జీవితమొక పయనం-10

1
2

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[రాఘవ వరంగల్ బయల్దేరుతాడు. రైల్లో ఏమీ తినకపోవడం వల్ల వరంగల్ దిగగానే బాగా ఆకలి వేసి, స్టేషన్ బయట ఉన్న ఓ హోటల్‍తో టిఫీన్ తిని సిటీబస్ ఎక్కి, శంకర్‌నగర్‌‌లో దిగి, ఇంటి నెంబర్లు చూసుకుంటూ మాధవరెడ్డి ఇల్లు చేరతాడు. కాలింగ్ బెల్ నొక్కితే, వాళ్ళ అమ్మాయి వచ్చి తలుపుతీస్తుంది. మాధవరెడ్డి ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆ పూటకి వాళ్ళింట్లో భోంచేస్తాడు రాఘవ. మాధవరెడ్డి తన స్కూటర్ మీద వాళ్ళ బావగారు రమణారెడ్డి ఇంటికి తీసుకువెళ్ళి ఆయనకి రాఘవని పరిచయం చేస్తాడు. ఆయన మాధవరెడ్డినీ, రాఘవని తీసుకుని ఆశ్రమ పాఠశాలకి వెళ్తాడు. హెడ్మాస్టర్ గారికి రాఘవని పరిచయం చేస్తాడు. ఆయన గుమాస్తాని పిలిచి, రాఘవకి రూమ్ చూపించమని చెప్తారు. ఆ రోజుకి విశ్రాంతి తీసుకోమని, మర్నాడు నుంచి క్లాసులు తీసుకోవచ్చని చెప్తారు హెడ్‍మాస్టార్ గారు. రాఘవకి వశిష్ఠ నిలయం కేటాయిస్తారు. ఆ గదిలో ఉండే పిల్లలకి అతనే బాధ్యుడు. ఒక పడక, ఒక అలమారాని రాఘవకిస్తారు. రాఘవ ఆ అలమారాలో తన వస్తువులు సర్దుకుంటాడు. కాసేపటికి మాధవరెడ్డి అక్కడికి వచ్చి తానిక బయల్దేరుతాననీ, వీలున్నప్పుడు ఇంటికి వస్తూండమని చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపయ్యాకా, హెడ్ మాస్టర్ గారు కబురుపెట్టడంలో ఆయన గదికి వెళ్తాడు రాఘవ. అక్కడున్న మిగతా అధ్యాపకులను రాఘవకి పరిచయం చేస్తారాయన. తనని తాను పరిచయం చేసుకుంటాడు రాఘవ. – ఇక చదవండి.]

19. సాయంత్రపు వ్యాహ్యాళి

[dropcap]రా[/dropcap]ఘవ, ప్రధానాచార్యుల గదిలో నుండి బయటికొచ్చి తమ నిలయం వైపు నడుస్తుంటే.. సుందరం అన్న ఆచార్యుడు అతణ్ణి కలిసి, “ఈపూట బాగా విశ్రాంతి తీసుకోండి మిత్రమా. సాయంత్రం కెనాల్‌ దగ్గరికి వెళదాం. అప్పుడు మరిన్ని విషయాలు కలబోసుకుందాం.” అంటూ సెలవు తీసుకుని తన క్లాసుకు వెళ్లిపోయాడు.

రాఘవ అతని కలుపుగోలుతనానికి నవ్వుకుంటూ తమ నిలయానికి చేరుకున్నాడు.

రాఘవకు భోజనం చెయ్యాలనిపించలేదు. అంతకుమునుపే బాబాయ్‌ ఇంట్లో భోజనం చెయ్యటం, దార్లో కొబ్బరి బోండాం, ఇందాక చిక్కటి మజ్జిగ తాగటంతో ఆకలి వెయ్యటం లేదు.

దాంతో తన పడక దగ్గరికెళ్లి బయటపెట్టిన వస్తువుల్ని అల్మైరాలో చక్కగా సర్దటం మొదలుపెట్టాడు.

ఆ పని పూర్తయ్యేసరికి అర్థగంట పట్టింది. అతనికి కాసేపు నడుము వాల్చాలనిపించింది.

ఆ కడప బండరాయిమీద దుప్పటి పరుచుకుని పడుకున్నాడు. కానీ, గాలి రావటం లేదు. ఎందుకంటే పైన  ఫ్యాన్‌ లేదు. లేచి వెళ్లి కాస్త దూరంగా ఉన్న ఫ్యాన్‌ స్విచ్‌ను ఆన్‌చేసి వచ్చి తన పడకమీద నడుము వాల్చాడు.

