జీవనహేల

    0
    4

    [box type=’note’ fontsize=’16’] కుటుంబానికో సైనికుడిని దేశానికి అందించిన ఆ కుగ్రామం వ్యక్తిగత విషాదాలని సైతం తట్టుకుని, తమ బిడ్డల వీరమరణాల పట్ల గర్వపడే వైనాన్ని చెబుతుంది శ్రీలక్ష్మి చివుకుల కథ “జీవనహేల“. [/box]

    [dropcap]అ[/dropcap]ప్పిగాడు చెట్టు కింద మంటవేసి తన చేతిలోని డప్పుకి దోరగా వేడి తగిలేటట్లు తిప్పుతున్నాడు. మధ్యలో దరువేస్తూ సరిగా పలుకుతోందో లేదో సరిచూసుకుంటున్నాడు.

    కొద్దిదూరంలో సన్నిగాడు కూడా తన తుడుంని సరిచూసుకుంటూ రువ్వతో జుంగ్… జుంగ్ శబ్దం వచ్చేటట్లుగా తిప్పుతున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మధ్య మధ్యలో దూరాన నుండి వాహనమేదైనా వస్తోందా అని నిగిడ్చి చూస్తున్నారు. అక్కడ సుమారొక యాబై మంది దాకా ఉన్నారు.

    దూరంగా మిలటరీ ట్రక్కు వస్తోంది. అందరూ ఉన్నపళాన నిలబడిపోయారు. అవును. తమ ఈశుని తెచ్చే ట్రక్కు ఇదే అనుకుంటూ.

    ట్రక్కు డ్రైవరు అడిగాడు – ‘ట్రక్కు లోపలకు వెళ్ళదా?’ అని.

    తల అడ్డంగా ఊపుతూ “ఇక్కడికో పది కోసుల దూరం ఉంటాది ఈశు ఇల్లు. కాకపోతే ఈ కనబడే కొండెక్కి దిగాల. మధ్యలో వాగు దాటాల” అంటూ త్రోవ చెప్పాడు ఒక వృద్దుడు. “సరే!” అంటూ ట్రక్కుని రోడ్డుప్రక్కగా ఆపాడు డ్రైవరు.

    అందరి చూపు అటువైపే. రెప్పలార్పకుండా చూస్తున్నారు ఆ అద్భుత దృశ్యాన్ని. మువ్వన్నెల జెండా కప్పిన పేటికను జాగ్రత్తగా దింపారు జవానులు. అమ్మోరి పండగలో మ్రోగించే గిరిజన వాద్యపరికరాలైన తుడుము, నరిగె, సన్నాయి, డప్పు వాయిద్యాల సమ్మేళనంతో ఒక్కసారి మిన్నంటాయి.

    ఆ పేటికపై కుర్రకారు జల్లే అడవిపూల సౌరు గుబాళిస్తూంటే అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్న ఆ జవానుల బూట్ల చప్పుడులో వాటికింద నలిగిపోతూన్న పూలు.

    “చాహ్ నహీ!” అంటూ “వీరోంకే లాష్ చలే…” అన్న కవితకు దృశ్య రూపంగా భాసిస్తోంది. వాగులూ, వంకలూ దాటుతూ సన్నని కాలిబాటలో నడుస్తూ సామాన్యునికి మహా సాహసయాత్రగా తోచే ఆ త్రోవ పట్టుమని పాతిక గుడిసలైనా లేని ఆ తండాని సమీపించింది.

    ఫోను వార్తతో ఊరంతా మరోసారి ఉలిక్కిపడ్డది. అచ్చయ్య ఇంటివైపు పరుగులు తీసారందరూ.

    నిజమా! ఇది నిజమేనా! అంటూ అందరి మొహాల్లో దిగ్భ్రాంతి. ఏం జరిగింది? ఎలా? ఎలా? ప్రశ్నలు.

    హిమాలయ మంచు శిఖరాలు పెళ్ళలు విరిగిపడ్డాయిట. అక్కడ గస్తీ కాస్తున్న మనవాళ్ళే… దుఃఖంతో గొంతు రుద్ధమవుతూంటే… మన ఈశు కూడా… ఈశ్వర్…

    ఊరంతా గొల్లుమంది. అందరి కళ్ళల్లో కన్నీళ్ళు.

    అవును. అక్కడ అది సామాన్యమే. అదే ఆ ఊరి ప్రత్యేకత. కొండల్లోని మారుమూల తండాల్లో సౌఖ్యాలమాట దేవుడెరుగు. కనీసావసరాలకు కూడా నోచుకోని ఆ కొండోళ్ళు సమాజం దృష్టిలో అట్టడుగునున్న వాళ్ళు. ఎప్పుడూ అంతెత్తునే కనిపిస్తారు మైదాన ప్రజలకు.

