[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
నేను చిట్టెన్‌రాజుగారికీ, ఆంటీకీ చెప్పేసా – ‘సాయంత్రం కంగారు పడకండి, డిన్నర్‌కి గిరిజ ఇంటికి వెళ్తున్నాన’ని.
గిరిజ భర్త ప్రసాద్ వచ్చి సాయంత్రం ఆరుగంటలకి ఫోన్ చేశాడు. వెనుక గుమ్మం దగ్గరకి రమ్మన్నాడు. నేను హడావిడిగా బయల్దేరి వెనుక గుమ్మం అనుకుని వేరే గుమ్మం దగ్గరకి వెళ్ళి 17 ఫ్లోర్లూ దిగి బయటకొచ్చేసా… నిర్మానుష్యంగా వుంది…. కొన్ని అడుగులు వేసా, చుట్టు తిరిగి ఇంకో గుమ్మం దగ్గరకి వెళ్దామని… ఎదురుగా పెద్ద పెద్దగా మాట్లాడుతూ కొందరు ఆఫ్రికన్ అమెరికన్స్, పొట్ట మీద కొట్టుకుంటూ, ఏడుస్తూ కొందరు ఆడవాళ్ళు, బలంగా దృఢంగా ఉన్న నల్లని మగాళ్ళు… ఏదో మాట్లాడ్తూ ఎదురొచ్చారు. అమెరికా వచ్చాకా బిచ్చగాళ్ళను చూడడం అదే మొదటసారి. ఎన్నో కథలు విన్నాను ‘మగ్గింగ్’ గురించి! వెన్నులో భయం లాంటిది కలిగింది. ఇరు పార్శ్వాలా మనుష్య సంచారం లేదు, వీళ్ళు తప్ప. నా ఒంటి మీద నగలు, పట్టుచీరా వున్నాయి. కాల్చి పారేసినా దిక్కులేదు. పేపర్లో కూడా మరునాడు వేస్తారో లేదోనని డౌట్!
‘ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చిన సామెత’లా మరీ కన్‌వెన్షన్ సెంటర్ వెనకాల ఎవరికీ తెలీని అనామక చావు చావడం ఇష్టం లేకపోయింది. మళ్ళీ కన్‌వెన్షన్ సెంటర్ ఫ్రంట్ డోర్ వైపు పరిగెత్తాను. వాళ్ళల్లో ఒకడు నా వెనుక… “స్టాప్” అంటూ పరిగెత్తడం మొదలుపెట్టాడు… డెఫినెట్‌గా గన్ తీసి కాల్చేస్తాడనుకుని సాయిబాబా నామం గట్టిగట్టిగా జపిస్తూ పరిగెత్తా… గేట్ వచ్చింది. అక్కడ ఆగి వెనక్కి చూశా… అతను పొట్ట చూపిస్తూ, విరగబడి నవ్వుతూ ఏదో అంటున్నాడు… వెనకలా సమూహంలా వాళ్ళు వస్తున్నారు. ఓసారి నాకీ అనుభవం, తిరుపతిలో గోవిందరాజుల స్వామి గుడి దగ్గర కూడా ఎదురయింది. ఒకత్తినీ వెళ్తున్నప్పుడు, గుంపుగా బిచ్చగాళ్ళు – ఆడా మగా వచ్చి చుట్టుముట్టబోతే కేకలు పెట్టాను. అక్కడ అమ్ముకునేవాళ్ళు వచ్చి వాళ్ళని చెదరగొట్టారు. ఆ రోజు కూడా వాళ్ళు చంపేస్తారనే అనుకున్నాను. ఈరోజు వీళ్ళయితే డ్రగ్స్ కాని తాగుడు నిషాలో కాని వున్నట్టు వున్మాదంగా ఏడుస్తూ నవ్వుతూ వూగిపోతున్నారు. ఈలోగా ప్రసాద్ ఫోన్ చేశాడు. నేను నా పరిస్థితి చెప్పాను. “సరే, నేనే ఫ్రంట్ డోర్ దగ్గరకి వస్తాను. అక్కడే వుండండి” అన్నాడు.
నేను కొంచెం కుదుటపడ్డాక ప్రసాద్ అన్నాడు “కొంచెం ప్రమాదమేనండీ… వాళ్ళ దగ్గర గన్స్ కూడా వుంటాయి” అని.