ఆలోచిస్తూ పడుకున్నాడు..

‘ఎక్కడి చిత్తూరు, ఎక్కడి కన్యాకుమారి, ఎక్కడి వరంగల్‌? దేవుడు మనుషుల్ని ఎలాగెలాగంతా కలుపుతాడో కదా? లేకపోతే తాను కన్యాకుమారిలో ఉద్యోగం కోసం వెళితే వరంగల్‌లో ఉద్యోగం దొరకటమేంటి? అంతా భగవంతుని లీల కాకపోతే..’ అనుకుంటూ నిద్రలోకి జారిపొయ్యాడు.

అలా పడుకున్నవాడు సాయంత్రం బడై పోయి, అల్పాహారం ఇచ్చే సమయానికి పిల్లలు గోలగోలగా అరుస్తుంటే మెలకువ వచ్చింది.

ఉదయం అతనితో మాట్లాడిన విద్యార్థి, చల్లా రవి అతణ్ణి కుదుపుతూ.. “లెగండి ఆచార్జీ, మీకోసం అల్పాహారం అట్టుకొచ్చినాను.. తీస్కోండి.” అని ఏదో తినుబండారం అతని ముందుకు చాపాడు. అవి మసాలా బొరుగుల్లా ఉన్నాయి.

“థాంక్స్‌. పర్వాలేదు, నువ్వు తిను. నాకొద్దు.” అని కళ్లు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు రాఘవ.

నిద్రమత్తు వదలాలంటే ముఖం కడుక్కుని రావాలి. “బాత్‌రూమ్‌ ఎటుంది?” అంటూ ఆ విద్యార్థిని అడిగాడు.

“రండి ఆచార్జీ, సూపిత్తాను.” అంటూ రాఘవను వెంటబెట్టుకుని వెళ్లి చూపించాడు.

చూసి ఆశ్చర్యపోయాడు రాఘవ.

అక్కడ బాత్‌రూముల గదులంటూ విడిగా ఏమీ లేవు. ఒక విశాలమైన నీటితొట్టె మాత్రం ఉంది. అందులో సగానికి పైగా నీళ్లున్నాయి. అక్కడక్కడా సబ్బు ముక్కలూ, ఒకట్రెండు మగ్గులూ కనిపించాయి. అక్కడే ముఖం కడుక్కోవాలి కాబోలు! అనుకుంటూ.. “మరి టాయిలెట్‌కెళ్లాలంటే ఎలా?” అని అడగ్గానే, వాడు వెనకవైపున్న తైలం చెట్లకేసి చెయ్యి చూపించాడు.

“సరే, నువ్వెళ్లు. నేను ముఖం కడుక్కుని వస్తాను!” అనగానే వాడు నిలయానికి వెళ్లిపొయ్యాడు.

నీటితొట్టె దగ్గరికెళ్లి ఒక మగ్గుతో నీళ్లు ముంచుకొని ముఖం కడుక్కుని వచ్చాడు.

“ఆచార్జీ, మిమ్మల్ని రాజారావుగారు పిలుతున్నరు.” చెప్పాడు చల్లా రవి.

“ఎక్కడున్నారాయన?”

“వంటశాల దగ్గిరున్న సెట్లకింద..” చెప్పాడు.

తువ్వాలుతో ముఖాన్ని శుభ్రంగా తుడుచుకుని వంటశాలవైపు వెళ్లాడు రాఘవ.

వంటశాల ముందున్న వేపచెట్ల కింద రాజారావుగారే కాదు మధ్యాహ్నం పలకరించిన సుందరం గారితోపాటు మిగిలిన ఆచార్యులు కూడా అక్కడ విశ్రాంతిగా కూర్చుని అల్పాహారం తింటున్నారు.

“రండి రాఘవగారూ..” ఒక పళ్లెంలో వేయించిన మరమరాల్ని పట్టుకొచ్చి ఇచ్చాడు వంటమాస్టరు.

“మధ్యాహ్నం మీరు భోజనానికి రాలేదేం, ఆచార్జీ?” అంటూ అతను రాఘవను పలకరించాడు.

“ఆకలెయ్యలేదండీ!” అంటూ సమాధానమిచ్చాడు రాఘవ.

