Site icon Sanchika

జీవన రమణీయం-79

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నా[/dropcap]ర్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారు నాదీ, గొల్లపూడి గారిదీ, రాళ్ళబండి కవితాప్రసాద్ గారివీ, ఫొటోలు ముఖచిత్రం సావనీర్ మీద ముద్రించారు. నేను ఆ ముఖచిత్రం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. నేను ఏ వేదిక ఎక్కి ఉపన్యసించినా, నన్ను వాళ్ళు సత్కరిస్తూన్నా, ‘ఇలా పరాయి గడ్డ మిద తన బిడ్డకు జరుగుతున్న సన్మానాలు అమ్మ చూస్తే ఎంత ఆనందించేదీ’ అని తలచుకునేదాన్ని!

ఆ రోజు నేను టీవీ సీరియల్ రచన గురించి మాట్లాడ్తుంటే, వచ్చిన ప్రేక్షకులు ఆపకుండా నవ్వారు. రాళ్ళబండి గారు “you got a sweet gab” అని మెచ్చుకుంటే, “నా పరువు కాపాడావు… బాగా మాట్లాడావు” అని చిట్టెన్‌రాజుగారు అన్నారు. వింజమూరి శివరాం అనే మా సుమిత్రా పంపన భర్త మేనత్త లక్ష్మిగారొచ్చి తనని పరిచయం చేసుకొని “అచ్చు మా సుమిత్రలానే వున్నారు” అని మాట్లాడారు. ఆవిడ ‘ఓ సీత కథ’ ప్రొడ్యూసర్ శర్మగారి భార్య అని తర్వాత తెలిసింది. ఇక కవితాప్రసాద్ గారి కవితా చమత్కృతీ, చిట్టెన్‌రాజు గారి హాస్యరసస్ఫోరకమైన ఉపన్యాసం సంగతి సరే సరి! మహామహులు వాళ్ళు! గొల్లపూడిగారు మాట్లాడ్తుంటే అటు రేడియో, ఇటు థియేటర్, సినిమా, నవలా, కథా… అన్నింటి గురించీ… అదో ఝరి! ఎక్కడా ఆగని సెలయేరులా ప్రవహిస్తుందా ప్రసంగం!

 

ఈ మహామహులతో సమానం నేనూ స్టేజ్ ఎక్కి, వారి సరసన స్థానం సంపాదించడం నా అదృష్టం. ప్రతి రచయితకీ, రచయిత్రికీ ఇవి దొరికే అవకాశాలు కావు! నేను సంపాదించుకున్న స్నేహాలు నా జీవితంలో అక్షయపాత్రల లాంటివి… పుష్పక విమానాల లాంటివి కూడా! నేను ఒకరితో స్నేహం చేసానంటే అవి జీవితాంతం నిలుస్తాయి. దానికి ఉదాహరణలు నా ఇంటర్‌మీడియట్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, మా స్కూల్లో టీచర్లు సుశీలా, లలితా, నేనీ ప్రొఫెషన్‌లోకి వచ్చిన మొదట్లో ఫ్రెండ్‌షిప్ అయిన సాయికృష్ణ (బాబాయి హోటల్ హీరో), సుమిత్రా పంపన, అమెరికా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అయినవాళ్ళు, ఇప్పటికీ వున్నారు. కొత్తవాళ్ళు జాబితాలో చేర్తూనే వుంటారు కానీ, పాత వాళ్ళు జారిపోరు! ఓసారి అలా ఆ బాండ్‌లో ఎంటర్ అయితే.. అది లైఫ్ లాంగ్ వుంటుంది. నేను బలవంతంగా తుంచుకున్న స్నేహాలు రెండో మూడో వుంటాయి మొత్తం జీవితంలో. అవీ బాగా మానసిక ప్రశాంతత లోపింప చేయడం వల్లనే అనుకోండీ! అంతే. ఆ సభ తర్వాత అందరం ‘ఆహార్’ అనే రెస్టారెంట్ భోజనం చేసాకా, చిట్టెన్‌రాజు గారి డ్రైవింగ్‌లో మరునాడు నేనూ, గొల్లపూడి గారూ, శివానీ గారూ వాళ్ళ హ్యూస్టన్ వెళ్ళేట్లు నిశ్చయం అయింది. అమెరికా వచ్చిన మొదటిసారి చెకిన్ లగేజ్ లేకుండ ఫ్లైట్ హబ్‌ కెళ్ళి, మళ్ళీ అక్కడ ఇంకో ఫ్లైట్  మారక్కర లేకుండా, మేం క్యాబిన్ బ్యాగేజ్‌లతో, కార్లో ఇంకో వూరు వెళ్ళడం చాలా హాయి అనిపించింది! నేను ఎక్కడ వున్నా అల్లు అరవింద్ గారు ఫోన్స్ చేసి “నాకు అక్కడ ఫ్రెండ్స్ వున్నారు. ఏవైనా అవసరం అయితే చెప్పండి” అనేవారు. ఆయనతో మాట్లాడడం విని గొల్లపూడి గారు చాలా ఆశ్చర్యపోయారు. రచయితలకు కొన్ని సౌలభ్యాలుంటాయి. అదేవిటో నాతో మాట్లాడడం ప్రారంభించగానే చాలామంది నా ముందు ఓపెన్ అయిపోయి తమ స్వవిషయాలను చెప్పుకుంటారు. కొన్నిసార్లు మా ప్రమేయం లేకుండానే కౌన్సిలింగ్‍లు కూడా చేసేస్తూ వుంటాం. మాతో మాట్లాడడం వల్ల వాళ్ళకి కొంత రిలీఫ్ వుంటుంది. ఇది దాదాపు అందరు రచయితలకీ జెండర్ భేదం లేకుండా జరిగే అనుభవమే అని నేను నమ్ముతాను.

