జీవన్మరణం

0
2

[dropcap]జీ[/dropcap]వన్మరణ సమస్య అంటే ఏమిటో నాకు అనుభవేక వేద్యం చేయిస్తున్నట్టుగా గత కొద్దిరోజులుగా ముఖ్యంగా రెండు సమస్యలు ఊగిసలాడుతున్నాయి. అసలు ఈ పరిస్థితి ఎలా వచ్చిందంటే నేను నా విధి నిర్వహణలో భాగంగా అటవీ ప్రాంతం నుండి నిర్వాసితుల తరలింపు కోసం వెళ్ళాను. ఆ ప్రాంతం పచ్చని ప్రకృతిలో అలరారుతూ ఆనందాన్ని, ఉల్లాసాన్ని విందు చేస్తున్నది. ఆ చుట్టు పక్కల గ్రామాల లోని వారంతా నిష్కల్మషమైన మనసుతో, అటవీ ఉత్పత్తులే ఆధారమై మరో ప్రపంచం తెలియని సుందర ప్రపంచంలో ఉన్నారు. చాలావరకు గిరిజన గ్రామాలే. ఎవరికీ సరైన అక్షర జ్ఞానం లేకపోయినా, అంతకు మించిన అనుభవసారం నన్ను ఆశ్చర్యచకితున్ని చేసింది.

ఆ అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణ నిమిత్తం వీరిని తరలించవలసిన అవసరం ఏర్పడి ముఖ్యాధికారిగా నేను వెళ్ళవలసి వస్తున్నది. దాదాపు నెలరోజులు కష్టపడ్డా వారి భాష నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. వారితో ఎలా ముందుకు సాగాలో తెలియలేదు. పోనీ భాష నేర్చుకుందామంటే లిపి లేని భాష. అలవోకగా మాట్లాడుతున్న వారి తీరుతో నాకేమీ అర్థం కాక తలపట్టుకున్న సమయంలో ‘యేముని’ పరిచయం కలిగింది.

ఓ రోజు మా సిబ్బంది అందరం చర్చించుకొని కొద్దో గొప్పో అక్షర పరిజ్ఞానం కలిగిన కొద్దిమంది యువతను సమీకరించి మొదట ఆంగ్లంలో మేము వచ్చిన పని గురించి వారి సహకారం గురించి అడగాలని ప్రయత్నించాం. కానీ వృధా ప్రయాసే అయింది. గమ్మతేమిటంటే వారు తమ భాషను, ఆ సరిహద్దు రాష్ట్రాల భాషను తప్ప ఏదీ వినడానికి మాట్లాడడానికి ఇష్టపడకపోవడం. నాకైతే మొదటిసారి అక్కడ అనుభవమైంది. జీవన్మరణ సమస్య. తర్జనభర్జనలతో ఎలా దీన్ని పూర్తి చేయాలా! అని ఆలోచిస్తున్న తరుణంలో ఓ రోజు మొదటిసారిగా ‘యేముని’తో మాట్లాడడం జరిగింది. లంచ్ అవడం వల్ల అందరూ బైటికెళ్ళారు. ఒక్కడినే నా గదిలో పేపర్లు తిరగేస్తుండగా “బాబుగారూ! దండాలండి” అన్న పిలుపుకు ఎవరన్నట్టుగా తలపైకెత్తాను.

“దండాలయ్యా! నా పేరు యేముడండి” అన్నాడు చేతులు జోడిస్తూ.

“ఏం పేరు?” అన్నా అర్థం కాక.

“యేముడండి… యేముడు” అన్నాడు అర్థం చేయించాలన్నట్టుగా.

“అదేం పేరయ్యా?” అన్నాను కాస్త నవ్వుతూ.

“నేను మా అయ్యా పెద్దగా సదువుకోలేదండి. కానీ మాయ్య వాళ్ళయ్య నేర్పిన రామాయణ, భారత, భాగవత, వేమన, సుమతి లాంటి తెలుగు పద్యాలంటే ఇష్టపడి మర్శిపోకుండా యాదివెట్టుకొని నాకు నేర్పిండయ్యా. అన్నిట్ల మానాయ్నకు వేమన పద్యాలు ప్రాణం. అండ్ల ‘భూమి నాదియన్న భూమి పక్కున నవ్వు’ అన్న పద్యం చాలా ఇష్టమయ్య. ఇప్పుడు నాక్కూడా అదే ఇష్టమయ్య అని ఆగక చెప్తూనే ఉంటే….”

“సరే… సరే… అదంతా నాకెందుగాని” అంటే.

“ఎందుకంటారేంటి బాబూ! అదేం పేరన్నారు గందా! మాయ్య ఆ పజ్జాలు రాసినాయన పేరు అభిమానంగా నాకు పెట్టుకున్నాడయ్య. అది చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను.”

