[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘The day I saw Death’ అనే ఆంగ్ల కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]నే[/dropcap]ను విసుగెత్తిపోయి ఉన్నాను. ఇంట్లో అన్ని విషయాలనూ, ప్రతి ఒక్కరినీ పట్టించుకునేదీ నేనే. అయినా నేనంటే ఎవరికీ లెక్కలేదు. పైగా ‘పర్వాలేదులే, లైట్ తీస్కో’ అన్నట్టుంటారు.
ఈ రోజు పొద్దున్న ఏమైందో తెలుసా? పొద్దున్నే తాజాగా నిద్ర లేచాను, నాకూ, మా ఆయనకీ కాఫీ కలిపాను. కప్పులో పోసుకుని, మా ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో కూర్చుని, చల్లగాలిని ఆస్వాదిస్తూ కాఫీ గుటకలు వేయసాగాను.
అప్పుడే వ్యాయామం పూర్తి చేసి వచ్చిన మా ఆయన.. మొదలెట్టారు.. “పిల్లలింత సోమరుల్లా ఉండడం నాకు నచ్చటం లేదు. కనీసం వాళ్ళు పొద్దున్నే లేవడం లేదు” అన్నారు.
రోజూ ఉదయాన్నే నిద్ర లేచే నాకు ఆ అలవాటు ప్రయోజనాలేంటో తెలుసు, కానీ పదేళ్ళ నా కవల పిల్లలు దాన్ని అర్థం చేసుకునేంత పెద్దవాళ్ళు కాదు. క్రమశిక్షణ అవసరమే. అది నేర్పించేదిలా ఉండాలి కానీ వేధించేదిలా ఉండకూడదన్నది నా ఉద్దేశం.
“ఆ కౌశిక్‍ని చూడు. మన దద్దమ్మల కంటే ఒక సంవత్సరం చిన్నవాడు. పొద్దున్నే లేచి టెన్నిస్ క్లాసులకి వెళ్తాడు, తర్వాత స్కూలికి వెళ్తాడు, పియానో నేర్చుకుంటాడు, మైకేల్ జాన్సన్‍లా డాన్సులు చేస్తాడు. మరి మన వెధవాయ్‍లో.. చదువులో తప్ప మిగతా ఏ విషయంలోనూ పనికిరారు.”
“చాలు, ఆపండిక. మీరు కన్న కొడుకులనే నిందిస్తున్నారు..” అంటూ ఆ కఠోర వచనాలను వినలేక చెవులు మూసుకున్నాను. పిల్లల గురించి కన్నతండ్రి ఆలోచించాల్సింది ఇలాగేనా? కాస్త సానుకూలంగా ఆలోచించలేడా?
“నీకు నా పరిస్థితి అర్థం కావడం లేదు. నా తోటి వాళ్ళ పిల్లలంతా విజయాలు సాధిస్తున్నారు. నాకేమో ఇద్దరు, కవలలు.. ఒక్కోక్కడికి వాళ్ళల్లో సగం టాలెంటైనా లేదు..”
“మీకిద్దరు కవలలన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి.. అంటే మీకు రెట్టింపు దీవెనలన్నమాట. అన్నిసార్లు విజయాలే ఘనతలు కావు.. టెంత్ క్లాసులో మీరు జిల్లా ఫస్ట్ వచ్చారు. అప్పటి ఆ విజయం.. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యాకా కూడా అంతే ఆనందం ఇస్తుందా?”
“ఆఁ, ఇస్తుంది.”
“కానీ, డిగ్రీలో నాకొచ్చిన గోల్డ్ మెడల్.. ఇప్పుడు నాకు అంతటి ఆనందాన్నివ్వదు. జీవితంలో ఎదుగుతూండాలి అనే వాస్తవాన్ని విస్మరించిన మూర్ఖురాలిని నేను.”
