జీవన రమణీయం-93

1
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]మా[/dropcap] అరవింద్ గారికి నచ్చలేదు, ఒక కారణం వలన! ఆయన కొలత బద్ద పెద్దది! దానికి ఇది ఆనదు. నేను స్నేహాన్నీ, వ్యాపారాన్నీ లంకె పెట్టలేదు ఏనాడూ. ఆయన “ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగోదు… వద్దులే” అన్నారు. “మీ ఇష్టం” అన్నాను.

మినిస్టర్ గీతారెడ్ది గారు అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా వున్నారు. నేనూ, చంద్రసిద్ధార్థ, నరేష్ గారితో కలిసి సెక్రెటేరియట్‌కి వెళ్ళి ఆవిడ్ని కలిసాం. ఆవిడకి సినిమా చూపించాం. చాలా మెచ్చుకున్నారు. “ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ తీసేస్తాను” అన్నారు. కానీ ఆ పాటికి థియేటర్స్ లేవు, సినిమా తీసేయాల్సొచ్చిన పరిస్థితి వచ్చింది! నా జాతకంలో ఏదీ ఈజీగా రాదు! ఎంతో కష్టపడాలి. విజయం వచ్చినా ధనం చేతికి రాదు! నా ద్వారా సాయం పొందిన వాళ్ళు త్వరగా నిచ్చెన లెక్కి కోట్లు గడించిన వాళ్ళున్నారు! కానీ నాకు పేరొచ్చినంత డబ్బు రాదు… ఇది జాతక ప్రభావం అనే నేను అనుకుంటున్నాను… చిత్రంగా ఎన్నడూ నేను జాతకం చూపించుకోలేదు. పిల్లలకీ చూపించలేదు. కానీ ఇలా అనుకోవలసి వస్తోంది…  రిపీటెడ్‌గా అయిన ఇన్సిడెంట్స్ వలన!

అవతలి వాళ్ళు నా భర్తా, పిల్లలు కాకపోతే, నేను కాకపోతే, నేనో మాట చెప్తే చాలు వాళ్ళకి పనులు అయిపోతాయి. నాకు మాత్రం కష్టం!

దేవా కట్టా తీసిన ‘ప్రస్థానం’ కూడా, మా ‘అందరి బంధువయా’ తోనే రిలీజ్ అయింది. రెండింట్లో శర్వానంద్ హీరో. అది బాగా ఆడింది. దీనికి బాగా పేరొచ్చింది.

అసలు ఈ ‘వెన్నెల’ డైరక్టర్ దేవాని నేను కాలిఫోర్నియాలో కిరణ్‌ప్రభ గారింట్లోనే మొదటిసారి కలుసుకున్నాను. నేను రేపు వెళ్తాననగా, భార్యా, పిల్లాడితో వాళ్ళ ఇంటి కొచ్చాడు. నాతో చాలా బాగా మాట్లాడాడు. భార్య డెంటిస్ట్. ఆ రాత్రి అక్కడే వున్నారు. ఆ అతిథి మర్యాదల్లో పడి పాపం కాంతిగారు నేను వెళ్తుంటే నాకు తినడానికి ఏవైనా ప్యాక్ చేసివ్వడం కూడా మర్చిపోయారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆకలికి మాడిపోయాను అని చెప్పానుగా! ఆ దేవా కట్టా ఇండియా వచ్చాకా నేను కనిపిస్తే ఎందుకనో ఆ స్నేహం పురస్కరించుకుని మాట్లాడలేదు! రిజర్వ్‌డ్‌నెస్ మెయిన్‌టెయిన్ చేసాడు! అమెరికాలోని ఎన్.ఆర్.ఐ.లు చాలామంది తెలుసుకోవాల్సిన విషయం – గాయనీమణులూ, నటులూ, వీరి ఇళ్ళల్లో విదేశాలలో వున్నప్పుడు చాలా స్నేహంగా, చనువుగా, గారాలు పోతూ, “మాకు పులిహోర చేసి పెట్టరా? ఆవకాయ వుందా?” అని చేయించుకు తింటారు కానీ, వీళ్ళు ఇండియా వచ్చాం అని చెప్పినా, మళ్ళీ టైం చేసుకుని వీళ్ళ కోసం రావడం, కలవడం అదీ వుండదు! నేను చాలామందిని చూసాను.

నాకు బాబాయ్ హోటల్, బోయ్‌ఫ్రెండ్ సినిమాల్లో హీరో సాయికృష్ణ ఫ్రెండ్, తమ్ముడితో సమానం. అతని పెళ్ళి అయ్యేదాక అలాగే వుండేవాడు పాపం! వాళ్ళ అమ్మగారు నాతో చెప్పేవారు. అంకుల్ ఉద్యోగ రీత్యా ఊటీలో వున్నప్పుడు పెద్ద పెద్ద హీరోలు, పేర్లు ఎందుకు గానీ, సాయి వెళ్ళి తీసుకొస్తే ఇంటికొచ్చి ఫ్యామిలీతో పాటు వుండిపోయి, “మంచి తెలుగు ఫుడ్ దొరుకుతోంది… ఆ పాడు హోటల్స్‌లో ఏం వుంటాము లెద్దూ?” అని ఆంటీ చేత మసాలా దోశలూ, చికెన్ ఫ్రైలూ చేయించుకొని తిని, మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ వచ్చి ఫోన్ చేస్తే ఆ కబుర్లూ, ప్రామిస్‌లూ అన్నీ మరిచిపోయి అసలు ఫోన్ ఎత్తే వాళ్ళే కారుట! అయినా ఎన్.ఆర్.ఐ.లు… అదీ తెలుగు వాళ్ళు ముఖ్యంగా తెలుగు సినిమానే వూపిరిగా బతికేవాళ్ళు చాలామంది, అక్కడ కూడా అభిమాన సంఘాలు నడిపించుకుంటూ, వాళ్ళ గురించిన వెబ్ న్యూస్ ఫాలో అవుతూ, సెలెబ్రిటీస్ ఎవరొచ్చినా ఆదరిస్తూ చాలా ప్రేమగా చూసుకుంటారు.

