జీవన రమణీయం-7

    0
    5

    [box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

    [dropcap]క[/dropcap]మలమ్మగారింట్లో, మేడ మీద మేం కాకుండా లీల అనే ఆవిడా, ఇద్దరు ఆడపిల్లలతో వుండేది. కమలమ్మగారితో నాకేం పేచీ లేదు కానీ, ఇల్లు సరిగ్గా పెట్టానా లేదా అని అస్తమానం తనిఖీ కొచ్చేది!

    పులి మీద పుట్రలా ఓనాడు మా మామగారు ఎడ్లబండి మీదా తన సామానంతా వేసుకుని, అత్తగారినీ ఆడబిడ్డనీ వదిలి, మాటామాటా వచ్చిందని మా దగ్గరకొచ్చేశారు!

    కమలమ్మగారు వచ్చి ప్రప్రథమంగా అన్నమాట “ఇంకో రెండొందలు అద్దె పెంచుతున్నా” అని.

    నాకైతే ఏమీ తోచని పరిస్థితి. ఉన్న మూడు గదుల్లో మధ్య గది మావగారికిచ్చాం. చివరికి బెడ్ రూమ్. అందులోనే ఎటాచ్డ్ బాత్‌రూమ్ వుండేది!

    ఆయన పొద్దున్నే లేచి ఆసనాలు వేసేవారు. శవాసనం వేసి ఎంతకీ లేచేవారు కాదు! మా చిన్నాడు ఆయన మీద నుండి పాకుతూ ఆడుకునేవాడు.

    మా పెద్దాడబిడ్డ ఇంటి పరిస్థితులు బాలేక ఆర్.కె.నగర్ అద్దెకొచ్చారు. ఆవిడకి క్యాన్సర్ అని డయాగ్నైజ్ అయింది. మా తోడికోడలు “మించిపోయాకా వచ్చావేం అక్కా?” అని లబలబలాడి, తనే డాక్టర్‌కి చూపిస్తూ వుండేది.

    మా అశ్విన్‍ని మెర్సీస్ మోడల్ స్కూల్‌లో వేశాను. ఇక్కడ దేవీ టీచర్ వుండేది! ఈవిడ ఈమని శంకరశాస్త్రి గారి అమ్మాయి. చాలా బాగా చూసేది పిల్లల్ని. ఆవిడకీ అక్షయ్ అని ఓ కొడుకు. మా నానీ కొడుకు అజయ్ కూడా ఈ స్కూలే!

        

    అశ్విన్‌ని స్కూల్‌కి తీసుకువెళ్ళడానికి మా పెద్దాడబిడ్డ ఫ్లాట్స్‌లో వుండే వాచ్‌మన్ దత్తా అనే కన్నడపు ఆయనని పెట్టింది. అతని చిటికెన వేలు పట్టుకుని మా వాడు యు.కె.జి.కి వెళ్తుంటే వినాయకుడూ, అనింద్యుడూ గుర్తొచ్చేవారు! అనింద్యుడు ఎవరని పాఠకులకి అనుమానం వస్తే… ‘వినాయక వాహనం… ఎలక’! దత్తా భార్యకి తెలుగు రాదు. వచ్చి బాదుషా లాంటి స్వీట్స్ చేసి పెట్టేది. అప్పటికింకా స్వగృహాలు రాలేదు.

    కమలమ్మగారికి అతిశయం ఎక్కువ. చాలా డబ్బుగల వాళ్ళమని అపోహ! పైన పిల్లాడు గట్టిగా పరిగెత్తినా ఓర్చుకునేవాళ్ళు కాదు. మావగారు బాత్‌రూమ్‌కి వెళ్ళాలంటే, అస్తమానం మా బెడ్‌ రూమ్ లోంచి వెళ్ళడం నాకూ ఇబ్బందిగా వుండి ఇంకో ఇల్లు కోసం చూస్తున్నాను.

    ఈలోగా ఏ.జీ. ఆఫీసులో నా ఉద్యోగ పర్వం. లీవ్ వేకెన్సీలున్నాయని ఎవరో చెప్తే, టైపిస్ట్‌గా జాయిన్ అయ్యాను. అప్పటికింకా ఓపిక వుండబట్టి, మా ఆడబిడ్ద తను క్రిష్ణని చూస్తానన్నారు. అశ్విన్ అసలు బడి వదలగానే అత్త దగ్గరకే పరిగెత్తేవాడు. ఇప్పటికీ వాడు పెద్దత్త అనగానే “స్వెటర్ వేసుకుని పాకెట్లలో చేతులు పెట్టుకుని వచ్చి ‘అచ్చిపండూ’ అని చాక్లెట్ ఇవ్వడం గుర్తు” అంటాడు. ఆవిడకి రాకూడని రోగం వచ్చింది. అయినా చివరిదాకా తమ్ముళ్ళకి సాయం చెయ్యాలనే చూసేవారు!

