జీవితమొక పయనం-11

0
2

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[ప్రధానోపాధ్యాయుల గది నుంచి వచ్చిన రాఘవ, తన వస్తువులను తనకు కేటాయించిన గూట్లో సర్దుకుంటాడు. కాసేపు నడుం వాలుస్తాడు. కాసేపయ్యాకా, ఓ పిల్లాడు అల్పాహారం తెచ్చి రాఘవని నిద్ర లేపుతాడు. రాఘవ లేచి బయటకు వెళ్ళి ముఖం కడుక్కుని వస్తాడు. ఇంతలో వంటశాల దగ్గరకి ఇతర ఉపాధ్యాయులతో కలిసి వచ్చిన రాజారావు, రాఘవని పలకరిస్తాడు. అల్పాహారమయ్యాకా, టీ తాగుతారు. తర్వాత వారంతా కలిసి వ్యాహ్యాళికి వెళ్తారు. బాటకిరువైపులా యూకలిప్టస్ చెట్లు ఉంటాయి. లెక్కల మాస్టారు సుందరం, సోషియల్‌ సార్ రాజారావు, ఇంగ్లీషు మాస్టరు మోహనరావు, హిందీ సార్ రసూల్‌, సైన్స్‌ చెప్పే నిరంజన్‌ – రాఘవతో పాటు నడుస్తూంటారు. కొంచెం ముందుకు వెళ్ళాకా, కె.సి. కెనాల్ గట్టు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ళ కోరిక మేరకు రాఘవ కొన్ని పాటలు పాడి వినిపిస్తాడు. పిల్లల సాయంత్రం చదువుకి టైమ్ అవుతుండడంతో, అందరూ తిరిగి ఆవాసకేంద్రానికి వెళ్ళిపోతారు. రాఘవని ఆ పూటకి విశ్రాంతి తీసుకోమని చెప్పి, మిగతా అధ్యాపకులు తమ పనులలో నిమగ్నమవుతారు. భోజనశాలలో రాజరావు పక్కన కూర్చుంటాడు రాఘవ. కంచం గ్లాసు తెచ్చుకోకపోవడం వల్ల, వడ్డిస్తున్న విద్యార్థి కంచం తీసుకుంటాడు. తినేముందు పిల్లలు చక్కగా శ్లోకాలు చదువుతారు. అవి విన్న రాఘవకి తాను కన్యాకుమారిలో గడిపిన రోజులు గుర్తొస్తాయి. అన్నాలు తిన్నాక, పిల్లలు తమ కంచాలను శుభ్రం చేసుకుని తమ గూళ్ళలో భద్రపరుచుకుంటారు.  రాఘవ తను తిన్న కంచాన్ని కడిగేసి, ఆ పిల్లాడికి ఇచ్చేస్తాడు. భోజనాల తర్వాత ఏమేం కార్యక్రమాలు ఉంటాయో రాజరావుని అడిగి తెలుసుకుంటాడు రాఘవ. పిల్లలు చదువుకుంటుంటే, మర్నాడు తాను చెప్పవలసిన పాఠం ప్రిపేరవుతాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టదు. కొత్త ప్రదేశం, పైగా ఫ్యాన్ దూరంగా ఉండడం వల్ల గాలి తగలడం లేదు. అటు ఇటూ దొర్లుతాడు. – ఇక చదవండి.]

21. మారిన పడక

[dropcap]ఉ[/dropcap]న్నట్టుండి మెలకువ వచ్చింది చల్లా రవికి.

అందుకు కారణం, వాడికి రాత్రుల్లో రెండుమూడుసార్లు లఘుశంకకు వెళ్లే అలవాటు ఉండటమే.

ఇప్పుడు అర్జంటుగా వెళ్లాలి. కానీ ఒంటరిగా వెళ్లటానికి వాడికి భయమేసింది.

పడకమీద నుంచి లేచి కూర్చున్నాడు. కళ్లు నులుముకుంటూ వెళ్లి పక్కనున్న మిత్రుణ్ణి తోడుకు లేపాడు.

ఇద్దరూ వెనకవైపుకు వెళ్లబోయారు. అంతలో కాలికేదో తగిలి ముందుకు పడబోయి నిలదొక్కుకుని కిందికి చూశాడు రవి. హాలు మధ్యలో రాఘవ నేలమీద దుప్పటి పరుచుకుని పడుకుని నిద్రపోతున్నాడు.

