలీస్ స్టేషన్ సెట్ కూడా వేసారు కామెడీ ట్రాక్ తియ్యడానికి. అందుకు ఆర్టిస్ట్‌లుగా శివారెడ్డీ, ఏ.వి.ఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉమ, వేణుమాధవ్, రజిత, ఫణిమాధవ్, చలపతిరాజు అందరూ ఫిక్స్ అయ్యారు.

చెట్టుక్రింద కూర్చుని నేను రాస్తున్నాను. నాయుడుగారు లోపలున్నారు. చందూ వచ్చాడు. “నా మాట వినరా? రాస్తారా? ఇది నేను తియ్యను… సినిమా ఆగిపోవచ్చు ఈ వివాదంతో” అన్నాడు. నేను చాలా భయపడ్డాను ఆ మాటకి. కానీ తప్పదు. “ఇది నేను డైరక్ట్ చెయ్యను” అన్నాడు చందూ. అతనికి వత్తాసుగా మొత్తం డైరక్షన్ డిపార్ట్‌మెంట్, స్నేహా అందరూ వున్నారు. “నేను డైరక్షన్ చెయ్యను ఈ సీన్” అని చందూ ఆయనతో కూడా చెప్పేసాడు. అందరం గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని నిలబడ్డాం. నేనైతే మరీను… ఇద్దరూ నాకు కావలసినవాళ్ళే!

నాయుడు గారు సీరియస్ అయ్యారు. కాసేపు నిశ్శబ్దం తర్వాత, చందూతో, “సరే… మీరు వెళ్ళి మిగతా సినిమా ఎడిటింగ్ అదీ చూసుకోండి” అన్నారు.

అతను వెళ్ళిపోయాడు. నేను భయపడ్తూ ఆయన పక్కనే కూర్చున్నాను. షూటింగ్‌కి అన్ని ఏర్పాట్లూ జరిగిపోతున్నాయి. ఆర్టిస్టులొచ్చి మేకప్ కూడా అయ్యారు. “సార్… డైరక్టర్?” అన్నాను. “నేను లేనా?” అన్నారు. చిన్నగా నవ్వి నాయుడుగారు “నేను డైరక్షన్ ఎందుకు చెయ్యలేదో తెలుసా? బి.గోపాల్, ఈ.వీ.వీ. బోయిన… వాళ్ళంతా వచ్చినప్పుడు ‘సార్ లైఫ్ ఇచ్చారు మీరు’ అని దణ్ణం పెడ్తుంటే, నేను డైరక్టర్ అయితే ఇంతమంది తయ్యారయ్యేవారు కాదు కదా! నా స్టూడియోలో ఇంతమంది డైరక్టర్ల ఫొటోలు ఎక్కడ నుండొచ్చేవి? అని ఆలోచించి డైరక్టర్‌ని కాలేదు! మనకదేం బాధ లేదు… నువ్వు చూస్తూ కూర్చో!” అన్నారు. ఏ.వి.ఎస్. “నేను చేస్తా సార్” అని ముందుకొచ్చినా, ఆయన మెగా ఫోన్ చేతబట్టి కామెడీ సీన్స్ షూట్ చేశారు. వాళ్ళకి సీన్ చెప్తూ ఈయనే దగ్గొచ్చేట్టు నవ్వేవారు. అసలు నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడే, “నాకు దగ్గొచ్చేట్టు నవ్వు రావాలి” అన్న కండీషన్ పెట్టారుగా. ఇప్పుడాయనే అది తీయాల్సి రావడంతో బాగా ఎంజాయ్ చేసారు.

గొప్ప ఆర్టిస్టులు అందరూ బాగా చేసారు. ఉత్తేజ్, నరేష్, జయప్రకాశ్‌రెడ్డీ, ఎం.ఎస్. నారాయణా, ఫస్ట్ హాఫ్‌లో ఎంత బాగా చేశారో, శివారెడ్ది, ఏవిఎస్, ధర్మవరపూ, వేణుమాధవ్ సెకండ్ హాప్‌లో అంత బాగానూ చేసారు.

చంద్రసిద్ధార్థ ఆ దరిదాపుల్లోకి రాలేదు. ఈ విషయం కాంపౌండ్ దాటనివ్వలేదు. లేకపోతే ప్రెస్‍వాళ్ళు మర్నాటి నుండే న్యూస్ ఐటెమ్స్ రాసేస్తారని.

ఆఖరి రోజున షూటింగ్‌లో నేను చెట్టు కింద కూర్చుంటే, పార్వతీ మెల్టన్ వచ్చి, ‘డైరక్టర్ పిలుస్తున్నాడ’ని నన్ను తీసుకెళ్ళింది. అక్కడ తన కారుని ఆనుకుని చందూ కనిపించాడు. నేనేం మాట్లాడాలా అని ఆలోచిస్తూ దగ్గరకెళ్ళా, ఓ కత్తి తీసి ఇచ్చాడు. నేను షాక్! “భయపడకండి, అది కొయ్యండి” అన్నాడు. కారు బోనెట్ మీద కొవ్వుత్తులు పెట్టిన కేక్ వుంది. ఆ రోజు నా పుట్టిన రోజు. నేను అది చూసి చాలా ఆనందపడ్డాను. పార్వతి చప్పట్లు కొడ్తూ, పెద్దగా “హ్యాపీ బర్త్‌ డే… టూ యూ” అని పాడ్తుంటే నేను కేక్ కట్ చేసి మొదటగా చందూ నోట్లో పెట్టాను. అలా మా గొడవ సమసిపోయింది. ఇద్దరం నవ్వుకున్నాం. కానీ నాయుడుగారు చందూ డైరక్ట్ చెయ్యను ఈ ట్రాక్ అన్నా సీరియస్ కాలేదు కానీ, దీనికి హర్ట్ అయ్యారు. లోపలికెళ్ళాకా, “ఏం నాకు చెప్పకూడదా నీ పుట్టినరోజనీ? నేను రాకూడదా మీ సెలెబ్రేషన్స్‌లో…? అలా కారు బోనెట్ మీదా, చెట్టుకిందా ఎందుకూ? ఇక్కడ మన ఆర్టిస్ట్‌లు అందర్నీ పిలిచి పార్టీ చేసుకునేవాళ్ళం కదా!” అని కోపంగా అన్నారు. “Wish me sir… అది చాలు… ఇది నాకు కూడా తెలీదు. తెలిస్తే వద్దనేదాన్ని… ఎవరికీ అసలు చెప్పను” అన్నాను. అప్పుడు ఆయన నా నెత్తి మీద చెయ్యి వేసి “అందర్నీ నవ్విస్తూ నువ్వు నవ్వుతూ ఇలాగే పది కాలాల పాటు వుండు… జనవరి 26 ‘రిపబ్లిక్ డే’… ఎవరు మర్చిపోతారు? నీ పుట్టినరోజు ఎప్పుడూ చేస్తూనే వుంటాం” అన్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here