జీవన తరంగాలు

0
2

[dropcap]“గు[/dropcap]మ్మంలో గూడుబండి ఆగింది. ఎవరొచ్చేరో చూడండి.” వీధికెదురుగా లోపలి వరండాలో పడకకుర్చీలో ఆసీనుడయి ఉన్న సీతారామాంజనేయ శర్మ గారు చుట్ట త్రాగుతూ గట్టిగా ఓ కేక వేసేరు.

“బుచ్చి మావయ్య వచ్చేడు నాన్నా.” పొలంనుండి అప్పుడే వస్తున్న పెద్దకొడుకు సత్యనారాయణ మూర్తి జవాబు చెబుతూ, వాకిట్లో ఇత్తడి గంగాళంలో ఉన్న నీళ్ళనుండి ఓ చెంబుడు నీళ్లు, ప్రక్కనే ఉన్న వరండాలో వెదురు దండేనికి వ్రేలాడుతున్న నాగుల గావంచాతో, మెట్లమీద నిలబడి ఉన్నమామయ్యకు ఆహ్వానం పలుకుతూ కాళ్ళ మీద నీళ్లు పోసి గావంచా అందించేడు.

“ఏరా, పొలంనుండేనా రావడం.” కాళ్ళు తుడుచుకొని మేనల్లుడి భుజం తడుతూ బావగారిని సమీపించి ఆయనకు పాదాభివందనం చేసి ప్రక్కనే ఉన్న కుర్చీలో ఆసీనుడయ్యేడు శంకర శాస్త్రి. శర్మ గారు బావమరిదిని కుశల ప్రశ్నలు వేస్తుండగా వంటింట్లోనుండి ఇంటి ఇల్లాలు విజయలక్ష్మి వచ్చి “శంకరం, ఇదేనా రావడం. అక్కడ అంతా బాగున్నారా.” అని యోగక్షేమాలు చేస్తూ భర్త ప్రక్కనే వినయంగా నిలబడ్డాది.

“అందరు క్షేమమే. దారిలో పెద్దక్కయ్యని చూసి వచ్చేను.”

“ఎలా ఉందిరా జానకి.”

“ఫరవాలేదు. వయసు మళ్లింది కదా. తలనొప్పని, నడుంనొప్పని ఉండుండి ఏవో వస్తూ ఉంటాయంది. మొత్తానికి బాగానే ఉంది. కోడళ్ళయిదుగురూ బాగా చూసుకొంటున్నారంది.”

“అదే మనకు కావలిసిందిరా.”

“విషయాలు తీరికగా మాట్లాడుకోవచ్చు. రెండుగంటలు కావస్తోంది. భోజనాల ఏర్పాట్లు చెయ్యండి.” అని శర్మ గారు సలహా ఇచ్చేరు.

“విశాలా, భోజనాల ఏర్పాట్లు చెయ్యమని సింహాద్రిగారితో చెప్పమ్మా.” పెద్దకోడలికి ఓ కేక వేసి, “ఈలోపుల మీరు కాళ్ళు చేతులు కడుక్కురండి.” అంటూ తనూ భోజనాల హాలు చేరుకొంది విజయలక్ష్మి.

పెద్దవాళ్ళకు వెండికంచాలు, వెండిగిన్నెలలోను, పిల్లలకు అరిటాకులలోను వడ్డనలు జరిగేయి. విశాలాక్షి నిలబడి విసనకర్రతో మామగారికి, ప్రక్కనే ఉన్న శంకర శాస్త్రికి నెమ్మదిగా విసరనారంభించింది. పర్యవేక్షణ చేస్తున్న ఇంటి ఇల్లాలు “సింహాద్రిగారూ, చిన్న వంటింట్లో అరుగుమీదున్న పెద్ద రాచ్చిప్పలో చింతకాయ పచ్చడుంటుంది, వడ్డించండి.” ఆదేశం జారీ అయింది.

మగవాళ్ళవి, పిల్లలవి భోజనాలయ్యేయి. సీను మళ్ళీ వరండాలోకి మారింది. శర్మగారు తన యథాస్థానం, వాలుకుర్చీలో వాలిపోయేరు. ప్రక్కనే శంకరశాస్త్రి వినయంగా కుర్చీలో ఆసీనుడయ్యేడు. ఇంతలో రెండో కోడలు పద్మావతి ఆకులూ, చెక్కలు, సున్నం అమర్చి ఉన్న వెండిపళ్ళెం వారిద్దరికి అందించింది. ఉభయులు తాంబూలాలు వేసుకొని లోకాభిరామాయణంలోకి దిగేరు.

“బావగారూ, సైమన్ కమిషను వాళ్ళ రిపోర్టు వచ్చిందట. ఏమిటంటారు వాళ్ళు.”

“వాళ్ళ వల్లకాడు… ఎంగిలి చేతులు దులిపేసి సరిపెట్టేద్దామనుకొంటున్నారు… మన నాయకులేం తెలివితక్కువవాళ్ళా… ఇంతకు ముందే – పూర్ణ స్వరాజ్యమే మాకు కావాలి, అది మా జన్మ హక్కు అని కుండ బ్రద్దలుకొట్టి చెప్పేరు.”

ఇలా ఉభయులు చర్చించుకొంటుంటే ఆడవాళ్ళ భోజనాలు ముగియడంతో విజయలక్ష్మి కూడా వాళ్ళ దరి చేరి భర్త ప్రక్కనే నిలబడి సంభాషణని రాజకీయాల్లోంచి మళ్లించి ఇంటి విషయాల్లోకి తెచ్చింది.

