Site icon Sanchika

జీవన రమణీయం-84

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఆ [/dropcap]రోజు రాత్రి ఇంటికి వచ్చేసాకా, కాంతిగారికి తీసుకొచ్చిన చీర ఆవిడకి ఇచ్చేసాకా ఆనందంగా నిద్ర పట్టింది. మరునాడు మల్లాది రఘు, శ్యామలా వాళ్ళింట్లో గెట్ టుగెదర్ పెట్టారు. జరిగిన ప్రోగ్రామ్ నెమరు వేసుకున్నాం. ఓ రచయిత్రి, “నాతో బాటు వచ్చిన రమణిగారిని చాలా ప్రత్యేకంగా చూసారు మీరు, నన్ను ఎక్కువ సేపు మాట్లాడనివ్వలేదు” అన్న అభియోగాలు మినహా ఎవరూ ఏమీ పెద్దగా కంప్లైంట్స్ చెయ్యలేదని చిట్టెన్‌రాజు గారు చెప్పారు.

మరునాడు వీళ్ళంతా కిరణ్‌ప్రభగారితో యూన మట్టీ అనే ప్రదేశానికి చూడ్డానికి వెళ్తే… నేను చిన్న కేరీబాగ్‌లో నాలుగు చీరలు పెట్టుకుని ఫీనిక్స్ వెళ్ళాను. కిరణ్ ప్రభ గారి ఆఫీస్‌లో పనిచేసే విజయ్ వేమూరి అనే అబ్బాయి నన్ను ఎయిర్‌పోర్ట్‌లో దింపాడు. ఫీనిక్స్‌లో మా మేనమామ కొడుకు శీను వుండేవాడు. వాళ్ళావిడ అనిత. ఇద్దరు ఆడపిల్లలు లాస్యా, కావ్యా వాడికి. అప్పుడు మా బాబు మావయ్య, అత్తయ్య కూడా అక్కడే వున్నారు. ఆయన పేరు మహాదేవ నియోగి, వాళ్ళవిడ నాగమణి. ఆయన్ని ‘బాబు’ అని తప్ప, అసలు పేరుతో పిలిచిన దాఖలాలు లేవు.

శీను నేను వస్తున్నానని తెలిసి చాలా ఆనందపడ్డాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఫోన్ చేసి, నేను వున్న గేట్ దగ్గరకొచ్చి తీసుకెళ్ళాడు. నేను రెండు సార్లు అమెరికా వెళ్ళినప్పుడు ఫీనిక్స్ వెళ్ళాల్సివచ్చింది. రెండవసారి ఫీనిక్స్ వెళ్ళినప్పుడు శీను అక్కడ లేదు. కానీ, బలరాం బాబాయ్ కొడుకు హరీష్ అక్కడ వుండడం వల్ల వాళ్ళింటికి వెళ్ళాను. గొల్లపూడి గారి శ్రీమతి, శివానీ ఆంటీ ఎప్పుడూ నాతో “మీ బంధువులంతా చాలా మంచివాళ్ళు. నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు” అనేవారు. నిజంగా! నేను వెళ్తున్నాను అంటే, అందరూ కూడా “మేం ఎంతో ఆనందంగా ఎదురుచూసాం…” అని చెప్పి, అది వాళ్ళ ప్రవర్తన ద్వారా కూడా చూపించారు. లీవ్ పెట్టి నాతో గడపడం, కబుర్లూ, విహారయాత్రలూ, విందులతో… అంతే కాకుండా వాళ్ళ స్నేహితులని ఇళ్ళకి పిలిచి “మా కజిన్ వచ్చింది, She is a writer” అని గొప్పగా చెప్పేవారు!

