జీవన రమణీయం-97

0
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]”మీ[/dropcap]రేవిటీ పెళ్ళికొచ్చి ఇన్ని రోజులుండిపోయారు?” అన్నారాయన. “పదహారు రోజుల పండుగ కూడా చూసి వద్దాం అనీ” అన్నాన్నేను. ఆయనతో వల్లభ, వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. అతనికి సాయి చెల్లెలు బీనా చాలా క్లోజ్! వల్లభ నా కథతో తీసిన ‘ఎవరే అతగాడు’లో హీరో. అదే రోజున ఇక్కడ అల్లు అరవింద్ గారింట్లో అల్లు అర్జున్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. మాకొచ్చిన విభేదాల కారణంగా ఆయన నాతో మాట్లాడ్డం లేదు! కానీ ముంబై వెళ్ళే ముందు ఆయన పి.ఎ.తో ఫోన్ చేయించి, “పోవైలో వున్న నా ఫ్లాట్ ఖాళీగానే వుంది… కావాలంటే వుండచ్చు” అని వర్తమానం పంపారు. నేను ఫోన్ ట్రై చేసాను. లిఫ్ట్ చెయ్యలేదు. నేను అభిమానం పొడుచుకొచ్చి వాళ్ళ పి.ఎ.తో “నాకు స్టార్ హోటల్‌లో రూమ్స్ బుక్ అయ్యాయి…. ఆయన శ్రమ తీసుకోనక్కర్లేదు” అని సమాధానం చెప్పాను. ఆ ఫ్లాట్ లోనే సాయికృష్ణని మూడు నాలుగు నెలలు వుండమన్నారు గతంలో నేను చెప్పానని.

మా సుమిత్ర, “ఇంకా నయం! మీరిద్దరూ స్నేహంగా వుండి వుంటే ఆ ఫ్లాట్‌లో మనం చీపురుతో వూడ్చుకుంటూ వుండాల్సొచ్చేది, ఇలా స్టార్ హోటల్‌లో రాజభోగాలు లేకుండా” అంది. నేను నవ్వి వూర్కున్నా కూడా, మనసులో మాత్రం ఈ మాటీవీ వుద్యోగం వల్ల మా స్నేహం మధ్య ఇలాంటి అగాధం ఏర్పడిందేంటబ్బా అని చాలా బాధగా వుండేది.  సుమిత్ర ఆ టైమ్ లో నాకు మంచి స్నేహం అందించింది. స్వంత తమ్ముడున్నా ఇంత బాగా చూసుకుంటాడో లేదో! సాయి పెళ్ళి అయ్యాకా కారిచ్చి మహాలక్ష్మి మందిరం, తాజ్ హోటల్, అన్నీ చూపించాడు. చాలా సంతోషంగా నేను సుమిత్రా హోటల్ గదే కాదు మనసులూ విప్పుకుని పంచుకుని, ఇంకా ఫ్రెండ్స్ అయ్యాం ఈ ట్రిప్‌లో.

ఆ తర్వాత నేను మళ్ళీ టీ.వీ. సీరియల్స్‌లో బిజీ అయ్యాను. కొంతకాలం నవలలు రాయలేదు. నాకొచ్చిన టీ.వీ. అవకాశాల వల్ల నేను నవలా రచనకి బాగా దూరం అయ్యాను.

మా అబ్బాయి అశ్విన్ మధ్యలో హ్యూస్టన్ నుండి శలవలకు ఒకసారి వచ్చి వెళ్ళాడు. అప్పుడు మేం ఇద్దరం వాకింగ్‌కి వెళ్తూ చాలా మాట్లాడుకునేవాళ్ళం! వాడు అప్పుడూ ఇప్పుడూ కూడా అంటాడు “నాకు ఏదైనా కష్టంగా అనిపించినప్పుడు నిన్నే తలచుకుంటానమ్మా… ఏదీ అసాధ్యం అని ఎన్నడూ అనుకోలేదు నువ్వు” అని.

చిన్నబ్బాయి కృష్ణకాంత్ ఇంజనీరింగ్ పూర్తి అవుతుండగానే, వాడికి హుండై‌లో జాబ్ వచ్చింది. కాని ఎందుకో ఆ జాబ్ వాడికి నచ్చలేదు! అయిష్టంగానే వెళ్ళేవాడు. చివరికి మానేసాడు. అప్పుడు నాకు మళ్ళీ మా సాయికృష్ణ గుర్తొచ్చాడు. “సాయీ నీ దగ్గరకి పిలిపించుకో కృష్ణని” అన్నాను. అప్పుడు బిర్లా కాన్సెప్ట్ స్కూల్స్ ‘శ్లోకా’కి సీ.ఇ.వో.గా చేస్తున్నాడు కదా! “కృష్ణని బిర్లా సోలార్ ప్లాంట్‌లో పెడ్తా, పంపించండి” అన్నాడు.

అలా కృష్ణ పూనేలో వుద్యోగానికి వెళ్ళాడు. డిసెంబరు 31. తెల్లారితే న్యూ యియర్స్ డే. చాలామంది రాత్రి 12కే  నన్ను విష్ చేసే స్నేహితులున్నారు. ఫోన్‌కి విరామం లేదు! ఆ సమయంలో నా సెల్ ఫోన్‌లో అరవింద్ గారి పేరొచ్చింది… విస్తుపోయాను. “Happy new year… జరిగిందింతా రికార్డ్స్ లోంచి తుడిపేద్దాం… మనం మళ్ళీ ఎప్పటిలా స్నేహం కంటిన్యూ చేద్దాం” అన్నారు.

జీవితంలో చాలా తక్కువ సార్లు అంత ఆశ్చర్యానందాలు పొందాను. అనుకోని గిఫ్ట్!

