[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]ఇ[/dropcap]క్కడ జీవితంలో ఒక పెద్ద మలుపు సంభవించింది! అదేమంటే, ఓనాటి రాత్రి కిరణ్ ప్రభ గారనే పెద్దమనిషి, అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ అందుగల డుబ్లిన్ నుండి ఫోన్ చేశారు. ఆయన పేరు నేను గుర్తు పట్టాను, కానీ ఆయనకి నేను నా రచనల ద్వారా తెలుసు అనడం చాలా ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు ఆయన తను ప్రారంభించిన ‘కౌముది’ గురించి చెప్పి, “నేనూ మా శ్రీమతి కాంతీ ‘మధుమాసం’ పిక్చర్‌నీ, మిమ్మల్నీ ఫాలో అవుతున్నాం అండీ, ఆవిడ మీ ‘రేపల్లెలో రాధ’ నవల కూడా ఆంధ్రప్రభలో ఫాలో అయ్యేదండీ…” అని చెప్పి, అసలు సంగతి అప్పుడు బయటపెట్టారు.
“వంగూరి చిట్టెన్‌రాజు అనే ఆయన వంగూరి ఫౌండేషన్ అని అమెరికాలో ఆరేళ్ళుగా ఒక తెలుగు సాహిత్య సంస్థ నడుపుతున్నారండీ… దానికి ఈసారి గెస్ట్‌గా భారతదేశం నుండి మిమ్మల్ని పిలవాలనుకుంటున్నారు” అని. నా చెవులని నేనే నమ్మలేకపోయా… నా ప్రతిభని గుర్తించి, ఎవరో నన్ను విదేశాలకి ఆహ్వానిస్తారని కలలో కూడా అనుకోలేదు! ఒకసారి ఎప్పుడో అల్లు అరవింద్ గారు, “సులోచనారాణి గారు మీకు బాగా పరిచయమే కాబట్టి, ఆవిడ సరే అంటే నేను ‘తానా’ వాళ్ళకి చెప్పి మీ ఇద్దరికీ ఆహ్వానం తెప్పిస్తా. ఎందుకంటే అంత దూరం వెళ్ళి మీరు సభలు మూడు రోజులు అయిపోగానే, తిరిగి వచ్చేయడం కాకుండా, అమెరికాలో నాలుగు వూళ్లూ తిరిగి ఆవిడతో కలిసి, ఆవిడ అభిమానుల ఇళ్ళల్లో బస చేసి తిరిగి రావచ్చు” అన్నారు. నేను ఆ ప్రపోజల్‌ని నిర్ద్వందంగా కొట్టిపారేసా! అలాంటిదిప్పుడు ఎవరి రికమండేషన్ లేకుండా, ఆ చిట్టెన్‌రాజు గారు ఎవరిని పిలుద్దాం ఈసారి అని కిరణ్ ప్రభ గారితో చర్చించడం, ఆయన నా పేరు సూచించడం, అంతా పెద్ద మాయగా వుంది! ఆనందంతో “అలాగేనండీ” అన్నాను. “అయితే నెక్స్ట్ చిట్టెన్‌రాజు గారు మీతో మాట్లాడ్తారు… మీ నెంబర్ ఇస్తాను” అని కిరణ్ ప్రభ గారు ఫోన్ పెట్టేసారు.
అప్పుడు మా అశ్విన్ ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ అయిపోయి, క్యాట్ ఎగ్జామ్ రాసి మంచి గ్రేడ్స్ తెచ్చుకుని, యూ.ఎస్. వెళ్ళే ప్రయత్నాలలో వున్నాడు. విశ్శూ కన్సల్టెన్సీ అనే సంస్థని నమ్ముకుని వాళ్ళు డాక్యుమెంట్స్ సరిగ్గా పంపక, మోసపోయి వున్నాం. పాపం వాడే, “స్వయంగా చేసుకుంటానమ్మా, బాధ పడకు” అన్నాడు. వాడు వెళ్ళే విషయంలో మా ఆయన ఎందుకో అప్పుడంత సముఖంగా లేరు! చిన్నవాడు మూడో ఏడు మెకానికల్ ఇంజనీరింగ్‌లో వున్నాడు.