కొంతమంది అది ఎడ్వాంటేజ్‌గా తీసుకుని, షాపింగ్‌లకి తీసుకెళ్ళమని, ఆ బిల్‌లు వాళ్ళకి వేసే పేరున్న సెలెబ్రిటీలని కూడా చూసాను! వాళ్ళు దేశం కాని దేశంలో కష్టపడి సంపాదించిన డబ్బు ఏదో సినిమా వ్యామోహంలో వీళ్ళని ఇళ్ళలో పెట్టుకుంటే, ఉల్ఫాగా ఖర్చు పెట్టించడం, ఎంజాయ్ చేయడం చాలా తప్పు! వీరేంద్రనాథ్ గారు ఓ సారి ఓ ప్రముఖ సింగర్, తన గదిలో ఫోన్ పని చేయడం లేదని, ఈయన గది తలుపు తట్టి, కాఫీ ఆర్డర్ చేయమని చెప్పి, వచ్చాకా తాగి, తను, “నా గదిలోంచి ఆర్డర్ ఇవ్వలేదుగా, నేను బిల్ కట్టను… ఆయననే కట్టమనండి” అందని చెప్తే ఆశ్చర్యపోయాను.

కానీ నా చిన్నప్పటి నుండీ నాకు ఒకటే ప్రశ్న! మన రేషన్ కార్డ్‌లో లేని వాడికి ఖర్చు పెట్టకపోవడం ఆదా అనిపించుకుంటుందేమో! కానీ స్వంత భార్యకీ, పిల్లలకీ…. అంతెందుకూ తన కడుపుకి తినకుండా, తనని తాను సుఖపెట్టుకోకుండా దాచుకున్న డబ్బు ఏం చేద్దాం అని? అది పిసినారితనమేగా… తను పోయాకా ఎవరు అనుభవిస్తారో తనకి తెలీదు… ఎందుకీ వుండీ దారిద్ర్యం? ధనవంతుల గురించే నేను అనేది… లేని వాళ్ళు పొదుపుగా వుండడం, జాగ్రత్త పడడం తప్పు లేదు! నా చేతికి ఖర్చు ఎక్కువ…. వచ్చినదంతా కాకపోయినా, చాలా వరకు హాయిగా ఫ్రెండ్స్ కోసం, నా యిష్టమైన ఛారిటీస్ కోసం, నా కంఫర్ట్స్ కోసం ఖర్చు చేస్తాను. నా నడుం నెప్పి వలన నేను బిజినెస్ క్లాస్‌లో తప్ప ప్రయాణించడం లేదీ మధ్య! లేకపోతే వెళ్ళను అంతే! అలాగే నా భర్త కూడా ఏదైనా వూరు వెళ్తే బంధువులు వున్నా కూడా హోటల్‌లో స్టే చెయ్యడానికే ప్రిఫర్ చేస్తారు! ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనీ, నేను హోటల్ రూమ్స్‌లో వుండడం ఇష్టపడ్తాననీ, రెండు కారణాలు!

‘అందరి బంధువయా’ వల్ల నేను అనుభవించిన తృప్తి మాత్రం చాలా ఎక్కువ! యూత్ కూడా నేను ‘అందరి బంధువయా’కి కథా, మాటలూ రాసానని చెప్తె, కొంచెం గౌరవంగా చూడడం, ఆ సినిమా తమకి చాలా ఇన్‌స్పిరేషన్ అని చెప్పడం చాలా జరుగుతూ వుంటుంది.

క్రియేటివ్ కన్సల్టెంట్‌గా మాటీ.వీ.లో నేనింకా వుద్యోగం చేస్తున్నా అని చెప్పాగా! ఆ ఉద్యోగం అరవింద్ గారి దయవలన… ఆ వుద్యోగం చేస్తూనే, నేను ‘తూర్పు వెళ్ళే రైలు’కి మాటలు రాసాను. ‘అశ్వనీకృష్ణ’ పేరుతో ఆ మాటలు రాసాను. కానీ ఒక స్త్రీ మాటీ.వీ.లో వుద్యోగంలో చేరి, నా వుద్యోగానికి ఎసరు పెట్టింది! ఆవిడ ఇప్పటికీ నాకు స్నేహితురాలే అవడం విచిత్రం… నేను తన వల్ల నా వుద్యోగం ఊడిపోయిందని తెలిసి కూడా అవిడని క్షమించాను! ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ చాలా మిజరబుల్‌గా వుండేది… పిల్లలూ, భర్తా, అన్ని విషయాల్లో… నాకు అదే జాలి! అందుకే  నా వుద్యోగం పోయినా ఏమీ అనలేదు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here