“అవును. నా అభిప్రాయం కూడా అదే! నీకు జీవితంలో ఓ లక్ష్యం ఉందని అనుకున్నాను. ఖాళీగా ఉండకుండా, సోమరితనాన్ని ప్రోత్సహించకుండా ఉంటావని భావించాను.”
“సోమరినా? నేనా? కుటుంబంలో ప్రతి ఒక్కరి అవసరాలు మీకు తెలుసా? నాకు తెలుసు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి సంరక్షణా బాధ్యత నేను తీసుకున్నాను. పైగా మీకు ఆర్థికంగా కూడా తోడ్పడుతున్నాను. ఇంత నిస్వార్థంగా సేవ చేస్తుంటే, నాకొచ్చిన బిరుదు సోమరినని! అంతేలెండి, నాకిలా కావాల్సిందే, నేను మీకు తగినదాన్ని కాదు..”
వాతావరణం వేడెక్కుతోంది. “దేన్నైనా సరిగా చేయకపోవడాన్ని సమర్థించుకునేందుకు వాడుకునే ఆయుధం ‘నిస్వార్థం’ అనే మాట” – మా ఆయన నా పుండు మీద కారం జల్లారు. నా హృదయాన్ని గాయపరిచి, సగం తాగిన కాఫీ కప్పుని అక్కడే ఉంచేసి, వెళ్ళిపోయరు. ఆ కాఫీ లాగే నా ఉత్సాహం కూడా చప్పచల్లారిపోయింది.
***
డైనింగ్ టేబుల్ వద్ద వాతావరణం అట్టుడుకుతోంది. నేను మౌనంగా మా అత్తగారికీ, మా ఆయనకీ ఇడ్లీలు, సాంబారు, పుదీనా చట్నీ వడ్డించాను. నాక్కూడా వడ్డించుకుని తినడానికి కూర్చున్నాను. ఇది వరకు నేను తినడం మొదలుపెట్టేవరకు తాను తినకుండా ఆగేవారు నా ప్రియమైన శ్రీవారు. ఆయన ప్లేట్ కేసి చూశాను, టిఫిన్ తినడం దాదాపుగా పూర్తయిపోయింది. నా కోసం ఆయన ఆగలేదని నాకు బాధ లేదు – బదులుగా, ఆయన ఆగకుండా తినేసినందుకు ‘హమ్మయ్య’ అనుకున్నాను. ప్రతిసారీ పూర్తిగా ప్రతికూలమైన – ‘నేను ఉత్తముడిని, నువ్వే అథమం’ అనే ప్రకటనను ఎవరు మాత్రం వినాలనుకుంటారు?
“నేను మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వస్తాను, మీరు భోజనం చేసేయండి” అని డ్రాయింగ్ రూమ్ నుండి అరిచారాయన, బయటకొచ్చి షూ లేస్‌లు కట్టుకుని, “నీ జంట కుంభకర్ణులు అప్పటికి నిద్ర లేస్తారేమో చూద్దాం!” అన్నారు.
“మీ పిల్లలను రాక్షసుడి పేరుతో పిలుస్తారా?” అని అరిచాను. “అత్తయ్యకి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ కొనడానికి నేను పాత నగరంలో ఉన్న టోకు మార్కెట్ ఏరియాకు వెళ్లాలి. నేను చిన్న కారు తీసుకెళ్తాను, మీరు పెద్ద కారు తీసుకెళ్ళండి” అన్నాను.
“ఓహ్, ఆ ఏరియానా! బాగా రద్దీగా ఉంటుంది, పైగా సరుకు వాహనాల దారి కదా, భారీ సరుకులతో నిండి ఉంటుంది! ఆటోలో వెళ్ళు. లేదా, అందుకు నీ హోదా అడ్డొస్తే, క్యాబ్‌లో వెళ్ళు. పార్కింగ్ స్థలం చాలా దూరంలో ఉంటుంది, నువ్వు ఎవరినైనా గుద్ది, కారుని సొట్టలతో ఇంటికి తెచ్చే ప్రమాదం ఉంది.”