    ఆ ఊర ప్రతి ఇంటా ఒక బుడతడిని దేశమాత కోసమే కంటుంది ప్రతి తల్లి. కొండల మధ్యలో తిరుగాడడం వాళ్ళకు పుట్టుకతో వచ్చిన విద్య కాగా బరువులు మోసుకుంటూ ఎక్కి దిగడం ఉగ్గుపాలతో నేర్చిన విద్య. కాయకష్టంతో జీవనాన్ని గడిపే వాళ్ళకు శిక్షణాకాలంలో చేసే విన్యాసాలు సునాయాసంగా అనిపిస్తాయి. అందుకేనేమో ఆ తండానుండే ఎక్కువమంది జవానులుగా ఎంపిక కాబడుతూంటారు.

    గిరిజనుల కోసం బడులు కావాలనీ, కాలేజీలు కావాలనీ, విశ్వవిద్యాలయాలు కావాలని అడిగే రాజకీయ నాయకులే తప్ప తమకేం కావాలో తెలుసుకోలేని అమాయకత్వంలో ఉండే ఆ జనమే సామాన్యులకు ఎంతో కష్టతరమైన వాటిని సునాయాసంగా చేసేయగలుగుతారు.

    అనేక పేర్లతో పిలువబడే ఆయా తండాలలోని యువకులంతా చేరి ఏకమాటపై నిలచి ప్రయత్నిస్తారు. ప్రతి సంవత్సరం కొందరు తప్పకుండా ఎంపిక అవుతారు. అవకపోయినా నిరాశపడకుండా మళ్ళీ ప్రయత్నిస్తారు.

    చుట్టుపక్కల తండాల అమ్మాయిలు కూడా “వీరపుత్రుని వరింతునయ్యా – వీరపత్నిగ గర్వింతునయ్యా” అంటూ జవాను భార్యగా ఉండడానికే ఇష్టపడతారు.

    ఈశ్వర్ మొన్న నెలక్రితమే రెండు నెలల సెలవుమీద వచ్చాడు. ఏడాదిన్నర వయసున్న కూతురు బాగా మాలిమైపోయింది వదలలేక వదలలేక వెళ్ళాడు. ఆ ఊరి కుర్రకారుకి సెలవుమీద వచ్చినా రోజులు ఇట్టే గడచిపోతాయి. ఊరిలోని ప్రతి గుమ్మంతో పరిచయమే. అందరి అవసరాలూ తమవే. ఉదయం సాయంత్రం భవిష్యత్ జవానుల శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనడం- స్నేహితులతో కలిసి అడవిలో బాటకు అడ్డంగా ఉండే చెట్ల కొమ్మలు నరికి బాట ఏర్పరచడం- కొండలపై గట్లు కట్టి పోడు వ్యవసాయానికి ఏర్పాట్లు చేయడం కొండలమీద చీపురుపుల్లలూ, కుంకుళ్ళు యేరుకునే వారికి సాయం చేయడం- రాత్రి అందరూ ఒక చోట చేరి సామూహిక నృత్యం చేయడం – అంతా అంతే. అదే వారి జీవన విధానం.

    యే ఇంట్లో వేడుక లొచ్చినా, ఎవరింట్లో కష్టమొచ్చినా అందరూ అక్కడే. మొన్న రాము, నిన్న చిన్న, ఇవాళ ఈశు… ఎవరైతేనేం?

    ఆ పేటికలు ఎన్ని మార్లు తెచ్చారో? ఎవరైనా లెక్కించారా? లేదే…

    ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అంతిమ యేర్పాట్లు చూస్తోంది. గౌరవసూచకంగా పేల్చే ఆ శతఘ్నుల పేలుడు వింటున్న ఈశు తండ్రి కళ్ళల్లో మెరుపులు. తన జీవితం ధన్యమైనట్లు…

    ఆ రాత్రి… ఈశు తల్లి కొడుకుని తలచుకుని రాగాలు తీస్తూ…

    “అమ్మీ! ఈశు అమ్మా నాన్నగా మా బిడ్డడిని భూమాతకు ఇచ్చేసాం. కానీ… నీ గురించి… ఈశు గురించే బాధగా ఉందే తల్లీ! నీకు ఈ బొట్టి తప్ప…” అంటూ మాటలు మింగేసింది.

    తలవంచుకుని యేదో ఆలోచిస్తూ వింటూన్న గోరి(గౌరి) తల ఎత్తి చూసింది. చిన్న చిరునవ్వు పేలవంగా మెరిసిందామె పెదవులపై.

    మొన్న సెలవు మీద వచ్చినపుడే ఈశు చెప్పాడు. “మన అమ్మిని కూడా సైన్యంలో చేర్చేందుకు ముందు ముందు బోలెడు అవకాశాలు వస్తాయట.” అంటూ అతి సన్నని స్వరంతో “ఇపుడు ఈశు నా కడుపులో ఉన్నాడు.” అంది కడుపుని రెండు చేతులతో ఆప్యాయంగా నిమురుతూ…

    అద్బుతమైన నిర్ణయాలకు బీజం ఇలా సునాయాసంగా… ఎలా?

    అదే జీవనం హేలగా భాసించడమంటే.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here