జీవన రమణీయం-64

0
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]రా[/dropcap]మానాయుడుగారూ, సుమంత్ మామా మేనల్లుడులవుతారని చెప్పానుగా. కానీ వాళ్ళిద్దరూ ఇంత దగ్గరగా అన్ని రోజులు గడిపింది ఈ సినిమా వల్లనే! నాగేశ్వరరావు గారి అబ్బాయి నాగార్జున, రామానాయుడుగారి అమ్మాయి లక్ష్మిగారితో విడిపోయాకా, స్వంత బావమరిది అయినా, సురేంద్ర యార్లగడ్డ గారు, ఆయన కుమారుడితో వీళ్ళు సినిమా ప్లాన్ చెయ్యకపోవడానికి ఎన్ని కారణాలున్నా, ఒకటి మాత్రం ఆయన అక్కినేని వారి పెద్దల్లుడవడం! మళ్ళీ ఇన్ని రోజులకి సుమంత్ వచ్చి నాయుడుగారి సినిమా చెయ్యడం, పర్సనల్‌గా తనకి ఎంతో ఆనందంగా వుందని నాతో నాగేశ్వరరావుగారు అన్నారు! నిజానికి ఇదే విషయం రామానాయుడుగారు నాతో భయపడ్డారు. “పెద్దాయన ఏవంటారో? సుమంత్ పైన తాతగారి ప్రభావం ఎక్కువ” అని. సుప్రియ ఎప్పుడూ ఫ్రాంక్‌గా, నాతో క్లోజ్‌గా మాట్లాడేది… “మీకు తెలుసుగా, వన్స్ సురేష్ మామ రంగంలోకి దిగాకా, ఆయన గ్రీన్ ఫ్లాగ్ వూపాకా సినిమాకి ఏం ఇబ్బందులుండవు” అని. అదే నిజం అయింది.

రామానాయుడుగారితో నేను సన్నిహితంగా వుండడం వలన ఒకరిద్దరు వంకరగా మాట్లాడుతున్నారని నేను విన్నాను! కానీ ఆయన నాకు పిత్రు సమానులు. అప్పట్లో ఆయనకి కాస్త తలనొప్పొచ్చినా చాలా భయపడిపోయేవారు. చాలా హెల్త్ కాన్షియస్. “ఈ రోజు సోమరాజు దగ్గరకెళ్లి హార్ట్ చెకప్ చేయించా… మోహన వంశీ దగ్గరకెళ్ళొచ్చా… గోపీచంద్ దగ్గరకెళ్ళొచ్చా…” అని ఆయన నాతో వారంలో ఒకసారి చెప్తుండేవారు.

‘నేనేం చిన్నపిల్లనా’ కోసం ఒకసారి వైజాగ్ స్టూడియోలో వున్నాం. అదే మొదటిసారి వైజాగ్ స్టూడియో చూడడం. ఆయనకి కాస్త జ్వరం వచ్చింది. తల నెప్పి కూడా. స్టూడియోలో మెయిన్ బిల్డింగ్‍లో కింద ఆయనా, పైన పెద్ద రూమ్ నాకూ ఇస్తే, చైల్డ్ ఆర్టిస్ట్‌లనీ, వాళ్ళ అమ్మనీ కూడా నేను నాతోనే వుండమన్నాను.

భోజనం చేసేటప్పుడు నన్నూ, డైరక్టర్‌నీ, వుంటే హీరోనీ ఆయన పిలిచేవారు. నాకు వడ్డించి, తినకపోతే “అది బావుంటుంది… తిను” అని అరిచి ఒక తండ్రిలా పెట్టేవారు. అందరూ వెళ్ళిపోయాకా, ఎటెండెంట్ కంగారుగా పరిగెడ్తున్నాడు. “ఏమైంది?” అని నేను అడిగితే, “నాయుడుగారికి ఒంట్లో బాలేదు, తల నెప్పీ, ఒళ్ళు నెప్పులూ” అన్నాడు. నేనెళ్ళి, “సార్… మీరు స్టూడియో అంతా తిరిగి నాకు చూపించారు. వచ్చిన పర్యాటకులు కూడా మీతో ఫొటోలు తీయించుకున్నారు… అందువల్ల మీకు దిష్టి కొట్టి వుండవచ్చు” అని దిష్టి తీస్తానని, ఉప్పు తెప్పించి దిష్టి తీసాను. నా పిల్లలకి తీయడం నాకు అలవాటే! నాకూ మా అమ్మా, అమ్మమ్మా దిష్టి తీస్తానంటే, నేను మూఢనమ్మకాలని ఖండించేదాన్ని. కానీ పిల్లల విషయంలో భయం. తీసేదాన్ని! నేను దిష్టి తీసాకా ఆయన ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తోందని, స్తిమితంగా హాయిగా పడుకున్నారు. ఆ తరువాత చాలా సార్లు “రమణిని పిలవండి… తల నెప్పి. ఉప్పు తెప్పిస్తే దిష్టి తీస్తుంది” అనేవారు. అలా ఆయనకి సైకలాజికల్‌గా అది పనికి వచ్చేది. నేనేదైనా చెప్తే “నువ్వు రచయిత్రివి… నువ్వు బాగా ఆలోచిస్తావు… అదే నిజం అయి వుంటుంది” అనేవారు. రచయితలు ఎవరైనా సరే ఆయనకి చాలా అభిమానం, గౌరవం.

