జీవితం నన్నెంత మాత్రం భయపెట్టదు

0
2

[మాయా ఏంజిలో రచించిన Life Doesn’t Frighten me అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు. ఒక బాలిక స్వరం నుంచి ఈ కవితను అర్థం చేసుకోవాల్సి ఉంది. తాను అధిగమించాలనుకున్న భయాలన్నిటినీ ఏకరువు పెడుతూ, ఆ బాలిక తనని తాను ధృఢపరుచుకునే ప్రయత్నంగా ఈ కవితని చూడొచ్చు.]

~

[dropcap]గో[/dropcap]డలపైన వాలిన నిశీధి నీడలు
కింద నట్టింట్లో రణగొణధ్వనులు
బతుకు నన్నే మాత్రం భయపెట్టదు

బిగ్గరగా అరిచే పిచ్చికుక్కలు
మేఘాల్లో దాక్కున్న పెద్ద పెద్ద దయ్యాలు
బతుకు నన్నేం భయపెట్టదు

వికారపు ముసలవ్వ చెప్పే బూచి కథలు
అడవిలోంచి ఊళ్ళోకి వచ్చిన సింహాలు
బతుకు నన్నేమీ భయపెట్టదు

నే కప్పుకునే దుప్పటిపై
డ్రాగన్ నిప్పుల జ్వాలలు ఉమిసినా
బతుకు నన్నేం భయపెట్టదు

నా నేస్తంతో కలిసి
వాటినే నే భయపెడతా
పరిహాసం చేస్తూ
భయాలన్నిటినీ గెలిచేస్తా
నేనస్సలు ఏడవను సరి కదా
నన్నేడిపించేవన్నీ మాయమైపోతాయి

మొండి ఘఠాలతో గొడవైనా
రాత్రిళ్ళు ఒంటరిగా
ఉండాల్సి వచ్చినా
నాకు భయమేం లేదిప్పుడు
తోటల్లో తోడేళ్ళను చూసినా
చీకట్లో అపరిచితులను కలిసినా
బతుకు నన్నేం భయపెట్టదు

కొత్త తరగతి గదిలో
నా వెంట్రుకలు పట్టుకు లాగి
నన్నేడిపించే అబ్బాయిలన్నా
ఉంగరాల జుత్తుతో
ముద్దొచ్చే నా తోటి బాలికలన్నా
నాకిప్పుడు భయమేం లేదు

కప్పల్ని పాముల్ని చూపించి
నన్ను భయపెట్టాలని చూడొద్దు
నా ఉల్లాసపు నవ్వులు వినండిక ముందు
ఇక నేను భయపడటమంటూ
జరిగితే, అది నా కలల్లోనే

నా భుజాల చుట్టూ
మార్మిక మనోజ్ఞతని
చుట్టుకొని ఉన్నా నేనిప్పుడు
సముద్రపు అలలపై
అలవోకగా నడుస్తాను నేనిపుడు

బతుకు నన్నిక ఎంతమాత్రమూ
భయపెట్టలేదు
ఎంత మాత్రం
ఎంత మాత్రం
జీవితం నన్నిక ఏ మాత్రమూ
భయపెట్టలేదు!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవిత్వం వెలువరించారు.

ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.

 

బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‍గా పని చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.

రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here