ఆ దృశ్యాన్ని తన మిత్రునికి చూపించాడు రవి. వాడూ ఆశ్చర్యంగా రాఘవను చూశాడు.

‘ఆచార్జీ పడుకోవటానికి పైన చక్కని పడక ఉండగా, కిందెందుకు పడుకున్నారు?’ అని ఆలోచిస్తూ వెనకవైపుకు వెళ్లటానికి తలుపుకున్న గొళ్లెం తీసి, వెళ్లి పని ముగించుకొచ్చారు.

కొత్త ఆచార్జీ కింద పడుకోవటానికి గాలి రాకపోవటమే కారణమని ఇద్దరూ త్వరగానే గ్రహించారు.

ఉదయం నాలుగు ముప్పావుకు పిల్లల్ని నిద్రలేపే గంట మోగగానే ఠక్కున లేచి కూర్చున్నాడు రాఘవ.

నేలమీద పరిచిన దుప్పటిని మడిచి తన పడక దగ్గరికి తీసుకెళ్లి పెట్టాడు. అక్కడే ఐదు నిమిషాలు కూర్చున్నాడు.

బయటేదో సన్నగా మాటలు వినబడుతున్నాయి. ఇంకో ఐదు నిమిషాలు గడిచాయి.

ఎవరో నిలయం తలుపును తడుతున్నట్టుగా అనిపించి వెళ్లి తలుపు తీస్తే మోహనరావుగారు నిలబడున్నాడు.

“ఏం ఆచార్యజీ, ఇంకా పిల్లల్ని లేపలేదా?” అని ప్రశ్నించాడు. వాళ్లే లేస్తారనుకున్నాడు రాఘవ. తను నిద్రలేపాలి కాబోలు అనుకుంటున్నంతలో… “లేపండి ఆచార్జీ. పిల్లల్ని లేపకపోతే ఎనిమిది గంటలదాకా అయినా ముసుగుతన్ని అలాగే పడుకుండిపోతారు.” అంటూ అతనే “రేయ్‌.. లేవండ్రా..” అంటూ గట్టిగా ఒక్క అరుపు అరిచాడు.

ఆ అరుపుతో పదవ తరగతి పిల్లలు మొదట లేచి కూర్చున్నారు. ఆ తర్వాత పక్కనున్నవాళ్లను తట్టి నిద్రలేపసాగారు.

మరో ఐదునిమిషాలకల్లా పిల్లలందరూ నిద్రలేచి వెళ్లి ముఖాలు కడుక్కొచ్చి పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నారు.

రాఘవ కూడా వెళ్లి ముఖం కడుక్కొచ్చాడు. అధ్యయనం ప్రారంభమైంది. రాఘవ వాళ్లందరినీ గమనిస్తూ కూర్చున్నాడు.

తర్వాత తన దగ్గరున్న ఏడవ తరగతి తెలుగు వాచకాన్ని తెరిచి రాత్రి చదివిన పాఠాన్ని ఎలా బోధించాలో ప్రిపేర్‌ కాసాగాడు. అప్పుడప్పుడూ తలపైకెత్తి పిల్లలు చదువుతున్నారా లేదా అని గమనించసాగాడు.

ఆరున్నరకు యోగా క్లాసు నిమిత్తం గంట కొట్టారు. పిల్లలందరూ పుస్తకాల్ని అలాగే వదిలేసి మైదానంలోకి పరుగు పెట్టారు. ఈ లోపు ఉపాధ్యాయులందరూ కూడా మైదానంలోకి చేరుకున్నారు.

సైన్స్‌ మాస్టారు కె.కె.గారు గట్టిగా ఒక విజిల్‌ వేశాడు. పిల్లలందరూ తరగతుల వారీగా వరుసల్లో నిలబడ్డారు.

ఆసనాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు కూడా ఆసనాలు వెయ్యసాగారు.

ఆశ్చర్యం! ప్రధానాచార్యులు కూడా అక్కడికొచ్చి ఆసనాలు వెయ్యసాగారు.

అర్ధగంట గడిచాక పిల్లల్ని ఆడుకోవటానికి అనుమతినిచ్చారు.