“ఏంటి రాఘవగారూ, మరీ భోజనాన్ని కూడా త్యాగం చేస్తే.. ఇక అంతే కత!” అంటూ హాస్యమాడాడు సుందరం.

వంటమాస్టరు ఇచ్చిన పళ్లెంలోని మరమరాల్ని గుప్పెడు తీసుకుని నోట్లో పోసుకుని తింటూ.. “త్యాగం అంటూ ఏమీ లేదు లెండి. బాగా నిద్రపట్టేసింది. నిద్రలో ఆకలి తెలియలేదు. అంతే!” అన్నాడు రాఘవ.

ఈలోపు వేడివేడి టీ తీసుకొచ్చి ఇచ్చాడు వంటమాస్టరు. తలా ఒక గ్లాసు తీసుకుని అందరూ టీ తాగసాగారు.

రాఘవ ప్రశాంతంగా టీ ని చప్పరించసాగాడు.

“రాఘవగారూ మీరూ మాతో అలా వస్తారా, వెళ్లొద్దాం!” అంటూ ఆహ్వానించాడు రాజారావు.

“అయ్యో, దానికేం. వెళదాం పదండి.” అంటూ వాళ్లను ఉత్సాహపరిచాడు రాఘవ.

“అయితే త్వరగా వెళ్లి ప్యాంటు వేసుకొని వచ్చెయ్యండి.” అన్నాడు సుందరం.

రాఘవ రాగానే అందరూ పాఠశాల పక్కన వెళుతున్న మట్టిబాట మీదికి నడిచారు.

ఆ బాటకు అటుఇటు యూకలిప్టస్‌ (తైలం) చెట్లు బాగా పొడవుగా, వరుసల్లో విస్తరించి ఉన్నాయి. కొంత దూరం వెళ్లాక చెట్లు పలచబడి ఖాళీ మైదానం కనిపించింది.

ఆ మైదానానికి అటువైపు పంటపొలాలు కనిపించాయి.

ఆ పొలాల్లో పొద్దు తిరుగుడు, అలాగే మొక్కజొన్న పంటా విస్తారంగా వేసినట్టున్నారు.

రాఘవతోపాటు లెక్కల మాస్టారు సుందరం, సోషియల్‌ రాజారావు, ఇంగ్లీషు మోహనరావు, హిందీ రసూల్‌, సైన్స్‌ నిరంజన్‌ ఆచార్యులు మాత్రం వస్తున్నారు.

మిగిలినవాళ్లు బడి దగ్గరే ఉండిపొయ్యారు.

“రోజూ బడి ముగిశాక ఇటువైపు రావటం మాకు అలవాటైపొయ్యింది రాఘవగారూ..” అన్నాడు సుందరం.

“మంచిదే. వ్యాహ్యాళి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.” అన్నాడు రాఘవ.

“ఏమన్నారు, వ్యా..అళి.. ఏదో అన్నారు..” అన్నాడు ఇంగ్లీషు మోహనరావు.

“వ్యాహ్యాళి..అంటే నడక. లేదూ వాకింగ్‌ అనొచ్చు. అది శరీరానికి ఎంతో అవసరం కూడానూ!”

“ఊ.. అచ్చమైన తెలుగు పదం వినటానికి ఎంత బాగుందో!” మెచ్చుకున్నాడు మోహనరావు.

“ఔనండి. ఇక్కడ అందరూ స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడుతూ ఉండటం నాకెంతగానో నచ్చింది.” అన్నాడు రాఘవ.

“ఏమైనా మీ భాష, మీ ఉచ్ఛారణ, మీ స్పష్టతా చాలా బాగుందండి. ఉపాధ్యాయుడికి ఉండవలసిన మొదటి అర్హత అదే!”

“ఔనండి. స్పష్టమైన మాటలు అందరికీ నచ్చతాయి.” నవ్వుతూ అన్నాడు రాఘవ.

ఈలోపు వాళ్లముందుకు ఒక పెద్ద కెనాల్‌ (కాలువ) ఎదురైంది.

ఒడ్డున ఒకచోట శుభ్రంగా ఉండటంతో అక్కడికెళ్లి కూర్చున్నారందరూ.