గిరిజ ఇల్లు చాలా బావుంది. నా కోసం చాలా ఐటెమ్స్ చేసింది. బాగా జ్ఞాపకం వున్నది. బీరకాయ పచ్చడీ, సాంబార్, వంకాయ కూర, పులిహోరా… ఐస్‌క్రీమ్ కూడా. ఎంతో ఆప్యాయంగా, “మా అక్కే మా యింటి కొచ్చినట్టుంది” అంది. మేం చాలా సేపు కబుర్లాడాకా, వాళ్ళు నన్ను నా హోటల్ దగ్గర దింపడాని కొచ్చారు. ఆ రోజు వాళ్ళ స్వాతంత్ర సంబరాలు. దాదాపు ఐదు సంవత్సరాలు పాటు అమెరికా ఇండిపెండెన్స్ డే రోజున నేను అక్కడే వున్నాను. ఆకాశంలో వాళ్ళు కాల్చే తారాజువ్వలని, ఫైర్ వర్క్స్ అంటారు. జూలై నాలుగవ తేదీన.
శివానీ ఆంటీ ఆ రోజుల్లో గ్రాడ్యుయేట్. అంతే కాదు, ఆవిడ డ్రైవింగ్ నేర్చుకుని, గొల్లపూడి గారిని రోజూ రేడియో స్టేషన్ దగ్గర దింపి మళ్ళీ తీసుకొచ్చేవారుట. చాలా ఏళ్ళుగా గొల్లపూడిగారిని తెలిసున్న పద్మనాభరావుగారో మాట చెప్పారు “వాన ఎందుకొస్తోందిప్పుడు? నేను బయటకు వెళ్ళాలి” అని కూడా గొల్లపూడి గారు శివానీ గారి మీద చిందులేసేవారుట! ఆవిడ మహా ఓర్మిమంతురాలు. కన్నతల్లికి కడుపుకోతకి మించి శిక్ష ఏం వుంటుందీ? ఆవిడ తన కొడుకు శ్రీనివాస్ మరణం తర్వాత కోలుకోలేనంత దెబ్బ తిన్నారు. ఆయనే వుంటే పెద్ద దర్శకులై వుండేవారు. ఆ అబ్బాయి జ్ఞాపకార్థం వీళ్ళు ట్రస్ట్ పెట్టి, ప్రతి సంవత్సరం ‘గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్’ ఇస్తున్నారు. మహామహులు కమల్ హాసన్, సింగీతం శ్రీనివాసరావు గారూ, విశ్వనాథ్ గారు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి లాంటి వాళ్ళంతా ఆ ఫంక్షన్‌కి వెళ్తారు. ఆంటీ పేరే పెద్ద మనవరాలు శివానికి పెట్టారు. ఆ అమ్మాయి భరతనాట్యం చేస్తుంది.
గొల్లపూడి గారు చెప్పారు “మహానటి సావిత్రిని రోజూ చూస్తున్న ఫీలింగ్ అమ్మా – ఎదురింట్లో వున్న విజయ చాముండేశ్వరి, వాళ్ళ అమ్మాయిని చూస్తుంటే” అని. నేను రామానాయుడి గారి వళ్వార్ కొట్టంలో వున్నప్పుడు, ఆ వెనుక వీధిలోనే గొల్లపూడి గారిదీ, విజయ చాముండేశ్వరి గారిదీ, ఎల్.ఆర్.ఈశ్వరి గారివీ ఇళ్ళున్నాయి అన్నమాట. నాకప్పుడు వీళ్ళు పరిచయం లేదుగా! గొల్లపూడి గారి కోడళ్ళు పెట్టే బొమ్మల కొలువు చాలా ప్రత్యేకమైనది. పేపర్లో కూడా వేస్తారు. ఆంటీ కోడళ్ళ గురించి గొప్పగా చెప్పేవారు. వాళ్ళకి ఏవైనా గుర్తుగా కొని తీసుకెళ్ళాలని కూడా కొట్టుకుపోయేవారు. అలాంటి అత్తగారు లభించడం అదృష్టం.
గిరిజ మరునాడు వచ్చి మమ్మల్ని తన కారులో తీసుకెళ్ళి న్యూ యార్క్ సిటీ చూపిస్తానన్న ఒప్పందంతో ఆ రోజుకి గిరిజా, ప్రసాద్ గుడ్‌బై చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళ అమ్మాయి ‘జయతి’ ఇండియాలో ప్రసాద్ గారి తల్లిగారి దగ్గర వుంది కాబట్టి చూడ్డం పడలేదు.
మరునాడు ప్రొద్దుటే చిట్టెన్‌రాజుగారొచ్చి నన్ను బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకెళ్ళారు. ‘ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు’ అనే ఫ్రెంచ్ ఫ్రైస్… ఫ్రెంచ్ వాళ్ళు అసలవి చెయ్యరని ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమా చూసాకా తెలిసింది! ఫ్రెంచ్ ఫ్రైస్, వేఫెల్స్ తిన్నాం. తర్వాత గిరిజ వచ్చింది. ‘అందమైన లేడీ షాఫర్’ అని గొల్లపూడి గారు గిరిజ అందానికి మళ్ళీ కితాబులిచ్చారు!
(సశేషం)