“శంకరం, భోజనాల దగ్గర ఏదో ముఖ్యమయిన విషయం మాట్లాడాలన్నావు. ఏమిటది.”

“బుచ్చక్కా, మా అయిదోది, అరవిందకి మా మావగారు సంబంధం చెప్పేరు. అయన అత్తవారివంక దగ్గర చుట్టాలేనట. భూమి,పుట్ర బాగా ఉన్నవాళ్లట.”

“మరి ఆలోచన దేనికి. శుభస్య శీఘ్రం.” శర్మ గారు నొక్కి చెప్పేరు.

“అన్నీ బాగానే ఉన్నాయి. కానీ… వయస్సు గురించే ..ఆలోచిస్తున్నాను. అందుకే మీ సలహా కోసం వచ్చేను, బావగారూ.”

“వయస్సు సమస్య ఏమిటోయ్”

“పెళ్ళికొడుకు అరవిందకన్నా పదేళ్లు పెద్దవాడండి.” సంశయం వ్యక్తపరుస్తూ సమాధానమిచ్చేడు శాస్త్రి.

“దానికేమిట్రా, నాకు మీ బావగారికి పదిహేనేళ్ళు తేడా. పదేళ్లు ఓ తేడావా. సంశయించకు. నిశ్చయం చేసీ.”

“తగిన సంబంధం వచ్చినప్పుడు వదులుకోకోయి.”

“పదిహేనేళ్లయినా రాలేదు. ఇప్పడినుండి సంసారాభారం మీద వెయ్యడమా, అని…” మళ్ళీ కొద్దిగా నసుగుతూ అన్నాడు శాస్త్రి.

“ఇప్పుడు దానికెన్నేళ్లురా.”

“మొన్న శివరాత్రికి పదకొండు నిండేయి.”

“శంకరం, నీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను నా ఎనిమిదోయేట ఈ ఇంటికి కాపురానికొచ్చేను. దానికి పదకొండంటున్నావు. ఆలస్యం చెయ్యకు. వెంటనే మంచిరోజు చూసి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి.”

“చిన్న వయస్సులోనే అత్తవారింటికి వెళితే వాళ్ళ ఆచార వ్యవహారాలు సుళువుగా ఒంటబడతాయి. త్వరగా వాళ్ళలో ఇమడగలుగుతుంది. మీ అక్క చెప్పినట్లు మరో ఆలోచన పెట్టుకోకు.”

“ప్రస్తుతం మా కుటుంబంలో మీరే పెద్దవారు. అందుకే మీ సలహా కోసం వచ్చేను. మీరు చెప్పినట్లే చేస్తాను.”

“శుభం” ఆశీర్వదించేరు శర్మ గారు.

“బావగారూ, మీరుభయులు పెళ్ళికి రెండుమూడు వారాల ముందుగా వస్తే మాకు కొండంత బలం. మీ ఆధ్వర్యంలోనే పెళ్లి అయిదు రోజులు నిర్విఘ్నంగా జరగాలి. పదహారురోజుల పండుగ తరువాత మంచి రోజు చూసుకొని తిరుగు ప్రయాణం పెట్టుకోవచ్చు. ఇక్కడ ముందుగా ఏర్పాట్లు చేసుకొంటారని చెబుతున్నాను. మంచి రోజు చూసి మేముభయులం పిలుపులకు వస్తాం.”

పై సంభాషణ జరుగుతుండగా వంటాయన సింహాద్రి మూడు పెద్ద వెండి గ్లాసులతో వేడివేడి టీ తీసుకొచ్చేడు. శర్మగారు, శాస్త్రి వారి భుజాలమీదున్న కండువాలతో అందుకొన్నారు. ఇంటి ఇల్లాలు పయిట కొంగుతో అందుకొంది. ముగ్గురూ టీ త్రాగుతూ సంభాషణ ముందుకు సాగనిచ్చేరు. క్రొద్ది సేపటి పిమ్మట సాయంసమయం కావస్తోందని శాస్త్రి మర్యాద పూర్వకంగా శలవు తీసుకొని గూడుబండి ముఖం మళ్లించేడు. గుమ్మం వరకు వెళ్లి తమ్ముడిని సాగనంపి లోపలకు వచ్చిన ఇంటిఇల్లాలు, కూనిరాగాలు తీస్తూ కొండచీపురుతో వరండాలు తుడుస్తున్న పన్నెండేళ్ల సీతాలుని ఉద్దేశించి, “సీతాలూ, చీకటి బడకుండా గుమ్మంలో నీళ్లు జల్లి ముగ్గు పెట్టమ్మా.” అని మృదువుగా పలుకుతూ పెరటి దిక్కుగా వెళ్ళింది. ఆవిడకు సీతాలుపై అభిమానం ఎక్కువ. చురుకయినది, తెలివయినది అని అభిప్రాయం. సీతాలు పెళ్ళికి, దానికి నూతన వస్త్రాలు, పసుపుకుంకుమలతో బాటు పదకొండు రూపాయిలు కానుకగా ఇచ్చింది.

