జీవితమే ఒక చమత్కారం..!!

2
4

[సుగుణ అల్లాణి గారు రచించిన ‘జీవితమే ఒక చమత్కారం..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


[dropcap]జీ[/dropcap]వితం నేర్పించని పాఠమేముంది
జీవితాన్ని మించిన గురువెవరున్నారు
పుట్టగానే ఏడవడం నేర్పించింది
ఏడుపుతో ఏదైనా
సాధించడం నేర్పించింది!
ఆకలిని నేర్పించింది
ఆకలి తీర్చుకోవడం నేర్పించింది
నడవడం నేర్పించింది
పడడం నేర్పించింది
పడి లేవడం నేర్పించింది
ఆడడం నేర్పించింది
ఆడి గెలవడం నేర్పించింది
గెలుపులో ఆనందాన్ని నేర్పించింది
ఓడడం నేర్పించింది
ఓటమిలో బాధను నేర్పించింది
బాధలో కొత్త బాట చూపించింది
కలలు కనడం నేర్పించింది
కలలు సాకారం చేయడం నేర్పించింది
పాటలు నేర్పించింది
పాటగా పాడుకోవడం నేర్పించింది
కవితలల్లడం నేర్పించింది
కవితలా చెప్పుకోవడం నేర్పించింది
కథలెన్నో నేర్పించింది
కథగా వినిపించడం నేర్పించింది
ప్రేమను నేర్పించింది
ప్రేమను ప్రేమించడం నేర్పించింది
ప్రేమకై జీవించడం నేర్పించింది
ప్రేమకోసమే మరణించడం నేర్పించింది
ద్వేషం నేర్పించింది
ద్వేషించడం నేర్పించింది
స్వార్థం నేర్పించింది
స్వార్థం కోసం తెగించడం నేర్పించింది
మోసం చేయడం నేర్పించింది
మోసపోవడం నేర్పించింది
మోసాన్ని ఎదిరించడం నేర్పించింది
బంధాలు నేర్పించింది
బంధాల కోసం త్యాగాలు నేర్పించింది
సంపదను చూపించింది
సంపదను సంపాదించడం నేర్పించింది
సంపద కోసం ఆశ పడడం నేర్పించింది
సంపద కోసం ఏ పాపమైనా చేయించింది
సమస్యలను ఏర్పరిచింది
సమస్యలను పరిష్కరించడం నేర్పించింది
బాధ్యతలను నేర్పించింది
బాధ్యతలను నెరవేర్చడం నేర్పించింది
హక్కులను తెలియజేసింది
హక్కులను సాధించడం నేర్పించింది
బాల్యంలోని మాధుర్యాన్నందించింది
యవ్వనంలో బతకు పాఠాలు నేర్పించింది
ముదిమిలో సరిపడ జ్ఞాపకాలనిచ్చింది
కావ్యంగా మలుచుకునేంత విషయానిచ్చింది
కానీ..
కథ ఎలా ఎక్కడ ఎప్పుడు ముగుస్తుందో
తెలియజేయడం మరిచిపోయింది
అదే కదా చమత్కారం!
ఇదే కదా జీవితం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here