ఇంక సుమంత్‌తో మలేషియాలో బస్ ఎక్కి లొకేషన్‌కి వెళ్తున్నప్పుడూ అదీ, తన అత్తవారిల్లు అంటే సుమంత్ అమ్మమ్మ గారింటి మీద జోక్‌లు వేసేవారు! “మీ ఇంట్లో నాన్ వెజ్ వారానికి ఒక్కసారి కూడా వండేవారు కాదు… నాకు రోజూ అలవాటు. అప్పట్లో పెళ్ళయిన కొత్త… నాకు ఆకుకూరలూ, కాయగూరలు వడ్డిస్తే, విస్తరి ముందు నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ తిన్నా. అప్పుడు వాళ్ళకి తెలిసి రోజూ వండడం మొదలుపెట్టారు నేనున్నన్ని రోజులూ!” అంటే, సుమంత్, “నువ్వు నాకు మహోపకారం చేసావు మావయ్యా అయితే…” అనేవాడు. ఇంకా ఎన్నో కబుర్లు ఆయన చిన్నప్పటివి చెప్పి, నవ్వించేవారు. ఆయన కాంపౌండర్‌గా చేసినప్పుడు నర్స్‌లతో రొమేన్స్‌లవీ కూడా చమత్కారంగా నవ్వొచ్చేట్లు చెప్పేవారు… దాని వల్ల ఆ ఉద్యోగం కూడా పోయిందని! ఇటుకలమ్మే వ్యాపారంలో కూడా నష్టం వచ్చిందనీ, ‘నమ్మినబంటు’ సినిమా తమ వూళ్ళో చేస్తుంటే ఆ షూటింగ్‌లో నాగేశ్వరరావు గారితో, ఎస్.వి.రంగారాగారితో పరిచయం అయి, ఉన్నది అమ్మి, డబ్బులు పట్టుకుని మదరాసు ప్రయాణం అయ్యాననీ, ఆ ఎపిసోడ్లు అన్నీ నేనే ఓ ఇరవై ముప్ఫై సార్లు విని వుంటాను! శాంతకుమారి గారు “నీకు దిష్టి తగులుతుందిరా… ఆ హీరోయిన్‍లందరూ నీకెల్లే చూస్తున్నారు” అనేదనీ! ఈ దిష్టి నమ్మకం ఆయనకి ఎప్పటినుండో వుంది! మొత్తానికి యూనిట్ అందరికీ, ఇద్దరు హీరోయిన్స్‌తో సహా ఆయన జీవిత చరిత్ర మొత్తం తెలుసు! అంతే కాకుండా… మోనికా బేడీ, దివ్యభారతీ, కరిష్మా కపూర్, సుమలతా… మొదలైన హీరోయిన్‌లని తను ఎలా వెతికి ఇండస్ట్రీకి తెచ్చారో; కరిష్మా కపూర్ ‘నేను స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోనం’టే ఈయన, “మీ తాత ప్రతీ హీరోయిన్‌నీ ఎక్స్‌పోజ్ చేసేవాడు… రాజ్‌కపూర్ సినిమాలో బికినీ సీన్స్ తప్పవు… అనే పేరుంది… నువ్వెందుకు చెయ్యవు?” అన్నానని చెప్పి చెప్పి నవ్వేవారు.

