రంగుల హేల -1: జీవితం సినిమా కాదు

    0
    7

    [box type=’note’ fontsize=’16’] “అల్లూరి గౌరీలక్ష్మి ఆలోచనలు, మంచి మాటలు, సరదా కబుర్ల శీర్షిక ‘రంగుల హేల’లో తొలి ఆలోచన జీవితం సినిమా కాదు. [/box]

    “ఇది జీవితం! సినిమా కాదు ! నచ్చిన గంతు వెయ్యడానికి!”

    బతుకును, రమణీయంగానూ, రంగుల భరితంగానూ ఊహించుకునే యువతను చూసి పెద్దవాళ్లనే మాటలవి. కాలేజీలో చదువుతూ సీతాకోక చిలుకల్లా బాగా బతికున్న రోజుల్లో మనమూ విన్నాం  ఆ మాటలు.

    సినిమా అంటే  ఓ కలల ఉయ్యాల

    అందరికీ నచ్చే ఓ ఆశల అల్లిక

    ఉత్సాహాన్నిచ్చే ఊహల మాలిక

    ఆ ఉయ్యాల ఊగాలనీ, అందంగా అల్లిన ఆ మాలికలను చూసి ఆనందించాలనీ అన్ని వయసుల వారూ కోరుకోవచ్చు.

    సినిమా ఒక రంగుల కల. కళాకారుల ఊహ. చక్కటి మాటల పొందికతో ఒక అమరికతో ఉంటుంది. అది కళల సమ్మేళనం. అనేకమంది కళాకారుల ఉమ్మడి కృషి ఫలితం.

    మరి జీవితం? అలా కానే కాదు. ఒక పద్ధతీ పాడూ లేకుండా రోడ్డు కడ్డంపడి పోతున్న ఎడ్ల బండిలా ఉంటుంది. ఎడ్లను అదిలించీ, బెదిరించీ నడిపేవాడు అనుకునే దారిలో బండి నడపడం ఎంత కష్టమో జీవితమూ అంతే.

    మనకి బోల్డంత ప్లాన్ ఉండొచ్చు. తెలివుండొచ్చు. డబ్బులుండొచ్చు.హోదా ఉండొచ్చు. ఇవేమీ బతుకు బండిని నడిపించడానికి అంతగా ఉపయోగపడవు. అయినా ఎలాగోలా లాగించక తప్పదు. అలా అని చివరికి జీవితంలో ఒక సందేశమూ, పాడూ కూడా ఉండవు. కనీస సౌలభ్యం కూడా ఉండదు. ఆ మాటకొస్తే అర్థం కూడా ఉండదు. కవులూ, బుద్ధిజీవులూ జీవితాన్ని బలవంతంగా పిండి, కాస్త ఔన్నత్యం లాంటిదేదో కలిపి దాని మీద కవితలూ, పద్యాలూ, రాసి ఊరిస్తారు కానీ చూడబోతే బతుక్కంత సినిమా సీన్ లేదని పిస్తుంది.

    చిత్రం ఏమిటంటే జీవితం సినిమా కాదని సినీ ప్రపంచంలో పనిచేసే వారందరికీ తెలుసు. అది సినిమా పరిశ్రమలోని వాళ్ళకి కూడా అందని మాయా నాటకం. వారంతా సినిమాలు నిర్మించొచ్చు, దర్శకత్వం వహించొచ్చు. సంగీత, సాహిత్యాలు సమకూర్చొచ్చు. ఆఖరికి హీరో హీరోయిన్లుగా నటించొచ్చు. వివిధ సాంకేతిక శాఖల్లో పనిచేస్తూ కూడా ఉండొచ్చు.  అయినా వాళ్ళెవరూ కూడా, ముందుగా రాసిన స్క్రిప్టులాగా జీవితాల్ని మలచుకోలేరు. నచ్చిన వారిని పెళ్ళాడలేరు. తీర్చిదిద్దిన జీవనాన్ని సాగించలేరు. సామాన్యుల్లాగే ఎదురుదెబ్బలు తగిలించుకుంటూ బతుకు చేతిలో పెద్ద పెద్ద మొట్టికాయలు తింటూ ఉండాల్సిందే.

    నటులకీ కుటుంబాలుంటాయి. తల్లి తండ్రులుంటారు. వాళ్ళకీ కుల, మత, ప్రాంతీయ భేదాలుంటాయి. అందుకే వాళ్ళు పిల్లల ప్రేమ విషయంలో విలన్  పాత్ర పోషిస్తారు. కొందరు పిల్లల సంపాదన దోచే దొంగలుగా కూడా ఉంటారు.

    సినిమా కష్టాలు  వేరు. సినిమా వాళ్ళ కష్టాలు వేరు. వాళ్ళకీ మనలాగే ఆర్థిక బాధలూ, కాస్ట్ ఫీలింగ్స్, వర్గ విభేదాలూ,  జెండర్ డిస్క్రిమినేషన్సూ ఉంటాయి. వాటిని అధిగమించాల్సిందే! తప్పదు.

    సినిమా రంగు రంగుల చిత్రాలు చూపించి చివర్న తెల్లటి తెరను తెచ్చి పెట్టి శ్రీ కృష్ణుడు విశ్వరూపం చూపించి గీత చెప్పినట్టు ‘అంతా వట్టిదే, ఎవరింటికి వాళ్ళు  వెళ్ళండి’  అని వెక్కిరిస్తుంది. అన్నీ తెలిసినా ఎందుకోమరి మనందరికీ ఇష్టం సినిమాయే!

    ఎంతోమంది సమిష్టి కృషితో తయారైన ఒక చలన చిత్రం ఒక వర్క్ అఫ్ ఆర్ట్‌గా శాశ్వతంగా నిలిచిపోతుంది. అదింక ప్రేక్షకుల ఆస్తి. తీసిన, దాని కోసం పని చేసిన వారంతా దూరంగా తల్లి తండ్రుల్లా నిలబడి చూడాలంతే!

    అవును. జీవితం సినిమా కాదు. అందమైన పాటలుండవు. క్లైమాక్స్ ఊహించలేం. మలుపులు అందంగా ఉండవు.  అందుకే జీవితంలా కాకుండా సినిమా బావుంటుంది. మనల్ని మురిపిస్తుంది. మన బాధల్ని మరిపిస్తుంది. ఏదో లోకంలోకి లాక్కెళ్లి మైమరపిస్తుంది. ప్రేక్షకులుగా మనం జడ్జిల్లా మారిపోయి సినిమాని నిర్మమకారంగా చూసి మాస్టారిలా మార్కులు వేసేస్తాం.

    సినిమా చూసినంత సేపట్లో మనం దాని ధ్యాసలో  పడి మన కష్టాలన్నీ మరిచిపోయి, ధ్యానం చేసినంత రిలీఫ్ పొందుతాం. కొత్త ఉత్సాహంతో థియేటర్ నుంచి బైటికి నడుస్తాం. మరదే  సినిమా రుచి. కాదంటారా !

    (మళ్ళీ కలుద్దాం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here