[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]అ[/dropcap]టు ‘తూర్పు వెళ్ళే రైలు’ సీరియల్ కూడా ఆపలేదు! ఇటు పార్ట్ టైమ్ జాబ్. వారంలో రెండు సార్లు వెళ్ళి కథలు వినేదాన్ని. ఇంకో పక్క మా ‘అందరి బంధువయా’ స్క్రిప్ట్ పని స్టార్ట్ అయింది.
నాకెంత మంది స్నేహితులున్నారో ఇండస్ట్రీలో… నేను మాటీవీలో క్రియేటివ్ కన్సల్టెంట్‌గా జాయిన్ అయ్యాకే అర్థం అయింది. అసలే చిన్నప్పటి నుండీ నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. “నువ్వు ప్రయాణం చేస్తేనే కాదు, లిఫ్ట్ ఎక్కి దిగితే కూడా నీకు స్నేహితులౌతారు…” అని మా ఆయన అనేవారు. ప్రతివాళ్ళూ టీవీ… ఇంకా సినిమా ఇండస్ట్రీలో స్నేహితులే గదా! వారొచ్చి “మాకు స్లాట్ ఇప్పించండి మేడం గారూ…” అనేవారు. అంతేకాదు, లంచాలు కూడా ఆఫర్ చేశారు. నాకన్నా ముందావిడ లంచాలు అడిగిందని వేగుల ద్వారా వార్త వచ్చే కదా నన్ను ఈ ఉద్యోగంలో పెట్టిందీ పెద్దలు! అసలు నాకు ఉద్యోగం ఎంత బావున్నా ఆ రూల్స్, రెగ్యులేషన్స్ పాటించడం ఇష్టం లేదు! స్వేచ్ఛగా తిరిగేదానికి కాలి సంకెలయింది వుద్యోగం – దానికి తోడు ఎవరికి ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళకి నా మీద పగ!
హీరో గురించి మేం పెద్దగా వెతకలేదు. శర్వానంద్ అయితేనే ‘అందరి బంధువయా’లో హీరో కేరక్టర్‌కి కరెక్ట్ అని మొదటినుండీ అనుకున్నాం. తండ్రి కేరక్టర్ చాలా ముఖ్యమైనది. ‘ఆ నలుగురూ’లో రాజేంద్రప్రసాద్ లాంటిది, అనుకోగానే మేం, అంటే నేనూ చంద్రసిద్ధార్థ, రాజేంద్రప్రసాద్ గారింటికి వెళ్ళాం!
రాజేంద్రప్రసాద్ అంటే ఇష్టం వుండనివాళ్ళు 80-90ల మధ్యలో తెలుగు సినిమాలు చూసినవాళ్ళు ఎవరూ వుండరు.
అలా మేం వాళ్ళింటికి కథ చెప్పడానికి వెళ్తున్నాం అనగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఆయనది చాలా మామూలుగా వున్న ప్లాట్. బాగా రిసీవ్ చేసుకున్నారు. “చందూ తెల్సుగా… మనకెలాంటి రోల్ కావాలో?” అన్నారు. ఆయనే స్వయంగా టీ పెట్టి, జంతికలూ, గవ్వలూ ప్లేట్‌లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు. ఓ బోయ్ కూడా లేడు! ఫ్యామిలీ మద్రాసులో వుందిట.. ఈయన ఒక్కడే హైదరాబాద్‌లో వున్నారు. అంతా బాగానే వుంది కానీ ఆయనకి ఎప్పుడు కోపం వచ్చేస్తుందో మాత్రం చెప్పలేం. చంద్ర సిద్ధార్థ మామూలుగా మాట్లాడ్తూ “మాటీవీలో మన ‘ఆ నలుగురూ’ సినిమా ఎప్పుడు వేసినా, పక్కన పెద్ద సినిమాలున్నా… వాటి కన్నా ఎక్కువ రేటింగ్ వస్తుంది” అన్నాడు.
ఆయన మొహం అప్రసన్నంగా మారిపోయింది. “పెద్ద సినిమాలంటే? పెద్ద హీరోల సినిమాలనా నీ వుద్దేశం? చిరంజీవా? నాగార్జునా? వెంకటేషా? అంటే నేను పెద్ద హీరో కాననా నీ అభిప్రాయం? అయితే ఎందుకొచ్చావ్? నన్ను వెతుక్కుంటూ వచ్చావంటే నేను ‘పెద్ద హీరేననేగా?’ అంటూ రెచ్చిపోయి మాట్లాడేసరికీ నేను బిత్తరపోయాను. సాధారణంగా మితభాషి అయిన చందూ, ఎంతో కష్టపడి తన సౌమ్యతతో చల్లబరిచాడు! కథ చెప్పడానికి నాకు భయం వేసింది. అయినా చెప్పేసాను! ఆయనకి కథ విపరీతంగా నచ్చి, ఆ పాత్ర గురించి తెగ మాట్లాడారు. కానీ “మన బాలాజీని హీరోగా పెడదాం” అన్నారు.