నాకు చిరాకేసింది. ఇంట్లో అందరి బాగోగులూ నేనే చూడాలని ఆయన అనుకున్నప్పటికీ, నా సౌఖ్యం గురించి మాత్రం పట్టించుకోరు. పైగా, నా కంటే కారే ఎక్కువ! ఎంత డబ్బుమనిషి, మెటీరియలిస్ట్!
“అనవసరమైన విషయాలకి మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? మగాళ్ళెప్పుడూ కాస్త నోరు జారుతూనే ఉంటారు. ఆడవాళ్ళే సర్దుకుపోవాలి. వీడి నాన్న కూడా ఇలాగే ఉండేవారు. నేను సర్దుకుపోలేదా?” అన్నారు మా అత్తగారు.
ఇప్పుడిక ఈవిడ వంతు! కాళ్ళు తుడుచుకునే డోర్‌మాట్‌లా నన్ను తీసిపడేస్తారావిడ. ఆమెని కన్నతల్లిలా చూసుకుంటున్నా కూడా ఆవిడ నాకు విలువ ఇవ్వరు. తన కొడుకు అడగకపోయినా, అతనికి మద్దతుగా నిలిచేందుకు ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎవర్ రెడీ! ఎవెరెడీ బ్యాటరీలకు ఆమెను చూసే ఆ పేరు పెట్టారేమో!
“అత్తయ్యా, నేను వెళ్ళి తయారవుతాను. మీకు తెలుసుగా, నేను మీకు ఆక్సిజనేటర్ కొనుక్కురావాలి” అంటూ, మా మధ్య వాగ్వివాదం పెరగకముందే డైనింగ్ రూమ్ నుండి లోపలి గదిలోకి నడిచాను.
***
కాబ్ డ్రైవర్ దారి తప్పి ఆలస్యంగా వస్తున్నాడు. ఈ రోజేంటో, అన్నీ ఎదురుదెబ్బలే, అందులోనూ నా తప్పు లేకుండా.
ఏవో ఆలోచనలు మనసుని తొలుస్తున్నాయి. నేను, బాధ్యత పట్టని ఓ పురుషాహంకారిని పెళ్ళిచేసుకున్నానా? మరి నేను ముందే ఎందుకు గ్రహించలేకపోయాను? అతనికీ, అతని కుటుంబానికీ ప్రగతిశీల దృక్పథం ఉన్నట్టు అనిపించలేదని అమ్మానాన్నలు నాకు చెప్పలేదా? వాళ్ళ మీద గుడ్డి ప్రేమతో నేనే పట్టించుకోలేదా? దాని మూల్యం, నేను మనశ్శాంతినీ, ఆనందాన్ని కోల్పోవడమే.
“అత్తయ్యా, భోజనం టేబుల్ మీద పెట్టాను. మీరు తినే వేళకన్నా ముందే తిరిగొస్తాను, ఒకవేళ ఆలస్యం అయితే మాత్రం మీరు తినేయండి.”
“నా ప్రియమైన కోడలా, శనాదివారాల్లో మనిద్దరం కలిసి తినడానికి ఇష్టపడతానని తెలుసుగా?”
ఈవిడేమో తన ప్రేమతో నన్ను చంపుతోంది, ఈమె కుమారరత్నమేమో తన ఉదాసీనతతో, వంకర మాటలతో చంపుతున్నాడు! ఇలా బ్రతకటం, చావు కంటే దుర్భరం!
“నాక్కూడా మీతో కలిసి తినడం చాలా ఇష్టం అత్తయ్యా. కానీ మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. దయచేసి వేళకి భోంచేయండి. క్యాబ్ సమయానికే వచ్చి ఉంటే, మీకింతలా చెప్పాల్సి వచ్చేదే కాదు. వీలైనంత తొందరగా వచ్చేస్తాను” అని చెప్పి, బయలుదేరాను.
