[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]నే[/dropcap]ను ఆ తరువాత ‘ఒక బృందావనం’ నవల రాసాను. ఆ కథని సిద్ధార్థకి చెప్పాను. ఆదిత్య డైరక్టర్‌గా ఎమ్.ఎన్. రాజుగారు అప్పుడు ‘ఆట’ సినిమా చేస్తున్నారు. మా అశ్విన్ అచ్చు సిద్ధార్థలా వుండేవాడు! వి.ఎన్.ఆదిత్య, అశ్విన్ ఎలా టీ షర్ట్ మీద ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుని సగం ముడుచుకుంటాడో, అలాగే సిద్ధార్థ చేతా ముడిపించి మెడ దగ్గర జుట్టు పెంచి నల్ల దారం వేయించాడు. తిరుపతిలో కొన్నది, అలాంటి దారం వేసి, చేతికి స్టీల్ కడియం వేసి, సడన్‌గా చుస్తే ఫోటో, మెడదాక జుట్టుతో, అచ్చు మా అశ్విన్‌లా తయ్యారు చేశాడు సిద్దార్థ గెటప్.
నా ఫేట్ ఎప్పుడూ నాకు విజయావకాశాలని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి లాగేసి ఆడిస్తూ వుండడం ప్రొఫెషనల్ లైఫ్‌లో కామన్‌గా వుండేది. అన్ని వచ్చేసినట్లే కనుచూపు మేరలో కనిపించేవి. మృగతృష్ణలా ఎంతకీ దగ్గరయ్యేవి కావు! నేనూ వాటిని అందుకోవాలన్న నడక మానలేదు… మానను. ఎందుకంటే ఒక అవకాశం పోతే ఇంకొటీ, ఒక ద్వారం మూస్తే మరొకటీ దేవుడు తెరుస్తాడని నా విశ్వాసం. సినిమా గేప్ రాగానె వెళ్ళి ఏదో ఒక టీ.వీ. సీరియల్ చేసేదాన్ని. అలాగే గేప్‌లో ‘తూర్పు వెళ్ళే రైలు’ సీరియల్‌కి అనిల్‍కుమార్ గారు పిలిచారు. శ్యాంప్రసాద్ రెడ్ది గారు నిర్మాత. అనిల్‌కుమార్‌గారితో పనిచెయ్యడం చాలా సరదాగా వుంటుంది. మనిషి చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మనిషి! స్పాంటేనిటీ కూడా చాలా ఎక్కువ. ఇప్పటికీ మేం ఫోన్‌లో మాట్లాడుకుంటుంటే చాలా సేపు నవ్వులే వుంటాయి!
శ్రీశైలంలో షూటింగ్ పెడ్తే, నేనూ మా ఆయనతో వెళ్ళాను. వీరేంద్రనాథ్ గారి ‘అంతర్ముఖం’కి నేను మాటలు రాస్తున్నప్పుడు ఓసారి భద్రాచలం వెళ్ళాను. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాను. స్క్రీన్ ప్లే మాత్రం రాసాను ‘తూర్పు వెళ్ళే రైలు’కి. నాకు స్క్రీన్ ప్లే రాయడం నల్లేరు మీద నడకలా వుండేరి. నేను గర్వంగా చెప్పుకోగలను. నా అంత వేగంగా స్క్రీన్ ప్లే చేసే రైటర్స్ చాలా తక్కువ వుంటారు. టీ.వీ. సీరియల్‌కి కావలసింది అదే! వేగం.
మధుమాసం వంద రోజుల పండుగకి రామానాయుడు గారు రాఘవేంద్రరావుగారినీ, అక్కినేని గారినీ, బి.గోపాల్ గారినీ, ఇంకా చాలామంది ప్రముఖులని పిలిచినా అరవింద్ గారిని పిలవలేదు. మొదట్లో చెప్పాగా… ఆయన ఫోన్ చేస్తే తియ్యకుండా అరవింద్ గారు నా ఫోన్ తీసారని ఆయన మనసులో పెట్టుకున్నారు.