“ఈ కెనాల్‌ నిర్మించటం ఇప్పుడు రైతులకెంతో ఉపయోగకరంగా ఉంటోంది. ఒకప్పుడు ఈ చుట్టుపక్కలున్న భూములకు సరైన నీటి వసతులు లేక రైతులు సరిగ్గా పంటలు పండించలేకపొయ్యేవాళ్లు. వాళ్లు పండించే పంటలో మిగిలేది అంతంత మాత్రంగానే ఉండేది. ఆ పరిస్థితుల్లో ఈ కెనాల్‌ నిర్మించటంతో ఇప్పుడు వాణిజ్య పంటలు కూడా విస్తారంగా పండిస్తున్నారు. వాటిని ఇతర ప్రాంతాలకు కూడా రవాణా చేస్తున్నారు..” చెప్పుకుపోతున్నాడు సోషల్‌ రాజారావు.

“ఈ కెనాల్‌ పేరేమిటండీ..” ఆసక్తిగా అడిగాడు రాఘవ.

“కె. సి. కెనాల్‌..” బదులిచ్చాడు సుందరం.

“కె. సి. కెనాల్‌ ఇటు కూడా ప్రవహిస్తుందా? కాదే, అది మా వైపు రాయలసీమ జిల్లాల్లో ప్రవహిస్తుందండి. కె. సి. కెనాల్‌ అంటే కర్నూల్‌ కడప కెనాల్‌ అని అర్థం. అది బ్రిటీషర్ల కాలంలోనే నిర్మించబడిరది.” చెప్పాడు రాఘవ.

“లేదండీ, ఇదే అసలు కె. సి. కెనాల్‌.” చెప్పాడు సుందరం.

“సుందరంగారూ మీరాగండి. రాఘవగారు చెప్పిందీ కరెక్టే. కానీ దీని పేరు కూడా కె. సి. కెనాలే. అంటే కాకతీయ కెనాల్‌ అని అర్థం. దీనికి దానికున్నంత చరిత్ర లేదు. ఈమధ్యే దీన్ని నిర్మించారు.” వివరంగా చెప్పాడు రాజారావు.

ఇంతలో..

దూరంగా కొందరు పల్లె పడుతులు పొలంగట్ల మీద వరుసగా నడుచుకుంటూ రావటం కనిపించింది.

కొందరి తలల మీద గడ్డిమోపులున్నాయి. కొంతమంది కుడిచేతిలో ఏదో పనిముట్టో, సంచీనో, అన్నం క్యారియరో ఏదో ఒకటి పట్టుకుని వస్తున్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే.. వాళ్లు ఎదమీదికి జాకెట్లు ధరించారు. కానీ, దానిమీద పైటను వేసుకోలేదు. ఎదకు అడ్డుగా ఉండాల్సిన పల్లెవాటు ఎడమ చేతిమీద వేసుకుని, చేతిని అలా పక్కకు పెట్టుకుని నడుస్తున్నారు.

అలా ఒక్కరు కాదు దాదాపు అందరూ అలాగే నడిచి వస్తున్నారు. వాళ్లనే కళ్లార్పకుండా చూడసాగాడు రాఘవ.

ఉన్నట్టుండి మోహనరావు అడిగాడు.. “రాఘవగారూ మీకు పెళ్లైందా?”

తాను అలా చూస్తూ ఉండటాన్ని గమచించే అడిగాడని అర్థం చేసుకుని సిగ్గుపడుతూ, “సారీ, కాలేదండీ.” అన్నాడు

“దేనికి సారీ, ఎందుకు సిగ్గూ..” ముసిముసిగా నవ్వుతూ అన్నాడు మోహనరావు.

“మావైపు ఆడవాళ్లు ఎవరూ కూడా ఇలా ఎద భాగం ప్రదర్శితమయ్యేలా నడిచి వెళ్లరండి.” చెప్పాడు రాఘవ.

“మా పట్టణవాస ఆడవాళ్లు కూడా వెళ్లరండి. వీళ్లు జానపదులు. వీళ్ల అలవాటే అంత. కానీ అందులో ఎంత నాచురాలిటీ, రసికత ఉందో గమనించారా.” అన్నాడు మోహనరావు కళ్లెగరేస్తూ..

“ఉహూ..” అంటూ సన్నగా మూలిగాడు సుందరం.

“మేము రోజూ ఇక్కడికి రావటానికి వీళ్లు కూడా ఒక కారణం. ఎందుకంటే మాలో ఎవరికీ ఇంకా పెళ్లి కాలేదు. పైగా మన ఆవాసంలో ఒక్క ఆడపురుగు ఉంటే ఒట్టు. మాంచి వయసు మీద ఉన్నాం. కనీసం కంటితో చూద్దామన్నా ఆడది కనిపించకపోతే ఎలాగండీ చచ్చేదీ..” అంటూ అక్కసును వెలిబుచ్చాడు మోహనరావు.