సీతారామాంజనేయ శర్మ గారు పేరు మోసిన జమీందారు. అతి సన్నిహితులకు ఆయన ఆంజనేయ శర్మ. జనసాధారణానికి జమీందారు గారు.ఆయన ఆరుగురు ఆడపిల్లల తరువాత జన్మించిన ఏకైక పుత్రుడు. శర్మ గారి దంపతులకు ఎనమండుగురు సంతానం. ఆరుగురు ఆడ, ఇద్దరు మగ. ప్రస్తుతం పెద్దబ్బాయిగారుగా పిలువబడే సత్యనారాయణ మూర్తికి ముఫై తొమ్మిది, చిన్నబ్బాయిగారుగా పిలువబడే వెంకటేశ్వరరావుకు ముప్ఫై. జమీందారుగారి భూములు అయిదు గ్రామాలలో విస్తరించి ఉన్నాయి. ప్రతీ గ్రామంలో అన్ని సదుపాయాలతో రెండు గదుల బంగళాలున్నాయి. అంచనాలకు, కొలతలకు వంట వానితో బాటు వెళ్ళినప్పుడు వాటిలోనే బస చేస్తారు. శర్మగారు గాంధేయ వాది. నిత్యం ధరించే పంచ, చొక్కా, కండువా అన్నీ శుద్ధ ఖద్దరువే. ఆయన నివాసం ‘లక్ష్మీ నిలయం’.అది పెద్ద నాలుగిళ్ళ వాకిలి. సుమారు రెండెకరాల పెరడు. పెరటి చివరి ద్వారం వెనుక వీధిలోనికి తెరవబడుతుంది. వెనుక వీధిలో,వారిదే అయిన పది గదుల సత్రవులో బాటసారులకు ఉచిత నివాస భోజన సదుపాయాలు అందజేస్తున్నారు. దంపతులిద్దరూ దానధర్మాలకు పేరుబడ్డారు. ప్రతి సంవత్సరం జమిందారుగారి ఖర్చుతోనే అమ్మవారి సంబరాలు మూడు రోజులూ అతి వైభవంగా జరుగుతాయి. గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం జమిందారుగారి విరాళం. ప్రతి సంవత్సరం దసరాలకు ఆ బడి విద్యార్థులు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ‘అయ్యవారికి చాలు అయిదు వరహాలు పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు’ అని పాడుకొంటూ ఊరేగింపుగా వచ్చి లక్ష్మీ నిలయ ప్రాంగణంలో నిలబడి జమీందారుగారి చేతుల మీదుగా లడ్లు,చాకిలెట్ల పొట్లాలు అందుకోవడం పరిపాటి. ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు, కానుకలు అందేవి. వారి గ్రామంలోనే గాక ఇరుగుపొరుగు గ్రామాలలో జరిగే కొన్ని శుభకార్యాలు జమిందారుగారి ఇంటి అటకనుండి పెద్దపెద్ద ఇత్తడి బిందెలు, గంగాళాలు, వంటపాత్రలు, వడ్డనసామగ్రి దింపకుండా జరుగవు.

* * *

కాలచక్రంలో పదిహేడు సంవత్సరాలు దొరిలేయి. జమీందారుగారున్న గ్రామం, పంచాయితీ నుండి మునిసిపాలిటీగా మారింది. జనాభా రెండు లక్షలు చేరుకొంది. ఆయన ధర్మంతో ఆ ఊళ్ళో ఒక ఉన్నతపాఠశాల ఉద్భవించింది. దేశ చరిత్రలో కూడా ఒక చరిత్రాత్మకమయిన మార్పు చోటుచేసుకొంది. ఎందరో మహానుభావుల నిస్వార్థ త్యాగాల ఫలితంగా భరతమాతకు సంకెళ్లు విడ్డాయి. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఎగుర నారంభించింది. ఎనిమిది పదులు దాటి నాలుగు సంవత్సరాలయిన జమీందారు గారు క్రొద్దిగా అస్వస్థతగా నున్నా ఊరిలో జరుగుతున్న స్వాతంత్రదిన సంబరాలకు కుటుంబంతో సహా ఆ రాత్రి హాజరయ్యేరు. నలుప్రక్కల పండుగ సందడి సంతరించుకొంది. తారాజువ్వలు గగనంలోకి దూసుకుపోతున్నాయి. పటాకుల ధ్వనులు చెవులకు చిల్లులు పెడుతున్నాయి. లౌడు స్పీకర్లలో దేశభక్తి గేయాలు వీనుల విందుగా వినిపిస్తున్నాయి. చిచ్చుబుడ్ల కాంతిలో ప్రజల ఆనందోత్సాహాలు గమనిస్తున్న జమిందారుగారు “ఎన్ని దశాబ్దాలనుండో ఈ దినం కోసం దేశమంతా ఎదురు చూసింది.” అని ప్రక్కనే ఉన్న గవర్నమెంటు డాక్టరుగారితో చెబుతూ హృదయపూర్వకమయిన సంతృప్తి వెలిబుచ్చేరు.

సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఇంతలో జమీందారుగారి సమీపంలోనే ఆసీనురాలయి ఉన్న అయన సతీమణి విజయలక్ష్మి శ్వాస తీసుకొనడంలో ఇబ్బంది పడనారంభించడంతో, వెంటనే డాక్టరుగారి సహాయంతో బంగళా చేర్పించేరు. కుటుంబ సభ్యులతో బాటు బంగళాలోని పనివారందరు ఆందోళనకు గురి అయ్యేరు. డాక్టరు గారు ఇంజెక్షను ఇవ్వడంతో కొంత ఉపశమనం లభించి ఇంటి ఇల్లాలు నిద్రపోయింది. కాని తెల్లవారుఝామున ఎప్పుడో ఆ నిద్ర దీర్ఘనిద్రలోకి దారి తీసింది. జమీందారుగారి దుఃఖానికి అంతులేదు. బంగళా శోకసముద్రంలో మునిగిపోయింది. “మా ఊరి డొక్కా సీతమ్మ మరి లేరు.” అని ఊరంతా సంతాపం వెలిబుచ్చింది. పసుపు కుంకాలతో విజయలక్ష్మికి అంతిమ యాత్ర జరిపించేరు.