***
నేను క్యాబ్‍లో కూర్చోగానే, సర్జికల్ షాప్‌కి ఫోన్ చేసి, మరో ముప్ఫై-నలభై నిమిషాల్లో అక్కడికి చేరుకుంటానని షాప్ యజమానికి చెప్పాను. వాళ్ళ దగ్గర ఆక్సిజనేటర్ స్టాక్ ఉందని ధృవీకరించి, నన్ను రమ్మని చెప్పాడు.
నా ప్రయాణం మృదువుగా సాగలేదు. నేననేది రోడ్ల గురించి కాదు. క్యాబ్ డ్రైవర్ మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నాను. నేను లొకేషన్ కరెక్ట్ గానే పెట్టాను, అయినా ఎందుకో సులభంగా చేరలేకపోతున్నాడు. చివరికి షాప్ యజమానికి ఫోన్ చేసి రూట్ చెప్పమన్నాను. షాప్ ఆయన చెప్పే డైరెక్షన్స్ పూర్తిగా వినడానికి డ్రైవర్‌కి ఓపిక లేదు, ఆ ఏరియా చుట్టూ రెండు-మూడు రౌండ్లు వేసి, చిరాకుపడి, కాసేపటి తర్వాత దారి నన్నే వెతుక్కోమంటూ, నన్ను వదిలేసి తన మానాన తాను పోయాడు. మండుటెండలో నడవాల్సి వచ్చింది, అంతే కాదు, నేను క్యాబ్‌లో నా వాటర్ బాటిల్‌ను మరచిపోయాను! పైగా, ఈ సంప్రదాయ హోల్‌సేలర్ షాపులో స్వైపింగ్ మెషీన్ లేదు! ఎంత దుర్భరమైన రోజు! నా బ్యాగ్‍లో డబ్బుందని పసిగట్టి ఎవరైనా బ్యాగ్ లాక్కుంటే? యాభై వేల రూపాయలు నావి కాకుండా పోతాయి!
అయినా నేనేంటి, ఇలా నెగటివ్‍గా ఆలోచిస్తున్నాను? కావల్సిన ఎక్విప్‍మెంట్ కొనుక్కుని, త్వరగా ఇంటికెళ్ళి అత్తగారికి తినేటప్పుడు కంపెనీ ఇవ్వాలికదా!
మొత్తానికి ఆ షాపుకి చేరాను. నన్ను సాదరంగా ఆహ్వానించారు. అది ఇరుకుగా ఉన్న చిన్న షాపు. యజమాని కూర్చోడానికో చెక్క కుర్చీ, క్లయింటు కూర్చోడానికో చెక్క స్టూలు!
“కూల్ డ్రింక్ తాగుతారా మేడం?” షాప్ యజమాని అడిగాడు.
“వద్దండీ! మెషీన్ ఎలా పని చేస్తుందో ఒకసారి చూపిస్తే, తీసుకెళ్తాను.”
“ఒక్క నిమిషం మేడమ్, గోడౌన్ నుంచి తెప్పిస్తాను, పదిహేను నిముషాల దూరం, అంతే!”
“అదేంటి? నేను చాలా సేపటి క్రితమే చెప్పానుగా, వస్తున్నానని?”
“సారీ మేడమ్, సాధారణంగా వస్తామని చాలామంది ఫోన్లు చేస్తారు, కానీ రానే రారు.”
నా నిజాయితీని నా కుటుంబం అర్థం చేసుకోదు సరే, కానీ ఈయన కూడా దాన్ని నమ్మడం లేదు!
“ఒరే అబ్బాయ్, మహావీర్! వెళ్ళి మేడమ్ గారికి ఆక్సిజనేటర్ పట్టుకురా” అన్నాడు.
అరగంట గడిచిపోయింది. మహావీర్ జాడ లేదు. నాలో ఓపిక నశిస్తోంది.
“ఇంకెంత సేపండీ? ఇలా కూర్చోబెడితే, మీకు కస్టమర్లు దొరుకుతారా?”