    పాలు తాగే పిల్లాడిని మా ఆడబిడ్డ మీద వదిలి నేను ఏ.జీ. ఆఫీసుకు మొదటిరోజు వెళ్ళాను. మొదటి రోజు ఇంటికి చేరేడప్పుడు ఆటో ఎఫోర్డ్ చెయ్యలేను, బస్సులు మారి రాత్రి లోపు ఇల్లు చేరలేనని తెలిసింది. పాలు ఇవ్వకపోవడం వల్ల నాకు కొంచెం అస్వస్థతగా వుంది. అయినప్పటికీ రెండవ రోజు, క్రిష్ణ పాలపొడీ, సీసా, ఆయిల్ క్లాత్, బట్టలూ బుట్టలో పెట్టి, వాడిని ఆడబిడ్డ దగ్గర వదిలి. ఏ.జీ. ఆఫీసుకు వెళ్ళాను. మధ్యాహ్నం అయ్యేసరికి జ్వరం వచ్చేసింది. ఆ సెక్షన్ హెడ్ నా పరిస్థితి చూసి ఇంటికి వెళ్ళిపోమన్నాడు! నేను బస్సు కోసం నిలబడలేక ఆటోలో ఇంటికొచ్చేశాను. పాలిచ్చే ఏ తల్లికీ ఆ పరిస్థితి రాకూడదు. బిడ్డని గుండెలకి హత్తుకుని ఎంత సేపు ఏడ్చానో.

    మా ఆడబిడ్డ… “చాల్లే నీ ఉద్యోగాం… పిల్లల్ని చూసుకో… అసలే వీళ్ళే వంశాంకురాలు” అన్నారు.

    మా అత్తగారు కూడా “ఆ పిల్ల చేత ఉద్యోగాలు చేయించాలా? వున్నంతలో సర్దుకోలేరూ?” అని మా ఆయన్నే తిట్టారు.

    మా ఆడబిడ్దకి కీమోథెరపీ స్టార్ట్ అయ్యాకా రోజు రోజుకీ దిగలాక్కుపోయారు. మా తోడికోడలు ఆవిడని తన ఇంట్లోనే పెట్టుకోడంతో ఆ అపార్ట్‌మెంట్ ఖాళీ చేసేశారు.

    లక్ష్మీదేవిలా ఒంటెడు నగలతో, ఎప్పుడూ నవ్వుతూ తిరిగే ఆ దేవత రోజు రోజుకీ శుష్కించిపోవడం, ఇంకా సి.ఎ. చేస్తున్న చిన్న కొడుకూ, బి.కాం చేసి ఏదో వుద్యోగం చేస్తున్న పెద్ద కొడుకూ, డిగ్రీ చదువుతున్న కూతురూనూ! పరాయి పంచలో వుండడం చూడ్డం నాకే నరకంగా వుండేది.

    మా తోడికోడలు ఇంటికి వెళ్ళినప్పుడు పక్కింట్లో వుండే ఆర్.కె.శాస్త్రి గారూ, సావిత్రి గారూ క్రిష్ణని ఇవ్వమని గోడ మీద నుండి ఎత్తుకుని ముద్దు చేసేవారు. వారికి మాధవి అనే ఓ అమ్మాయీ, బాబూ అని ఓ అబ్బాయి. వారూ సత్యసాయి భక్తులే. కమలమ్మగారి కన్నా మొతాదు ఎక్కువ. ప్రతి గురువారం పెద్ద భజన జరిగేది వారింట్లో. ఆయన – ప్రశ్నలకి జవాబులు చెప్పడం, ఒంట్లో బాలేకపోతే తీర్థాలు ఇవ్వడం కూడా చేసేవారు.

    క్రిష్ణని వారు వదిలి పెట్టలేక “పై వాటా వుంది. వచ్చి చేరిపొండి” అన్నారు. సత్సంగం అని నేనూ వెంటనే ఒప్పుకున్నాను. కమలమ్మ గారింటి నుండి విముక్తి పొందాము.

    సావిత్రి గారూ, శాస్త్రి గారూ మా క్రిష్ణని నిజంగానే చాలా ముద్దు చేసేవారు. ఇక్కడ ఇంటి ముందు పెద్ద విశాలమైన స్థలం, మేడ మీదే అయినా, చాలా హాయిగా వుంది.