భార్యావియోగం జమీందారుగారి ఆరోగ్యాన్ని ప్రభావితం జేసింది. అయన కదలికలు పడకగదికే పరిమితమయ్యేయి. దినదినానికి దిగజారుతున్న ఆరోగ్యం కారణంగా భార్య నాలుగో మాసికానికి మూడు రోజుల ముందున జమీందారుగారు తన ఇహలోక యాత్ర ముగించేరు. ఆయన చనిపోయిన సమయానికి నక్షత్ర దోషం ఉందని తత్కారణంగా ఆయన మరణించిన గదిలోనికి ఆరు నెలలు వరకు ఎవరు అడుగు పెట్టకుండా గదికి తాళం వేసి ఉంచాలని సిద్ధాంతి గారు సలహా ఇచ్చేరు. అంతే గాదు. ఆయన భౌతిక శరీరాన్ని సింహద్వారం గుండా కాక పెరటి గుమ్మము ద్వారా తీసుకొని వెళ్లాలని శాస్త్రం చెప్పేరు. కుటుంబ సభ్యులు, ఊరి పెద్దలు అంగీకరించకపోవడంతో జమీందారు గారి అంతిమ యాత్ర సింహద్వారం గుండానే జరిగింది. స్మశాన వాటిక జనసముద్రంతో క్రిక్కిరిసి పోయింది. జమీందారుగారి భౌతిక శరీరం అగ్నిజ్వాలలకు ఆహుతి అవుతుంటే అక్కడి జనమంతా వంగి నమస్కరించేరు. జమీందారుగారి కుటుంబంలో ఒక శకం ముగిసింది.

దివంగత దంపతుల సంవత్సరీకాలు గో, భూ, సువర్ణ దానాలతో శాస్త్రోక్తంగా జరిగేయి. ‘లక్ష్మీ నిలయం’ క్రమక్రమంగా తేరుకొంటోంది. తండ్రి అడుగుజాడలలో పెరిగిన కుమారులిద్దరు, సమిష్టి యాజమాన్యంతో గత వైభవానికి ఏ లోటూ రాకుండా చూసుకొంటున్నారు. కోడళ్ళిద్దరూ, దానధర్మాలకు స్వర్గస్తురాలయిన అత్తగారికి తీసిపోరని జనవాక్యం. ప్రస్తుతం స్వర్గస్తులయిన జమీందారుగారి యాభయి ఆరేళ్ళ జ్యేష్ఠుడి సంతానం ఇద్దరు మగ, అయిదుగురు ఆడ. రెండవ కుమారునికి నలుగురు ఆడ, ఒక మగ. ఆడపిల్లలందరూ అత్తవారిళ్లకు వెళ్ళేరు. లక్ష్మీ నిలయంలోని మూడవ తరం మనవలు, ముగ్గురు మగపిల్లలకు చదువు మీద ఆసక్తి ఎక్కువ. ఆ ముగ్గురిలో పెద్దబ్బాయి పెద్దకొడుకు సీతారామ శాస్త్రికి ఇరవై సంవత్సరాలు. విశాఖపట్నంలో డిగ్రీ చేస్తున్నాడు. చివరి సంవత్సరంలో ఉన్నాడు. పదిహేడు సంవత్సరాల రెండవ వాడు బాపూజీ, ఆ కాలేజీలోనే ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నాడు. చిన్నబ్బాయి ఏకైక పుత్రుడు పదునెనిమిది సంవత్సరాల ఆంజనేయ శర్మ ఇంటర్ రెండవ సంవత్సరంలోఉన్నాడు.

స్వతంత్ర భారత దేశం సామజిక న్యాయం దిక్కుగా అడుగులు వెయ్యడం ఆరంభించింది. జమీందారీలు, సంస్థానాలు చట్టాలికి గురి అయ్యేయి. ‘దున్నేవాడిదే భూమి’ అంటూ ఆందోళనలు నలుప్రక్కల వ్యాపించేయి. వీటన్నిటి ప్రభావం లక్ష్మీ నిలయం మీద బడ్డాది. భూరి విరాళాలకు అలవాటు బడ్డ కుటుంబానికి నిత్యావసరాలకు గూడా లెఖ్ఖ చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. పనివారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ధాన్యపు గాదెలు కేవలం ఎలుకల స్థిర నివాసంగా మారేయి. ఇక్కడ నిలయంలో ఖర్చులతో బాటు అటు పట్నంలో ఉన్నత విద్య నభ్యసిస్తున్న ముగ్గురకు ఏ లోటు రాకుండా చూసుకోవలసి వస్తోంది. ఆడపిల్లల పురుళ్ళు, పుణ్యాలు, ఆహ్వానాలందుకొని పండుగలకు వచ్చిన అల్లుళ్లకు, ఏ వెలితి లేకుండా మర్యాదలు చెయ్యడాల్లో వెనుకంజ వెయ్యలేని పరిస్థితి. గుట్టుగా పరువు నిలబెట్టుకోడానికి అన్నదమ్ములిద్దరూ సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఊరు విస్తరిస్తోంది. క్రొత్త కట్టడాలు వెలుస్తున్నాయి. ఒకప్పటి తాపీమేస్త్రి అప్పలనాయడు ఇప్పుడు పేరున్న సివిల్ కాంట్రాక్టరుగా మారేడు. అందరు అతన్ని సివిల్ నాయడు అంటారు. ఊరిలో మూడు హోటళ్లు వెలిసేయి. వాటిలో వసతి సౌకర్యాలతోనున్న ఒకటి సివిల్ నాయడుది. లక్ష్మీనిలయంలోని పరిస్థితుల అవకాశం తీసుకొని దీనావస్థలోనున్న వారి ధర్మసత్రవుని సివిల్ నాయడు అతి తక్కువ వెలకు తనదిగా చేయుంచుకొన్నాడు. సత్రవుకు కావలిసిన మరమ్మతులు మార్పులు చేసి తన నివాసంగా మార్చుకున్నాడు.

