జీవన రమణీయం-86

6
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]సూ[/dropcap]ర్య చిట్టెన్‍రాజు గారి తమ్ముడి గారబ్బాయి. అప్పుడే క్లాసు చదువుతున్నాడో తెలియదు కానీ ‘హాయ్ రమణీ’ అని చనువుగా పలకరించి, లోపలికి తీసుకెళ్ళాడు. ముద్దుగా ఉన్నాడు పిల్లాడు అనుకున్నా. కానీ కనిపించిన ప్రతి క్యూలో నిలబడి నన్ను అన్ని ‘రెయిడ్లూ’ ఎక్కిస్తూంటే భయంతో గిలగిలలాడిపోయా! అతని వయసులో వుత్సాహానికీ నా వయసుకీ ఎలా మేచ్ అవుతుందీ? అయినా సూర్య చెయ్యి పట్టి లాక్కెళ్ళకపోతే ఎన్నో థ్రిల్స్ ఆ యూనివర్సల్ స్టూడియోస్‌లో మిస్ అయిపోయేదాన్ని!

అసలు అది ఓ అద్భుత లోకంలా వుంది. నేను రోజూ చూసే ‘డెస్పరేట్ హౌస్ వైవ్స్’ సెట్, చిన్నప్పటి నుండీ మనం చూస్తున్న కామిక్ కారెక్టర్స్ హల్క్, పపాయ్, బాట్‌మెన్ లాంటి వాళ్ళు నడిచి మన దగ్గర కొచ్చేస్తుండడం, ఇంకో పక్క కార్టూన్స్ మిక్కీ మౌస్‌లూ, డోనాల్డ్ డక్కులూ పరిగెత్తడం, పిల్లలు భయపడడం, వాళ్ళతో ఫోటోలు తీయించుకోడం భలే సందడిగా ఉంది. ‘మమ్మీ’ సినిమాకి గ్రాఫిక్స్‌కి కాను చిట్టెన్‌రాజు గారి తమ్ముడు గారబ్బాయి ఇంకొకరు ఆస్కార్ అవార్డ్ కూడా తీసికున్నారట! ఆ మమ్మీ టూర్‌కి సూర్య తీసుకెళ్ళినప్పుడు, మధ్య మధ్యలో ఆ చీకటి టన్నెల్‌లో దెయ్యాలు వచ్చేసి మొహంలో మొహం పెడ్తుంటే చాలా భయం వేసి అరిచానా… అవన్నీ ఫొటోలు తీసి బయటకొచ్చేటప్పుడు మనకి ఇస్తారు కూడానూ! అలాంటిదే జురాసిక్ పార్క్ ఒకటి. డయనోసార్స్ మరీ మొహం మీద మొహం పెట్టి, నాలిక పెట్టి నాకేస్తాయి! పెద్దవి ముక్కులోంచి ఆవిర్లు కక్కుతూ మరీ చాలా భయంకరంగా బుసలతో వస్తుంటే, గుండెలు జారిపోతాయి. నాకెంతో నచ్చిన రెయిడ్ ఓ పడవలో మేం వెళ్తుంటే, నది రెండుగా విడిపోయి, వసుదేవుడు చిన్ని కృష్ణుడు పుట్టినప్పుడు బుట్టలో పెట్టుకుని వెళ్తుంటే, యమునా నది చీలిపోయి దారిచ్చినట్టు దారివ్వడం… వరదలా నీళ్ళు ఉవ్వెత్తున లేచి మన మీద పడ్తుంటడం, అదంతా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకో ట్రెయిన్ రెయిడ్‌లో మేం వెళ్తుంటే ఓ వ్యక్తి ఇంట్లోంచి బయటకొస్తున్న ఓ అమ్మాయిని పిస్టల్‌తో కాల్చి, ఆమె పడిపోగానే, ఎత్తి డిక్కీలో వేసి, మనని చూసి, ‘ష్… ఎవరికీ చెప్పద్ద’న్నట్లు వేలు నోటి మీద వేసుకుని సైగ చేసి కార్ స్టార్ చేసుకుని వెళ్ళిపోతాడు!