    ఈలోగా మా రెండో ఆడబిడ్డకి పెళ్ళి చేశాం. తను బయొలాజికల్స్‌లో పని చేస్తూ వుండేది! ఆ పెళ్ళి సంబంధం మా అత్తగారికి ఇష్టం లేకపోయినా, వయసులో చూడకపోవడం వలన, కాంప్రమైజ్ అయి చేశారు.

    ఆ పెళ్ళి అప్పటికి మా లలిత వదినగారు కొంచెం ఓపిగ్గా వున్నారు. మా చిన్నాడ బిడ్డ శారద కాపురానికి వెళ్ళాకా కూడా మా అత్తగారు కొడుకుల దగ్గరికి రాలేదు. వదినగారికి కొన్నాళ్ళు సేవ చేశారు…

    నేనూ చంటిబిడ్డతో వెళ్ళి రాత్రిళ్ళు సాయం పడుకునేదాన్ని. ఆవిడ కొచ్చినది సర్వైకల్ క్యాన్సర్. ఆ నరకం ఎవరూ పడకూడదూ… చూడకూడదూ కూడా!  ఆవిడ అరుపులు, ఏడుపులూ చూడతరం కాకుండా వుండేవి. మా తోడికోడలు చెయ్యవలసినంతా చేశారు… అయినా లాభం లేకపోయింది.

    మా శారద ఆ భర్తతో పొసగక, వెనక్కొచ్చేసింది. దురదృష్టాలు ఒంటరిగా రావు, జమిలిగా వస్తాయి. మా లలిత వదిన మమ్మల్ని వదిలిపెట్టి ఆ లలితాదేవిని చేరింది! అది ఎప్పటికీ తీరని లోటు మా కుటుంబానికి! ఆవిడ లాంటి ఆడబిడ్డ ఎవరికైనా వుంటారా అన్నది సందేహమే… నన్ను కన్న కూతురిని చూసినట్టు చూసేది! చివరిగా పోయే ముందు నా చెయ్యి పట్టుకుని “ఈ సంవత్సరం మీరు ఇల్లు కట్టుకుంటారు… నా మాట ఇది!” అన్నారు.

    “ఆలూ లేదు, చూలూ లేదు” అన్నట్టు అప్పటికి నాలుగిళ్ళు చూశాం. ఇల్లు కట్టుకునే వుద్దేశం లేదు… వుద్దేశం అంటే ఆర్థిక శక్తి లేదు. అందుకే ఆలోచించలేదు. కాని పెద్దల ఆశీర్వాదం వూరికే పోదు!

    మా అమ్మమ్మ గారికి ఫ్రీడం పైటర్‌గా మా తాతగారు పోయాక ఇచ్చిన స్థలంలో కల్పనా టాకీస్ వెనక ఓ ఇల్లు కట్టింది. పోతుకూచి సాంబశివరావు గారింటి పక్కన.  సీరా సత్యనారాయణ అనే ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌కి అద్దెకిచ్చింది.

    “నా కొడుకు లాంటి వాడివి సత్యనారాయణా… నాకు ముగ్గురూ ఆడపిల్లలే!” అనేది. ఆ మాటని అతను నిజం చేద్దాం అని ‘ఇల్లు నాకు ఇరవై వేలకి అమ్మేయ్యమ’ని కూర్చున్నాడు.

    “ఫ్రీడం ఫైటర్ని, నాకు కొడుకులు లేరు, వుండడానికిల్లు లేదు, కూతురింట్లో వుంటున్నాను, అమ్మను” అంది అమ్మమ్మ. కొడుకు… కొడుకు… అని ఇరవై ఏళ్ళు వుంచేసిన పాపానికి రెంట్ కంట్రోల్‍లో వేశాడు.

    కోర్టు ద్వారా అరవై రూపాయలు ప్రతి నెలా పంపేవాడు. నా చిన్నతనంలో గౌన్ వేసుకుని అమ్మమ్మతో వాళ్ళింటికి వెళ్తే ఆ పెళ్ళాం పిల్లలూ తెగ తిట్టి పంపించేవారు అమ్మమ్మని.

    చివరికి కోర్టులో గెలిచి ఆ ఇల్లు అమ్మమ్మ చేతికొచ్చింది. ఆవిడకి మూడు లక్షలొస్తే పైసా ముట్టుకోకుండా మూడు భాగాలు చేసి ముగ్గురు ఆడపిల్లలకీ నిస్వార్థంగా ఇచ్చింది.

    మా అమ్మ అయితే అంతకన్నా నిస్వార్థ జీవి, ఒక్క నయా పైసా వుంచుకోకుండా నన్ను పిలిచి ఆ డబ్బు నా చేతిలో పెట్టింది.

    అప్పుడు అంకురార్పణ జరిగింది, మా ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనకి 1992లో!

    (సశేషం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here