“ముందు మోహనరావుకు పెళ్లయిపోతే బాగుణ్ణండీ. ఎందుకంటే పాపం అతను మాంచి రంజుమీదున్న కోడిపుంజులా తెగ అవస్థ పడిపోతున్నాడు.” హాస్యమాడాడు సుందరం.

అతని మాటలకు ముసిముసిగా నవ్వాడు మోహనరావు.

అందరూ బ్రహ్మచారులుగా ఉండటంతో దాపరికం లేని సరసాన్ని పంచుకున్నారు. చాలా సరదాగా అనిపించింది రాఘవకు. అయితే ఎవరూ ఎక్కడా హద్దు మీరకుండా అందరితోనూ స్నేహంతో మెలిగారు.

“అయితే రాఘవగారూ.. ఇంకా మీలో ఏమేం ప్రత్యేకతలున్నాయో చెప్పండి, విందాం!” అని అడిగాడు రాజారావు.

“ప్రత్యేకతలు అంటూ ఏమీ లేదండి. నేనొక మామూలు మనిషిని…”

“అలా కాదు, మీకు ఇంకా ఏమేం వచ్చు. ఐ మీన్‌ యాక్టింగ్‌, మ్యూజిక్‌, డ్యాన్సింగ్‌, డ్రాయింగ్‌.. ఎట్‌సెట్రా ఎట్‌సెట్రా..”

“మ్యూజిక్‌ అన్నది పెద్ద పదం కానీ, కొంత మేరకు పాటలు పాడగలను. అదీ సినిమా పాటలు.” చెప్పాడు రాఘవ.

“వావ్‌. వెరీగుడ్‌. ఏదీ మా కోసం ఒక చక్కటి సినిమా పాట పాడండీ..” బతిమాలుతున్నట్టుగా అడిగాడు రాజారావు.

“నాకు జేసుదాస్‌ గారంటే చాలా ఇష్టం. ఆయన పాడిన ఒక పాట, మీ కోసం..” అంటూ “వేగు చుక్క మొలిచింది, వేకువ పొడ సూపింది. తూరుపు తెలతెల వారక ముందే, కాలం మాటేసింది, నా కళ్లను కాటేసింది.” అంటూ జీర పోకుండా చక్కగా పాడాడు.

అతను పాడడం పూర్తికాగానే “వావ్‌.. అద్భుతం.. ఫెంటాస్టిక్‌!” అంటూ అందరూ చప్పట్లు చరిచారు.

వాళ్ల ప్రశంసకు నవ్వి ఊరుకున్నాడు రాఘవ.

“నాకోసం ఒక లవ్‌ సాంగ్‌ పాడండి ప్లీజ్‌!.” ప్రాధేయపడుతున్నట్టుగా అడిగాడు మోహనరావు.

ఆలోచించి పంతులమ్మ సినిమాలోని పాట అందుకున్నాడు.

“సిరిమల్లె నీవె.. విరిజల్లు కావె, వరదల్లె రావె, వలపంటి నీవె. ఎన్నెల్లు తేవె, ఎదమీటి పోవె..” అని పాడుతూ ఉంటే అందరూ తలలూపుతూ కనులు మూసుకుని వినసాగారు.

రెండవ చరణం ప్రారంభంలో వచ్చే ఆ రాగాలాపనను గొప్పగా పాడాడు రాఘవ.

అది పాడుతున్నప్పుడు మోహనరావు నిటారుగా కూర్చుని జాగ్రత్తగా విన్నాడు. అలాగే చివరలో ముక్తాయింపుగా వచ్చే హమ్‌ పూర్తికాగానే లేచొచ్చి రాఘవను కౌగిలించుకున్నాడు.

“అబ్బ ఎంత స్వీట్‌గా ఉందో. ఈ పాటలన్నీ విని ఎన్నాళ్లయిందో. సుందరంగారూ మనకొక చక్కటి గాయకుడు దొరికినట్టే. అద్భుతం.” అంటూ తెగ మెచ్చుకున్నాడతడు.

అందరూ ఔనన్నట్టుగా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తలలూపారు.

