Site icon Sanchika

జీవన రమణీయం-77

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు ‘బ్రాడ్‌వే’ మొత్తం చూసాం. గొల్లపూడి గారు వ్యాఖ్యానం ఇస్తూ, థియేటర్స్ గురించీ, ఆ నాటకాల గురించీ చెప్పారు. తర్వాత ఎక్కడో ఓ చోట లంచ్ చేసి, గిరిజ తనే బిల్ చెల్లించాకా, మమ్మల్ని హోటల్ దగ్గర దింపి వెళ్ళింది. చిట్టెన్‌రాజు గారు హోటల్ వెకేట్ చేసాకా కారు రెంట్‍కి తీసుకొని మాన్‌హాట్టన్ వీధులూ, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూపించే ప్రోగ్రామ్ నిర్ణయించడం అయింది. అనుకోకుండా, నా సొమ్ము గట్టిదని నిరూపిస్తూ మాధవి వచ్చి నా ఫౌండేషన్ క్రీమ్ ఇచ్చి వెళ్ళింది.

   

నేను సూట్‌కేస్ లోంచి ఒక్క వస్తువు కూడా బయటకి తీసి పరచకుండా, అన్నీ సర్దినవి సర్దినట్టే పెట్టుకోవడం చూసి ఆంటీ “అలా ఎలా రెడీ అవుతావమ్మా?” అని ఆశ్చర్యపోయేవారు. అంతేకాదు, చిన్న సూట్‌కేస్‌లో నేను వారానికి సరిపడా బట్టలూ, జ్యూవెలరీ, కాస్మోటిక్స్ సర్దుకోవడం, ఏదైనా షాపింగ్ చేస్తే అవి కూడా పెట్టుకోవడం, చాలా మంది ఆశ్చర్యంగా నన్ను అడుగుతూ వుంటారు. మొదటిసారి నేను మద్రాసు వెళ్ళినప్పుడు ఆఖరున వచ్చిన రామానాయుడు గారు “ఇంతేనా నీ సూట్‌కేస్? పది రోజులకి ఎలా సరిపోయాయి బట్టలు?” అని అడిగారు. నా ప్రతి అమెరికా ట్రిప్‌లో, నేను ఎవరింట్లో వున్నా వాళ్ళు అడుగుతూనే వుంటారు… “ఒక్క రోజు కూడా చీర రిపీట్ చేసినట్టు కనిపించలేదు, ఒక్క సూట్‌కేస్‌లో ఎలా సర్దుకున్నారు?” అని. అంతే కాదు, నేను ఏ ఊరు వెళ్ళినా, వాకింగ్ షూస్ దగ్గర నుండీ తీసుకెళ్తానా, అవి మాత్రమే బయటకు కనిపిస్తాయి.. వేసుకుని విప్పిన బట్టలూ, మిగతావన్నీ సూట్‌కేస్‌లోనే వుంటాయి. రోజూ వేసేసుకున్నవి అడుగున పెడ్తూ, వేసుకోవలసినవి పైకి పెడ్తూ వస్తాను. అందుకే, ఏవీ మర్చిపోయి రాను. నాకు ఊరికెళ్ళడం కన్నా సూట్‌కేస్ సర్దుకోవడం చాలా సరదా!

చిట్టెన్‌రాజు గారి డ్రైవింగ్‌లో మేం, కబుర్లలో కాలం తెలీకుండా మన్‌హాట్టన్ చేరాం. ఆ తరువాత స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూసాం. చాలా ఫొటోస్ తీసుకున్నాం. మధ్యలో నేను ఆంటీ కాఫీ తాగాం. చాక్లెట్స్ కొన్నాను. అప్పటి నుండీ నేను ‘కిసెస్’ చాక్లెట్స్ మాత్రమే కొంటూంటాను. అంతగా నచ్చాయి. కానీ ఆ వాతావరణంలో తేమకి నా మొహం అంతా చాలా పొడారిపోయింది. మధ్యలో ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్స్‌లో కోల్డ్ క్రీమ్ పెద్దది కొన్నాను. అది నన్ను మొత్తం ట్రిప్‌లో కాపాడింది.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర నేను నిలబడి ఫొటో తీయించుకుంటున్నాను. సడెన్‌గా ఆ స్టాట్యూ కదిలి, నా భుజం మీద చెయ్యేసింది. నేను దడుసుకుని, పెద్దగా కేకలు పెట్టాను. అది నిజం స్టాట్యూ కాదు, మనిషే అలా వేషం వేసుకుని నిలబడ్డాడు! నిజం తెలిసాకా ఎంత నవ్వొచ్చిందో!

నేను జీవితంలో చూస్తాననుకోని ప్రదేశాలు నేను చూడగలిగేట్టు చేసిన చిట్టెన్‌రాజుగారికి నేనెంతైనా ఋణపడ్డాను. తరువాత ఆల్‌మోస్ట్ ప్రతి ఏడాది మార్చి ఏడాదీ వెళ్తునే వున్నాను. కానీ మొదటి అమెరికా ట్రిప్‌లో పొందిన అనుభూతులు, ఆనందాలూ మళ్ళీ పొందలేదు! చిట్టెన్‌రాజు గారు జోక్స్ వేస్తూనే వుంటారు. పాపం డబ్బుకి కూడా చూసుకోరు. ఇండియా నుండి ఎవరైనా వస్తే చాలు, ‘ప్రాణం పెడ్తారు!’