“సారీ మేడమ్, నేను మా వాడితో మాట్లాడుతూనే ఉన్నాను. వాడు దాన్ని గుర్తించలేకపోతున్నాడు. పైగా అది ఎక్కువగా అమ్ముడుపోయే వస్తువు కాదు. పైగా చాలా పెద్దదీ, బరువైనదీ..” అని నాకు చెప్తూ, ఫోన్‍లో “అటక మీద కుడి వైపుకు చూడు మహావీర్..” అని ఆ కుర్రాడితో అన్నాడు.
***
“అత్తయ్యా, ఇక్కడ వీళ్ళింకా మెషీన్ చూపించలేదు. ఇంకా ఎంతసేపు పడుతుందో చెప్పలేను.. నా భోజనం గురించి ఆలోచించకండి.. మీరు తినేయండి.. నేను ఆకలిని తట్టుకోగలను..” అని చెప్పి ఫోన్ పెట్టేశాను.
***
మరికొంత సమయం గడిచింది. నా సహనం నశించింది.
“అసలు మీ దగ్గర స్టాక్ ఉందా, లేదా?” అడిగాను.
“దొరికింది మేడమ్, తెస్తున్నాడు” చెప్పాడాయన.
ఎట్టకేలకు ఆ మెషీన్ గోడౌన్ నుంచి షాపుకు వచ్చింది. కొన్ని క్షణాల తరువాత,
“సారీ మేడమ్, మేమీ రోజు దీన్ని అమ్మలేం. దీని ప్లగ్ కనబడటం లేదు.” అన్నాడాయన
“సరిగ్గా చూడండి, లోపలే సైడుకి ఎక్కడో ఉంటుంది” చెప్పాను. మళ్ళీ వెతికాడు.
“ఆఁ, కనబడింది” అని నాతో చెప్పి, “వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టాను.. ఆఁ, కనబడింది” అంటూ ఆ మిషన్‍ని టెస్ట్ చేసి చూపించసాగాడు.
“మేడమ్, చూడండి.. ఆక్సిజన్ అందుతున్నట్టు తెలుస్తోందా?” అడిగాడు.
తలూపాను.
“మహావీర్, జాగ్రత్తగా ప్యాక్ చేయ్” అంటూ ఆదేశాలిచ్చాడు. కొద్దిసేపటికి ప్యాకింగ్ పూర్తయింది.
“ఆటో పిలవనా మేడమ్?” అని అడిగి, తనకి తెల్సిన ఆటో డ్రైవర్‍ని ఫోన్ చేశాడు.
“మాణిక్యం, మా షాపుకి.. అదే షాప్ నెంబర్.. వచ్చేయ్” అన్నాడు. బహుశా ఆ మాణిక్యం అనే అతనికి కుదరలేదనుకుంట. రాలేదు.
కాసేపు చూసి, నేనే ఓ క్యాబ్ బుక్ చేసుకున్నాను. కొన్ని క్షణాల తరువాత, ఆ డ్రైవర్ ఫోన్ చేశాడు.
“సారీ అండీ, ఈ రోజు రోడ్డు మరీ ఇరుకుగా ఉండి, లొకేషన్ వరకూ క్యాబ్ రావడానికి వీలుగా లేదు. 300 మీటర్ల దూరంలో ఉన్న జంక్షన్ వరకు వస్తే, మీరు అక్కడ ఎక్కచ్చు.”
చేసేదేం లేక సరేనన్నాను. ఆ మాటే షాపాయనకు చెప్పి,
“అక్కడి వరకూ ఈ మెషీన్‍ని తీసుకురావడానికి మీ కుర్రాడు సాయం చేస్తాడా?” అని అడిగాను.
“తప్పకుండా మేడమ్” అంటూ, ఆ మెషీన్‍ని తీసుకుని జంక్షన్ వరకూ నా వెంట వెళ్ళమని మహావీర్‍ని ఆదేశించాడాయన.