వంగూరి చిట్టెన్‌రాజు గారు మర్నాడు ఫోన్ చేసారు. “మహాతల్లీ… నన్ను భవదీయుడు వంగూరి చిట్టెన్‌రాజు అంటారు… మీ గురించి కిరణ్ ప్రభ చెప్పాడు… తమరి రాక మాకెంతో ఆనందం సుమండీ… రండి… రండి… రండి… దయచెయ్యండీ” అంటూ చాలా ఏళ్ళుగా పరిచయం వున్నవాళ్ళు మాట్లాడినట్లు తమాషాగా మాట్లాడారు. నేను ఆనందంగా నా అంగీకారం తెలిపి, నా సంశయాలూ, సంకోచాలూ, సంభ్రమాలూ అన్నీ అడిగేసాను! అప్పుడాయన, “మొదట జూన్ మొదటివారంలో జరిగే ఆటా సభలకి రండి… తర్వాత నాతో అక్కడి నుండి హ్యుస్టన్ వద్దురుగాని మా ఇంటికి” అన్నారు. నా భయం సగం తీరింది. మా ఇంట్లో మా అమ్మకీ, మా ఆయనకీ, నా పిల్లలకీ చెప్పి వీసాకి అప్లై చేసే ప్రాసెస్‌లో కాయితాలు సమకూర్చుకోడంలో పడ్డాను.
అయితే ‘ఆట’ సినిమా తర్వాత ఆదిత్య వి.ఎన్. ఇంకో సినిమా స్వయంగా తీయడానికి నిర్ణయించుకుని, నన్ను కథ రాయడానికి పెట్టుకున్నాడు. అతను చెప్పిన లైన్ తీసుకుని ‘కలర్ బ్లైండ్’ హీరో మీద ‘రెయిన్‌బో’ కథ తయ్యారు చేసిచ్చాను. అందులో వేషం వెయ్యడానికొచ్చిన గొల్లపూడిగారితో నాకు పరిచయం అయింది.
రచయితలంటే నాకు చాలా ఇష్టం కదా! నేను ఆయనకి నమస్కారం పెట్టి మాట్లాడ్తుంటే, ఆయన “మా అబ్బాయిలు వెల్ సెటిల్డ్, చెన్నై ట్రావెల్ ఏజన్సీ నడుపుతున్నాడు రామకృష్ణ..” అని చెప్పారు. నేనప్పుడు “వంగూరి గారు పిలిచారండీ, వీసా వస్తే నేను ఈసారి వంగూరి ఫౌండేషన్ ఆరవ మహా సభలకి వెళ్తాను” అని చెప్పాను.
అయన వెంటనే “చిట్టెన్‌రాజు కానీ ఆ కిరణ్ ప్రభ గానీ నాకెంతో దగ్గరవాళ్ళు! ఓ పని చెయ్యి, అమెరికాలో ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావో, VUSA (విజిట్ యూ.ఎస్.ఎ.) అనే టికెట్స్ మా అబ్బాయి చేత బుక్ చేయించుకో… నీకు ముందుగానే, ఏ రోజు నువ్వు ఏ స్టేట్‌లో, ఏ ఫ్లైట్‌లో ఏ సీట్‌లో ప్రయాణం చేస్తావో కూడా ముందే తెలియబరుస్తారు. నువ్వు నా ఏజెంట్‌ని వాడు లేదా నేను నీ ఏజంట్‌ని వాడ్తాను… తద్వారా మీ ఆంటీకి నీ లాంటి అమ్మాయి మంచి కంపెనీ దొరుకుతుంది” అన్నారు. నేనెంతో సంతోషించాను… ఒక్కదాన్నీ దేశం కాని దేశం వెళ్తున్నాను అనే భయం పోయింది. మహానుభావుల కంపెనీ దొరికింది!
నేను ఉద్యోగం చేస్తున్న మాటీవీలో చెప్పే ముందు అరవింద్ గారికి చెప్పాను. “ఒక్కదానివి వెళ్తే ఆ మజానే వేరు… ఎక్స్‌ప్లోరింగ్ ఎప్పుడూ ఎవరి మీదా డిపెండ్ అయి చెయ్యకూడదు… వీసాకి వెళ్ళేముందు చెప్తే, నేను మా మేనేజర్‌కి చెప్తాను. పుల్లయ్య మీకు గెస్ట్‌హౌస్, కారూ అన్నీ ఏర్పాటు చేస్తాడు” అన్నారు. సరే ఆ బాధ కూడా లేదు, అన్నీ సాల్వ్ అవుతున్నాయి… మరి ‘నేను వెనక్కి వస్తాను, పర్వాలేదు’ అని కాన్సులేట్‌లో నమ్మకం కుదర్చాలిగా! రామానాయుడిగారి దగ్గర నుండీ, శ్రీ మిత్ర ప్రసాద్ దగ్గర నుండీ, మాటీవీ సీ.ఈ.ఓ. శరత్ మరార్ గారి దగ్గర్నుండీ నేను ‘ఈవిడ మాకు పనిచేస్తోంది. రీజినల్ లాంగ్వేజ్‌లో. తెలుగు నవలా, స్క్రీన్ ప్లే, స్టోరీ, డైలాగ్ రైటర్’ అని లెటర్స్ తెచ్చుకున్నాను. నా పేరు కూడా రికార్డ్స్ ప్రకారం బలభద్రపాత్రుని రమణి కాదు, అదీ ఒక లాయర్ వద్ద నుండి ఎఫిడవిట్ తెచ్చుకున్నాను!