మేం చిన్నప్పుడు అన్ని కామిక్స్ చదవలేదు, చందమామా, బాలమిత్రా తప్ప! మా పిల్లలు చెప్తుంటే వీళ్ళందరి గురించీ వినడమే! వాళ్ళయితే ఎంతగా కేరింతలు కొట్టేవారే కదా అనిపించి, చేతిలో వున్న ఫోన్ లోంచి మా అశ్విన్‌కి ఫోన్ చేసి “నేను యూనివర్సల్ స్టూడియోస్‌లో వున్నాను… ఈ కేరెక్టర్స్‌ని చూస్తున్నాను” అని చెప్తే, వాళ్ళు “ఎంజాయ్ మమ్మీ” అన్నారు. ఇవన్నీ పోయిన సంవత్సరం మా చిన్నబ్బాయి కృష్ణకాంత్ డిస్నీకి తీసుకెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను!

ముఖ్యంగా అప్పటి సినిమాలు ఎలా తీసేవారూ, గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్, అప్పటికి కొత్తయిన 4D ఎఫెక్ట్‌తో సినిమాలూ, అన్నీ సూర్య విపులంగా చెప్తూ చూపించాడు! మధ్యలో వాళ్ళమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ తీసి లంచ్ చేసాం. “ఐ హేట్ ఆవకాయా” అన్నాడు. నాకైతే ఆవకాయన్నం అమృతంలా అనిపించింది అక్కడ. పెరుగన్నం కూడా ఇచ్చారు. నేను సూర్యని “ఏం ఐస్ క్రీమ్ తింటావు?” అని అడిగితే, “బనానా స్ప్లిట్” అన్నాడు. బక్కెట్టెడు ఐస్‌క్రీమ్ ఇచ్చారు. నేను తినను అన్నాను. అతను కొంచెం తిని, “ఐ డోంట్ లైక్ ఇట్” అని చెత్త డబ్బాలో పారేసాడు. నేను ఉస్సూరుమన్నాను కానీ అది దాచుకునే వస్తువు కాదుగా! మొన్న కూడా అదే అయింది… డిస్నీకెళ్ళినప్పుడు, మా ఆయనా నేనూ హోటల్ వాళ్ళు ఏదో కూపన్ ఇచ్చారని బనానా స్ప్లిట్ తీసుకుంటే, పళ్ళు వున్నాయి కానీ, తీపి లేక, తినలేక పారేసాం! మనం అనుకునేట్లు పొద్దుట లేచినప్పటి నుండీ కేకులూ, ఐస్‌క్రీమ్‌లూ అన్నీ సుగర్‌తో తినరు వీళ్ళు! నాకెంతో ఆశ్చర్యం వేసేది మాత్రం ‘సలాడ్’ అనగానే బోలెడు ఆకుకూర, కేల్, క్యాబేజీ రంగురంగుల్లో, బేబీ టొమేటోస్ అవన్నీ పెద్ద పెద్ద డిష్‌లలో ఇస్తే పచ్చివే తినేసి కడుపు నింపుకుంటారు. సలాడ్ భోజనం ముందు సూప్‌లా తినరు! వాళ్ళు ఏది చేసినా అంత సిన్సియర్‌గా చేస్తారు. ‘వేగాన్’ అనే మాటా, ఆ ఫుడ్ నాకు ఫస్ట్ టైం ఈ అమెరికా ట్రిప్‌లో తెలిసాయి! నేను ఫీనిక్స్‌కి వెళ్ళినప్పుడు ఒరిజినల్ ‘రేబాన్’ కళ్ళజోడ్లు ‘పదివేలు’ ఒక్కొక్కరికీ ఖర్చు పెట్టి పిల్లలిద్దరికీ కొన్నాను. మా చిన్నబ్బాయి ఆ సంవత్సరమే విరక్కొట్టాడు. అతికిస్తే అతుకు అతుకులా కనిపిస్తోంది! పెద్దబ్బాయి అశ్విన్ ఇప్పటికీ దాచుకున్నాడు. వీడు జాగ్రత్తపరుడు! అలాగే ఐపాడ్స్ అవీ ఒక్కోటీ పదివేలు పెట్టి ఇద్దరికీ కొన్నాను… ఇంటికి రాగానే ఒకటి పోయింది… ఎవరు కొట్టేసారో నాకు తెలిసినా ఏమీ అనలేదు! పైగా ఆ శిష్యుడు ఇప్పటికీ ఇంటికొచ్చి నా మీద ఎనలేని భక్తి చూపిస్తుంటాడు! అతను ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చూస్తే తట్టుకోలేడు. అదొక క్లిప్టోమేనియక్ లక్షణం! ఇలా మా పిల్లలకి నాకు సభల్లో ఇచ్చిన డాలర్స్ అన్నీ ఖర్చు చేసి షర్ట్స్ అవీ షాపింగ్ చేసేదాన్ని. మా ఆయనకి కూడా పెర్‌ప్యూమ్స్, షర్ట్స్ కొన్నాను. అవి ఆయన ఎప్పుడూ వేసుకోలేదు! మన టేస్ట్ నచ్చదని తెలిసి, నా తర్వాత ఫారెన్ ట్రిప్‌లలో ఎప్పుడూ బట్టలు మాత్రం కొనలేదు. మా అబ్బాయిలకి నా బట్టల ఎంపిక చాల ఇష్టం! నేనేం కొన్నా ఇష్టంగా వేసుకుంటారు.

