Site icon Sanchika

జీవనానందం..!

[dropcap]తొ[/dropcap]లకరి జల్లుతో పులకరించిన అడవంతా
పచ్చదనాన్ని సంతరించుకున్న లోయలాగుంది
యవ్వనారంభంలోని ఆలోచనల మెరుపులు
మొగ్గలై వికసించిన వెలుగు సుమాలైనాయి
దేహమంతా ఉత్సాహంతో పొంగుతుంటే
తొలిసారి నడకలు నేర్చుకుంటున్నట్లుగా
ఆ ప్రదేశాలను గాలించడమొక తన్మయత్వం
ఆకులు రాలిన చెట్లకు చిగుళ్ళతో కొత్త శోభ
బోధించినవి వినూత్న విషయాలను…!

వసంతంలోని కోకిల కూతల కమ్మదనం
చుట్టుపర్చుకున్న విశాలమైన కొండల మధ్యన
కట్టుబొట్టులతో విశేషమైన సౌందర్యంతో
ఎప్పుడు వినని పలుకుల సొగసులతో
వెండి ఆభరణాల చక్కని అలంకరణలతో
కానవచ్చేవారిని గోండులు, కొలామ్‌లు
నామక్‌పోడ్, అంధ్, ప్రధాను అక్కడ
వుంటారని ఎరుక కల్గిన రోజులవి
వాళ్ళంటే ఎవరో కాదు అడవి పుత్రులు
అచ్చమైన అడవికి వారసులైన ఆదివాసులు
వాళ్ళను చూడడమొక వింతలా అనిపించేది
వసంతరావు దేశ్ పాండే గారి అడవి నవలలోని
చిత్రకారుని బొమ్మల్లోనే దర్శించాను మొదటగా
అరణ్యంలోని వారి జీవితానికి దర్పణమవి
ప్రత్యక్షంగా పరిశీలనలతో అర్థమయ్యింది నేడది
కర్రలతో గోడలను నిర్మించుకొని
వాటిపై ఎర్రని మట్టిని రుద్దుకొని
తెల్లటి అందమైన ముగ్గులను పెట్టుకొని
చెట్లను ఇండ్లను వేరుచేసి చూడలేనంతగా
అలుముకుని ఉండే ఆ నివాస ప్రాంతాలను
టక్కు గూడని, లొద్ది గూడని, రాంజీ గూడని
కొలామ్ గూడని, తాత ముత్తాల పేర్లతో
ప్రసిద్ధి చెందిన ఆదివాసీ గ్రామాలవి..!

కొన్ని చోట్ల తాండాలుంటాయి
అచట నాయక్ పెద్దగా వ్యవహరిస్తారు
శంకర్ నాయక్ తాండ, చీమ నాయక్ తాండ
వంటి నామాలతో పలకరిస్తుంటాయి
లంబాడీలుగా పేరుపొందిన వాళ్ళు కూడా
ఆ అటవీ ప్రాంతంలో గిరిజనులుగా
మనుగడ సాగిస్తూ, అందర్ని ఆత్మీయులుగా
అభిమానంతో అక్కున చేర్చుకుంటారు వాళ్ళు
ఒక వైపు అదివాసులు జీవన పోరాటం
మరో వైపు లంబాడీల విభిన్న బతుకుపోరు
అన్ని మతాలకు చెందిన ప్రజల సమూహంతో
మినీ భారతావనికి అచ్చమైన ప్రతీకలా
మిశ్రమ సంస్కృతికి ఒక కూడలిలా
వెలిసింది ఉట్నూరు గోండు రాజుల కోటలా
చెంతకు వచ్చిన వాళ్ళందరిని అమ్మలా
ఆదరించి, ఆశీర్వదించింది చల్లని దీవెనలతో..!

భవంతులను వీక్షించిన నేత్రాలకు
గుడిసెలు అంతగా కానరావు కావచ్చు
ఆదివాసుల నివాస నిర్మాణాలను
ఇండ్లంటే ఆశ్చర్యంగుండేది నాకు మనసులో
వానస్తే తడువడమే, ఎండలో నీడకై వెతకడమే
చలిలో వణుకుతు గడపడమే అన్నట్లుగున్నాయి
పొద్దంతా చేను పనుల్లో నిమగ్నమయ్యేది
రాత్రైతే జొన్న రొట్టెలతో కడుపునింపుకునేది
మిణుగురు పురుగుల వెలుతురుల్లోనే
గడిచిపోయేది వాళ్ళకు నెలలు నెలలుగా
ఇదేనా మన అభివృద్ధి అనుకునేది
ప్రతి గూడలో ఒక పెదరాయుడు ఉంటాడు
పటేల్ మాట మీదనే నిలబడుతారు వాళ్ళు
నాగరిక మానవులకు ఆశ్చర్యమేమో కాని
నేటికి కూడా వాళ్ళ జీవనానందం
ఒక పరనీయ గ్రంథమేనంటే నమ్మాల్సిందే…!

Exit mobile version