Site icon Sanchika

జీవన రమణీయం-88

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

నేను చెప్పడం మరిచిపోయాను. యూనివర్సల్ స్టూడియోలో నేను నందన్ కపుల్‌కీ, సూర్య వాళ్ళమ్మానాన్నలకీ ఆస్కార్ అవార్డ్ మోడల్‌లో బెస్ట్ కపుల్ అని వున్నవీ, లీడర్ అని రాసున్నది మరో మిత్రుడు ప్రసాద్‌కీ కొన్నాను. నిన్న అంజిగారు (చిట్టెన్‌రాజు గారి తమ్ముడు, వాళ్ళావిడ్ స్వర్ణ గారు) జ్ఞాపకం చేసి, “ఆ ‘ఆస్కారమణీ’యం ఇంకా మా ఫైర్ ప్లేస్ దగ్గర పెట్టుకుని, మనం ‘బెస్ట్ కపుల్’ అవార్డ్ కొట్టేసాం రమణిగారి దగ్గర అని ఆనందపడ్తున్నాం… సూర్య కూడా ‘I remember Ramani aunty'” అన్నాడని చెప్తే చాలా సంతోషం వేసింది. మింట్ చాక్లెట్‌లా చప్పరించిన తర్వాత వచ్చే అనుభూతి ఈ జ్ఞాపకాలు!

గొల్లపూడి గారిని ఏదో ఒక సందర్భంలో తలుచుకోకుండా ఈ జర్నీలో ఏ సంఘటన రాయడం లేదు కదా! కానీ గొల్లపూడి గారు ఈ 12వ తారీఖున అంటే డిసెంబర్ 12, 2019న కీర్తిశేషులవడం బాధాకరం!

వారిని నేను ఇన్నేళ్ళ తర్వాత ‘2008లో ఇలా అన్నారు…. ఇలా చేసారు…’ అని స్మరిస్తుండగా, ఆయన మనందరినీ విడిచి పై లోకాల్లోకి వెళ్ళిపోవడం యాదృచ్ఛికం. కానీ ఇదొక నివాళిగా నేను భావిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలుగు గాక!

కాంతి గారి గురించి కొద్దిగా చెప్పాలి. ఆవిడ చదువుకున్నది కొద్దిగానే, కానీ, పెళ్ళయినప్పటి నుండీ భర్త చెప్పించే లోకంగా, ఆయనని గురువుగా భావించి, ఆవిడ ఎన్నో నేర్చుకొన్నారు.

ఎంతెంత టెక్ సేవీలయినా, ఆవిడలా పేజ్ మేకప్ చెయ్యలేరు. అలాగే ఆవిడకి కళ్ళు టీ.వీ. తెర మీదుండి, సీరియల్స్ అన్నీ చూసేస్తున్నా, వేళ్ళు ఆగకుండా తెలుగు టైప్ చేసేయడం వచ్చు! ఎంత ఫాస్ట్‌గా చేస్తారో, ఎంత ఫాస్ట్‌గా వంట చేస్తారో, ఎంత ఫాస్ట్‌గా వాకింగ్ చేస్తారో చెప్పలేను! ఆవిడ నుండి ఎంతో నేర్చుకోవాలి అనుకుంటానే కానీ, నాకు శ్రద్ధ లేదు. ఏం చెప్పినా మనం ఆవిడ “మా ఆయన చెప్పలేదండీ ఇదీ!” అనడం నేను చాలామందికి చెప్పి నవ్వుతుంటాను. ఈ కాలంలో ఇలాంటి ఇల్లాళ్ళు తక్కువ. అంత అమాయకత్వం, అంత టెక్నాలజీ, ఎక్కడ ఏదీ మాట్లాడాలో తెలిసిన విజ్ఞతా, అతిథులను ఆదరించే గృహిణి బాధ్యతా అన్నీ కలబోస్తే కాంతికిరణ్ పాతూరి.