చీకటి పడుతూండగా అందరూ లేచి బడి వైపుకు నడక మొదలుపెట్టారు.

అందరూ బడి వెనకున్న నీటితొట్టె దగ్గరకు వెళ్లి ముఖమూ, కాళ్లూచేతులూ కడుక్కున్నారు. ఇద్దరు ఆచార్యులు తమ ప్యాంటు జేబులో పెట్టుకొచ్చిన సోపును బయటికి తీసి దాంతో ముఖం కడుక్కున్నారు. “వెనక నుండి మనం మన గదుల్లోకి వెళ్లిపోదాం.” అని సుందరం, రాఘవ వైపుకు తిరిగి “రాఘవగారూ మీరేమీ మళ్లీ అధ్యయనం తరగతికి రానఖ్ఖర్లేదు. ఈ రోజంతా బాగా విశ్రాంతి తీసుకోండి. రేపటినుండి ఎటూ తప్పదు.” అంటూ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు.

రాఘవ కూడా తన పడక దగ్గరికి వెళ్లి తువ్వాలు తీసుకుని ముఖం తుడుచుకున్నాడు. విశ్రాంతిగా పడకమీద కూర్చున్నాడు.

20. శ్లోకాలతో క్రమశిక్షణ

రాత్రి భోజనానికి గంట కొట్టారు. పిల్లలందరూ లేచి బ్యాగుల్ని సర్దుకుని తమతమ నిలయాలలోకి వెళ్లారు.

కంచాలు తీసుకుని భోజనశాలకేసి నడిచారు.

చేతులు కడుక్కుని తానూ భోజనశాలలోకి అడుగుపెట్టాడు రాఘవ. పిల్లలందూ నేలమీద ఎత్తు తక్కువున్న పొడవాటి బల్లలమీద కంచాలు ముందు పెట్టుకుని కూర్చున్నారు.

ఎదురెదురుగా రెండేసి వరుసల చొప్పున ఆరు వరసల్లో పిల్లలందరూ కూర్చున్నారు.

“రాఘవగారూ ఇలా రండి.” అంటూ రాఘవను తన దగ్గరికి ఆహ్వానించాడు రాజారావు.

అతని పక్కనకెళ్లి కూర్చున్నాడు రాఘవ.

“తినటానికి మీరు ఇంటి నుండి కంచం తీసుకురాలేదా?” అడిగాడు రాజారావు.

“లేదండీ.. కొత్తది కొనుక్కోవాలి.” అనేసరికి “రేయ్‌, వడ్డించేవాళ్లెవరిదైనా కంచం ఉంటే కొత్త ఆచార్యజీకి ఇవ్వండ్రా.” అనగానే ఇద్దరు ముగ్గురు విద్యార్థులు పోటీలుపడి తమ కంచాలను ఇచ్చారు. అందులో ఒకటి తీసుకుని రాఘవ ముందు పెట్టాడు రాజారావు. అలాగే మంచినీళ్ల గ్లాసూ పెట్టాడు.

“వడ్డించిన వెంటనే కంచంలో చెయ్యి పెట్టకండేం?” మెల్లగా గుసగుసగా చెప్పాడు రాజారావు.

పదిహేనుమంది పదవతరగతి పిల్లలు వరుసకు ఐదుగురు చొప్పున పిల్లలకు వడ్డన చెయ్యటం మొదలుపెట్టారు. మొదట ఒకరు మంచినీళ్లు పోస్తే, ఒకరు అన్నం వడ్డిస్తే, ఇంకొకరు కూర, మరొకరు వేపుడు ఇలా.. అన్నీ వడ్డించాక.. “భోజన మంత్రం కురు..” అని బాబూరావు గట్టిగా అనగానే పిల్లలందరూ చేతులు జోడించి, కళ్లు మూసుకున్నారు.

‘బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్‌! బ్రహ్మైన తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా..

ఓం అన్నపతే అన్నస్య నో దేహీ..’ అంటూ నిమిషం పాటు కొనసాగిన భోజన మంత్రాన్ని పిల్లలందరూ కలిసి కోరస్‌గా చెప్పారు. అది పూర్తయ్యాక అందరూ తమతమ కంచాల్లో ఉన్న భోజనానికి నమస్కరించి తినటం మొదలుపెట్టారు.