చిట్టెన్‌రాజు గారి డ్రైవింగ్‌లో రంజుగా, చమత్కారాలతో, సాహిత్య దాయకమైన సంభాషణలతో, మా ప్రయాణం ఐదు గంటల పాటు డల్లాస్ నుండి హ్యూస్టన్‌కి చాలా బాగా జరిగింది. జూన్ నెల కాబట్టి ఎండలు మొదలవుతూ వుండి వెదర్ కూడా సహకరించింది.

హ్యూస్టన్ సమీపిస్తూంటేనే ఎంతో అందంగా వుంది. ప్రతీ స్టేట్‌కీ తనవైన అందాలుంటాయి అమెరికాలో. గొల్లపూడి గారి అన్నగారి అమ్మాయి ఇంటి కోసం ఎక్కువ ప్రయాస పడలేదు! అప్పుడు ఆ జి.పి.ఎస్. చూసి ‘దారి చూపే దేవత’ అని పేరు పెట్టుకొని చాలా అబ్బురపడ్డాను. ఇప్పుడు రోజూ నేను షూటింగ్ లొకేషన్స్‌కి మన హైదరాబాద్‌లో కూడా అది పెట్టుకునే వెళ్తున్నాను. ఆ అమ్మాయి పేరు కూడా కామేశ్వరి అని జ్ఞాపకం. ‘బాబాయ్’ అని గొల్లపూడిగారిని చూసి పరిగెత్తుకొచ్చి కౌగిలించుకుంది. “మీ కోసం మెంతికారం పెట్టి వంకాయ కూర చేసాను బాబాయ్” అంది. మమ్మల్ని కూడా భోజనానికి వుండమన్నా మేం కాఫీలు తాగి బయల్దేరిపోయాం. చిట్టెన్‌రాజు గారు మర్నాడు వచ్చి వాళ్ళని నాతో బాటు తన ఫ్యాక్టరీకీ, స్వామి నారాయణ్ టెంపుల్‌కీ తీసుకెళ్తానని చెప్పారు. అక్కడ ఆ దంపతులని వదిలిపెట్టి నేనూ, చిట్టెన్‌రాజు గారూ సుగర్‌ల్యాండ్‌లో వున్న వాళ్ళ ఇల్లున్న కమ్యూనిటీకి వెళ్ళాం. ఆయన అందువల్లే తియ్యని హాస్యకథలు రాయగలుగుతున్నారని నేను అన్నాను.

గేటెడ్ కమ్యూనిటీస్ ఇంకా మనకి అప్పట్లో ఇప్పట్లా లేవు! గేట్ దగ్గర ఆయన్ కోడ్ నొక్కడం, గేట్ తెరుచుకోవడం, లోపల విశాలమైన ఇళ్ళూ, ఇళ్ళ ముందు రంగు రంగుల పూల మొక్కలూ, ప్రతి ఇంటి ముందూ గ్యారేజీలో, ఇంటా బయటా కలిపి నాలుగేసి కార్లు అన్నీ వింతగా చూసాను. “ఇంట్లో నలుగురం బయటకెళ్ళేవాళ్ళమోయ్… అందుకే నాలుగు కార్లు” అన్నారాయన. అప్పటికి వాళ్ళబ్బాయి అనూజ్ చిన్నవాడు. స్కూల్‌కి వెళ్తున్నా, డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం వచ్చేసింది. ఎందుకంటే అతనే తనని ఎయిర్‌పోర్ట్ నుంచి పికప్ చెసుకున్నాడని ఆయన చెప్పినట్టు గుర్తు! ఆయనకి అమృతా, అమూల్యా అని ఇద్దరు అందమైన కూతుళ్ళు. ఇద్దరూ కూచిపూడి డాన్సర్స్.

ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళావిడ గిరిజగారికి పరిచయం చేసారు. తర్వాత వాళ్ళ చిన్న అమ్మాయి అమూల్యతో “She can make you a heroine” అని పరిచయం చేసారు. ఆ అమ్మాయి నిజంగానే అంత బావుంది. మొదటిసారి చుట్టాలు కాని వాళ్ళ ఇంట్లో వుండడం, అమెరికా వచ్చాకా! అది మొహమాటంగా ఫీల్ అయ్యాను. నేను స్నానం చేసొచ్చేసరికీ… ఆవిడ హాస్పిటల్‍లో ఫార్మాసిస్ట్… తయ్యారయి హాస్పిటల్‌కి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళ ఇంటి ముందు నాలుగు కార్లున్నాయి.

మన నటరత్న ఎన్.టి.ఆర్.గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు గిరిజగారు పని చేసే హాస్పిటల్‌లోనే, ఆవిడ చేతనే కొన్ని పరీక్షలు చేయించుకున్నారట, ఆయన చెప్పారు. నేను ఆవిడని చూడగానే ఆవిడ కోసం తెచ్చిన పట్టుచీర, చనువుగా పూజా రూమ్ నుండి కుంకుమ తెచ్చి, ఆవిడకి పెట్టి ఇచ్చేసాను. ఆవిడ మంచి రంగుతో చాలా బాగుంటారు. ఆయన కూడా మంచి రంగు కాబట్టి పిల్లలు కూడా జామ పండ్లలా వున్నారు. వాళ్ళిల్లు చాలా బాగుంటుంది.

(సశేషం)

Exit mobile version