జీవన రమణీయం-91

4
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఓ[/dropcap] ముసలి పోలీస్ వెనకనుండి తల లోపలికి పెట్టి, “అమ్మా, ఏమైంది? ఎలా వున్నావ్?” అని అడుగుతున్నాడు. నా తల బద్దలైందని నాకు అర్థమైంది. ఎవరో 108ని పిలిచారు. 108ని ప్రశంసించకుండా వుండలేను. పది నిమిషాల్లో స్పాట్ కొచ్చింది. స్ట్రెచ్చెర్ తీసుకుని ఇద్దరు నర్స్‌లూ, ఒక డాక్టర్, అందరూ అమ్మాయిలే, కారు దగ్గరకొచ్చి “దాని మీద పడుకోండి… వినిపిస్తోందా?… చూడగలుగుతున్నారా?” అని అడుగుతున్నారు. “నేను నడిచి వస్తాను. మా డ్రైవర్ ఎక్కడున్నాడు?” అని అడిగాను. డ్రైవర్ నిక్షేపంగా వున్నాడు. కాస్త చేయి గీసుకుపోయింది, అంతే! అమ్మయ్య అనుకున్నాను. నేను నడిచి 108 వ్యాన్ ఎక్కుతుంటే, చుట్టూ మూగిన జనం “ఎవరైనా చచ్చిపోయారా? అయ్యో… బాగానే వుంది” అనడం వినిపించి, అంత బాధలోనూ నవ్వొచ్చింది. మనుషులకి ఏమీ కాలేదంటే ఎంత నిరుత్సాహం? తెలీని శాడిజం వుంటుందనుకుంటా లోపల.

మా పెద్ద బాబు అశ్విన్ అమెరికా వెళ్ళిపోయాడు అప్పటికే. అందుకే మా చిన్న బాబు కృష్ణకాంత్‌కి ఫోన్ చేసాను. వాడు “అమ్మా బాలనగర్‌లోని పెద్దనాన్న ఫ్యాక్టరీ చూడ్డానికి మా ఫ్రెండ్‌తో వచ్చాను. ఏంటీ?” అన్నాడు. “నేను మన డాక్టర్ నాయక్ గారి దగ్గరకి యశోదాకి వెళ్తున్నాను. కాంతారావ్ వాటర్ ట్యాంకర్‌కి డాష్ ఇచ్చాడు. నాకేం కాలేదు… యశోదాకి రా” అని పెట్టేసాను.

వ్యాన్‌లో ఫస్ట్ ఎయిడ్ చేసారా పిల్లలు. “ఎంత గుండె ధైర్యం మేడం… ఇంత రక్తం పోతుంటే?” అన్నారు. బహుశా ఓ రెండు బకెట్ల రక్తం పోయి వుంటుంది! నేను అప్పుడే అరవింద్ గారికీ, మా అన్నయ్యకీ కూడా మెసేజ్ పెట్టాను – “ఏక్సిడెంట్ అయ్యింది, యశోదాకి వెళ్తున్నాను. అమ్మకి చెప్పొద్దు… బాగానే వున్నాను” అని.

అందరికీ మెసేజ్ పెట్టాను కానీ, నాకేం కాలేదని నాకు నమ్మకం కలగలేదు! స్పృహ తప్పుతోంది. రక్తం చాలా పోయింది కదా!

యశోదా డాక్టర్ గారికి నేను నెంబర్ ఇవ్వడం వల్ల 108 వాళ్ళు తెలియబరిచారు. దేవుడి దయవలన ఆయన డ్యూటీలోనే వుండడం వల్ల, ఛైర్ రెడీగా పెట్టి నన్ను లోపలికి తీసుకెళ్ళారు. ఎక్స్‌రేకి అరేంజ్ చేసారు.

ఈలోగా మా మౌంట్ ఒపేరా ప్రసాద్ దగ్గర పనిచేసే గిరిధర్ గోపాల్, అందరి బంధువయా ప్రొడ్యూసర్స్ నయీం, ఆర్.కే. (ఆ సినిమాలో విలన్ జంగయ్య పాత్రధారి, హైద్రాబాద్ నవాబ్స్ ఫేమ్) ఇంకా గోగూ, చంద్రసిద్ధార్థ అంతా షూటింగ్ ఆపి వచ్చేసారు. నేను ఎక్స్‌రే కని టేబుల్ మీద బోర్లా పడుకుంటే, ముక్కు లోంచి ఆగకుండా రక్తం కారి కింద మడుగు కడ్తోంది. ఎక్స్‌రేలో ఏదో క్లాట్ వుందనో, ఏదో ప్రమాదం వుంటుందనే అనుకున్నాను.

