[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]నే[/dropcap]ను బోస్టన్‌లో ఉన్నప్పుడే పన్నెండు వేలూ కట్టించుకుని, మా అశ్విన్ ఎమ్మెస్ సీటుకి ఆ విస్సు కన్సల్టెన్సీ వాళ్ళు ప్రాసెసింగ్ చెయ్యలేదు అని తెలిసింది. దాంతో నేను ఫోన్ చేసి చెప్తే, వాడు చాలా డిజప్పాయింట్ అయ్యాడు – “ఇంక స్ప్రింగ్‌లో నాకు చాన్స్ లేదమ్మా… అన్ని యూనివర్సిటీలకి నా పేపర్స్ చేరలేదన్న మాట. నేనే స్వయంగా చేసుకుంటాను”అని.
మా శేషు యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి “పేపర్స్ అన్ని త్వరలో పంపుతాం, సో అండ్ సో స్టూడెంట్‌వి”అని మాట్లాడింది. మళ్లీ వాడికి చెప్పాను.
శని ఆదివారాలు వస్తే అందరూ ఇంట్లో వుంటారుగా, సెంథిల్, శేషూ, పిల్లాడూ నేనూ బోస్టన్ నగరం తిరిగి చూసాం.
డౌన్ టౌన్‌లో రకరకాల గారడీలు చేసేవాళ్ళూ, స్టేజి మీద డాన్సులు చేసే అమ్మాయిలూ, ఆర్కెస్ట్రాలు, ఒక కర్ర మీద సీసా ఆడుతున్నట్టు నిలబడి పైకి కిందకీ అవుతూ, బాటిల్స్ నెత్తి మీద పెట్టుకొని పడకుండా బ్యాలెన్స్ చేసేవాళ్ళూ, అన్ని ఒక పెద్ద జాతరలా అనిపించాయి. వెజిటేరియన్స్ ఎక్కడికి వెళ్లిన సాధారణంగా తినేది పిజ్జా, గార్లిక్ బ్రెడ్, ఆనియన్ రింగ్స్, అంతే! వెజ్ సాండ్ విచెస్ కూడా భయమే. ఫిష్ కొన్నిచోట్ల వెజ్!
నాకు బాగా నచ్చినవి పార్కింగ్ టికెట్లు ఇచ్చే మెషిన్లు, పబ్లిక్ రెస్ట్ రూమ్స్! ఎంత నీట్‌గా ఉంటాయో, నేను వచ్చాక ఒక ఆర్టికల్ రాశాను.
కారులో వెనుక కూర్చున్నా, సీట్ బెల్ట్ నేను బోస్టన్‌లో పెట్టుకోలేదు, కానీ కాలిఫోర్నియాలో తప్పనిసరి!
నా నడుము నొప్పి వల్ల బెల్ట్ పట్టుకొని కూర్చునేదాన్ని. ఎక్కడా కార్ ఆపి అందులో పడుకోకూడదు! ఒకవేళ రూల్స్ తప్పి వెళ్తుంటే వెనక నుంచి పోలీసులు సైరన్ వేస్తే, కారు ఆపి దిగకుండా, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి. మనం ఏ మూమెంట్ ఇచ్చిన వాళ్లు అనుమానించి ఫైర్ చేసే ప్రమాదం ఉంది. ఇవన్నీ మా శేషు డ్రైవ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేసేది. పసిపాపలని సైతం చైల్డ్ సీట్లో బంధించవలసిందే!
ముఖ్యంగా హైవేలలో వెళ్తుంటే, ఆ స్పీడ్‌కి విండోస్ తెరవలేము, చెవుల్లో బొయ్యమని హోరు!
ముఖ్యంగా ముద్దొచ్చే బార్బీ బొమ్మలలాంటి పసి పిల్లల్ని, ఎంత ముద్దొచ్చిన వేలేసి సైతం ముట్టుకోవడం కానీ, కళ్లార్పకుండా చూడటం కానీ చెయ్యరాదు! ఇంక మనుషులు మనకి వాళ్లతో ఐ కాంటాక్ట్ ఏర్పడగానే చిరునవ్వు నవ్వుతారు… నాకెంతో అందంగా అనిపించేది!