సూర్య ఉత్సాహం వల్ల నేను కాదనలేక మొత్తం యూనివర్సల్ స్టూడియోస్ నడిచి సాయంత్రానికి గాలి తీసిన  బెలూన్‌లా తుస్సులా అయి, చాలా అలసిపోయాను. మేం బయటకొచ్చేసరికీ వాళ్ళ నాన్నగారు రెడీగా వున్నారు! మేం కార్ ఎక్కి లాస్ ఏంజెల్స్‌లో మారుతీరావుగారికీ, నాకూ అక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన సభకి వెళ్ళాం! చిట్టెన్‌రాజు గారి తమ్ముడికీ, భోజనం పంపించిన రాజుగారి తమ్ముడి భార్యకీ, సూర్యకీ చాలా థాంక్స్‌లు చెప్పుకుని, హోటల్‍లోకి నడిచాను!

ఏ డయిరీలో రాసుకోని ఈ జ్ఞాపకాలన్నీ నా మనసులో భద్రపరుచుకున్నవే! అంటే ఎంత అపురూపంగా నిక్షిప్తం అయ్యాయో చూడండి!

అక్కడే నేను మన సినిమా స్టార్, ఇంకా పొలిటీషియన్ రోజా భర్త సెల్వమణి గారిని కలిసాను. ఆయన కెమెరామెన్, కొన్ని సినిమాలు కూడా తీసారనుకుంటా. చాలా సౌమ్యంగా మాట్లాడారు. మా సభ కూడా చాలా బాగా జరిగిందని వేరే చెప్పక్కర్లేదు. గొల్లపూడి గారు మంచి వక్త! ఆయన మాట్లాడ్తుంటే ఎవరైనా స్పెల్‌బౌండ్ అయిపోవాల్సిందే! నేనూ మాట్లాడాను. ఆ తర్వాత భోజనాలు. కానీ నాకైతే పక్కకి పడిపోతానేమో, అనిపించింది, అస్సలు ఓపిక లేదు! కాంతిగారూ, నందన్ వైఫ్ అందరూ చక్కగా ఫ్రెష్‌గా తయ్యారయి వచ్చారు. నేను ప్రొద్దుటనగా తయ్యారయ్యాను. మొహం కడుక్కునే టైం కూడా లేదు! ఎప్పుడు నందన్ ఇంటికి వెళ్ళి పడుకుంటామా అనిపించింది!

నా నడుము నెప్పి సంగతి ప్రతీసారీ నేను చెప్పకపోయినా, అది ఎంత హారిబుల్‌గా వుంటుందీ అంటే, ఇప్పటికీ వెనుక సపోర్ట్ లేకుండా అస్సలు పది నిమిషాలు కూడా కూర్చోలేను! సోఫాలో బ్యాక్‌రెస్ట్ వున్న ఛెయిర్‌లో కూడా గంట తర్వాత నెప్పి మొదలవుతుంది. ఆ వయసులో… ఆ వుత్సాహంలో నేను కామన్ క్లాస్‌లో అమెరికా ప్రయాణాలు ఎలా చేసానో కానీ ఇప్పుడు బిజినెస్ క్లాస్‌లో తప్ప 20, 23 గంటల ప్రయాణాలు చెయ్యడం లేదు! నా నడుము నెప్పి నరకం నా మొహం మీద కూడా చూపించను!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here