జహీరాబాద్ నుండి ఆదుర్దాగా మా ఆయన బయల్దేరిపోయారు. మా కృష్ణకాంత్ రాగానే, ఫస్ట్ ఎయిడ్ చేయించుకొచ్చిన ఈ కాంతారావ్ అనే డ్రైవర్ “నాకు ఆకలైతుంది… వంద రూపాయల్ ఇవ్వు… తినొస్తా” అని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడట! ఆ విషయం విని నేను నిర్ఘాంతపోయాను.

మరో సందర్భంలో డా. నాయక్ గారితో రచయిత్రి

నన్ను రూమ్‌లోకి తీసుకురాగానే ఆర్.కే, గిరీ, నయీం, చందూ, ఇంతమందిని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంతలో అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి, “ఎలా వున్నారు? నేను రావాలా?” అని అడిగారు. “అక్కర్లేదు. డాక్టర్ నాయక్ గారు చూస్తున్నారు” అని చెప్పాను. “సరే! ఓసారి ఇవ్వండి. డాక్టర్ గారితో మాట్లాడ్తాను” అని ఆయన డాక్టర్ గారితో మాట్లాడి “ప్లీజ్! టేక్ కేర్ ఆఫ్ హర్… మాకు చాలా ఆప్తులు” అన్నారట. అలా మొదటిసారి డా. నాయక్ గారితో మాట్లాడిన అరవింద్ గారు తరువాత ఆయన పేషంట్ అవుతారని అప్పుడు అనుకోలేదు! ఆ తర్వత మా ఆయన సాయంత్రం వచ్చారు. రిపోర్ట్స్ వచ్చాయి. మిరాక్యులస్‌గా నా తలకి ఏమీ కాలేదు కానీ అరవింద్ గారు మాత్రం నాతో గొడవ జరిగి, నేను ఏమైనా అన్నప్పుడు “ఆ కారు ప్రమాదంలో నీ తలకి బాగా గాయం అయింది. పాపం ఇలా మాట్లాడడం నీ తప్పు కాదులే” అంటూంటారు.

నేను ఎక్స్‌రే టేబుల్ మీద వున్నప్పుడు పెద్ద బాబు ఫోన్ చేసి, పరీక్షకి వెళ్ళాలి… మూడు గంటల తర్వాత నిద్ర లేపమన్నాడు. అలాగే అని… మూడు గంటల తర్వాత లేపాను.

మా ఆయన వస్తూనే నన్ను దగ్గరకు తీసుకుని “నీకు వాడి మీద అనవసరపు జాలి! చూడు అది నీ ప్రాణం మీదకు తెచ్చింది. ఇక వాడ్ని తీసేద్దాం… కారు చిత్తు చిత్తు అయిపోయిందట… అమ్మితే ముప్ఫై వేలు కూడా రాదనుకుంటా… పోనీలే, నీకేం కాలేదు. అంతే చాలు!” అన్నారు.

మరునాడు ఇంటికొచ్చేసా… అమ్మ ఏడుస్తూ వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి వాళ్ళూ వచ్చారు. అంత గందరగోళంలో వుంటే ఈ గుడ్డి కాంతారావొచ్చి “మా చెల్లె బిడ్డ పెద్ద మనిషైంది, వెళ్ళాలి… నా జీతం ఇచ్చేయ్” అన్నాడు. అప్పుడు తిట్టాను నేను, “గెట్ అవుట్” అని. కారుకి ఏక్సిడెంట్ చేశాడు. ఓ కన్ను కనిపించదని చెప్పలేదు, దాచాడు. నిన్న నేను ఆ పరిస్థితుల్లో వుంటే మా అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు కూడా నేను ఎలా వున్నానో చూడ్డానికి వచ్చాడేమో పశ్చాత్తాపంతో అనుకుంటే, లేదు, జీతం కోసం వచ్చాడు, అదీ నెల మధ్యలో. చాలాసార్లు మనం అనవసరమైన జాలి చూపిస్తూ వుంటాం అనిపించింది! అంతే… మా వారూ చూస్తే కొడ్తారు, వెళ్ళిపొమ్మని అమ్మ పంపించేసింది. నిజంగానే మా ఆయన వాడు కనిపిస్తే కొడ్తా అంటున్నారు!

