Site icon Sanchika

జీవితం జనరల్ స్టోర్

[box type=’note’ fontsize=’16’] జనరల్‌గా జీవితాన్నిశాంపిల్‍గా చూస్తూ, జీవితాల్లోని ఆశనిరాశలను, వైరుధ్యాలను సానుభూతితో కవితలో ప్రదర్శిస్తున్నారు భువనచంద్ర జీవితాన్నే జనరల్ స్టోర్‌గా చేసి.. [/box]

జీవితం జనరల్ స్టోర్

ఇక్కడ అన్నీ లభించును

వీధి వీధికీ, ఇంటి ఇంటికి

కంటి కంటికీ, కడుపుమంటకీ

కావలసిన వన్నీ కారు చౌకగా లభించును

 

వయసు మళ్ళిన ఓ MPగారు

ఓడిపోయి వాడిపోయి

తిరిగిరాని డిపాజిట్టు

తిరుపతి లో వోదిలిపెట్టి

“పదవి” జబ్బు మందుకోసం

పరుగులిడుతూ వొచ్చి

రాజకీయ రహస్యాల్ని

రహస్యంగా కొనుక్కు వెళ్ళింది

నాదగ్గరే !

 

కాలణా ఇచ్చి ఓసారి

కూడులేని బిడ్డతల్లి

బిడ్డ కడుపు నింపడానికి

కారే కన్నీటి కవితలు

కలవరంగా కొనుక్కు వెళ్ళింది

నా దగ్గరే !

ఉడిగిపోయిన వయసు చూసి

పరుగులెత్తే పాపాయిలని

ప్రిస్టేజి పేరుతో పక్కనే ఉంచుకుని

యువకులమంటూ పకపకలాడి

బయటపడుతున్న బట్టతలని

విగ్గుల్లో దాచుకుని

మనసులో బాధలకి మతలబు తెలీక

పటుత్వం కోసం ఫారిన్ మందులు

పూటుగా కొనుక్కు వెళ్ళింది

నా దగ్గరే !

 

గోడ పక్కని అలమరకి ఎన్నో అరలు

మరుగుపడిన మనసుకి ఎన్నో తెరలు

 

ప్రేమ మత్తులో

కలల కైపులో

కానున్నది కనక

రానున్నది తెలియక

పదహారేళ్ళ పడుచు

వొచ్చిన వాడు

తెచ్చినవన్నీ తీసుకుని

ఉన్నదంతా ఊడ్చుకుని

ఉడాయించాక

ఆకలికోరలు ఆక్రమిస్తుంటే

పాండీ బజార్లో

పడుపు వ్యాపారం పెట్టి

విటులిచ్చిన డబ్బుల్తోపాటు

వీ. డీ. లు తెచ్చుకుని

కళ్ళ నీళ్ళు కారుస్తూ

పశ్చాత్తాప్పడి

ప్రాయశ్చిత్తం కోసం

పాయిజన్ కొనుక్కు వెళ్ళింది

నా దగ్గరే !

 

 

గుడ్డ చిరిగిన గోగుగులా

ఊగిపోయే పడవలా

చూరుకింద చాపలా

గుట్టుగా సంసారాన్ని యీదుకోస్తున్న

గుమాస్తా గుర్నాధం గారు

లేచిపోయిన పెద్దకూతుర్ని

పైకి తిడుతూ లోపల మెచ్చుకుంటూ

మంచానవున్న పెళ్ళాన్ని

బతికించాలని భ్రమలు పడుతూ

తిరుగుబోతు తనయుడ్ని

బాగుపడమని బతిమలాడుతూ

వాడిపోయి వగచి

వగచి వంకీలా వొంగిపోయి

నిద్రలేని రాత్రులకై నిద్రమాత్రలు తెచ్చుకుని

వెచ్చ వెచ్చని కలల్లో

ఒక్కసారి మునిగిపోయి

తిరిగిలేచి తిరిగివొచ్చి

వేదాంతం కొనుక్కు వెళ్ళింది

నాదగ్గరే !

 

 

సైనికదళానికి చెందిన

సిపాయి చిన్నయ్య

ఊరించే వయసులో

వొణికించే చలిలో

వేదనతో నిట్టూరుస్తూ

పఠాన్‌కోట పరిసరాల్లో

ప్రేయసిని తలుచుకుంటూ

రాకాసి రాత్రిలో

రైఫుల్ని పట్టుకుని

రోజుకుంటూ రొప్పుకుంటూ

ఆలివ్ డ్రెస్‌లో కూరుకుపోతూ

మూసుకుపోయే కళ్ళని

మరింత తెరుచుకుంటూ

గార్డ్ డ్యూటీలో గతాన్ని

గరళం లా మింగుతూ

రేపటి మీది ఆశల్ని

ఈనాడే కొనుక్కు వెళ్ళింది

నాదగ్గరే !

నా దగ్గరే !!

వలపులనీ

విలాసాల్ని

నిషాలనీ

విషాదాల్నీ

ఆశల్నీ

అమృతాన్నీ

అందరికీ

అమ్ముతాను

జనరల్ గా జీవితాన్ని

శాంపిల్ గా చూస్తుంటా.

Exit mobile version