***
సరుకులు మోసుకెళ్ళే బళ్లూ, జనాలను తప్పించుకుంటూ ఆ ఇరుకు సందులో జాగ్రత్తగా నడుస్తున్నాను. ఇంతలో వెనక నుంచి ‘ట్రింగ్ ట్రింగ్’ మంటూ బెల్ మోగింది, “తప్పుకోండి, తప్పుకోండి” అనే అరుపు వినబడింది. నేను పక్కకు తప్పుకునే లోపే ఆ వాహనం హ్యాండిల్ నాకు తగిలింది. పేడ మరకలున్న రోడ్డుపై పడిపోయాను. ఓ లావుపాటి టైరు నా వీపుకి గట్టిగా తగిలింది. నన్ను గుద్దేసి వెళ్ళిపోబోతున్న అతన్ని ఆగమంటూ అరిచాను. మహావీర్, మరికొందరు పాదచారులు పరుగెత్తుకెళ్ళి అతన్ని ఆపారు. నేను మొదట అనుకున్నట్టు అది సైకిల్ కాదు. లోడ్ తీసుకెళ్ళే బండి.. ట్రాక్టర్‌కి ఉండేంత పెద్ద టైర్లు ఉన్నాయి దానికి. “నేను గట్టిగానే అరిచాను, కానీ ఆవిడే తప్పుకోలేదు..” అంటున్నాడతను, తన తప్పేం లేదన్నట్టు. చచ్చిపోయేదాన్నేమో! లేచి చుట్టూ చూశాను. జనాలు నాకు సాయం చేశారు. నీళ్ళు తెచ్చిచ్చి మొహం కడుక్కోమన్నారు, తాగడానికి మంచినీళ్ళిచ్చారు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు అతన్ని మందలించారు. అందరికీ ధన్యవాదాలు చెప్పి అక్కడ్నించి కదిలి క్యాబ్ ఆగి ఉన్న చోటుకు చేరాను. మహావీర్ ఆ మెషీన్‍ని కారు డిక్కీలో పెట్టాడు. కూర్చున్నాను. కారు కదలగానే ఆలోచనల్లో లీనమయ్యాను. ఇంటికి ఫోన్ చేసి జరిగింది చెప్పాలనుకుని హ్యాండ్ బ్యాగ్ లోంచి సెల్ తీయబోతుంటే, రక్తం మరక కనబడింది. బాగా గాయపడిన మోచేతి క్రిందుగా రక్తం కారిందని గ్రహించాను.
జరిగిన ప్రమాదం గురించి ఆలోచించాను. అది హెవీ టైర్. దానికి తగినంత హార్స్ పవర్ లేకపోవడమే నన్ను కాపాడింది. కానీ అప్పుడు నాకు భయం కలగలేదు. బహుశా, నన్ను పైకి పిలిచేందుకు అది సమయం కాదని దేవుడు తలచినట్టున్నాడు. కానీ నేను బండి కింద పడ్డప్పుడు – నాలో ఏదో నిర్వికారం, ఒక ప్రశాంతత – అదెన్నడూ నా స్వభావంలో మునుపు లేనే లేదు. నాకా క్షణంలో ముద్దులొలికే నా కవల పిల్లల ముఖాలు కూడా గుర్తు రాలేదు!!
కాసేపు వింతగా అనిపించింది. కొన్ని క్షణాల అనంతరం ఓ అసౌకర్యపు భావన నాలో మెదిలింది. బహుశా, ప్రేమరాహిత్యం, తగినంత స్వేచ్ఛా సంతోషాలు లేకపోవడం, ఇంట్లో గుర్తింపు లేకపోవడం వంటివి.. చావుని కూడా మరుగున పడేశాయేమో! నేను బ్రతికే ఉన్నాను, కానీ నా ఆత్మ జ్యోతి ఏనాడో ఆరిపోయింది.
అందుకే, ఇప్పుడు నిర్ణయించుకున్నాను.. ఇకపై బ్రతికినంత కాలం.. జీవించాలని!
ఆంగ్ల మూలం: డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
స్వేచ్ఛానువాదం: కొల్లూరి సోమ శంకర్