ఈలోగా మాటీవీలో ‘తూర్పు వెళ్ళే రైలు’ సీరియల్ క్రూకీ తెలిసీ, మా డైరక్టర్ అనిల్ కుమార్ గారూ, కోడైరక్టర్ శశిభూషణ్ గారూ కూడా వచ్చారు. “ఎంత రక్తం పోయిందో తెలుసా? కానీ నా ఒంట్లో చాలా రక్తం వుంది… అందుకే ఎక్కించలేదు!” అన్నానని ఇప్పటికీ చెప్పి నవ్వుతుంటారు వాళ్ళు! మా పెద్ద అబ్బాయికి మర్నాడు ఫోన్ చేసి వాళ్ళ నాన్న “కంగారు పడకు… మీ అమ్మకి చిన్న ఏక్సిడెంట్ అయింది నిన్న మధ్యాహ్నం…” అని చెప్తే, “అదేంటీ? నేను మమ్మీతో నిన్న మధ్యాహ్నం మాట్లాడానుగా, తనే నన్ను లేపి ఎగ్జాంకి పంపిందీ” అన్నాడు.

“అదే మరి మీ అమ్మ మొండితనం… అప్పుడు కడవల కొద్దీ రక్తం కారుతూ ఎక్స్‌రే టేబుల్ మీద వుందట… నాకు చెప్పలేదు… మళ్ళీ మూడు గంటల తర్వాత నిన్ను ఏమీ ఎరుగనట్టే నిద్ర లేపింది” అని చెప్తే వాడు ఏడ్చినంత పని చేసి, “అమ్మని చూడాలి… వచ్చేస్తా…” అన్నాడుట. అప్పటికి వీడియో కాల్స్ లేవు. నేను బాగానే వున్నాను అని వూర్కో పెట్టాను. అసలు వాడికి చాలా బెంగ. అమెరికా వెళ్ళేటప్పుడే నేను ఎయిర్‌పోర్ట్‌లో దింపి ఇంటికొస్తుంటే, “నువ్వు రేపటి నుండీ కనిపించవు అంటే, చాలా బెంగగా వుంది” అన్నాడు. నేను వాడిని దింపి ఏడుస్తూ ఇంటికొచ్చాను. కాని ఒకటే ధైర్యం… దేశం కాని దేశం అయినా హ్యూస్టన్‌లో చిట్టెన్‌రాజుగారు వుంటారని! ఆ రాత్రంతా నేను పిల్లవాడు క్షేమంగా చేరాడు, అనే వార్త వచ్చేదాక జాగారం చేసాను. వాడి చేతిలో ఫోన్ లేదు! తెల్లవారు ఝామున మర్నాడు 24 గంటల అనంతరం, వంగూరి చిట్టెన్‌రాజుగారు ఫోన్ చేసి, “దింపుకున్నానోయ్ మీ బంగారాన్ని… ఇంటికి తీసుకెళ్ళి గోంగూర పచ్చడీ, వంకాయ కూరా వేసి అన్నం పెడ్తాను. నువ్వు లేని లోటు తీర్చలేను కానీ, దగ్గర కూర్చొని ముద్దలు పెడ్తాను” అన్నారు. అమ్మయ్య… అని గుండెలు తేలికపడ్డాయి! అసలు పరాయిదేశంలో అలా తెలిసినవాళ్ళు వుండడం… దిగగానే ఇంటికి తీసుకెళ్ళడం… తెలుగులో పలకరించడం ఎంత అదృష్టం? మళ్ళీ నాకు మంచి స్నేహితులను ఇచ్చిన ఆ దేవదేవుడికి కోటి వందనాలు! అలా మా అశ్విన్ ‘అమ్మా’ అన్నాక నా మనసు కుదుట పడింది.

అశ్విన్‌కి చాలా మొహమాటం, మా కృష్ణలా చొరవ వున్నవాడు కాదు! వాడికి రాజుగారు లాప్‌టాప్ అదీ కొని పెట్టి ఇంటికి తీసుకెళ్ళారుట!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here