శీను వుండే ఇల్లు త్రీ బెడ్ రూమ్ ఎపార్ట్‌మెంట్. నేనూ అత్తయ్యా ఒక బెడ్ రూమ్‌లో, మావయ్య హాల్లో, శీనూ వాళ్ళు ఒక గదిలో, పిల్లలు ఒక రూమ్‌లో పడుకునే ఏర్పాటు అయింది. శీనుకి రాత్రంతా కాల్స్. అప్పుడు ఇండియాకి డే టైమ్ కాబట్టి. ఇక్కడ పిల్లలు చాలా కష్టపడ్తున్నారు అనిపించింది! పిల్లలు తల్లి తండ్రుల్ని చాలా బాగా చూసుకోవడం కూడా అమెరికాలో వున్న పిల్లల్ని చూసి నేర్చుకోవాలి.

కొన్ని కొన్ని సంఘటనలూ, అవకాశాలూ మిస్ చేసుకోకూడదు! అత్తయ్యతో సాన్నిహిత్యం నేను అక్కడ ఒకే గదిలో ఒకే మంచం మీద పడుకుని పొందాను. ఇప్పుడు అత్తయ్య లేదు! ఆవిడ చెప్పిన మాటలు మిగిలాయి…. మగవాడికి భార్య లేకపోతే కోడళ్ళ దగ్గర ఎలా  మెసలుకోవాలో నేర్పాలనీ, లేకపోతే వాళ్ళు బ్రతకలేరనీ అత్తయ్య నాతో చెప్పింది!

అసలు నాగమణి అత్తయ్య మా బాబు మావయ్య ఇంటి, పక్కింటివాళ్ళ అమ్మాయిట! ఇద్దరూ చిన్నప్పటి నుండీ, పోట్లాడుకుంటూ కలిసే పెరిగారుట. మా చిన్న అమ్మమ్మ (అమ్మమ్మ చెల్లెలు) సత్యవతికీ మణి అత్తయ్య తల్లి భానమ్మగారికీ చాలా స్నేహంట రాజమండ్రిలో. మణి అత్తయ్య, బాబు మావయ్యకి సంబంధాలు చూస్తుంటే, వారితో కలిసి ప్రతి పెళ్ళిచూపులకీ వెళ్ళి, ఆ పిల్ల ఏం బాగాలేదూ, ఈ పిల్ల బాగాలేదూ అని వంకలు పెట్టేదటా… చివరికి మావయ్య “అయితే మణినే చేసుకుంటాను” అన్నాడుట. భానమ్మగారు, సుబ్బారావు గార్లకి అప్పటికే ఆరుగురు పిల్లలు. తర్వాత అత్తయ్యతో బాటు కూడా ఆవిడకీ డెలివరీలు అయినట్టున్నాయి!

అదీ వాళ్ళ ప్రేమ కథ! అలా చిన్నతనంలో పెళ్ళి అయి అత్తవారింటికొచ్చిన అత్తయ్యకి స్వంత ఆడబిడ్దలు సావిత్రీ, చంద్రభానులు అయినా, మా పెద్దమ్మలూ, మా అమ్మ కూడా తన ఆడబిడ్డతోనే సమానంగా చూసుకునేది! అమ్మ ఇప్పటికీ తనకి 81, మావయ్యకి 83 వచ్చినా వెళ్ళి రాఖీ కట్టి వస్తుంది! మా పెద్దమ్మ కూతుళ్ళ అందరి బుట్టలూ 8 మంది పెళ్ళిళ్ళలో మేనమామగా మా నియోగి మామయ్యే ఎత్తాడు! స్వంత మేనమామలు లేరు కాబట్టి మేం వాళ్ళనే స్వంత మామయ్యా అత్తయ్యా అనుకుంటాం!