కన్యాకుమారిలో పరిచయమై అలవాటైన ఆ దృశ్యాన్ని ఇప్పుడు ఇక్కడ చూసి భ్రమసిపోయాడు రాఘవ. పెద్దవాళ్ల మధ్య అలాంటి క్రమశిక్షణ సాధ్యమే. కానీ ఇక్కడ చిన్నపిల్లలు ఆ పద్ధతిని అనుసరిస్తుంటే చూడటానికి రెండు కళ్లూ చాలటం లేదు. తింటున్నంతసేపూ ఎవరూ పక్కవాళ్లతో మాట్లాడలేదు. నిశ్శబ్దంగా తింటున్నారు. తింటున్న విద్యార్థికి ఏం కావాలన్నా ఎడమచేతిని పైకెత్తితే చాలు, ఆ వరుసలో వడ్డించే విద్యార్థి అతనికేం కావాలో తెలుసుకుని దాన్ని వడ్డిస్తున్నాడు. తినటం పూర్తయ్యాక ఎవరి కంచాన్ని వాళ్లు తీసుకెళ్లి బయటున్న కుళాయిల దగ్గర శుభ్రం చేసుకుని వెళ్లి తమ అల్మైరాలో భద్రపరుస్తున్నారు.

రాఘవ భోజనం పూర్తిచేసి కంచం చేతిలోకి తీసుకోబొయ్యాడు. “అలాగే ఉంచెయ్యండి, పిల్లలు కడుగుతారులే..” అన్నాడు రాజారావు.

“పర్వాలేదు, నేను తిన్నానుగా, నేనే కడుగుతాను.” అని కంచాన్నికడిగి అదెవరిదో అడిగి వాళ్లకు తిరిగిచ్చేశాడు రాఘవ.

“రాఘవగారూ.. ఇప్పుడే గదికెళ్లి ఏంచేస్తాం? కాసేపు అలా ఇసుకలో నడుద్దాం, రండి.” అని ఆహ్వానించాడు సుందరం. రాఘవ అలాగే అన్నట్టుగా తలూపుతూ అతనితో కలిసి ఇసుకలోకి దారితీశాడు.

“ఇక పిల్లలు పడుకోవటమేనా?” అడిగాడు రాఘవ.

“అబ్బే లేదండీ. తొమ్మిది నుండి పది వరకూ గంటసేపు అధ్యయనం ఉంటుందండి. పది తర్వాత శాంతి మంత్రం చెప్పాక నిద్రకు వెళతారు. ఆపైన ఎవరూ చదువుకోవటానికి వీల్లేదు. పదవ తరగతి పిల్లలెవరైనా ఇంకా చదువుకోవాలని అనుకుంటే ప్రధానాచార్యుల నుండి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.”

“మరి ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు?”

“ఐదు గంటలకు మనమే వాళ్లను నిద్ర లేపాలి. గంటన్నరసేపు మళ్లీ అధ్యయనం ఉంటుంది. ఆరున్నర నుండి వాళ్లకు యోగాసనాలు నేర్పిస్తారు. ప్రతి ఆచార్యుడూ కూడా అందులో తప్పక పాల్గొనాలి. ఆపైన కాలకృత్యాలు తీర్చుకోవటానికి గంట సమయం ఇస్తారు. ఎనిమిదిన్నర గంటలకు అల్పాహారం ఉంటుంది. తొమ్మిది గంటల నుండి ప్రార్థనతో తరగతులు ప్రారంభమౌతాయి.”

ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ నడుస్తుంటే ఇంకో ఇద్దరు ఆచార్యులు దూరంగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండటం కనిపించింది. వేసవి కాలం కావటంతో, చుట్టూ చెట్లూ చేలూ ఉండటంతో చల్లని గాలులు వీస్తున్నాయి.

అది శరీరానికి ఎంతో హాయిని కలిగిస్తోంది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ కొద్దిసేపు నడిచారు.

ఈలోపు రాత్రి అధ్యయనం తరగతి కొరకు గంట కొట్టారు. పదవ తరగతి పిల్లలు పుస్తకాలు చేతబట్టుకుని బయట వీథిలైట్ల వెలుతురులో వరుసగా కూర్చుని చదువుకోవటం మొదలుపెట్టారు.

వాళ్లను చూసి ఉపాధ్యాయులు లేచి అక్కడికెళ్లారు. వెనకే రాఘవ, సుందరం కూడా వెళ్లారు.