ఓ రోజు రాత్రి నా స్నేహితురాలు ఉమ వారి ఇంట్లో డుబ్లిన్‌లో వుండగా ఫోన్ చేసింది. దాని చెల్లెలి కూతురే పీ.వీ.సింధూ, బాడ్మింటన్ క్రీడాకారిణి! ఈ ఉమ ఆడపడుచు ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ దగ్గర కమలానగర్‌లో కాంతిగారూ, కిరణ్ ప్రభ గారి ఇంటి వెనకాల వుండేవారు. వీళ్ళకి స్వర్ణ, గోపాలకృష్ణ గారూ బాగా పరిచయం. అప్పుడు ఉమ వీళ్ళ ఇంటికి పుస్తకాల కోసం వచ్చేదిట. అందుకని అది నాకు ఫోన్ చేస్తే వీళ్ళు కూడా మాట్లాడారు. లోకం చాలా చిన్నది… నాకూ కిరణ్ ప్రభ గారికి కామన్‌గా చాలా మంది తెలుసు.

మృత్యుంజయుడు గారు నాకు శాన్‌ఫ్రాన్సిస్కో నగరం అంతా విపులంగా చూపించిన తర్వాత, మళ్ళీ ఇంకోసారి ఆ నగరం చూస్తానని అనుకోలేదు. కానీ ఆ తర్వాత ఆల్‌మోస్ట్ ప్రతీ ట్రిప్‌లో ఇప్పటికి ఐదు సార్లు శాన్‌ఫ్రాన్సిస్కో నగరం లివర్‌మోర్ టెంపుల్ చూడడానికి వెళ్తూనే వున్నాను, ఆ కాలిఫోర్నియా నగరంలోనే మా చిన్నబ్బాయి కృష్ణకాంత్‌కి వుద్యోగం రావడం వలన.

కిరణ్ ప్రభ గారింట్లో నేనున్నన్ని రోజులూ అక్కడ లోకల్ సాహితీ ప్రియులు రావడం, నాతో ముచ్చటించడం, వాళ్ళిళ్ళకి పిలవడం చేసారు. చాలా పేర్లు నేను మరిచిపోయినా, వారందరికి కూడా నా కృతజ్ఞతలు. పరాయి దేశంలో వుండి కూడా తెలుగు మీద ఇంత మక్కువ చూపడం ప్రశంసించదగ్గ విషయం. ఇప్పుడు ఎవరినైనా కలుస్తామా, “ఈవిడ ఫలానా, రచయిత్రి… తెలుగు నవలలూ, కథలూ రాస్తారు… సీరియల్స్ సినిమాలూ కూడా” అని నన్ను పరిచయం చేస్తే, భారతదేశంలో… “అలాగా! మేం ఎప్పుడూ పుస్తకాలు చదవం… సీరియల్స్ చూడం… ఒకప్పుడు పుస్తకాలు చదివే వాళ్ళం. ఇప్పుడు చదవడం లేదు!” ఇలాంటి సమాధానాలే వస్తాయి. నాకైతే ‘పుస్తకాలు చదవం’ అన్న వాళ్ళు వింత జీవుల్లా కనిపిస్తారు! పాఠకులు క్షమించాలి… నిజంగా నా ఫీలింగ్ అదే. వాళ్ళకి చిన్నప్పటి నుండీ కనీసం చందమామా, బాలమిత్రా, ట్వింకిల్ లాంటి పుస్తకాలు కూడా పరిచయం చెయ్యని ఆ తల్లిదండ్రులు ఎలాంటివాళ్ళు అనిపిస్తుంది!

నేను ఆరో క్లాసులో మా స్కూల్ లైబ్రరీలో వున్న ‘మాయా నగరం’, ‘నీలికళ్ళు’ అనే ఆంగ్లానువాదం, ‘కాంచన ద్వీపం’ చదివాను. పదో తరగతి కల్లా నవలలూ, ఇంటర్‌మీడియట్‌లో వీరేంద్రనాథ్ ఋషి, చెంగల్వపూదండా; యద్దనపూడి సెక్రటరీ, ‘సహజీవనం’; మల్లాది ‘అదిగో పులి’, ‘శనివారం నాదీ’ చదివానంటే అతిశయోక్తి కాదు!