రాజారావు, రాఘవ దగ్గరికొచ్చి, “రండి, వెళ్లి స్నానం చేసొద్దాం” అన్నాడు.

అప్పుడేనా అన్నట్టుగా రాజారావు ముఖంలోకి చూశాడు రాఘవ.

“రండి, ఈ వానర సైన్యం వచ్చేలోపే మనం స్నానం పూర్తి చేసెయ్యాలి. లేకపోతే నీళ్లన్నీ సబ్బు నురగతో నింపేస్తారు. ఇక్కడ మనకంటూ ప్రత్యేకంగా ఏ స్నానాల గదులూ లేవుగా?” అని తొందరపెట్టాడు రాఘవను.

పరిస్థితిని అర్థం చేసుకున్న రాఘవ తన పడక దగ్గరకెళ్లి తువ్వాలు, సబ్బు పట్టుకుని రాజారావు వెంట నడిచాడు.

నీటితొట్టె దగ్గరకు చేరుకుని తువ్వాలు పక్కన పెట్టి, మగ్గుతో నీళ్లు తీసుకుని ఇద్దరూ బహిర్భూమికి వెళ్లారు.

తర్వాత నీటితొట్టె దగ్గరకొచ్చి చన్నీటితో స్నానం చెయ్యసాగారు.

కన్యాకుమారిలో అలవాటైంది చన్నీటి స్నానం. ఇప్పుడిక్కడ కొనసాగుతోంది.

పావుగంటలో స్నానం పూర్తిచేసి తమ నిలయంలోకెళ్లి.. తన పడకను చూసి ఆశ్చర్యపోయాడు రాఘవ.

తన పడక దగ్గర ఉండాల్సిన సూట్‌కేస్‌ లేదు. అల్మైరాలో పెట్టిన పుస్తకాలు, ఇతరత్రా తనకు సంబంధించిన ఏ వస్తువూ కూడా అక్కడ కనిపించలేదు. అతనిలో ఆదుర్దా మొదలైంది.

ఎవరు తీశారు? ఇక్కడ దొంగలున్నారా? అయినా ఏదైనా ఒక వస్తువును దొంగిలిస్తారు కానీ, ఇలా ఏకంగా తన వస్తువులన్నింటినీ దొంగిలిస్తారా? లేదూ తనను మరో నిలయానికేమైనా మార్చేశారా? లేక తనను పిల్లలు ఆటపట్టిస్తున్నారా? ఏమీ అర్థంకాక దిక్కులు చూడసాగాడు రాఘవ.

ఇంతలో చల్లా రవి.. అతని మిత్రుడు నిలయంలోకి అడుగుపెట్టారు.

“ఆచార్జీ అగ్గో ఆడుంది మీ సూట్‌కేసూ, మీ కంచమూ, అన్నీనూ. గీ దినం నుండి మీ పడక ఇక్కడ కాదు, అక్కడ!”

“అక్కడికెవరు మార్చారు?” కోపంగా ప్రశ్నించాడు రాఘవ.

“మేమే!”

“దేనికీ?” సూటిగా వాళ్లిద్దర్నీ చూశాడు రాఘవ.

“మీరు నిన్న రాత్రి నేలమింద పడుకొని ఉంటం సూసినం ఆచార్జీ. మీ పడక దెగ్గిరికి గాలి బాగా రాదు. అదే, ఆడైతే ఫ్యాను గాలి మస్తుగొస్తది. అందుకే గీ దినం నుండి మీరక్కడే పడుకోండి. అదే ఇంకనుండి మీ పర్మినెంట్‌ సోటు.”

“మరి నువ్వూ?”

“నా పడకను మీ పడక దెగ్గిరికి మార్సుకున్నాగా. ఇగ ఇదే నా సోటు.” చెప్పాడు రవి.

“నీకూ గాలి కావాలి కదా?”

“లేకున్నా నాకలవాటే ఆచార్జీ. నేను నేలమింద పండుకున్నా నాకేమీ గాదు. కానీ, మాకు పాఠాలు సెప్పే గురువు నేలమింద పండుకోటం మాకు కష్టంగుంటది. గందుకే మార్చేసినం. ఇంగేం ఆలోసించకుండా ఎల్లి ఆడే మీ వస్తువుల్ని సర్దుకోండి.”

