[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]బో[/dropcap]స్టన్‌లో ఎయిర్‌పోర్ట్ నుండి వాళ్ళింటికి చాలాసేపే పట్టింది. లోగాన్ ఎయిర్‌పోర్ట్ దారి అది. దారి పొడుగుతా అభిగాడు ముద్దుగా ఇంగ్లీషులో మాట్లాడ్తూనే వున్నాడు. సెంథిల్ బాగానే మాట్లాడి వెల్‌కమ్ చేశాడు. మా శేషు చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంది. మేం ఇల్లు చేరి, గేరేజ్‌లో కారు పెట్టడానికి, ఆటోమేటిగ్గా కారు గేరేజ్ తలుపులు తెరుచుకోడం దగ్గర నుండీ చాలా తమాషాగా చూశాను.
ఇల్లు ఎంతో బాగుంది. కింద ఒక సిట్ అవుట్, కిచెన్, పైకి మెట్లు. అక్కడ రెండు బెడ్ రూమ్స్, ఇంకా పైన ఒక బెడ్ రూమ్. నాకు మా లక్ష్మక్క ఉత్తరంలో రాసిన విషయం గుర్తొచ్చింది. “ఓ సంచీలో నా మందులూ, సెల్, పుస్తకాలూ, కళ్ళజోడూ, కావలసిన సరంజామా సర్దుకుని కిందకి వెళ్తే, మళ్ళీ సాయంత్రమే పైకి వచ్చి పడుకుంటాను” అని రాసింది. ఎందుకు పైకి వెళ్ళడానికి అంత బద్ధకం? అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. ఎన్ని మెట్లున్నాయో. శేషు అప్పుడు ఎనిమిదో నెల గర్భవతి. వాళ్ళ అక్కకి పుట్టిన బాబు గురించి చాలా వుత్సుకతగా అడిగి తెలుసుకుంది. వాడికి ఆ తర్వాత కపిల్ అని పేరు పెట్టారు. శేషు కడుపులో పాప అని అప్పుడే చెప్పేశారు. కాబట్టి అక్కడ, అదితి నేను వచ్చేసాకా తర్వాత నెల పుట్టింది.
అప్పుడు డిన్నర్ టైం అయింది. నేను వస్తానని వాళ్లు వండేసి వచ్చారు ఎయిర్‌పోర్ట్‌కి. సాంబారూ, అన్నం, ఆవకాయా చూస్తే ప్రాణం లేచి వచ్చింది.
ఆ రాత్రే ఆపుకోలేనంత వుత్సాహంతో, ‘అమెరికాలో అడుగు పెట్టాను’ అని చిట్టెన్ రాజు గారికీ, కిరణ్ ప్రభ గారికీ ఫోన్ చేసి చెప్పాను. చిట్టెన్ రాజు గారు “గొల్లపూడి మారుతీరావు గారూ, వారి శ్రీమతీ అట్లాంటాలో ఫణి డొక్కా అనే అబ్బాయి ఇంట్లో ఉన్నారు. ఉదయం ఫోన్ చేయండి. ఆనక అందరం ఎటూ న్యూయార్క్‌లో కలుస్తాం” అని చెప్పారు.
కిరణ్ ప్రభ గారు కూడా “చిట్టచివరి మజిలీ మా ఇల్లే అయినా, ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాం నేను కాంతీ” అని ఆప్యాయంగా మాట్లాడారు. తరువాత మా ఆయనకీ పిల్లలకీ కూడా ఫోన్ చేసి మాట్లాడాను. నేను క్షేమంగా చేరినందుకు అమ్మా పిల్లలూ అంతా హేపీ.
నేను భోజనానంతరం మేడ మీదకి రెండు అంతస్తులూ ఎక్కి పడుకున్నాను.
తరువాత రోజు ఎండ కళ్ళల్లో పడుతుంటే లేచాను. పగలు చాలా పొడవు. ఎంతకీ రాత్రి అయ్యేది కాదు. తొమ్మిది అవుతున్నా అప్పుడప్పుడు ఇంకా వెలుతురుగా ఉండేది.
నేను బ్రష్ చేసుకుని కిందకి వచ్చేసరికి, వంట పూర్తి చేసేసింది శేషు. అభిని కూడా రెడీ చేసేసి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసారు. శేషుకి బయటవి ఏవీ పడవు. డైజషన్ చాలా ప్రాబ్లమ్‌గా ఉండేది. అందుకే ఆఫీస్‌కి డబ్బా తీసుకెళ్ళేది. సెంథిల్ చాలా వర్క్‌హాలిక్ అనేది. అతను కూడా వంటింట్లో చాలా పని చేసేవాడు. “ఈరోజు నుండి ఈవినింగ్ వంట నేను చేస్తాను… ఆ స్టవ్ ఎలా ఆన్ చేయాలో చూపించు” అన్నాను. ‘పడమటి సంధ్యారాగం’లో చెప్పినట్టు ‘నిప్పు లేని వంట, ఉప్పు లేని పప్పు’ అన్నట్టు లైటర్ లేకుండా వెలగటం చాలా ఆశ్చర్యం అనిపించింది.