లక్ష్మీనిలయానికి కష్టాలు తీరలేదు. పరిస్థితుల ప్రభావానికి వెండి కంచాలు, వెండి పళ్లేలు ఒక్కొక్కటి పట్నంలోని నగల వ్యాపారి దుకాణానికి దారి తీసేయి. అదే మార్గాన్న అటకమీదున్న బరువయిన ఇత్తడి గంగాళాలు, బిందెలు, వంటసామాగ్రి పట్నంలోని ఇత్తడి దుకాణాన్ని చేరుకొంటున్నాయి. కలలోనైనను ఊహించని ఈ క్లిష్ట పరిస్థితి అన్నదమ్ములిద్దరకు నిద్ర లేకుండా చేసింది. ఏమి చేయడమో తోచకుండా పోయింది. సిద్ధాంతి గారిని సంప్రదించేరు. అయన సలహా మేరకు లక్ష్మీ నిలయంలో మూడు రోజులు నిష్టగా హోమాలు చేసేరు. శనిత్రయోదశినాడు శనీశ్వరునికి తైలాభిషేకం చేసేరు. హనుమంతుని మెడలో వడమాల వేసేరు. అందుబాటులోనున్న అన్ని దేవాలయాలలోను పూజలు చేసేరు. కష్టాలు తొలగితే కాలిబాటన వెళ్లి ఏడుకొండలవాడి దర్శనం చేసుకొంటామని మ్రొక్కుకొన్నారు.

ఉగాది పండుగలు పండ్రెండు వెనక్కి వెళ్ళేయి. లక్ష్మీ నిలయానికి భూములపై అధికారం క్రమక్రమంగా సన్నగిల్లింది. అన్నదమ్ములిద్దరి వద్ద కేవలం దస్తావేజులే మిగిలేయి. పరిస్థితులను సదవగాహన చేసుకొని, సివిల్ నాయుడు మధ్యవర్తిత్వంలో కొంత భూమి అడిగిన ధరలకే అమ్మడమయింది. కారు మేఘాల మధ్య కొన్ని వెలుతురు కిరణాలు ఆశలను చిగురింపజేసేయి. పెద్దబ్బాయిగారి పెద్దవాడు, సీతారామశాస్త్రి లా డిగ్రీ చేసి విశాఖపట్నంలో లాయరుగా స్థిరబడ్డాడు. రెండవవాడు బాపూజీ కార్డియాలజిస్టు. విశాఖపట్నంలోనే ప్రేక్టిసు చేస్తున్నాడు. చిన్నబ్బాయి ఏకైక పుత్రుడు ఆంజనేయశర్మ విశాఖపట్నంలో కళ్ళ డాక్టరుగా ప్రైవేటు ప్రేక్టిసు చేస్తున్నాడు. ముగ్గురికి సాంప్రదాయంగా వివాహాలు జరిగేయి.

ఒకరోజు లాయరు సీతారామ శాస్త్రికి లక్ష్మీ నిలయం నుండి ఉత్తరం వచ్చింది. విప్పి చూసేడు.

నాయనా రామం,

ఆశీర్వచనాలు. మీ మూడు కుటుంబాలు క్షేమమనుకొంటాను. తప్పనిసరై నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను.

ఇక్కడ పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి. మన భూములపైన మనం అడుగు పెట్టలేక పోతున్నాం. పాలు, బియ్యం కొనుక్కొనే పరిస్థితి ఏర్పడింది. ఊరి దగ్గరలో రెండు పెద్ద ఫేక్టరీలు వచ్చినప్పటినుండి ధరలు మండిపోతున్నాయి. ప్రతి ఆరు నెలలకు జీతం పెంచమని పనిమనిషి ఒత్తిడి చేస్తోంది. బోనస్ కూడా ఇవ్వాలిట. మరో ప్రక్క, ఇంటి పన్నులు విపరీతంగా పెరిగిపోయేయి. పెరడంతా పాడుబడి ఉంది. ప్రతి పెద్ద పండుగకు బంగళాకు సున్నాలు వేయించేవారిమి. ఇప్పుడు అయిదు సంవత్సరాలయి ఆ జోలికి పోలేక పోతున్నాం. బంగాళా వెనుక భాగంలో పైకప్పులోని చాలా దూలాలు పుచ్చిపోయేయి. వాటిని వెంటనే మార్చకపోతే ఆ భాగం ఎప్పుడైనా కూలిపోవచ్చని సివిల్నాయుడు చెప్పేడు. ఖర్చులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదాయం శూన్యమైపోయింది. చేసిన చేతి అప్పులకు అసలు కన్నా వడ్డీలు ఎక్కువవుతున్నాయి. మన కుటుంబ హోదా, ఔన్నత్యము తాతగారితోనే అంతమయింది. పరిస్థితులకు పరదాలు ఎన్నాళ్ళు వెయ్యగలం. వచ్చిన మార్పులు నచ్చినా నచ్చకపోయినా అంగీకరించక తప్పదు.

