జీవన రమణీయం-74

5
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]ను సూట్‌కేసులతో సహా ఆ బస్ ఎక్కాను. రవిగారు “ఎందుకమ్మా ఈ సూట్‌కేసులూ?” అన్నారు. “ఆ గదికి తాళం వేరెవరో దగ్గర కూడా వుందిగా?” అన్నాను.

మేం కన్వెన్‌షన్ సెంటర్‌కి వెళ్తే గేట్ దగ్గర అంతా కోలాహలంగా వుంది. అక్కడున్న ఎత్తుగా, బలంగా వున్న నల్లవాళ్ళు మినహాయించి, అంతా మా చిక్కడపల్లి త్యాగరాయ గానసభలానే వుంది. ఎందుకంటే మల్లిక్, మృణాలినీ, రఘురాం గారూ, వంశీరామరాజు గారూ లాంటి తెలిసిన మొహాలే అన్నీనూ! చిట్టెన్‌రాజు గారుకి ఫోన్ చేసా. “మహాతల్లీ, ఎక్కడున్నావ్?… నేనూ గొల్లపూడి గారూ ఫలానా గేట్‌లో వున్నాం…” అని చెప్తుండగానే, ఓ ఆజానుబాహుడైన వ్యక్తి నా సూట్‌కేస్ లాగి, “ఓపెన్… ఓపెన్” అంటున్నాడు. నేను తెరిచే లోపే, అతను జిప్ లాగేయ్యడం, నా పుస్తకాలూ, చీరలూ అన్నీ భళ్ళున కిందపడిపోవడం జరిగిపోయింది. నేనేం అన్నా అతనికి అర్థం కాలేదు… అన్నీ తీసి చెక్ చేశాడు! ఆ సమయంలో వంగూరి చిట్టెన్‌రాజు గారొచ్చి, అతనితో మాట్లాడి నన్నూ, నా సూట్‌కేసునీ రక్షించారు.

“ఎక్కడ దిగావమ్మా?” అంటే “వింథామ్ హోటల్” అని చెప్పా. “అక్ఖర్లేదు..  నేను మా హోటల్‍కి మార్పిస్తా” అన్నారు. వాళ్ళు ‘రాబర్ట్ ఫ్రాస్ట్ హోటల్‌’లో దిగారు. అది ఇంకా పెద్ద స్టార్ హోటల్ అనుకుంట!

చేతులకి వి.ఐ.పి.లకి ఇచ్చే రక్షాబంధనాలు రెడ్ కలర్‌లో ఇచ్చారు. లోపలికి ఆ ఎర్ర ద్వారం గుండా వదిలారు. లోపల, గొల్లపూడి గారూ, శివానీ గారూ కనిపించారు. ఆయన “అందరం కలిసి వెళ్దాం… హోటల్‍కి, కూర్చో అమ్మా” అన్నారు. కానీ ఆయనకి తెలిసిన వాళ్ళెవరో రమ్మనగానే, నాకేసి చూడకుండా, “శివానీ రా…” అని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోతుంటే, ఆంటీ పాపం… “ఆ అమ్మాయిని కూడా మనతో తీసుకెళ్దాం” అన్నారు. “అబ్బా, రమ్మన్నానా…” అని ఆవిడ్ని తీసుకెళ్ళి పోయారు

చిట్టెన్‌రాజు గారు “రా మనం హోటల్‌కి వెళ్దాం, నీ హోటల్ మార్పించాను” అని వచ్చారు. నా కళ్ళకి కోదండం లేని శ్రీరాముడిలా కనిపించారు. కాని చిక్కడపల్లిలో ‘రమణీ గారూ’ అంటూ ఆప్యాయంగా పలకరించేవారెవరూ, నాతో న్యూజెర్సీలో మాట్లాడలేదు! చూసి తలలు తిప్పుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది.

సరే, మేం ఇంకో కారెక్కి రాబర్ట్ ఫ్రాస్ట్ హోటల్‌కి వెళ్ళాం. అప్పుడు నా కళ్ళు తిరిగాయి స్కై స్క్రేపర్స్ చూసి. రూం మామూలుగా లేదు! భూతల స్వర్గంలా వుంది. లోపలికెళ్ళగానే కాఫీ కలుపుకున్నాను. స్నానం చేసి మంచి పట్టుచీర కట్టుకుని తయ్యారయ్యాను. నా పక్కన రూమ్ గొల్లపూడి గారిదీ, ఆ పక్క రూమ్ చిట్టెన్‌రాజు గారిదీనూ! ఇస్త్రీ పెట్టె చూసి దాన్ని కూడా వాడాను.

చిట్టెన్‌రాజు గారు శాండ్ విచెస్ తీసుకొచ్చి పెట్టారు. ఆకలి మీద అద్భుతంగా వున్నాయి. నాలుగు అవుతుంటే ఆయన, “బాంక్వెట్‌కి వెళ్ళాలి… రా” అని ఫోన్ చేశారు. రెడీగా ఉన్నాను కదా… లాక్ చేసి గదికి, బయటకి వెళ్ళాను. పక్క రూమ్ నుంచి శివానీ ఆంటీ వచ్చి “ఎంత బావుందో చీర?… ఇంత త్వరగా ఎలా తయారయ్యావూ?” అన్నారు. నేను ‘ఒక్కదాన్నే వచ్చాగా… భర్తకి అన్నీ అందించనక్కర్లేగా…’ అని మనసులో అనుకున్నాను.