“ఓహో! నీ పేరు వేమనా?” అన్నా.

“కాదయ్య! వేమయ్యండి. అందరూ యేముడంటారండి” అన్నాడు. అలా తొలిసారిగా యేముడి పరిచయం నాలో కొత్త ఆశలు కలిగించింది. కాస్తంత యాస ఉన్నప్పటికీ నగ్నమైన మనసుతో ఉన్న అతడే మాకు సహాయం చేస్తాడనిపించింది. అతడిని కూచోబెట్టి మా ప్రణాళిక దీనికి మేము చెల్లించే పరిహారము, పరిహారము ఇష్టపడని వారికి చేసే ఉపాధి మొదలైన విషయాలన్ని కూలంకషంగా చెప్పి మరునాడు గ్రామసభ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను సేకరించాలని తీర్మానించుకున్నాం.

యేముడు మేము చెప్పిందంతా విని దీర్ఘాలోచనతోనే వెళ్తున్నట్టు కనిపించినా సహాయం మాత్రం చేస్తానన్నాడు.

హమ్మయ్య! గ్రామస్థుల అభిప్రాయ సేకరణకు ఒక పాతాళగంగ దొరికిందని సంతోషించాను.

ఆ సాయంత్రం కార్లో ఇంటికి వస్తూండగా పబ్లిక్ గార్డెన్‍లో వారంరోజుల పాటు నాటికలు ప్రదర్శింపబడుతాయని నిర్వాహకులు ఏర్పాటు చేసిన కటౌట్ అక్కడ కనిపించింది. ప్రత్యేకించి తెలుగు నాటక రంగంలో సుప్రసిద్దుడైన సోమరాజు రామానుజరావు రచించిన నాటకంలే ఐదు ఉండడం విశేషం. పౌరాణిక నాటక ప్రదర్శనంటే నాకు చాలా ఇష్టం.

’వీరాభిమన్యు’ నాటక ప్రదర్శన మొదలయ్యింది. నారద పాత్రాధారి ”భరతమాతకు జయము, హైందవ స్వరాజ్య మాతకు జయము…’ అంటూ ఒక్ భారీ డైలాగు ద్వారా భారతమాతకు జేజేలు పలికాడు. నాటకం ఆసాంతం రసవత్తంగా సాగింది. చక్కటి తెలుగులో భాష మాధుర్యాన్ని చిత్రిక పట్టింది. ఎలాగైనా సరే, ఈ వారం రోజులు నాటకాలు చూడాల్సిందేనని నిర్ణయించుకున్నాను. కానీ కుదిరేట్టు లేదు.

మరుసటిరోజు ఉదయమే నేను హడావుడిగా బయల్దేరుతుంటే నాన్న అడిగారు. “ఏంట్రా ఈ రోజు ఇంత త్వరగా బయల్దేరుతున్నావ్?” అని.

“అవును నాన్న! తరలింపునకు సంబంధించిన ఆ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. స్థానికులను తరలించుటకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామసభలు నిర్వహించి పరిస్థితులను అర్థం చేయించాలని తీర్మానించుకున్నాం. ఇప్పుడు అ పనిమీదే వెళ్తున్నాను. సాయంత్రం వివరంగా మాట్లాడుకుందాం” అంటూ బయల్దేరాను.

కారు గ్రామం వైపు దూసుకుపోతున్నది. నాకైతే ఆ కుటుంబాలకు కాస్తంతైనా లౌక్యం లేదనిపిస్తున్నది. ప్రభుత్వం ఉపాధి చూపిస్తుంది, ఊరు ఖాళీ చేయండి అంటే వినరేం? వట్టి మట్టి మనుషులు అనుకుంటూ ఆలోచిస్తూండగానే గ్రామం చేరుకున్నా. నా తోటి అధికారులు కూడా చేరుకుని గ్రామసభ నిర్వహించాం. ఊరిపెద్ద కూడా ఐన యేముడుతో అందరికీ తమ భాషలో అర్థమయ్యేటట్టు చెప్పించి వారికి రెండు ఆప్షన్‍లు ఇచ్చాం. మీరు పునరావాసం ఏర్పాటు చేసుకోడానికి ఒకేసారి పెద్దమొత్తంలో నగదు ఇస్తామని, రెండోది పునరావాసం ఏర్పాటు చేసి విద్య, వైద్యం, త్రాగునీరు వంటి సౌకర్యాలను కల్పించడం అని రెండు ఆప్షన్‍లను ఇవ్వగా యేముడు అందరికి విషయం బాగా అర్థం చేయించి సగంమంది డబ్బులు, సగానికి ఎక్కువమంది పునరావాసం కోరుకుంటున్నట్టుగా చెప్పాడు. కానీ యేముడిని ఎలా నమ్మటం? తను మేము చెప్పినట్టుగా కాక మరలా చెప్పి ఒప్పించి ఉంటాడేమో! తెలుసుకోవాలనుకున్నాను. ఏదైతేనేం అనుకున్న కార్యం అనుకున్నట్టు పూర్తయినందుకు తేలికగా ఊపిరి పీల్చుకున్నాం.

