Site icon Sanchika

జీవన రమణీయం-94

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]ను సీరియల్‍కి ప్రతి నెలా ఓ లక్ష దాకా సంపాదించడం, మళ్ళీ ఇక్కడ జీతం తీసుకోవడం, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఆవిడకి కంటగింపుగా వుండేది!

నాకు సాయిప్రసాద్ అని వైస్ ప్రెసిడెంట్‌తో మంచి ఫ్రెండ్‌షిప్ వుండేది. ఒకనాడు ఆవిడని నేను హోటల్‌కి తీసుకెళ్ళాను. సాధారణంగా ఆవిడ్ని ఇంటి దగ్గర దింపేదాన్ని. అదేదో బస్తీ! మా డ్రైవర్ కుమార్‌కి ఎందుకో మొదటి నుండీ ఆవిడంటే ఇష్టం వుండేది కాదు! “మేం అటు పోతలేము” అనేవాడు, ఆవిడ కారు దగ్గరకి లిఫ్ట్ అడగడానికి రాగానే. నాకు అపరిమితమైన జాలి అని చెప్పాను కదూ… అదే నా కొంప ముంచింది!

“మనం అటెళ్ళి దింపే వెళ్దాం” అనగానే కుమార్ నోరు మూసుకునేవాడు పాపం!

ఆ రోజు  మేం జుబ్లీహిల్స్‌లో వున్న చట్నీస్ హోటల్‌కి వెళ్ళాం. ఆవిడ పన్నీర్ దోశ తింటానంది. నాకు పన్నీర్ నచ్చదు. మసాలా దోశ చెప్పాను. ఎంతో స్నేహంగా మాట్లాడుతున్న నాతో ఆవిడ “సాయిప్రసాద్ మంచివాడు కాదు, మీ ముందు స్నేహంగా ఉన్నట్టు నటిస్తాడు… వెనకలా మిమ్మల్ని జాబ్ రిజైన్ చెయ్యమని చెప్పమని నన్ను పోరుతున్నాడు” అని స్టార్ట్ చేసింది.

సాయిప్రసాద్‌కి నాతో వున్న చనువుకి అలా వెనకాల ఎందుకు చెప్పాల్సొచ్చిందో నాకు అర్థం కాలేదు… ఆ తరువాత ఆవిడ్ని ఇంటి దగ్గర దింపుతున్నప్పుడు నా చెయ్యి పట్టుకుని “నీకు ఇంకో విషయం కన్ఫెస్ చెయ్యాలి. మన సి.ఈ.ఓ శరత్ మరార్ గారితో నీకూ, అరవింద్ గారికి వున్న స్నేహం వల్ల నీతో కలిసి పని చేయడం ఇబ్బందిగా వుంటోంది… నువ్వు అన్నీ ఆయనకి చేరేస్తున్నావ్ అని చెప్పాను… పైగా నువ్వు ఇక్కడ వుద్యోగం చేస్తూ సీరియల్ కూడా చేసి డబ్బు సంపాదిస్తున్నావ్ అని కంప్లైంట్ చేసాను. ఆయన నిన్ను రిమూవ్ చేసేస్తారేమో… సారీ!” అంది.

నేను షాక్ తిన్నాను. “అలా ఎందుకు చేసావ్?” అని అడిగాను.

“నీకొచ్చే ఇంపార్టెన్స్ నేను చూడలేక” అంది.