అభి ఆడుకోవడానికి ఒక సింహళీ కుటుంబం, వాళ్ళ అబ్బాయి ఉండేవాడు. ఆవిడ పేరు లీల. అయినా ఇంగ్లీషే శరణ్యం! వాళ్ల భాష మనకి రాదుగా! శేషు వాళ్ళ నాన్న అంటే మా పెద్ద బావగారికి స్నేహితులు ఎక్కువ హైదరాబాదులో. అది నవ్వుతూ చెప్పింది “ఇక్కడ కూడా ఎలా పరిచయం చేసుకున్నారో పిన్ని… హన్మంతరావు సాబ్ అంటూ కొందరు నార్త్ ఇండియన్స్ ఈయన కోసం ఈవినింగ్ రోజు వచ్చేవారు” అని. నిజంగా స్నేహం చేసుకోవాలనే గుణం ఉండాలి కానీ, మద్ది చెట్లు కూడా స్నేహం అవుతాయి.
నాకు శేషు టీవీ రిమోట్, ఫోన్ ఎలా చెయ్యాలో చూపించి ఆఫీస్‌కి వెళ్ళిపోయింది. అదే ఒక సెల్‌ఫోన్ కూడా ఇచ్చింది, డబ్బు లేసి… అదే డాలర్లు వేసి.
నేను గొల్లపూడి గారి కోసం ఫణి డొక్కాకి ఫోన్ చేస్తే “మీరు నాకు బాగా తెలుసు… మా ఇంటికి కూడా రావాలి” అని ఆప్యాయంగా మాట్లాడాడు. ఆ తరువాత ఫణి నాకు ఆత్మీయుడైన తమ్ముడు అవుతాడని, వాళ్ళింట్లో ఎన్నోసార్లు మరదలు గాయత్రి చేతి వంట తింటూ వుంటాననీ అనుకోలేదు! కానీ మొదటిసారి అమెరికా యాత్రలో ఫణి దగ్గరకి అట్లాంటా వెళ్లలేదు.
గొల్లపూడి గారు కూడా “వెరీ గుడ్… వచ్చేసావా అమ్మా… నెవార్క్‌లో కలుద్దాం…” అన్నారు. నేను అందర్నీ కలవటానికి వువ్విళ్ళూరాను. బోస్టన్‌లో మా ఆయన కజిన్ బ్రదర్ అంటే మా కేశవరావు బావగారి అబ్బాయి శ్రీనివాస్, పద్మజా ఉంటారు. తల్లిదండ్రులను కూడా పిలిపించి గ్రీన్ కార్డుతో, ఇక్కడే వుంచేసుకున్నాడు. తరువాత సిటిజన్‌షిప్ కూడా వచ్చేసింది. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ వున్నారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో మేథ్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా చేశారు అప్పట్లో. ‘ఋతురాగాలు’ దగ్గరనుండి మంజులానాయుడు సీరియల్స్‌కి పాటలు రాసే బలభద్రపాత్రుని మధుకి సొంత అన్నగారు ఈయన. మా ఆయనకి పెదనాన్న గారి అబ్బాయి.
నేను శ్రీనివాస్‌తో కూడా మాట్లాడాను. అతను కూడా “పిన్ని మా ఇంటికి ఎప్పుడు వస్తారు? కుమార్ బాబాయ్ ఎలా ఉన్నాడు?” అని ప్రేమగా మాట్లాడాడు.
సాయంత్రం శేషు వచ్చేసరికి నేను వంకాయ కాల్చి పులుసు పచ్చడి చేసి అన్నం వండాను. అదొక పెద్ద ఎచీవ్‌మెంట్ అనిపించింది నాకు.
దాంతో కలిసి ‘సేఫ్ వే’కి వెళ్లి అక్కడున్న అందమైన రంగురంగుల కూరగాయలు చూసి ఆశ్చర్యపోయాను ‘ఎంత అందంగా అమర్చారో పండ్లు కూరగాయలు’ అని. అక్కడి నుండి ఇండియన్ బజార్‌కి వెళ్ళాం. శేషు ఇంటికి కావాల్సిన ఏదో కొంటుంటే, నేను నెక్స్ట్ డే శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడని స్వీట్స్ కొన్నాను.
సెంథిల్ ఇంట్లోనే పిజ్జా భలే చేస్తాడు. రవ్వ దోశ కూడా. మరునాడు శ్రీనివాస్ వచ్చి వాళ్ల ఇంటికి తీసుకు వెళ్ళాడు. అక్కడ కూడా ఇల్లు ఇదే మాదిరిగా ఉంది. శేషు వాళ్ళు నాష్వాలో ఉండేవారు. వాళ్లది ఓ ఇరవై నిమిషాల దూరం. బావగారూ, తోడికోడలూ, వాళ్ళ అబ్బాయీ, కోడలుతో బాటు కూతురూ, కూతురు పిల్లలూ, బొంబాయి నుంచి వాళ్ళ రెండవ అబ్బాయీ, వాళ్ళ ఆవిడా పిల్లలూ కూడా ఉన్నారు. భోజనం చేసేటప్పుడు అక్కడ బిర్యానీ బియ్యం వాడతారు రెగ్యులర్‌గా కూడా అని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. పద్మజ చాలా మంచి కుక్!
మళ్లీ రాత్రి శ్రీనివాస్ తీసుకొచ్చి శేషు వాళ్ళింట్లో దింపేశాడు.
నేను ఇండియా ఫోన్స్ చేసి పిల్లలతో అందరితో మాట్లాడాను.
(సశేషం)