Site icon Sanchika

జీవాత్మ ఆత్మ స్వరూపుడే!!!

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘జీవాత్మ ఆత్మ స్వరూపుడే!!!’ అనే రచనని అందిస్తున్నాము.]

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి।
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ॥
(భగవద్గీత 2 వ అధ్యాయం, సాంఖ్య యోగం, 22 వ శ్లోకం).

[dropcap]మా[/dropcap]నవుడు తన పాత వస్త్రములను త్యజించి కొత్త వస్త్రాలను ధరించినట్లే ఆత్మ కూదా శిధిలమైన, జీర్ణమైన తన పాత దేహాన్ని వదిలి నూతన దేహాన్ని ధరిస్తుంది. ఇదియే జనన మరణముల వెనుక వున్న రహస్యం అని పై శ్లోకం భావం.

ఆత్మ యొక్క స్వభావాన్ని వివరిస్తూ భగవానుడు పునర్జన్మ భావనను పునరుద్ఘాటించాడు, వస్త్రాలు చిరిగిపోయి పనికిరానివిగా మారినప్పుడు, కొత్తవాటికి అనుకూలంగా వాటిని విస్మరిస్తాము, కానీ అలా చేయడం వల్ల మనల్ని మనం మార్చుకోము. అదే విధముగా, ఆత్మ తన అరిగిపోయిన శరీరాన్ని విసర్జించి, మరొక చోట కొత్త శరీరంలో జన్మనిచ్చినప్పుడు, అది మారదు. దాని స్వభావాలలో ఎట్టి మార్పు వుందదు.

ఈ శరీరానికి అతీతమైన ఆత్మ ఆధారమని వైదిక సంప్రదాయ సిద్ధాంతం. దీన్నే ప్రాణం లేదా ఆయువు అంటారు. ఈ ఆత్మ జీవుని దేహంలో చేరుతుంది. తన కర్మల్ని అనుభవిస్తూ జీవిస్తుంది. ఇది దేహాన్ని ఒక ఉపాధిగా లేదా ఒక ఉపకరణంలా మాత్రమే వాడుకుంటుంది. ఈ వైదిక పునర్జన్మ సిద్ధాంతంలో ఆత్మ మాటిమాటికి మరలా మరలా అలా పుడుతూనే ఉంటుంది. అంటే ఆత్మ శాశ్వతం అని అర్థం. శాశ్వతమైన ఆత్మ, దేహాల్ని మార్చడమే పునర్జన్మ. దేహం అశాశ్వతం. ఆత్మ శాశ్వతం. దేహమనే చెట్టుపై ఆత్మస్వరూపుడైన జీవాత్మ తీవ్ర ప్రయాసలతో నివసిస్తుంది. కాని అదే పక్కనే వున్న గురువైన మరొక పక్షిని ఆశ్రయిస్తే గురూపదేశాల ద్వారా ఆత్మ జ్ఞానం పొంది శ్రీఘ్రమే అన్ని శోకాల నుండి విముక్తి పొందుతుంది. ఈ తరుణంలో అది మరొక వృక్షాన్ని (నూతన శరీరాన్ని) వెదుక్కుంటూ వెళ్ళిపోతుంది. యజ్ఞ వేదికపై దేహాన్ని విడిచిపెట్టే వాడు తప్పక విముక్తుడై ఉత్తమ జన్మను పొందుతాడు కనుక నువ్వు అన్ని శోకాల నుండి విడివడి తప్పక యుద్ధం చేయమని భగవానుడు అర్జునుడిని కర్తవ్యోపదేశం చేసాడు.

ఈ సిద్ధాంతాన్ని దాదాపుగా అన్ని మతాలు, మహాత్ములు అంగీకరించారు. కొన్ని ఆలోచించలేనివి ఉంటాయి, ఎవరైనా వాటి గురించి ఆలోచించాలని ప్రయత్నిస్తే, వారు వాటిని ఎప్పటికీ పరిష్కరించలేరు,. వాటిలో ఒకటి కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం, విశ్వం మూలాల గురించి ఆలోచించడం, దానిని సృష్టించారా, లేదా అనేది ఊహించడం. “మొదట శరీరం చనిపోతుంది, తర్వాత ఇంద్రియాలు, తర్వాత శ్వాస నశిస్తాయి. అన్నీ పోయిన తర్వాత పునర్జన్మ పొందే అత్యంత సూక్ష్మ భాగం మాత్రమే మిగులుతుంది” అని గౌతమ బుద్ధుడు చెప్పారు.

మహర్షి పత్రీజీ ఒక సందర్భంలో ఆత్మ శాశ్వత తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. నిరుక్తం అన్నది ఒకానొక ముఖ్యమైన వేదాంగం.

అది పునర్జన్మ గురించి ఇలా చెప్తోంది:

“మృతత్చాహం పునర్జాతో జాతశ్చాహం పునర్ మృతః
నానా యోని సహస్రాణి మయోషితాని యానివై”

జ్ఞాని అయినవాడు – ‘నేను చాలాసార్లు పుట్టాను, మరణించాను; ఎన్నో యోనులలో నివసించాను’ అని తెలుసుకుంటాడు అని పై శ్లోకం తాత్పర్యం.

బ్రహ్మలోక పర్యంతం ఉన్న సమస్త లోకాలన్నీ కూడా పునరావృత్తములు; కానీ నేను సదా వసించే ఆత్మస్థితికి చేరిన వారికి ఇక పునర్జన్మ ఉండదు. కనుక నేను ఆత్మస్వరూపుడను అని గుర్తించుకుని ఆ ప్రకారంగా స్థితప్రజ్ఞత్వంలో జీవించిన వాడికి ఇక మళ్ళీ ఈ భూమి మీదకి తిరిగి రావలసిన అవసరం ఉండదు.

Exit mobile version