తమ నిలయంలోకి వెళ్లేసరికి ఆరవతరగతి పిల్లలందరూ కూడా వాళ్లవాళ్ల పడకమీద కూర్చుని చదువుకోవటం కనిపించింది. రాఘవ వెళ్లి తన పడకమీద కూర్చుని అందరినీ గమనించసాగాడు.

ఆ హాల్లో అన్ని తరగతుల విద్యార్థులూ ఉన్నట్టున్నారు. ఒక్కో తరగతికి చెందినవాళ్లు నలుగురేసి చొప్పున ఉన్నట్టున్నారు. ఒకే నిలయంలో ఒకే తరగతికి చెందినవాళ్లను ఉంచకుండా అందరినీ కలగలిపి ఉంచారు. అదీ ఒకందుకు మంచిదే! తమ నిలయంలో ఉన్న పదవ తరగతి విద్యార్థుల పడకలు ఖాళీగా కనిపించాయి. బహుశా వాళ్లందరూ బయట చదువుకోవటానికి వెళ్లినట్టున్నారు.

ఈలోపు ఒక విద్యార్థి బయటినుండి వచ్చి.. “ఆచార్జీ లోపలికి రావచ్చా?” అని రాఘవను అనుమతి అడిగాడు.

“రా..” అంటూ రాఘవ ఆ పిల్లవాణ్ణి ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించాడు.

వాడు అతని దగ్గరికొచ్చి, “ప్రధానాచార్యులు ఈ సమయసారిణిని మీకిచ్చి రమ్మన్నారు.” అని ఇచ్చి వెళ్లిపోయాడు.

అది రేపటినుండి రాఘవ ఏఏ తరగతులకు ఏఏ సబ్జెక్టులు చెప్పాలో సూచించబడిన టైమ్‌టేబుల్‌.

అతనికి 6,7 తరగతులకు తెలుగు, సాంఘికశాస్త్రం సబ్జెక్టులను చెప్పమని సూచించటం జరిగింది.

‘ఇప్పుడివ్వటం మంచిదే అయ్యింది. వీళ్ల దగ్గరినుండి టెక్స్ట్‌బుక్స్‌ తీసుకుని ఏ పాఠం దాకా అయిందో కనుక్కుని, తర్వాతి పాఠం ప్రిపేర్‌ అవ్వటం మంచిది.’ అనుకుని, 6,7 తరగతుల పిల్లలనుండి తెలుగు వాచకాల్ని అడిగి తీసుకుని చదవటం మొదలుపెట్టాడు.

రాత్రి పదిగంటలైంది శాంతి మంత్రానికి పిలుపొచ్చింది. పిల్లలందరూ బయటికెళ్లి వరుసల్లో నిలబడ్డారు.

ఇంగ్లీషు ఆచార్యులు మోహనరావుగారు అందరిచేత శాంతిమంత్రాన్ని చెప్పించాడు.

‘ఓమ్‌ ద్యౌ శాంతిః అంతరిక్షగం శాంతిః పృథివీ శాంతిః

ఆప శ్శాంతిః ఓషధయ శ్శాంతిః వనస్పతయ శ్శాంతిః..’ అంటూ ఆ మంత్రం కొనసాగింది.

ఆనక అందరూ వాళ్లవాళ్ల నిలయాల్లోకి వెళ్లి నిద్రకుపక్రమించారు. పరుపులు పరుచుకుని పడుకున్నారు.

పదవ తరగతి పిల్లల్లో ఒకడు హాలుకు ముందూ వెనకున్న తలుపులకు గొళ్లెం పెట్టాడు.

అందరూ పడుకున్నాక అన్ని లైట్లనూ ఆర్పేశారు. జీరోవాట్‌ బల్బ్‌ మాత్రం వెలగసాగింది.

క్రమంగా అందరూ నిద్రలోకి జారిపొయ్యారు.

రాఘవ పడుకున్నాడు, కానీ నిద్రపట్టలేదు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి మధ్యాహ్నం రెండుగంటల పాటు నిద్రపోవటం. మరొకటి ఫ్యానుగాలి తన పడక దాకా రాకపోవటం.

అతనికి బాగా ఉక్కపోతగా ఉంది. అటు ఇటు ఎంతసేపు పొర్లినా నిద్ర పట్టటం లేదు.

అదీకాక వెనకనున్న చెట్లలో నుండి కీచురాళ్ల రొద కూడా ఎక్కువగానే ఉంది.

రాఘవ పడకలో అటుఇటు దొర్లసాగాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here