***

సాయంత్రం పెందలాడే ఇల్లు చేరా. నా బంగారు తల్లి పోతన భాగవత పద్యం ‘మందార మకరంద….’ చాలా శ్రావ్యంగా కంఠస్థం చేస్తున్నది. అలాగే మైమరచిపోయా. ఐదేళ్ళ వయసున్న నా బిడ్డ అంత చక్కగా తెలుగు పద్యం పాడడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేయగా అడిగా, ఇంతలా ఎలా పాడగలుగుతున్నావని?

“ఇంకెవరురా? మనస్విని నేర్పిస్తుందిగా” అన్నాడు నాన్న.

“అవునా! మనస్విని తెలుగు పద్యాలు ఇంత చక్కగా పాడుతుందా? నేనెప్పుడు వినలేదే” అన్నా. నా భార్యను మెచ్చుకోలుగా చూస్తూ.

“నేను మాత్రం సొంతంగా నేర్చుకున్నానా? ఆసక్తి కాబట్టి మామయ్య తమ గదిలో భాగవతం పద్యాలు పైకి చదువుతుంటే వినీ వినీ నేర్చుకున్నాను. మాతృభాష కాబట్టి ఇట్టే వచ్చేసింది” అన్నది.

ఏమైనా నా చిట్టితల్లి పద్యపఠనం నాకు ఏనుగెక్కినంత సంతోషాన్ని కలిగించి ముద్దులతో ముంచెత్తాను.

ఆ సాయంత్రం యధావిధిగా మళ్ళీ నాటక ప్రదర్శన  ‘తిలక్‍ రాయబారము’ ప్రదర్శించారు. ఇది స్వాతంత్రోద్యమం అంశంతో రాయబడింది. ప్రదర్శన ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించి రక్తికట్టించారు. చిన్నారికి చాలా ఉత్సాహం కలుగుతున్నది. ఎంతైనా అమ్మపాల వంటి మాతృభాషలోని గొప్పదనం వల్లే, నాలోను అదే కదా! అనిపించింది. వారం రోజులు చూస్తూండగానే గడచిపోయాయి.

పునరావాస ప్రణాళికల్లో తలమునకలవుతున్నాం. యేముడితో నా సాహచర్యం బాగా పెరిగింది. నాకూ వారి భాష పట్ల మమకారం పెరిగి వారి పాటలను, పండుగ వేడుకలలో చేసే తంతులను క్షుణ్ణంగా తెలుసుకోవాలనే పట్టుదల, ఆతృతతో ‘అభ్యాసం కూసు విద్య’ అన్నట్టుగా యేముడినే గురువుగా చేసుకొని ఆ గిరిజనుల భాష నేర్చుకున్నాను.  వార్ కాకి (ఎనా ఉన్నావు చిన్నమ్మా?) అంటూ వాళ్ళకు మరింత సన్నిహితుడనయ్యాను.

కొద్దికాలంలోనే నేనే వాళ్ళకు మరోసారి స్పష్టంగా చెప్పి ఊరు ఖాళీ చేయించే పనికి శ్రీకారం చుట్టబోతున్నాం.

ఈ మధ్యలో కొంతకాలం వ్యక్తిగత పనులవల్ల సెలవు పెట్టాను. చిన్నారిని మంచి స్కూల్లో జాయిన్ చేయాలని జల్లెడ పడుతున్నాను. ఏ స్కూల్లో ఐనా ఒకటే మాట పూర్తి ఆంగ్ల మాధ్యమం అని, ఇంట్లో కుటుంబీకులు కూడా ఖఛ్ఛితంగా ఆంగ్లంలోనే మాట్లాడేవారై ఉండాలని పొరపాటున కూడా తెలుగు ఉచ్చారణ ఒప్పుకోబోమని, కాదు కూడదని మీ పిల్లలు మీరు ఏమైనా నిర్లక్ష్యంగా ఉంటే జరిమానా కూడా కట్టవలసి ఉంటుందని ఇలాంటివే మరికొన్ని షరతులు చెప్పారు. నాకు అవన్నీ విన్నాక తల దిరిగిపోయింది.

ఏమిటీ దారుణం ఉగ్గుపాలతో ఊంగా… ఊంగా అంటూ మొదలు పెట్టిన నా అమ్మభాష నేను మాట్లాడితే ఇంత శిక్షనా? అదే… అదే అడిగాను కూడా.