నేను నవ్వి చెప్పాను, “నాది వుద్యోగం కాదు, కాంట్రాక్ట్… ఎప్పుడైనా రద్దు చేసుకునే అధికారం వాళ్ళకి వున్నట్టు అపాయింట్‍మెంట్ ఆర్డర్‌లో రాసి వుంది. నేను సీరియల్ చెయ్యకూడదన్న నిబంధన లేదు! అరవింద్ గారే ఈ ఉద్యోగం వేయించారు… నువ్వు కొత్తగా నా గురించి మేనేజ్‌మెంట్‌కి చెప్పాల్సిందేం లేదు.. ఇవన్నీ వదిలేస్తే నీకు నా మీదున్న జెలసీని నువ్వు ఇంత ఓపెన్‌గా ఒప్పుకోవడం నాకు నచ్చింది! నువ్వు ఈ రోజు ఆ సీట్‌లో కూర్చుంటే క్రియేటివ్ హెడ్, రేపు నువ్వు సాయిప్రసాద్ వుద్యోగం కూడా తీయిస్తే వైస్ ప్రెసిడెంట్ అయిపోవచ్చు… కాని నేను ఎప్పటికీ బలభద్రపాత్రుని రమణినే! నా స్థానం వేరు… ఎక్కడ వున్నా ఏం చేసినా…” అని.

“అమ్మయ్యా… ఇంక ఈ రోజు నేను నిశ్చింతగా నిద్రపోతాను. ఎందుకంటే నువ్వు నన్ను క్షమించినట్టే!” అంది. ఆవిడ మా ఇంటికొచ్చి ఈయన్నీ, నన్నూ, పిల్లల్నీ చూసి “ఎంత హేపీ ఫ్యామిలీ రమణీ… నాకు కన్ను కుడ్తోంది” అంది. జోక్‌గా అందని అనుకున్నాను. అసలు ఏదీ మనసులో పెట్టుకోకుండా కనీసం సమాజ భీతి లేకుండా ఎలా మాట్లాడ్తారో… స్కాండల్స్ క్రియేట్ చేస్తారో కదా!

మా డ్రైవర్ ఆవిడని దించాకా, “ఆమె ఏదో పాడు పని చేసినట్టే వుందమ్మా, మీరు చెప్పకపోయినా. ఏం చేసింది? దొంగ పిల్లి మొకం ఆమెది” అన్నాడు.

“నీకు వెనుక సీట్‌లో మాట్లాడుకునే మాటలు వినడం చెడ్డ అలవాటు! మానుకో…” అని తిట్టాను.

నా చాతకానితనం ఆవిడ రూపంలో “నీ దగ్గర అప్పులు తీసుకొంటూ, నీ కార్లో రోజు లిఫ్ట్ తీసుకుంటూ, నీ వుద్యోగం సక్సెస్‌ఫుల్‌గా తీయించేసా… నీ వెనకాల ఎంత పెద్ద పెద్ద వాళ్ళున్నా…” అని చెప్పి ధిలాసాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.

“మనుషుల్ని నువ్వు ఈజీగా నమ్మేస్తావ్” అంటారు మా ఆయన. నేను నమ్మడం ఏమీ లేదు, వాళ్ళు హాని చేస్తున్నారని నాకు కళ్ళ ముందు కనబడినా ఏమీ పరుషంగా ఒక్క మాట కూడా అనలేను! పై సంఘటనలో ఆవిడ “నేనే కారణం నీ వుద్యోగం పోడానికి” అని చెప్పినా నేనేం అనలేదు… గర్వపడ్డాను… ఎందరో ఈర్ష్య పడే స్థాయిలో నేనున్నాను అన్నమాట! అనుకుని. పైగా అసలేం చెయ్యాలి… అసలే మొగుడు పోయి, పిల్లలు ప్రయోజకులు కాక, ఆవిడతో మాటాడక ఒంటరిని చేసేస్తే, ఎప్పుడూ ఏడుస్తూ వుండేది. ఉన్నప్పుడు కూడా భర్తకి వేరే స్త్రీలతో సంబంధాలుండేవి అని చెప్పింది. అవన్నీ వినడం వలన నాకు జాలి! ఏమీ అనలేను!