మేం మన్‌హాట్టాన్ యాత్ర తర్వాత న్యూ యార్క్ తిరిగొచ్చి, కారు వెనక్కిచ్చేసి, డల్లాస్ వెళ్ళే ఫ్లైట్ మా షెడ్యూల్ ప్రకారం ఎక్కాం. చిట్టెన్‌రాజుగారు మమ్మల్ని ఈ ప్లయిట్ ఎక్కించి, తన హ్యూస్టన్ ఫ్లయిట్ కోసం వెయిట్ చేస్తే, అది కాస్తా కాన్సిల్ అయి, ఆ రాత్రంతా నెక్స్ట్ ఫ్లయిట్ కోసం వెయిట్ చేయాల్సొచ్చిందట!

మాకు ఫ్లయిట్‌లో – గొల్లపూడిగారికీ, ఆంటీకీ, నాకూ పక్క పక్క సీట్లే వచ్చాయి. మరి వాళ్ళ అబ్బాయి ప్లాన్డ్‌గా, ఊసా టికెట్స్ అలా కొనిపెట్టాడుగా. మిగతా ప్రయాణాలు అన్నీ కూడా ఇలా పక్కపక్కన కూర్చునే చేసాం. అలవాటుగా ఈ ఫ్లయిట్‌ కూడా హబ్‌కి వెళ్ళింది. ‘అట్లాంటా’లో మళ్ళీ మారడానికి నాలుగు గంటలు ఆ విమానాశ్రయంలో వెయిట్ చేసాం. ట్రెయిన్‌లో ప్లాట్‌ఫామ్స్ మారడం, అంత పెద్ద విమానాశ్రయం చూడడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఎక్కడైనా కాఫీ నేనే కొనేదాన్ని. ఆంటీ నేను తాగే వాళ్ళం. గొల్లపూడి గారు “ఒక్కసారి బోజనం చేస్తే, నేను రాత్రి దాకా మళ్ళీ నోరు తెరవను తినడానికి” అనేవారు. నాకూ ఆంటీకి చిరుతిండ్లు కూడా అలవాటు. ఇంకా ఎయిర్‍పోర్టుల్లో, ట్రాలీలు చాలా కొన్ని చోట్ల తప్ప 3 డాలర్లు వేస్తే కానీ వాడడానికి లేదు! అలాంటప్పుడు గొల్లపూడి గారు, ఎవరైనా తెలుగు వాళ్ళు తనని గుర్తు పట్టి వచ్చి ఫొటో తీయించుకుంటామని వస్తే.. “ఈ ట్రాలీలు…” అనగానే, వాళ్ళు “మేం తీసుకొస్తాం గురువుగారూ, మీరు వుండండి” అని పరిగెత్తుకెళ్ళి తెచ్చేసేవాళ్ళు! నాకు మొదటిసారి సెలెబ్రిటీ స్టేటస్ అంటే ఏమిటో తెలిసొచ్చింది.

నేను అమెరికా ట్రిప్ ప్లాన్ చేసుకుని, ‘ఊసా’ టికెట్లు కొనేముందు, నా బంధువులందరినీ వాళ్ళు ఏ డేట్లలో ఖాళీనో, నేనెప్పుడొస్తున్నానో, ఎయిర్‌పోర్టుకి ఎప్పుడొచ్చి నన్ను పికప్ చేసుకోవాలో చెప్పడం వలనా, ఫోన్ నెంబరు ఇవ్వడం వలనా, నా పికప్‌కి ఎక్కడా లోపం రాలేదు!

డల్లాస్‌లో మా అత్తయ్య కొడుకూ, మా వదిన చిన్నన్నయ్యా అయిన నాగేశ్వరరావు బావ వుంటాడు. వాళ్ళావిడ సత్య. తను బ్యూటీషియన్. వాళ్ళకి కునాల్ తేజస్వి అనే అబ్బాయీ, మౌనిక అనే అమ్మాయీ.

మేం ‘బుజ్జి’ అంటాం అతన్ని. ఎయిర్‌పోర్ట్‌లో గొల్లపూడిగారు పెద్ద గొంతుతో మాట్లాడేస్తుంటే, నన్ను పిక్ చేసుకోడానికి వచ్చిన సత్య కళవెళపడింది. ఆయన చాలాసార్లు అమెరికా వచ్చిన మనిషే. కానీ పెద్దగానే మాట్లాడేవారు!

ఆయన తన ఫ్రెండ్స్ ఇంటికీ, నేను మా సత్యా వాళ్ళింటికి వెళ్ళబోతు ‘టాన్‌టెక్స్ (Tantex) వాళ్ళ ప్రోగ్రామ్‌లో కలుసుకుందాం’ అని చెప్పుకున్నాం. బుజ్జి దగ్గర అమెరికాలో అప్పుదు మా శారదత్తయ్య వుంది. అది నాకు ఎడిషనల్ ఎట్రాక్షన్.

నేనొస్తున్నాని శారదత్తయ్య చింతకాయ పచ్చడి నూరి, టమాటా పప్పు, దొండకాయ కూరా చేసింది. నేను వెళ్ళగానే నన్ను కౌగిలించుకుని చాలా సంతోషించింది. ‘మధుమాసం’ ప్రివ్యూలో రామానాయుడిగారికి “మా అత్తయ్య” అని పరిచయం చేస్తే, “మేనత్తా? అత్తగారా?” అని అడిగారు అని ఇప్పటికీ చెప్పి మురిసిపోతుంది. నాకు రెండు పురుళ్ళు పోసింది మా అత్తయ్య. నాకు ఫేవరెట్ మేనత్త ఆవిడ!

(సశేషం)

Exit mobile version