పై విషయాలన్నీ మేము నలుగురం బాగా ఆలోచించేము. ప్రస్తుత పరిస్థితులలో మనకు అనుకూలంగా ఎటువంటి మార్పులు వచ్చే అవకాశాలు లేవు. అప్పుల భారం రోజురోజుకు పెరిగిపోతోంది. మా నలుగురకు వయస్సులు మళ్ళేయి. ఇంక ఎవరు ఎన్నాళ్ళో చెప్పలేము. అందుచేత ఈ గడ్డు రోజులనుండి ఎంత వేగిరం బయటబడితే అంత మంచిది. వీలయినంత వరకు భూములలో కొంత భాగం అమ్మగలిగేము. కాని సింహభాగం రైతుల చేతులలోనే ఉంది. అది మరి మనకు దక్కదు. ఆ ఆశ వదలుకొన్నాం. ఇహ లక్ష్మీ నివాసం. దీనికి కావలిసిన మరమ్మత్తులు చేయించి నివాసయోగ్యంగా మార్చుకోడానికి మన దగ్గర పెట్టుబడులు లేవు. అంత మొత్తం అప్పులు దొరకవు. అయినా మా నలుగురకు ఇంత పెద్ద బంగళా అనవసరం. ఇవన్నీ అలోచించి మేము నలుగురం ఒక నిర్ణయానికి వచ్చేము. ఉన్న ఈ ఒక్క ఆస్తి – లక్ష్మీ నిలయాన్ని క్రయం చేసి వచ్చిన డబ్బుతో అప్పులన్నీ తీర్చి శాశ్వతంగా ఈ ఊరు వదిలి మీ దగ్గర మా శేష జీవితం గడుపుదామనుకొంటున్నాము. అప్పులు తీర్చకుండా ఈ ఊరు వదిలిపెట్టడం మాకు సుతరామూ ఇష్టం లేదు. దైవానుగ్రహమో ఏమో గాని క్రిందటి వారం ఒక బిల్డరు కలిసేడు. మన బంగళా వెనుక పెరడుతోబాటు కొనుక్కోడానికి ఇష్టబడతున్నాడు. మంచి ధర చెప్పేడు. ఈ పరిస్థితులలో అదే సదవకాశమనుకొంటున్నాము. అయినా నువ్వు లాయరివి. మీరు ముగ్గురు బాగా చదువుకొన్నవాళ్ళు. అన్ని విషయాలు మాకన్నా మీకే బాగా తెలుస్తాయి. అందుచేత మీ ముగ్గురు వీలుచూసుకొని త్వరలో ఇక్కడికి వస్తే ఆ సమయానికి బిల్డరుని రమ్మనమని కబురు పెడతాం. మీరు అతనితో చర్చించి క్రయం ఖరారు చెయ్య వచ్చు. నీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను.

ఆశీర్వచనములతో,

సత్యనారాయణమూర్తి.

లక్ష్మీ నిలయానికి జవాబు చేరింది. పెద్దబ్బాయి విప్పి ముగ్గురకు వినిపించేడు.

పూజ్యులు నాన్నగారికి నమస్కారాలు.

మీరు రాసిన ఉత్తరం మేమంతా చదువుకొన్నాము. మీరు ఇన్ని కష్టాలు పడుతున్నట్లు మాకు ఎన్నడూ తెలియజేయలేదు. మీరు రాసిన ఉత్తరంలోని ప్రతి పదంలో మీ మనోవ్యథ తెలుసుకొని మేమెంతో విచారించేము. మేమందరం జాగ్రత్తగా ఆలోచించేము. మన లక్ష్మీ నివాసం మన దగ్గరే ఉంటుంది.తాతగారి రక్తం ఇంకా మాలో ప్రవహిస్తున్నాది. ఓడిపోయి ఊరువదిలి పారిపోయేరని కుటుంబానికి నల్లమచ్చ రానీయం. మా నిర్ణయం వినండి. మా మూడు కుటుంబాలు శాశ్వతంగా మన ఊరు వచ్చేస్తున్నాయి. మా ప్రణాళికలు సిద్ధం చేసేము. త్వరలో మిమ్మలిని కలసినప్పుడు వివరాలు తెలియజేస్తాం. మనకు మంచి రోజులు తప్పక వస్తాయి. స్వర్గంలోనున్న తాతగారు, మామ్మల ఆశీర్వచనాలు మనకు ఎప్పుడూ ఉంటాయి.

పాదాభివందనములతో,

మీ, సీతారామశాస్త్రి.

ముందుగా ఎంపిక చేసిన రోజున మూడు కుటుంబాలు విశాఖపట్నం వదిలి స్వంత ఊరు చేరుకొన్నారు. తమ ప్రణాళికా వివరాలు పెద్దవాళ్ళ చెవులలో వేసేరు. సంతోషంగా వారు ఆమోదించేరు. తమ వంతు సలహాలు కూడా కొన్ని ఇచ్చేరు. పిల్లలకు తాతగారిపై నున్న గౌరవం, వారి ఆత్మాభిమానం పెద్దలకు సంతోషాన్ని పంచిపెట్టేయి.

