జీవన రమణీయం-82

0
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]అ[/dropcap]ప్పుడే లకిరెడ్డి హనిమరెడ్డిగారి పేరు కూడా ఆ గుడి మీద చూసాను. ఆయన దాత కదా! ఇంటికొచ్చి, గొల్లపూడి గారి టైం టేబుల్ ప్రకారం, ఆయన సిట్టింగ్ అయ్యాకా, మేం పలహారాలు చేసి నిద్రకుపక్రమించాం. రెడీమేడ్‌గా వత్తిన చపాతీలు కొనుక్కోడం మొదటిసారి వాళ్ళింట్లోనే చూసాను.

కిరణ్ ప్రభ గారి అబ్బాయి సుమన్ అప్పుడు ఇండియాలో వున్నాడు సినిమా డైరక్షన్ కోసం. అందుకే అతని గదిని గొల్లపూడి గారికీ, ఆయన శ్రీమతికీ ఇచ్చి, ఆ గది పక్కనున్న మేడమీద మరో గదిని నాకిచ్చారు. మధ్యలో వాష్‌రూమ్ వుంటుంది. మేడ మీదే ఈ గదికి ఆపోజిట్‌గా వారి మాస్టర్  బెడ్‌రూమ్ వుంటుంది. ఈ ఇంటి టోపోగ్రఫీ కౌముది కుటీరంలో బసచేసిన వందలాది అతిథులకి తెలుసు! అంతమంది అతిథులు వచ్చి వుంటారు వారింట్లో.

మేడ మీదకి వెళ్ళి పడుకున్నానే కానీ, ఇంకో చీర మాత్రమే వుంది చిన్న పెట్టెలో, సూట్‌కేస్ మిస్ అయింది. బంగారం లేకపోయినా, ఎన్నో పట్టుచీరలున్నాయి! ఆడవాళ్ళకీ, వారి చీరలకీ ఎమోషనల్ ఎటాచ్‌మెంట్ వుంటుంది. అందుకే దిగులుతో నిద్ర పట్టలేదు! రేపు ఎలాగైనా కిరణ్ ప్రభ గారిని అడిగి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి, మిస్ అయిన సూట్‌కేస్ ఆనవాళ్ళు చెప్దాం అని నిశ్చయించుకున్నాను.

పాపం కిరణ్ ప్రభ గారు కూడా అతిథుల కోసం బోలెడు ప్రోగ్రామ్‌లు ప్లాన్ చేస్తున్నారు. నా సూట్ కేస్ రాకపొవడం కాంతిగారికీ, ఆయనకీ కూడా బాధగానే వుంది.

ఆ రోజు మేం చార్లీ చాప్లిన్ స్ట్రీట్ అని చాప్లిన్ పేరు మీద వుంటాయి వీధులో షాప్‌లూ, బార్‍లూ అన్నీ… అవి చూపిస్తా అంటే బయలుదేరాం. మొదట ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాం. ఆ  రోజు నుండీ దినచర్య ప్రతి రోజూ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడంతోటే ప్రారంభం అయింది. వారింటి దగ్గరగా ఉన్న ఓక్‌లాండ్ (Oakland) ఎయిర్‌పోర్ట్‌లోనే నేను దిగడం మంచిదయింది.