రామానాయుడు గారు రివాజుగా మంచి విందు ఇచ్చారు. “రమణీ గారెలు వేసుకున్నావా? రేయ్… వేడిగా వెయ్యండిరా గారెలు… అదిగో అందులోకి కొబ్బరి చట్నీ వేసుకో… ఇదిగో పులిహోర… బ్రాహ్మలమ్మాయివని నీ కోసమే చెప్పి చేయించాను” అని అని ఆయన నా పక్కనుండి వడ్డింపించి ప్రేమగా తినిపించడం చూసి నా పక్కనున్న ఫణి “మీరెంత అదృష్టవంతులు మేమ్?… ఇలా పెద్ద పెద్ద వాళ్ళు మిమ్మల్ని ఇంతగా అభిమానించడం ఎంత గొప్ప? ఇందాక నాగేశ్వరరావు గారు వెళ్ళేటప్పుదు కూడా ‘రమణీ గారు ఏరీ?’ అని ఆగి, మీరొస్తేనే గానీ కారెక్కలేదు… ఆయన కడగంటి చూపుల కోసం అక్కడ ఎంతమంది ఎదురు చూస్తున్నారో!” అని ఆశ్చర్యపోయాడు. అవన్నీ నా గొప్పతనం కాదు! నా పూర్వజన్మ సుకృతం… మా పెద్దలు చేసిన పుణ్యం.. డబ్బు కోట్లలో సంపాదించిన రచయితలు కూడా వున్నారు… కానీ నేను సంపాదించుకున్న ప్రత్యేకమైన స్థానం పెద్దల దగ్గర… అరుదైనది… వెలకట్టలేనిది!
ఆ రోజు మా పెద్దమ్మ పెద్ద కూతురు లక్ష్మీ అక్కా, హనుమంతరావు బావల షష్టిపూర్తి. గ్రాండ్ కాకతీయాలో వారి పిల్లలు డిన్నర్ ఇస్తున్నారు. నేను ఈ వంద రోజుల పండుగ నుండి డైరక్ట్‌గా అక్కడికి వెళ్ళాను. డ్రైవర్ కుమారే నాకు అప్పుడు కూడా. నా కడుపు నిండిపోయి వుంది… అసలు ఈ ఫంక్షన్ కన్నా అక్కడే కాసేపు గడిపి నాయుడిగారి సమక్షంలో గడపాలనిపించింది. రేపటినుండీ ఈ కాంపౌండ్‌కి రాలేనేమో అన్న దిగులేసింది! కాని 2006 నుంచి 2015 వరకూ ఆ కాంపౌండ్‌కి చాలా ఎక్కువగా వెళ్ళి, అది నా స్వంత ఇల్లు అన్నట్లు గడిపే ఆస్కారం నాకు దొరికింది!
కొన్ని రోజులు పిల్లల చిన్నతనంలో వుద్యోగం గీత నా చేతిలో వుండి టీచర్‌గా చేసానా… ఇంక జన్మలో ఉద్యోగం చెయ్యద్దనుకున్నాను. కానీ అల్లు అరవింద్ గారి పుణ్యమా అని నేను మళ్ళీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అదీ మాటీవీలో క్రియేటివ్ కన్సల్టెంట్‌గా. వారానికి రెండే రోజులు వెళ్ళేదాన్ని. అక్కడ నేను మొదటగా కలిసిన వ్యక్తి ఫిక్షన్ హెడ్‌గా వున్న శాయిప్రసాద్ గారు. తర్వాత ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యారు కానీ… మొదట నా బాస్‌గా వున్నారు. శరత్ మరార్ గారి పేరు అరవింద్ గారి నోటి నుండి చాలాసార్లు విన్నాను. నేనోసారి రేడియో మిర్చీ లాంచింగ్‌కి చిరంజీవిగారిని పిలవడానికి సుజాత అనే అమ్మాయికి హెల్ప్ చేసా! అప్పుడు కూడా శరత్ మరార్ చెప్తే చిరంజీవి గారు వింటారు అనేవారు అరవింద్ గారు. చిరంజీవిగారికి, అల్లు అరవింద్ గారికీ కూడా శరత్ మరార్ గారు అంత ఆప్తులు. ఆ మరార్ గారు, డిడి1 నుండి టీవీ ఇండస్ట్రీకే భీష్మ పితామహులు అని పిలవబడే మరార్ గారి అబ్బాయి. ఎబిసిల్ సంస్థలో, రిలయన్స్‌లో, డిస్నీలో చేసి వచ్చిన మేధావి! ఆయన అప్పట్లో సి.ఇ.ఓ. మాటీవీకి. ఆయన్ని కలిసాను. ఆయన నన్ను ఇమ్మీడియట్‌గా జాయిన్ అయిపోమన్నారు. నేను మాటీవీలో ఉద్యోగం చెయ్యడం వలన కొన్ని విషయాలు తెలుసుకోగలిగాను. అపురూపమైన స్నేహాలు పొందాను… కొందరు వ్యక్తులు ఎంత ప్రమాదకరమో తెలిసి దూరం పెట్టగలిగాను… జీతం మాత్రం 2008లో 40 వేలు… పార్ట్ టైమ్ జాబ్, చాలా హేపీగా వున్న టైమ్ అది!
(సశేషం)