ఒకరోజు అభిగాడి స్కూల్లో ఏదో ఫంక్షన్, నన్ను కూడా తీసుకెళ్ళింది శేషు. మగవాళ్ళు, మన దగ్గర ఇళ్ళల్లో ఆడవాళ్ళు పిల్లల్ని చంకనేసుకున్నట్లుగా వేసుకొనొచ్చి, కడుపుతోటున్న మా శేషుతో, “వాటర్ బ్రోక్ అవగానే నీకేమైనా హెల్ప్ కావాలంటే కాల్ చెయ్యి… నేను సాయం వస్తాను. బేబీ పుట్టాకా ఈ జాగ్రత్తలు తీసుకో!” అంటూ ఆడవాళ్ళలా ఏ భేషజాలూ లేకుండా మాట్లాడడం నాకెంతో నచ్చింది!
స్కూల్‌లో కూడా బర్గర్‌ల దగ్గర నుండి బోలెడు తినుబండారాలు పెట్టారు. అవన్నీ తిని, పిల్లవాడి స్కూలు, క్లాస్ రూమ్ చూశాక, మన వాళ్ళు అక్కడే పిల్లల్ని కంటాం అని ఎందుకు పట్టుపడతారో తెలిసినట్లయింది!
ఓ రోజు వడగళ్ల వాన పడింది. వడగళ్ళు మన బాదంకాయల పరిమాణంలో పడ్డాయి. రోడ్లమీద ఒక్క పెంపుడు జంతువు కూడా కనబడకపోవడం, రోడ్డుకిరువైపులా అందమైన ఉద్యానవనాల్లా పూల మొక్కలుండడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ‘ఆహా… ఇది భూతల స్వర్గమే కదా!’ అనుకున్నాను.
మొత్తం ఎనిమిది రోజులు ఉన్నాను శేషశైలజ ఇంట్లో. అప్పటికి మా రమక్క వాళ్ళు డల్లాస్‌కి కెనడా నుండి షిఫ్ట్ అవలేదు. ‘కెనడా వీసా ఈజీ, అక్కడ తీసుకుంటే, తీసుకుని రమ్మని’ చాలా అంది రమక్క. కానీ, టైం లేదు! ఊసా (విజిట్ యుఎస్ఏ) టికెట్‌ల వల్ల ప్రోగ్రాంలో ఏ మార్పు చెయ్యలేను. ప్రోగ్రామ్ అంత టైట్‌గా ఉంది. నాకు అమెరికా నీళ్లు కొత్త చేసి రెండు రోజులు నలతగా కూడా అనిపించింది.
అక్కడి నుండి ఎనిమిదో నాడు ప్రొద్దుటే మూడింటికి లేచి, శేషు ఇడ్లీ బాక్స్‌లో పెట్టిస్తే తీసుకొని, ఒక అరటిపండు కూడా ఇచ్చింది, వాటితో అభి గాడిని వదలలేక, వదలలేక శేషు దింపితే మళ్లీ లోగాన్ ఎయిర్‌పోర్టు కొచ్చి, నెవార్క్ వెళ్ళడానికి పిట్స్‌బర్గ్ ఫ్లైట్ పట్టుకున్నాను. అన్ని డైరెక్ట్‌గా కాకుండా ‘హబ్’కి వెళ్ళేట్లు ప్లాన్ చేశారు పూసా టికెట్ల వల్ల. నేను ఒక్కదాన్నే ఫ్లైట్ మారి పిట్స్‌బర్గ్‌లో, అన్ని టైం జోన్‌లు వేరే, ఒక చోటి నుండి ఇంకొక చోటికి వెళ్ళేసరికి బోస్టన్ నుండి రెండు గంటలు ముందుకి ఉండటం, నాలుగు గంటలు వెనక్కి ఉండటం కన్ఫ్యూజింగ్ గా ఉండేది!
నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి, చిట్టెన్‌రాజు గారికి ఫోన్ చేద్దామా, ఆయన ఒక్కడే పరాయి గడ్డమీద అస్మదీయుడు అని చూస్తుండగా, “బలభద్రపాత్రుని రమణి గారూ… నమస్కారం” అంటూ ఒక తెలుగాయన చాలా చిరపరిచితంగా కనపడ్తూ ఫుల్ సూట్‌లో, మొహమంతా నవ్వుతో వచ్చారు.
అక్కడ నా పేరు వినిపించగానే, ఎగిరి గంతేయ్యలనిపించింది. రెండు చేతులూ జోడించడానికి సూట్‌కేస్‌లు కింద పెట్టాను. “నా పేరు కొండబోలు రవి…. నాగేశ్వరరావు గారు చెప్పారు, మీరు వస్తున్నారని, ఆటా కనీ” అన్నారు. “ఏ నాగేశ్వరరావు గారు?” మా బావ ఏమోనని ఆశ్చర్యంగా అడిగాను. “అక్కినేని నాగేశ్వరరావు గారు అండీ… మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు”అన్నారు.
ఆయన నేను వచ్చేటప్పుడు ఫోన్ చేసి “అమెరికా వెళ్తున్నానండీ, మొదటిసారి”అంటే, మాటవరసకి కాదు, నిజంగానే నా గురించి శ్రద్ధ తీసుకుని, వీళ్ళకి చెప్పారని తెలిసి మనసంతా ఆనందంతో నిండిపోయింది. సామాన్ల హార్డ్ ట్రాలీ ఒక డాలర్‌ను వేస్తే కానీ రాలేదు. అది తెచ్చి రవి గారు దానిమీద నా సూట్‌కేసులు పెట్టి స్వయంగా, ఫుల్ సూట్ వేసుకున్న ఆ పెద్ద మనిషి తోస్తూంటే చాలా సిగ్గుపడిపోయాను.
“ముందుగా హోటల్ రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయి, బయటకు వచ్చి నాకు కాల్ చేయండి… నేను కన్వెన్షన్ సెంటర్‌కి తీసుకెళ్తాను. మాధవి అనే అమ్మాయి హైదరాబాదు నుండి వచ్చింది, ఆ రూమ్‌లో ఉండండి”ఉన్నారు.
నేను ‘వింధామ్’ హోటల్‌లో ఆ 2022 అనుకుంటా, ఆ రూమ్‌కి లిఫ్టులో బెల్‌బాయ్‌తో వెళ్తూ కిందకి చూస్తే కళ్ళు తిరిగాయి. నేను వెళ్లి చూస్తే ఆ అమ్మాయి లేదు. హడావిడిగా వెళ్ళిపోయినట్లు ఉంది, వనితా టీవీలో ఏంకర్ ఆమె అప్పుడు. రూమ్‌లో బట్టలు, మేకప్ వస్తువులు ఎక్కడివక్కడ పడేసి ఉన్నాయి. నాకేమో అతి శుభ్రం… నేను కష్టపడి బాత్రూంలోకి వెళ్లి తయారయ్యాను. అక్కడ అద్దం దగ్గర నా ఫౌండేషన్ క్రీమ్ బయట పెట్టేసాను. అది 36 డాలర్లు పెట్టి బోస్టన్‌లో కొన్నాను. నేను తయారై బయటకు వచ్చేసాను. చాలా ఆకలేస్తోంది. మొదట ఫ్లైట్ లో శేషు ఇచ్చిన అరటిపండు, ఇడ్లీ తిన్నాను..
రవి గారు “రామ్మా, ఈ బస్సు ఎక్కు, కన్వెన్షన్ సెంటర్‌కి వెళ్లడానికి” అనగానే ఎక్కి కూర్చున్నాను.
(సశేషం)