కిరణ్‌ప్రభ గారితో వెళ్ళిన నేను, ఆయన చెప్పనిచ్చి, తర్వాత “నేను రైటర్‌ని అనీ… నేను కర్బ్ చెకిన్ చేసాననీ… నా రెడ్ కలర్ సూట్‌కేస్ మిస్ అయిందనీ, అది తప్పకుండా ఎవరూ క్లైమ్ చెయ్యకపోవడంతో ఎక్కడో ఆ చుట్టు పక్కలే తిరుగుతుంటూందనీ” వాళ్ళకే ఎక్స్‌ప్లెయిన్ చెయ్యడమే కాకుండా, అక్కడున్న ఆఫ్రికన్ అమెరికన్ స్త్రీని రిక్వెస్ట్ చేసి, ఆ వారం ఎవరెవరు కర్బ్ చెకిన్ చేసారో, ఆ లిస్ట్ అంతా చూసాను. అప్పుడు తెలిసింది, అమెరికాలో ‘బలభద్రపాత్రుని’ వాళ్ళు చాలా మంది వున్నారనీ, వాళ్ళు వారం అంతా తిరుగుతూనే వున్నారనీ.  నా దృష్టి బాలా… బల… అని చూస్తుంటే బాలషణ్ముఖం అన్న పేరు మీద పడింది. నేను చెక్ ఇన్ చేసిన టైమ్ లోనే ఆ పేరూ వుంది. సో… నేను వాళ్ళతో గట్టిగా… అతని సూట్‌కేస్‌కి నా పేరూ, నా సూట్‌కేస్‌కి అతని పేరు పెట్టి ఉంటారు, జాగ్రత్త చూసి అతన్ని కనుక్కోమన్నాను. వాళ్ళు నా రిక్వెస్ట్ అనుసరించి అలాగే చేసారు. అతను పోర్ట్‌లాండ్ వెళ్ళాడు. ఆఫీస్‌లో వున్న అతను ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ ఫోన్ తీసుకుని, “ఫలానా రోజున నేను డల్లాస్ నుండి పోర్ట్‌లాండ్ వచ్చిన మాట నిజమే, కానీ నేను సూట్‌కేస్ ఏమీ చెక్ ఇన్ చెయ్యలేదు” అన్నాడుట. దాంతో కథ మొదటకొచ్చింది. అప్పుడింక రియల్ ట్రాజెడీ క్వీన్‌ని అయ్యాను. ఎవరేం జోక్ చేసిన పట్టించుకోకుండా, మొహంలో దైన్యం, మనసులో శూన్యం నింపుకుని తిరుగుతున్నాను.

డల్లాస్‌లో మేం షాపింగ్ చేసి, పాటిల్ బ్రదర్స్ అనే గుజరాతీ స్టోర్స్‌లో ఒక అద్భుతమైన మిర్రర్ వర్క్ వున్న వైట్ శారీ కొనుక్కున్నాను. అది వంగూరి వారి సదస్సులో ఓ రోజు కట్టుకుందాం అనుకున్నాను, కానీ అదీ పెట్టెలో వుండిపోయింది. అందుకే వాల్‌మార్ట్స్‌లో వున్న గుజరాతీ స్టోర్స్‌లో ఒక ఆకుపచ్చ చీరా, డిజైనర్ వేర్ కొన్నాను. నాకు వున్న చీరలే నచ్చుతాయి. సేమ్ పోయిన వైట్ శారీ, ఇండియాలో వున్న లాంటిదే ఆకుపచ్చ చీర ఫంక్షన్ కోసం కొనుకున్నాను. ఆపాటికి ఇంక సూట్‌కేస్ దొరుకుతుందనే ఆశ పోయింది.