మా పిల్లలకి మా నాన్నగారు ఆదివారం వస్తే ఆబిడ్స్ తీసుకెళ్ళి, పేవ్‌మెంట్ షాపింగ్ పేరిట బోలెడు కామిక్స్ కొనిపెట్టేవారు! మా పెద్ద అబ్బాయి అశ్విన్ దగ్గరున్న కామిక్స్ కలెక్షన్ ఎవరి దగ్గరా వుండదు! అందుకే చిన్నవాడు కృష్ణకాంత్ శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్‍లో ‘వాక్స్ పాపులీ’ అని కాలేజ్ మేగజైన్ కూడా ఎడిట్ చేసేవాడు. పిల్లలకి ఏమిచ్చినా ఇవ్వకపోయినా తల్లిదండ్రులు పుస్తకాలని పరిచయం చెయ్యాలి. గాంధీ మహాత్మునికి సత్యహరిశ్చంద్ర కథ ఇన్‌స్పిరేషన్‌లా, ఎవరికి ఏ కథ ఇన్‌స్పిరేషన్‌గా మారి వారి జీవితాలని మారుస్తుందో చెప్పలేం కదా! చిన్నతనంలో మేము మా స్కూల్ లైబ్రరీలో చదివిన ‘డేస్ అండ్ డీడ్స్’ అనే పుస్తకం నేను అమెరికాలో వెదికి, చివరికి అమెజాన్‌లో పట్టుకుని తెప్పించుకున్నాను! ఎంత మధురానుభూతో ఆ కథలు మళ్ళీ ఇప్పుడు చదువుతుంటే…

“పుస్తకాలు చదవని వాళ్ళతో మనం ఏం మాట్లాడగలం రమణీ?” అని  మా పద్మజ (మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి వైఫ్) అంటూ వుంటుంది. వాళ్ళు మా ప్రపంచంలో మనుషులు కారు అనిపిస్తుంది మాకు. పుస్తకాల వల్లే కదా నాకు ఇంతమంది తెలిసారు… నా లైఫే తీసుకోండి… ఓ స్కూల్ టీచర్‌ని… బావిలో కప్పని… ఈ పుస్తకాలు చదివే, రాయాలన్న జిజ్ఞాస మొదలై, రచయితలు, నిర్మాతలు, సీరియళ్ళు, సినిమాలు… ఇవన్నీ… లేకపోతే నేనూ నా మిగతా స్నేహితురాళ్ళు చాలామంది మల్లే…. మొగుడూ పిల్లలూ, వంటా వార్పూ తప్ప మరో లోకం తెలీకుండా వుండేదాన్ని! కాబట్టి పుస్తకాలు చదవాలి. పుస్తకాలు లోకానికి మనం పెట్టుకున్న కిటికీలు… ఏ కిటికీ తెరవాలో… ఎక్కడ అద్భుత దృశ్యాలు కనిపిస్తాయో మీకు తెలిసి వుండాలి. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదవకూడదు… కొన్ని అనవసరపు, చెత్త సాహిత్య పుస్తకాలు కూడా వుంటాయి. వుద్రేకపడే వయసుల్లో అవి నరాల మీద ఆడుకుని తప్పుదోవ పట్టిస్తాయి. ఇప్పటి సంగతి తెలీదు… మా చిన్నతనంలో ఆ సాహిత్యం కూడా ఎక్కువగానే వుండేది!

శలవలప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి మా స్నేహితులతో టైమ్ తెలీకుండా, పొద్దుట నుండీ సాయంత్రం దాకా పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్న రోజులున్నాయి. ‘మశూచికి తెలుగు వైద్యం’ అన్న పుస్తకం నేను పూర్తిగా చదివి, ఆ రోగలక్షణాలకి భయపడి జ్వరం తెచ్చుకున్నాను!

సూర్యకాంతం వంటల పుస్తకం, మాలతీ చందూర్ వంటల పుస్తకం నా దగ్గర ఇంకా భద్రంగా వున్నాయి. నేను పెళ్ళయిన కొత్తలో కూడా ఎన్నడూ ఆ పుస్తకాలు పక్కన పెట్టుకుని వంట చేసిన గుర్తు లేదు కానీ, ఇప్పుడు కిచెన్ క్యాబినెట్ మీద లాప్‌టాప్ ఓపెన్ చేసి ‘వా షెఫ్’ని చూసి పంజాబీ, మెక్సికన్, ఇటాలియన్ వంటలవీ చేస్తున్నాను!

(సశేషం)

Exit mobile version