ఇది జరిగిన వారం లోనే మేం ఒక హోటల్‌లో భోజనం చేసాం. అప్పుడు, “నాకో మాట ఇవ్వాలి…. ఎప్పుడూ మాటీవీ గురించి మాట్లాడకూడదు” అన్నారు. నేను “సరే” అనేసాను.

నేను అంత మాటకి విలువిచ్చి ఆ విషయం ఎత్తకుండా వుండలేదు అనుకోండీ! కానీ ఆయన పద్ధతి అది! ఏదైనా రికార్డుల్లోంచి తుడిపెయ్యాలి అంటే తుడిపెయ్యాలి! మళ్ళీ ఆ విషయం ఎత్తకూడదంటే ఎత్తకూడదు! కానీ ఇచ్చిన మాటకి నిలబడ్తారు. స్నేహానికి విలువిస్తారు.

కానీ ప్రొఫెషనల్‌గా నాకు ఎప్పుడూ సాయం చెయ్యలేదు. నేను సంపాదించుకున్న సీరియల్స్, సినిమాలు, అన్నీనూ స్వయంకృషితోనే.

మళ్ళీ రామానాయుడు గారి కాంపౌండ్‌కి వెళ్ళి ఓ కథ చెప్పాను. నలుగురు యువకుల వల్ల, తన పల్లె అడాప్ట్ చేసుకుని బాగుచేసుకోవాలని వెళ్ళే NRIకి కాళ్ళు పోయి, ఏక్సిడెంట్‌లో… ఆ యువకులని తన కాళ్ళ బదులు ఇమ్మని హ్యూమన్ రైట్స్ కమీషన్‌ని అడిగే కథ అది. నాయుడి గారికి వినగానే చాలా నచ్చేసిందీ కథ! నేను రామానాయుడి కాంపౌండ్‌లో కుర్చుని చాలామంది డైరక్టర్లతో ఆ కథకి వర్క్ చేసాను. కానీ కొన్ని కొన్ని కలిసి రావు!

అనిల్ రావిపూడి అప్పట్లో డైరక్టర్ అవ్వాలని ఓ కథ చేసుకుని, సురేష్ కాంపౌండ్‌లో రానా కోసం ట్రై చేస్తున్నాడు. ప్రసాద్ అనే డైరక్టర్ నాతో కూర్చుంటూనే, నా వెనుక గోతులు తీసాడు. వేరే కథ చేసి నాయుడు గారికి చెప్పి, నన్ను తీయించి, ఓకే చేయించుకున్నాడు. అనిల్ నాకీ విషయం చెప్పాడు. నాకీ విషయంలో పెద్ద కోపం రాలేదు! నా కథ క్లైమాక్స్ సెట్ అవనప్పుడు పెద్దాయన ఎంతకాలం ఎదురు చూస్తారు పాపం? ప్రతీ ఏడూ ఓ సినిమా రిలీజ్ అవ్వాలి ఆయనకి.

నేను ఇంటి కెళ్ళిపోయాను. సాయంత్రం నాయుడు గారు నాకు ఫోన్ చేసి “కోపం తెచ్చుకోకు… నువ్వు ఆ సినిమాకి పని చెయ్యి” అన్నారు. “ఆ డైరక్టర్ తీరు నాకు నచ్చలేదు, నేను అతనితో వర్క్ చెయ్యను” అన్నాను. ఆ సినిమానే ‘కౌసల్య సుప్రజా రామా’ అని వచ్చి వెళ్ళింది. మధ్యలో  ‘మీ శ్రేయోభిలాషి’ డైరక్టర్ ఈశ్వర్‌రెడ్డి గారితో కలిసి ‘స్వర్గ సీమ’ అనే కథ చాలా సిట్టింగ్‌లు చేసాను. అతనో తీరు! మనిషి చాలా మంచివాడు కానీ వర్కింగ్ స్టైల్ నాకు నచ్చలేదు! రోజు ఒకసారి నా చేత కథ చెప్పించేవాడు. అదంతా రికార్డ్ చేయించి సాయంత్రం హరికథా కాలక్షేపంలా అందరికీ వినిపించేవాడు. అలా వినిపించి, వినిపించి ఆ కథ నా చేతి లోంచి పోయి, వేరే వాళ్ళు కాపీ కొట్టి సినిమా తీసేసారు!

నేను మళ్ళీ నంది అవార్డుల కమిటీలో రెండు సార్లు జ్యూరీ డ్యూటీ చేసాను. ఒక కమిటీలో శారదా అశోకవర్ధన్ గారూ, సుమిత్రా పంపనా, సుబ్బరాయశర్మగారూ, అడబాల గారూ, కొమ్మనాపల్లి గణపతిరావు గారూ, కల్చరల్ కమిటీలకు చెందిన ఇద్దరూ వుండేవారు.

కొమ్మనాపల్లి గారూ నేనూ రోజూ జోక్స్ వేసుకుని, సీరియల్స్ చూస్తూ తెగ నవ్వుకునేవాళ్ళం… ముఖ్యంగా దేవరాజు రవి గారూ, ఇంకా ఆయన గురించి కొమ్మనాపల్లి గారు బాగా మిమిక్రీ చేసి నవ్వించేవారు. అందరూ చాలా స్పోర్టివ్‌గా తీసుకునేవారు.

ఈలొగా రామానాయుడు గారు సుబ్బిరామిరెడ్డిగారికి చెప్పి నన్ను సెన్సార్ బోర్డ్‌లో మెంబర్‌గా వేయించారు.

సెన్సార్ బోర్డ్‌లో లేడీ రీజనల్ ఆఫీసర్ వల్ల నేను పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here