‘బాలాజీ’ అంటే వాళ్ళబ్బాయి. నేనూ చందూ మొహాలు చూసుకున్నాం! మేం ఇద్దరం శర్వానంద్‌ని వూహించుకుని సీన్స్ రాశాం. అందుకే మర్యాదగా, తిరస్కరించకుండా బయల్దేరాం. ఆయన టేబుల్ మీద ఒక యోగి ఆత్మకథ పుస్తకం… అలాంటిదే ఇంకో పుస్తకం… అచ్చు అదే గెటప్‌లో రాజేంద్రప్రసాద్ గారి ఫొటో వున్నాయి.
“ఆ అమ్మాయి గమనించింది… నువ్వు గమనించలేదు చందూ. ఈ గెటప్ ఎలా వుంది? నేనే ఆ వేషం వేస్తున్నాను” అన్నారు. మేం వచ్చేసాం. కానీ ఆ సినిమా మాత్రం అయినట్లు లేదు!
పూలన్నీ పిందెలూ, పిందెంతా కాయా కాదు అని మామిడి పూతని అన్నట్టే సినిమా ఫీల్డులో ప్రపోజల్స్, సినిమా తియ్యాలన్న ఆలోచనలనీ పోల్చచ్చు! ఎంతైనా కోట్లతో వ్యవహారం! అప్పట్లో చాలా అవస్థగా వుందేది. పబ్లిసిటీ ఖర్చు, నిర్మాణం ఖర్చుకి సమానంగా పెట్టుకోవల్సి వచ్చేది. అయినా పూర్తి అయిన తర్వాత థియేటర్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు! ‘ఆ నలుగురూ’ చేతుల్లో థియేటర్స్ వున్నాయని, వాళ్ళ వల్లే చిన్న సినిమాలు ఆడడం లేదనీ, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, దాసరి నారాయణరావుల గురించి అంతా మీడియాలో హల్‌చల్ చేస్తున్న రోజులవి!
హీరోయిన్ పాత్రకి ఎంపిక మాకు కష్టమే అయింది. చాలామంది అమ్మాయిలను రోజూ ఆడిషన్‍కి పిలిచేవారు! సేమ్ టీమ్ గోగు, మా రవీ, వీళ్ళతో బాటు అత్యుత్సాహపరుడైన కుమార్, ఇంకో అబ్బాయి బాలూ వచ్చి చేరారు.
ఆర్.కె.లోరీ, నయీంలు మా ప్రొడ్యూసర్‍లుగా వ్యవహరించారు. చందూ ఎలా చెప్తే అలా వినే ఫ్రెండ్సేగా అనుకున్నాను. రెమ్యూనరేషన్‌కి పెద్దగా బేరసారాలు లేకుండానే నాకు ‘మధుమాసం’కి ఎంతిచ్చారో, అంత ఇస్తాం అన్నారు. డైలాగ్స్ కూడా నేనే రాస్తానన్నాను!
నా జీవితంలో ‘అందరి బంధువయా’ టైటిల్స్‌లో ‘రచన… బలభద్రపాత్రుని రమణి’ అని కాకుండా, ‘కథా… మాటలూ… బలభద్రపాత్రుని రమణి’ అని పడ్తే బావుండేదేమో అని ఇప్పటికీ అనుకుంటాను… అంత మంచి డైలాగ్స్ రాశాను. ‘రచన’ అంటే నేను నావలిస్ట్‌ని కాబట్టి, కథ మాత్రమే అనుకొని వుంటారు. అందుకే ఇప్పటికీ ‘అందరి బంధువయా’ మీరు రాసారా, ఆ డైలాగ్స్ మాకు ఎంత ఇష్టమో… ఏమిటీ మీరు రాసారా, అస్సలు తెలీదు అని ఫీల్డులో పెద్ద పెద్ద డైరక్టర్స్, ప్రొడ్యూసర్స్ సైతం అంటుంటే బాధేస్తుంది! అవతలి వాళ్ళకి పని ఇప్పించడం, వేషాలిప్పించడం ఇవన్నీ కాస్త తగ్గించి, నా కెరీర్ గురించి నేను ఎక్కువ పట్టించుకునుంటే పరిస్థితి ఇలా వుండేది కాదేమో!
(సశేషం)