‘గ్రాండ్ కెనైన్’లో అత్తయ్య, మావయ్య, అనితలతో

శీను భార్య అనిత హౌస్ వైఫే! చక్కగా వంట చేస్తుంది. పిల్లలు సంగీతం నేర్చుకుంటున్నారు. అప్పుడు నాలుగూ, మూడూ ఏళ్ళు వుంటాయి వాళ్ళకి. ‘పెద్దమ్మ వస్తోంద’ని చాలా చెప్పినట్లు వున్నారు… నేను వెళ్ళగానే “పెద్దమ్మా” అని నన్ను పట్టుకుని వదలలేదు! “పెద్దమ్మ దగ్గరే పడుకుంటాం”, “పెద్దమ్మే జడ వెయ్యాలి” అని నా చుట్టూ తిరిగారు! అమెరికాలో పిల్లలకి ఎవరైనా బంధువులు ఇంటికొస్తే ఆనందంగా వుంటుంది! మా శీను నేనొచ్చానని లీవ్ తీసుకుని ‘గ్రాండ్ కెనైన్’ తీసుకెళ్ళాడు. అతని ఇంటి నుండి పులిహోరా, దద్ధోజనం అన్నీ చేసి తెచ్చింది! అసలు మా నాగమణి అత్తయ్య వంట గురించి ఇక్కడ ఆగి ఒక నిమిషం మాట్లాడుకోవాలి… ఆవిడ చపాతీ చేస్తే… చందమామకైనా వంకర వుంటుందేమో కానీ ఈవిడ చేస్తే వుండదు! చపాతీ మార్చకుండా పీట మీద గుండ్రంగా వత్తుతుంది… దోశ వేస్తే ఎక్కడా హెచ్చుతగ్గులు లేని సర్కిల్. కూర చేసినా, సాంబార్ చేసినా వంక పెట్టలేని నైపుణ్యం!  కొందరు పాడతారు, కొందరు బొమ్మలేస్తారూ అంటామే కాని ఈ వంట కూడా సహజంగా రావాల్సిన కళే! మా పిన్నుల్లో రామలక్ష్మి పిన్నీ, నాగమణి అత్తయ్యా, మా అమ్మా, తర్వాత తరంలో మా లక్ష్మీ, శాంతి అక్కల వంట గొప్పగా వుంటుంది. అసలు మా ఇళ్ళల్లో నాన్న వైపున  కానీ, అమ్మ వైపున కానీ అక్కచెల్లెళ్ళకి ‘వంట రాదు’ అన్న మాట లేదు! ఏయే రంగాల్లో పేరు తెచ్చుకున్నా పిల్లలకి మేమే వంట చేసి పెడతాం! అది ఒక కళగా నేర్చుకుంటాము. హాబీగా ఎంజాయ్ చేస్తాం!

బ్రహ్మ సిస్ట్, విష్ణూ సిస్ట్, శివా సిస్ట్

అలా గ్రాండ్ కెనైన్‌కి వెళ్ళాం. అదొకప్పుడు ప్రపంచ వింతలలో ఒకటి. అక్కడ ఉడతలు నిలబడితే, నాలుగు అడుగుల మనుషులంత వున్నాయి! వాటికి ఫుడ్ పెట్టడం అలవాటు చేసారేమో… అవి దగ్గరకి భయం లేకుంటా వస్తుంటే, మేమే భయపడి పరిగెత్తాం! తర్వాత ‘రాలీ’లో కూడా ఉడతలు మనుషుల్ని వెంటపడి తరమడం చూసాను నేను!

ఎర్రమట్టితో, ప్రకృతి సహజంగా కోటగోడల్లా సొరంగాల్లా ఏర్పడ్డ ఆ కందకాలనీ, లోయల్నీ చూసాం. బ్రహ్మ సిస్ట్, విష్ణూ సిస్ట్, శివా సిస్ట్ అని వాళ్ళు పేర్లు పెట్టడం నాకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఆ ఎక్స్‌ప్లోరింగ్ అంతా ఒక 3డి సినిమాగా కూడా టికెట్ కొని చూపించాడు శీను. ఆ ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాను! మన బంధువులు వుండబట్టి కదా, ఇలా పుస్తకాలలో చదువుకున్న పేర్లు గల ప్రదేశాలన్నీ చూడగలుగుతున్నాం అనిపించేది!

(సశేషం)

Exit mobile version