వాళ్ళు నన్నో బుద్ధిహీనుడిలా చూస్తూ మీ పాపకి ఉజ్వల భవిష్యత్ కావాలంటే తప్పదు. నేటి గ్లోబలైజేషన్ వ్యవస్థలో నిలబడాలంటే తెలుగు ఎందుకూ పనికిరానిది.

పనికిరానిది అన్నమాట నన్ను చాలా ఆవేశానికి గురిచేసింది. అయినా తమాయించుకొని “నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నానండి” అన్నాను. ‘గెజిటెడ్ ఉద్యోగం కూడా చేస్తున్నాను. మంచి భవిష్యత్తుకు మాతృభాష అందునా నా తెలుగు భాష పునాది వేసి సోఫానమవుతుందే తప్ప నిలువునా కూల్చివేయదని, మీరిలా చులకనగా మాట్లాడి మీ విద్యా వ్యాపారం పెంపవడానికి జనాలలో ఆ భావన ప్రోది చేయకండ’ని చెప్పాను.

“అలాగైతే హాయిగా సర్కారి బడిలో వేసుకోండి. మాదాకా రావడం దేనికి?” అంటూ కాస్త అసహనం చూపించినా, వాళ్ళు చెప్పింది అక్షర సత్యమే అనిపించింది. ఇంక వాదనలు అనవసరం అని మౌనంగా వచ్చేశాను. మాతృభాష అందునా నా తెలుగు భాష లేకుండా చిన్నారికి విద్య దుస్సాహసం అనిపించింది. పిల్లల బుద్ధివికాసానికి, నైతిక విలువలతో ఎదుగుదలకు తెలుగు భాషే సోపానమని నమ్ముతున్నవాన్ని అవడం చేత ఋజువుగా నేనే ఉండడం చేత కూడా చిన్నారిని ఆంగ్ల మాధ్యమంలో చేర్పించాలనే ఆలోచన విరమించుకున్నాను.

తెలుగు వెలుగు దశదిశలా వ్యాపింపజేస్తూ ఏర్పాటు చేయబడిన తెలుగు మహాసభలకు హాజరయ్యాను. తెలుగును మృగ్యం చేస్తూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పాఠశాలలు, నైతిక పురోగమనం లేకున్నా, తమ సంతానం ఆర్థికంగా పురోగమించాలని వెంపర్లాడుతున్న తల్లిదండ్రులు ఉన్న ఈ సమాజాన్ని మేల్కొల్పాలంటే ఇటువంటి ఆవశ్యకత చాలా ఉందని నేనూ ఓ కవితనై గళం విప్పి పాడాను. తెలుగు భాషా, పద్య విద్యా మూలాలను మరుగున పడిపోతున్న కావ్యాల దొంతరలను సగర్వంగా చాటి చెప్పిన విశిష్ట సదస్సులనే తేనెలూరే నా తెలుగు భాషా పవిత్ర నదిలో మునిగి పుణ్య స్నానాలు చేశాను. నా తెలుగు కీర్తితో రొమ్ము విరుచుకుని తెలుగువాడైనందుకు గర్వించాను.

ఆ తరువాతి రోజు ఉద్యోగంలో భాగంగా విధుల్లో జాయినవగానే ఆ గ్రామం వెళ్ళాను. యేముడు దిగాలుగా ఎదురొచ్చాడు. ఏమైందని అడిగాను. “మీరు సూపిన ఆశకు నా కొడుకు పట్నం వెళ్దామని ఆశపడుతున్నాడు. అలగైతే నా తరువాతి తరం నా భాషకు నా పండుగలకు సంప్రదాయాలకు ఈ మట్టికి దూరమైనట్టే గదయ్యా!

కూసోని తింటే కొండలైనా కరుగుతున్నట్టు మీరిచ్చే డబ్బులు ఓడ్శినంక ఆ పట్నంలో మాఓడు ఏ కూళీ నాలో చేస్కుంటు మట్టిని మరిచి ముట్టవుడే గదయ్య!” అన్నాడు.

“అలా ఎందుకవుతుంది? అయినా నిన్న మీరందరూ తీర్మానం చేసిందే కదా! మళ్ళీ ఇదేంటి కొత్తగా. వెళ్ళు…. వెళ్ళు” అన్నాను చిరాగ్గా.

“కోపగించుకోకండి బాబూ! పెద్దాడ్ని కాస్త మాట్లాడే అవకాశమియ్యండి” అన్నాడు.

నేను మౌనంగానే ఉన్నా.

మౌనం అంగీకారమనుకున్నాడో ఏమో! మళ్ళీ మొదలు పెట్టాడు. “ఇక్కడ వన్యప్రాణులున్నాయని వాటి రక్షణ అని మమ్మల్ని ఖాళీ చేయిస్తున్నారు గందా! మరి పులిలాంటి వ్యవస్థ నన్నే మింగేసే ప్రయత్నం చేస్తుంటే నన్నెవరు కాపాడతారు బాబూ?” అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here