ఒక శుభముహుర్తాన్న కార్యాచరణ ప్రారంభమయింది. ఒకప్పుడు కేవలం ఒకేఒక కోఆపరేటివ్ బేంకు ఉన్న ఊరిలో ప్రస్తుతం పదికి పైగా బేంకు శాఖలు వెలిసేయి. అన్నదమ్ములు ముగ్గురూ దగ్గరలోనున్న బేంకు శాఖలో అడుగుపెట్టేరు. అక్కడ వారికి అనుకోకుండా కళ్ళడాక్టరు ఆంజనేయ శర్మకు ఇంటరులో సహాధ్యాయుడయిన సురేష్ మేనేజరుగా ఉండడం వారికి కలిసి వచ్చింది. అతనితో తమ ప్రణాళికా వివరాలు కూలంకషంగా చర్చించేరు. తమ బేంకు, కావలిసిన రుణాలు అందివ్వగలదని సురేష్ హామీ ఇచ్చేడు. కావలిసిన డాక్యుమెంట్లు, బేంకు నిబంధనలు తెలియజేసేడు. బజారులో దుకాణాలు అద్దెకు తీసుకొని అన్నదమ్ములు ముగ్గురూ వాళ్ళ వృత్తికి క్రొత్తగా మళ్ళీ శ్రీకారం చుట్టేరు. క్రమక్రమంగా నిలద్రొక్కుకొన్నారు. అటు లక్ష్మీ నిలయంలో పనులు జోరందుకున్నాయి.

రెండు సంవత్సరాల తరువాత -(క్రమ క్రమంగా)

లక్ష్మీ నిలయం ఆధునిక సదుపాయాలతో రెండస్తుల నూతన భవనంగా అవతారమెత్తింది. పెరడులో ‘సీతారామాంజనేయ, విజయలక్ష్మి స్మారక ఆసుపత్రి ఒక నూతన భవనంలో ఇరవై పడకల సదుపాయంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తోంది. నలుగురి నమ్మకం సంపాదించి దూర గ్రామాల రోగులను కూడా ఆకర్షిస్తోంది. కంటి జబ్బు, గుండెజబ్బు రోగులు ఉదయం ఎనిమిది గంటల నుండి వెయిటింగ్ హాలులో, తమ పేరు పిలుపు కోసం గంటలతరబడి ఎదురు చూసే రోజులు వచ్చేయి. నలుగురు నర్సులు, ఇద్దరు రిసెప్షనిస్టులు షిఫ్టుల మీద పని చేస్తున్నారు. ఆసుపత్రి, లక్ష్మీనిలయాల నిత్య సంరక్షణకు ముగ్గురు పనివారున్నారు. ఇదిగాక ప్రాంగణంలోని పూల తోటల పెంపకానికి ఒక మాలీ రోజూ ఉదయాన్నే వస్తాడు. మూడు కార్లను నడపడానికి ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు.

లాయరు శాస్త్రి తన వృత్తిలో అతి త్వరలో విజయాలు సాధించి నీతినియమం గల తెలివయిన లాయరుగా పేరు తెచ్చుకొన్నాడు. ఊరిలోని నాలుగు బ్యాంకులకు, ఫేక్టరీకి కన్సల్టెంటు లాయరయ్యేడు. తాతకు తగ్గ మనవలని పాతతరం వాళ్ళ ప్రశంసలు లక్ష్మీనిలయానికి ఆశీర్వచనాలయ్యేయి.

ఒకమారు సివిల్ నాయుడు దగ్గరకు వెళదామా. ఊరిలో నిన్నటి వరకు ఒక పెద్దమనిషిగా చలామణి అవుతున్న అతని నిజస్వరూపం బయటబడింది. తన హోటలులో లైసెన్సు లేకుండా మద్యం విక్రయిస్తున్నాడని, అక్కడ రాత్రిళ్ళు వ్యభిచార వ్యాపారం సాగనిస్తున్నాడని ఫిర్యాదులు చేరడంతో అధికారులు హోటలుపై దాడి జరిపి, ఫిర్యాదులలో నిజం ఉందని రూఢి చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. హోటలు మూత బడింది. మరోప్రక్క ఇన్కమ్ టేక్స్ వారి వలలో చిక్కుకోడంతో బ్యాంకు ఖాతాలు సీజయిపోయేయి. అంతటితో సరిపోలేదు. ఊరిలో తను నిర్మిస్తున్న ఇరవైఆరు ఎపార్టుమెంట్స్ గల నాలుగంతస్తుల భవనం చివరి దశలో నుండగా సాంకేతిక లోపాలవల్ల ఒకరోజు కుప్పకూలింది. అందులో అప్పుడు పనిచేస్తున్న నలుగురు పనివారు హరీ అన్నారు. వీటన్నిటితో సివిల్ నాయుడు ఆర్థికంగా మునిగిపోయేడు. కోర్టు కేసులకు, అధికారుల చేతులు తడపడానికి, నిత్యావసరాలకు అప్పులు చేసే పరిస్థితికి దిగజారిపోయేడు. ఈ ఉబిలోనుండి బయటపడడానికి తన నివాసం (గతంలో దివంగత జమిందారుగారి ధర్మ సత్రవు) లక్ష్మీనివాస వాస్తవ్యులకు విక్రయించేడు. తమదయిన సత్రవు తిరిగి తమ ఆధీనంలోకి రావడం లక్ష్మీ నిలయంలో అంతులేని సంతోషాన్ని పంచింది. క్రొద్దిగా మార్పులు చేసి దానిని వృద్ధాశ్రమంగా మార్చడమైంది. దిక్కులేని కొందరు వృద్ధులకు ఒక చిరునామా ఏర్పడింది. ఉచిత నివాస భోజన సదుపాయాలతోబాటు ఉచిత వైద్య సౌకర్యాలు కూడా వారికి లభ్యమవుతున్నాయి.