గొల్లపూడి గారు కూడా బయటకొచ్చారు. ఆయన చేతిలో ‘అమ్మ కడుపు చల్లగా’ పుస్తకాలున్నాయి. నేను మా లలిత చెల్లెలు గిరిజకి ఫోన్ చెయ్యాలని నాకు తట్టింది. ఆ పుస్తకం మీద ధర చూసా. 450/- అని ఉంది. నేను 500/- నోటు తీసి ఆంటీకి ఇస్తూ “నాకూ ఓ పుస్తకం ఇస్తారా? నా ఫ్రెండ్‌కి ఇస్తాను” అన్నాను. “అలాగే అమ్మా” అందావిడ. కానీ వెంటనే గొల్లపూడి గారు “20 డాలర్లు దాని ధర. ఇండియాలో అయితే 500/-లకే ఇచ్చేవాడిని” అన్నారు. నేను ఏమీ అనలేదు. ఇంకో ఐదు వందలు తీసి ఇచ్చాను. కానీ మనసులో మాత్రం ‘యూఎస్ మనుషుల్ని డాలర్లలోకి ఎంత త్వరగా కన్‌వర్ట్ చేసేస్తుంది?’ అనుకున్నాను.

మేం కన్‌వెన్షన్ సెంటర్‌కి వెళ్ళేసరికీ వరండాల నిండా ఫుల్ సూట్లలో, వజ్రాల నగలతో చిత్ర విచిత్రమైన డ్రెస్సులలో, పట్టుచీరలతో స్త్రీ పురుషులు మెరిసిపోతున్నారు. రకరకాల స్నాక్స్, కాఫీ, టీలూ పెట్టారు.

   

నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిన విషయాలు కొన్ని జరిగాయి. లకిరెడ్డి హనిమిరెడ్డిగారనే పెద్ద డాక్టరు గారు, ఆగర్భ శ్రీమంతులు… నా దగ్గరకి వచ్చి “చిట్టెన్‌రాజు గారు చెప్పారు.. హైదరాబాద్ నుండి మీరొచ్చారని, మీ పేరు విన్నానమ్మా… నాకు రచయితలంటే చాలా ఇష్టం!” అన్నారు. అప్పుడు ఆయన గొప్పదనం అంతగా తెలీదు! నమస్కారం పెట్టాను. తర్వాత తెలిసింది, సిలికాన్ ఆంధ్రా యూనివర్సిటీకీ, కాలిఫోర్నియా యూనివర్సిటీకీ, లివర్‌పూల్ గుడికీ కూడా ఆయన పెద్ద డోనర్ అనీ, ఒక ఆంధ్రుడి పేరు ఆ కట్టడాల మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసి వుంటుందనీ… వీటిన్నంటినీ మించి, ఆయన నేను కాలిఫోర్నియా వెళ్ళినప్పుడల్లా వారింటికి పిలిచి విందు ఇచ్చే చుట్టం అవుతారనీ అప్పుడు అస్సలు తెలీదు!

చాలామంది అమ్మాయిలూ అబ్బాయిలూ నన్ను గుర్తు పట్టి “మీరు రమణి గారు కదా” అంటే, పుస్తకాలు చదివేవాళ్ళంతా ఇక్కడికి వలస వచ్చేసారా అనిపించింది!

ఇంకా ఎగ్జిబిషన్‌లా రకరకాల దుకాణాలు పెట్టారు, ముఖ్యంగా చీరల షాపులు. గొల్లపూడి గారిని అభిమానులు చుట్టుముట్టేసారు. ఆయన “నవ్వి నవ్వి పెదాలు నెప్పొస్తున్నాయమ్మా” అనేవారు. నేను చాలా ఫొటోలు తీసాను. అప్పుడింకా సెల్‌ఫోన్‍లో ఫొటోలు లేవు! మలేషియాలో కొన్న నా చిన్న కెమెరాలోనే తీసేదాన్ని! గొల్లపూడి గారు చాలా చమత్కారంగా మాట్లాడ్తారు. ఆయన పెద్ద విజ్ఞాన ఖని! ఎన్నో పుస్తకాలు చదివారు. డ్రామాలు చూసారు. లండన్ కూడా థియేటర్ చూడ్డానికి వెళ్తారు. జీవిత కథలు ఆల్‌మోస్ట్ అందరివీ చదివారు. ఆయన ‘అమ్మ కడుపు చల్లగా’ కూడా అంత బావుంటుంది! ఆంటీ చాలా సహనశీలి. ఈయనకి కోపం ఎక్కువగా వుండేదిట. ఇప్పుడు మాత్రం ‘శివానీ’ అని అస్తమానం పిలుస్తూనే వుంటారు. పాపం, ఆవిడకి ఆస్తమా వల్ల దగ్గు! ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఆవిడ నా చేతిని వదిలి పెట్టేవారు కారు. లోపలికి వెళ్ళాం… ‘ఆటా’ అంటే ఎంతో వూహించుకుని వెళ్ళి నాకు ఆ డాన్స్‌లూ, పాటలూ చాలా నిరుత్సాహం కలిగించాయి. తర్వాత స్టేజ్‌ మీద ‘ధనలక్ష్మి’ విశ్వరూపం చూపించింది. అంటే మిలియన్లలో విరాళాలిచ్చిన దాతలను పిలిచి సన్మానించారు. మన నేతలు కూడా వచ్చారు. తెలుగు వాళ్ళు పరాయిగడ్డ మీద అంతలా సెటిల్ అయి అంతంత డబ్బు సంపాదించడం నాకు గొప్పనిపించింది.

తోటకూర ప్రసాద్ గారూ, ఎమ్.వి.ఎల్. గారూ, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు కనిపించినా, అప్పుడంత పెద్ద పరిచయం కాలేదు. తర్వాత ట్రిప్పుల నుండీ బాగా స్నేహం అయ్యారు.

(సశేషం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here