ఇంట్లో నేనీ విషయం ఎవరికీ చెప్పలేదు! డబ్బులు పోతాయి అని ఏనాడు బాధపడలేదు. కానీ నమ్మినవాళ్ళు ఏ మాత్రం అన్యాయం చేశారన్న తలంపు వచ్చినా తట్టుకోలేను! సాయిప్రసాద్‌కి ఫోన్ చేసి ఆవిడ చెప్పిన మాటలు అడిగాను. “నేను అనలేదు… ఎవరి మీద ఒట్టు పెట్టనూ?” అన్నాడు. “అనలేదు… అంటే చాలు… ప్రూఫ్‌లు అడగను” అన్నాను.

వేరే సందర్భంలో అల్లు అరవింద్ గారితో రచయిత్రి

మరునాడు సి.ఈ.ఓ. శరత్ మరార్ గారు పిలిచి చాలా నాటకీయంగా మాట్లాడ్తూ “మీకు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌తో వున్న స్నేహం కారణంగా…” అని చెప్పబోతుంటే… “శరత్… బికాజ్ ఆఫ్ హిమ్, ఐ గాట్ దిస్ జాబ్… బికాజ్ ఆఫ్ హిమ్, ఐ ఏమ్ లూజింగ్… నో రిగ్రెట్స్…” అన్నాను.

“కాదూ అని వాదించరా?” ఆయన తెల్లబోతూ అడిగాడు.

“హీ ఈజ్ మై ఫ్రెండ్. కాదూ అని చెప్పాలా ఈ ముష్టి జీతం కోసం?” అని అడిగాను. ఆయన ఇంకా తెల్లబోయి, “ఈ సీరియల్ కూడా వేరే పేరుతో రాస్తున్నారు.. ఒప్పుకుంటారా?” అడిగాడు. “మా పిల్లల పేర్లతో నేనే రాస్తున్నాను. దానికి ఉత్తమ స్క్రీన్ ప్లేకి యువకళావాహిని అవార్డు కూడా తీసుకున్నాను” అని చెప్పాను.

“దట్సాల్” అన్నాడాయన. నేను లేచి వచ్చేస్తుంటే – “you have guts, I like it” అన్నాడు.

ఇప్పుడు కూడా శరత్ మరార్ గారు నాకు మంచి మిత్రులు! మొన్నే ఓ సబ్జెక్ట్ కొని సినిమా కోసం పెద్ద మొత్తంలో ఎడ్వాన్స్ ఇచ్చారు.

నేను చాలా బాధ పడ్దాను. నాకు మెయిల్‌లో “మీతో వున్న కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటున్నాం…” అని శరత్ మరార్ గారి సంతకంతో లెటర్ వుంది.

నేను అరవింద్ గారికి ఫోన్ చేసాను. నా కాల్ రిసీవ్ చేసుకోలేదు ఆయన. నేను బాధపడింది ఈ విషయానికి. నా వుద్యోగం పోయినందుకు కాదు! శరత్ మరార్ గారు ఆయనకి చాలా దగ్గర… ఈయన్ని ఫాదర్‍గా చుస్తాడు. ఈయనికి చెప్పకుండా ఎటువంటి స్టెప్ తీసుకోడు! ఈయన నన్ను “నువ్వు రిజైన్ చెయ్యి” అంటే చేసి వుండేదాన్ని. అవమానం చేయించాడు అని అప్పట్లో వుక్రోషంగా అనిపించింది. తర్వాత ఆయన ఫోన్ చేసారు, నేను నోరు జారి అంత పెద్దమనిషిని కూడా లెఖ్ఖ చెయ్యక మాట్లాడాను. అది నా తప్పే! తర్వాత ఆయన ఆ విషయానికి అపాలజీ చెప్పాలని ట్రై చేసినా “అది రికార్డ్స్ నుండి తుడిపేద్దాం” అన్నారు… స్నేహం కంటిన్యూ అయ్యింది. కాని అప్పట్లో మా ఇద్దరి మధ్య అక్షరాలా మూడు నెలలు మాటల్లేవు….

(సశేషం)

Exit mobile version