మీనాక్షీ శేషాద్రీ “ఒక చెవి మీద జుట్టు పైకి తియ్యమ్మా… ఆ చెవికున్న జూకా చాలా డబ్బు పెట్టి తెచ్చాం… ప్రేక్షకులకి కనబడాలి” అంటే, ఆమె పాటలో మళ్ళీ చెవి మీదకి జుట్టు వేసుకుందనీ, తాను పట్టుపట్టి మళ్ళీ రీషూట్ చేయించాననీ చెప్పేవారు.

కరిష్మా కపూర్, బబితా, కరీనా కపూర్ తన గెస్ట్ హౌస్‌లోనే సినిమా కంప్లీట్ అయ్యేదాకా వుండిపోయారు, మధ్యలో ముంబయి వెళ్ళకుండా. చాలా కష్టాల్లో వుండేవారని చెప్పారు. ఆయనకున్న చాలా స్టాంగ్ ప్రిన్సిపల్స్‌లో ఒకటి – హీరో, హీరోయిన్స్ స్టార్ హోటల్ అడగకూడదు… కావాలంటే ఫుడ్ ఎక్కడినుండైనా తెప్పించుకోవచ్చు గానీ, తన సురేష్ గెస్ట్ హౌస్‍లోనే వుండాలన్నది మెయిన్ ప్రిన్సిపల్.

అది కూడా చాలా మందికి ఇష్టం వుండేది కాదు అని నాకు తెలిసింది!

ఇంక మధుమసం మొదలయినప్పటి నుండీ, ప్రెస్ మీట్లూ, ఏదో ఒక ఫంక్షన్, భోజనాలు మాకు సర్వసాధారణం అయిపోయింది. “ప్రాతికేయులకి నమస్కారం” అన్న ఆయన స్పీచ్ పాత్రికేయులకీ అలవాటే… అందరినీ పేరు పేరునా పలకరించేవారు! వాళ్ళు నా గురించి కూడా గౌరవంగా రాసేవారు. ఒకే ఒక్కసారి ‘నేనేం చిన్నపిల్లనా’ చేస్తున్నప్పుడు, గ్రేట్ ఆంధ్రా డాట్ కామ్‌లో నా గురించి రామానాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఒక జర్నలిస్ట్ రాస్తే, పరుచూరి గోపాలకృష్ణ గారు చాలా ఫీలయి, నన్ను పిలిచి చెప్పారు… నేను ఆ ఓనర్ ఫోన్ నెంబర్‌కి (వెంకటరెడ్డి గారికి) వెంటనే ఫోన్ చేసి “నా గురించి మీ రిపోర్టర్ ఇలా రాయచ్చా” అని అంటుండగానే, పూర్తిగా వినకుండానే “క్షమించండమ్మా… నేనిప్పుడే తీయించేస్తాను… లైన్‌లో వుండండి…” అని, “ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి, లేదు” అన్నారు! నేను చాలా ఋణపడ్డాను ఆయనకి. ఎందుకంటే, ఏం చెప్పాలో కూడా తెలీదు నాకు అప్పట్లో! ఏం చెప్తే ఈ వెబ్‌సైట్‌లలో ఏం పెడర్థాలు తీసి రాస్తారో అని భయం. కానీ నేనేం చెప్పకుండానే ఆయన నా ప్రాబ్లెం సాల్వ్ చేసేసారు. మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి న్యూస్‌లు రాలేదు… లక్కీగా అప్పుడు యూట్యూబ్‍ ఛానల్స్ లేవు! కనీసం జర్నలిజంలో డిగ్రీ లేని ప్రతీ వాళ్ళూ, ఖాళీగా వుంటే ఓ మైక్ పట్టుకుని, రిటైరయిన వాళ్ళని పట్టుకుని పనికిమాలిన ముచ్చట్లు చెప్పమని అడగడం… వాళ్ళు చూడనివీ, విన్నవీ, వాటికి మరిన్ని జోడించి చెప్పడం ఎక్కువయిపోయింది. మా చిన్నతనంలో సినిమా వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే విజయచిత్ర ఒక్కటే శరణ్యం! వాళ్ళు మనలో కామన్ పీపుల్‌గా తిరిగేవారు కాదు. వంద రోజుల పండగలకి కూడా, గీతాంజలి గారు చెప్తారు, స్టేజ్‌కీ, ప్రజల మధ్య బేరికేడ్స్ కట్టి, కనీసం వాళ్ళ దగ్గరకి ఆటోగ్రాఫ్‌ల కోసం కూడా వెళ్ళనిచ్చేవారు కాదుట!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here