ఒక ఆదివారం సాయం సమయం. మేడమీద బాల్కనీలో పంచ, కబ్బా ధరించి రోడ్డుదిక్కుగా చూస్తున్న పెద్దబ్బాయి, లక్ష్మీనిలయం ముందర ఒక జీపు ఆగడం గమనించేడు. ఇద్దరు యువకులు, సుమారు 45-50 సంవత్సరాల స్త్రీ, జీపులోనుండి దిగేరు.యువకులలో ఒకరు పోలీసు ఆఫీసరు యూనిఫారములో ఉన్నాడు. రెండవ యువకుడు పేంటు, టీ షర్టు వేసుకొని స్మార్టుగా ఉన్నాడు. ఆ ముగ్గురు నిస్సంకోచంగా లక్ష్మీ నిలయంలో ప్రవేశిస్తుండడం చూసిన పెద్దబ్బాయి పోలీసు వాళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చేరా అని సంశయిస్తూ, త్వరత్వరగా చొక్కా వేసుకొని క్రింద డ్రాయింగ్ రూము చేరుకొన్నాడు. ఇంతలో, ఆ స్త్రీ త్వరత్వరగా అతనిని సమీపించి పాదాభివందనం చేసింది.

“ఎవరమ్మా మీరు, మా పిల్లలు ముగ్గురు బయటకు వెళ్ళేరు. ఇప్పుడే వస్తారు.”

“అయ్యగారు, నేను, సీతాలుని. మీ బంగళాలో పనిచేస్తుండేదాన్ని.”

“సీతాలు, నువ్వా… ఎన్నాళ్ళో అయింది కదూ, జ్ఞాపకం రాలేదు. ఏమి అనుక్కోకు. వీళ్ళు…”

“ఈడు నా కొడుకు సింహాద్రి . ఆ అయ్యగారు పోలీసు ఆపీసరు. అచ్చిబాబు పెండు.”

యువకులిద్దరు పెద్ద అబ్బాయుయికి నమస్కరించేరు. అతను చెప్పడంతో ఇద్దరూ సోఫాలో ఆసీనులయ్యేరు. ఎంత చెప్పినా సీతాలు మాత్రం నిలబడే ఉంది. ఇంతలో వీధిలోకెళ్ళిన ముగ్గురు, ఇంటిలోనున్న కుటుంబ సభ్యులు కూడా వచ్చేరు. పరిచయాలయ్యేయి.

పెద్దబ్బాయికు దగ్గరగా నేల మీద కూర్చొని సీతాలు తన కథ వినిపించింది.

 పెళ్లయిన తరువాత జీవనాధారానికి భర్త ఎల్లాజీతో సీతాలు ముంబై వెళ్ళింది. అక్కడ ఎల్లాజీ ఒక ఎపార్ట్మెంట్ కాంప్లెక్ లో వాచ్మెన్ గా చేరేడు. త్వరలోనే నమ్మకస్తుడని, వినయవిధేయతలు గలవాడని అందరి మెప్పు సంపాదించుకున్నాడు. కొన్నాళ్ళకు వారి ఏకైక సంతానం సింహాద్రి పుట్టేడు. రెండో నంబరు లో ఉంటున్న లెక్చరరు ఒకాయన సింహాద్రిని చిన్నక్లాసులనుండి మంచి స్కూలులోను తరువాత కాలేజిలోను తన ఖర్చుమీద చదివించేడు. అతని ప్రోత్సాహంతో సింహాద్రి ఎంట్రన్సు పరీక్షలో నెగ్గి నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో అడుగు పెట్టేడు. శిక్షణ పూర్తయ్యేక సింహాద్రి ఇండియన్ ఆర్మీలో ఆఫీసరుగా చేరేడు. ప్రస్తుతం కాశ్మీరులో కెప్టెనుగా ఉన్నాడు. సీతాలు, ఎల్లాజీ, కొడుకు తోనే ఉంటున్నారు. విశాఖపట్నంలో ఒక ఎపార్ట్మెంటు కొందామన్న ఉద్దేశంతో వచ్చేరు. తను పుట్టిపెరిగిన ఊరు చూడాలనిపించింది సీతాలుకు. అందువలనే ఇలా రావడమయింది. ఎల్లాజీ, దగ్గర బంధువులను చూడడానికి పార్వతీపురం వెళ్ళేడు.

సీతాలు జీవిత విశేషాలు విని అందరు హర్షించేరు. ఈలోగా వంటాయన విశ్వనాధం మగ్గులతో వేడివేడి టీ, పళ్లేలతో పకోడీలు అందరికి అందించేడు.

టీ త్రాగుతూ లాయరుగారు సింహాద్రిని ఉద్దేశించి ‘your life is very inspiring.’  అని మెచ్చుకున్నాడు.

కళ్ళ డాక్టరుగారు “yours is a very challenging profession” అని అనడంతో సింహాద్రి “నేను మా father profession లోనే ఉన్నాను.” అని స్పందించగానే అందరు ఆశ్చర్యపడ్డారు.

“My father was a watchman of apartments and I am a watchman of the country.” అని సింహాద్రి చిరునవ్వుతో అనడంతో డ్రాయింగ్ రూము నవ్వులతో నిండిపోయింది.

ఇలా కొంత సేపు సరదాగా ఖబుర్లు చెప్పుకొన్నాక, పెద్దబ్బాయి, మిగిలిన కుటుంబ సభ్యుల ఒత్తిడికి, వచ్చిన ముగ్గురు లక్ష్మీనివాసంలో విందు భోజనం చేసేరు. పెద్దబ్బాయి భార్య, విశాలాక్షి సీతాలుకు నూతన వస్త్రాలు, పసుపుకుంకుమలతో బాటు 501 రూపాయిలు కానుకగా ఇచ్చింది.

లక్ష్మీ, సరస్వతుల కటాక్షంతో లక్ష్మీనిలయం కళకళలాడుతూ దానధర్మాలకు మారుపేరుగా నలుగురి మెప్పులు పొందుతున్నాది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here