గొల్లపూడి గారికి వీరాభిమాని ఒకావిడా, ఆవిడ భర్త డాక్టరు గారూ, ఈయన వస్తున్నారని తెలిసి మమ్మల్ని భోజనానికి పిలిచారట ముందే. ఆ సదరు ఇల్లాలి గురించి గొల్లపూడి గారు చాలా చెప్పారు. ‘నేనంటే ప్రాణం…. వాళ్ళింటికి వెళ్ళకపోతే చంపేస్తుంద’ని. సరే, మేం అంతా ఆయన వెంట బయలుదేరి వెళ్ళాం. ఆవిడ అదో తీరు! మమ్మల్ని చూసాక వంట ప్రయత్నం మొదలుపెట్టింది. వంకాయలు తరుగుతుంటే, గుత్తి వంకాయ కారం కూరి, కూర నేను చేస్తానన్నాను. సింక్ నిండా వున్న గిన్నెలు చూసి, కాంతిగారు సాయం చేద్దాం అని అవి తోముతుంటే, నేనెళ్ళి కడిగిపెట్టాను. ఆవిడ ‘ఒద్దు’ అనకపోగా, ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడ్తూ, “ఈ రోజు గొల్లపూడిగారితో బాటు ఇంకా చాలామంది గెస్ట్ లొచ్చారు… ఆ వంటా గిన్నెలూ… చాలా పనే! కానీ ఇద్దరు హెల్పర్‌లు వున్నారులే… ఏం ఫర్వాలేదు నాకు” అని చెప్పడం విని నేనూ కాంతిగారు మొహాలు చూసుకున్నాం! అలా మమ్మల్ని పనిమనుషులని చేసేసింది… మనుషులు అవతలి వారిని అవమానించేటంత ఇన్‌సెన్సిటివ్‌గా కూడా వుంటారు అమెరికాలో అని మొదటిసారి చూసాను.

మర్నాడు వాళ్ళు కాంతి గారింటికొచ్చారు. అప్పుడు కిందా మీదా పడిపోతూ చాలా ఆప్యాయత కనపరిచింది. కనీసం కిచెన్‌లో కొచ్చి, “ఏమైనా హెల్ప్ చెయ్యనా?” అని అడగలేదు ఆ మహా ఇల్లాలు. భర్త చాలా సౌమ్యుడూ, సంస్కారీ, కానీ వాయిస్ లేదు!

మల్లాది రఘు, శ్యామలా దంపతులు కూడా పరిచయం అయ్యారు. కాంతి గారు ఆ అమ్మాయిని స్వంత కూతురిలా చూసుకునేవారు. ‘ఊసులాడే జాబిలంటా’ అన్న నవల కౌముదిలో రాసిన నిషిగంధా, ఇంకా కొందరు నేను వాళ్ళింట్లో వున్నానని తెలిసి ఫోన్ చేసి మాట్లాడారు. శ్యామల కూడా నన్ను రెండుసార్లు సూట్‌కేస్ కోసం ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్ళింది పాపం!

వంగూరి గారి సదస్సు నెక్స్ట్ డే అనగా, వంగూరి చిట్టెన్‌రాజు గారొచ్చారు. నా సూట్‌కేసు వుదంతం అప్పటికే ఫోన్‌లో విని వుండడం చేత చాలా బాధపడ్డారు. విజయబాబు అనే కిరణ్‌ప్రభగారి స్నేహితుడు, ఒకప్పుడు ఆంద్రప్రభ ఎడిటరు కూడా వస్తున్నారని తెలిసింది. లోకల్‍గా వున్న చాలామంది ఔత్సాహికులైన సాహితీ ప్రియులు ఫ్రిమాంట్‌లోని ‘మయూరీ’ హోటల్‌లో జరిగే ఈ సదస్సు రెండు రోజులకీ హెల్ప్ చెయ్యడానికి వాలంటీర్స్‌గా ముందుకొచ్చారు.

ఈ వాలంటీరింగ్ అమెరికాలో చాలా వుంటుంది. మృత్యుంజయుడు అనే అతను కూడా చాలా సాయంగా వున్నాడు. అప్పట్లో ఆనంద్ కూచిభొట్ల గారూ, కిరణ్‌ప్రభగారూ మొదలుపెట్టిన ‘సుజనరంజని’ పత్రికకి ఆయన సంపాదకులు!

అత్తలూరి విజయలక్ష్మి అనే రచయిత్రి కూడా డల్లాస్‌లో తన కుమార్తె వద్ద వుండడంతో, ఆవిడనీ పిలిచారు సదస్సుకి. ఇతర స్టేట్స్ నుండొచ్చిన వాళ్ళకి హోటల్లో బసలు ఏర్పాటు చేసారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here