వీసా అప్లై చేసాం. చిట్టెన్‌రాజు గారి ట్రావెల్ ఏజంట్ గణేష్ ఏమని పరిచయం అయ్యాడో గానీ, అప్పటి నుండీ ‘ఓం గణేషాయ నమః’ అన్నట్టు ఎన్నెన్నో ఫారిన్ ట్రిప్స్, నేనూ నా పిల్లలూ… అన్నీ గణేష్ చేతుల మీదుగానే జరుగుతున్నాయి. అప్పుడు అతను కపిల్ ట్రావెల్స్‌లో పని చేస్తుండేవాడు! మంచి మనిషి. ఒక తమ్ముడిలాగా క్లోజ్ అయిపోయాడు. వాళ్ళావిడ పద్మజ కూడా మంచి మనిషి!
వీసా డేట్ వచ్చింది. అరవింద్ గారికి చెప్పి, హైదరాబాద్ నుండీ ఫ్లయిట్‌లో వెళ్ళాను. ఆయన డ్రైవర్ మహాలింగంని పంపించారు బెంజ్ కారిచ్చి! గీతా ఆర్ట్స్ గెస్ట్ హౌస్‌లో దిగి, ప్రొద్దుటే లేచి వాళ్ళు తెప్పించిన బ్రేక్‌ఫాస్ట్ తిని వీసాకి వెళ్లాను. పుల్లయ్య, మహాలింగంకి లంచ్ ఏర్పాట్లు చెయ్యమని చెప్పాడు. పుల్లయ్య పేరు పెద్దగా వున్నా, చిన్న కుర్రాడే, అరవింద్ గారి మద్రాస్ మేనేజర్. తరువాత ఆయన పి.ఎ. శశిరేఖనిచ్చి అరవింద్ గారే పెళ్ళి చేసారు!
నేను వీసా ఇంటర్వ్యూకి కట్టుకెళ్ళిన చీర నాకు సెంటిమెంట్, మా అబ్బాయిల వీసాలకీ, నా వీసా ఎక్స్‌టెన్షన్‌కీ కూడా నేను అదే చీర కట్టుకుని వెళ్ళాను. ఇంకా దాచి వుంచాను. నా ముందు వెళ్ళిన జగన్నాథ శర్మ మొదలైన రైటర్స్‌కి వీసా ఇవ్వలేదు మరి నా కళ్ళ ముందే! అందుకే ఇంత భయం.
నేను నా వంతు రాగానే వీసా కౌంటర్లో తల లోపలికి పెట్టి, నా ఆదాయ వివరాలు, చార్టర్డ్ ఎకౌంటెంట్ అయిన నా మేనల్లుడు తయ్యారు చేసిచ్చిన ఇంత లావు ఫైలు అందిస్తే “పర్పస్ ఆఫ్ విజిట్?” అని అడిగిందా శ్వేతజాతి పిల్ల… నేను ఏం మాట్లాడకుండా నేను రాసిన నావెల్స్ ఓ నాలుగు లోపలికి తోసి, బ్యాక్ కవర్ మీద నా ఫొటో చూపించి, “ఇట్స్ మీ” అన్నాను. “రైటర్?” అని అడిగి పక్కన తెలుగు వచ్చిన అతన్ని పిలిచి, ఆ కవర్ పేజ్ మీదున్న నా పేరు చదవమంది. అతను చదవగానే నవ్వి, నా వైపు చూసి బొటనవేలు ఎత్తి చూపి, “ఎంజాయ్ ద స్టే” అని నా పాస్‌పోర్ట్ తీసేసుకుంది.
నాకంతా కొత్త! అసలు వీసా వచ్చింది అని చెప్పలేదు, పాస్‌పోర్ట్ తీసేసుకుంది… వచ్చినట్టా? రానట్టా? సవాలక్ష ప్రశ్నలు… అలా బయటకొచ్చి మహాలింగం నిలబడమన్న చోటుకొస్తే మహాలింగం వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళి కారు తీసుకొచ్చాడు.
“వచ్చిందా అమ్మా?” అన్నాడు.
“తెలీదు” అన్నాను.
(సశేషం)