[dropcap]హ[/dropcap]ఠాత్తుగా నిలిపివేయబడిన
జీవనగమనాన్ని
స్తంభించిన కాలానికే
పరిమితమైపోయింది..!
గతకాలపు జ్ఞాపకాలన్నీ
గువ్వ పిట్టల్లా ఒదిగి పోయాయి!
ఇంతకాలం ఆరోగ్య సూత్రాలను
బంధించడం తో…
అనారోగ్య ఖాతాలు తెరుచుకున్నాయి!
శరీరంలోని ఒక్కో అవయవానికి
ఒక్కో రకపు తర్ఫీదు కావాలిప్పుడు…!
అడుగే ముందుకుపడనప్పుడు…
నడకనెలా సాగిస్తాం..!
ఎక్కడచూసినా మూసుకుపోయిన
ద్వార బంధాలు కనిపిస్తుంటే
మాటలెలా కలుపుతాం..!
సమాజం నిండా వ్యక్తిత్వాలు మార్చుకున్న
మనుషులే కనిపిస్తున్నారిప్పుడు..
కలిసిన ప్రతి మనిషీ
జీవితాన్ని కొత్తగా నేర్చుకుంటున్న
విద్యార్థులు గా అగుపిస్తున్నారు..!
కాలం ఒడిలో రూపాంతరం చెందిన
కొత్త జీవితాలను ప్రతిఒక్కరూ
స్వాగతించాలి..!
వ్యాయామం తో ఆరోగ్యాన్ని పునర్నిర్మించాలి..!