ఆ పిల్లల మనసును అర్థం చేసుకున్న రాఘవ, వాళ్లిద్డర్నీ పిలిచి వాళ్ల స్వచ్ఛమైన పసి మనసును అభినందిస్తూ ఇద్దరినీ తన రెండు చేతులతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు.

“వెళ్లండి, వెళ్లి స్నానం చేసి రండి” అంటూ వాళ్లను ప్రేమగా స్నానానికి పంపించాడు.

22. అదనపు బాధ్యత

రాఘవ ఆ పాఠశాలలో చేరి మూడు రోజులైంది.

ఆ రోజు సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్లొచ్చి ముఖం కడుక్కుని తమ నిలయానికొచ్చి కూర్చున్నాడు.

ఇంతలో ఒక విద్యార్థి వచ్చి.. “ఆచార్జీ, మిమ్మల్ని ప్రధానాచార్యులు రమ్మంటున్నారు.” అంటూ చెప్పి వెళ్లిపోయాడు.

రాఘవ లేచి గది బయటికి నడిచాడు.

బయట స్కూలు పొడవునా వీథిలైట్లు వెలుగుతున్నాయి. కొందరు విద్యార్థులు ముఖ్యంగా పదవ తరగతి పిల్లలు బయట దూరం దూరంగా కూర్చుని చదువుకుంటున్నారు.

నడుస్తూ వాళ్ల వాళ్ల నిలయాల్లో చదువుకుంటున్న పిల్లల్ని చూశాడు.

పిల్లలందరూ చక్కగా ముఖాలు కడుక్కుని, తలలు దువ్వుకుని, పుస్తకాలు ముందేసుకుని హోమ్‌వర్క్‌ రాసుకుంటూనో, నోట్సు కాపీ చేసుకుంటూనో, ఇంకొకరి దగ్గర లెక్కలు చెప్పించుకుంటూనో, లేదూ చదువుకుంటూనో కనిపించారు.

వాళ్ల క్రమశిక్షణ చూసి ముచ్చటేసింది రాఘవకు.

ప్రధానాచార్యులు కార్యాలయం ముందు ఆటస్థలానికి అభిముఖంగా ఉన్న రాతి బెంచీమీద కూర్చొని ఉన్నారు.

రాఘవ వెళ్లి ఆయన ముందు నిలబడి నమస్కరించాడు.

“కూర్చోండి..” అంటూ తన పక్కనున్న ఖాళీచోటు చూపించాడు. రాఘవ ఆయన పక్కన కూర్చోవటానికి సంశయించాడు.

“పర్వాలేదు కూర్చోండి రాఘవగారూ. బడి వేళల్లో మాత్రమే నేను ప్రధానాచార్యుల్ని. ఇప్పుడు మీరు నాతో సహజంగా ఉండొచ్చు. ఆ పద్ధతులన్నీ ఇప్పుడు అఖ్ఖర్లేదు. కూర్చోండి.” అనగానే రాఘవ ఆయన వైపుకు తిరిగి కూర్చున్నాడు.

“రాఘవగారూ, ముందుగా మిమ్మల్ని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే డిగ్రీ చదివి ఊరకే కూర్చోకుండా, ఏదో ఒక పని చెయ్యాలని ఇక్కడిదాకా వచ్చారు చూడండి, అది నాకెంతగానో నచ్చింది. చాలామంది యువకులు ప్రభుత్వోద్యోగం కోసం సంవత్సరాల తరబడి సమయాన్ని వృథాగా గడిపేస్తుంటారు. కానీ అది రాకపొయ్యేసరికి నిరాశతో అప్పుడు ప్రైవేటు ఉద్యోగాల కోసం వెతుకులాట మొదలుపెడతారు. అప్పటికే వాళ్ల వయస్సు మీరిపోయి ఉంటుంది. అనుభవమూ ఏమీ ఉండదు. మీరు అలాకాక కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన చేశారు చూడండి, అది నాకు మరింత నచ్చింది! నిజానికి చదువుకూ ఉద్యోగానికి ఏమీ సంబంధం లేదు. చదువు జ్ఞానం కోసం. ఉద్యోగం భుక్తి కోసం. ఏ పనైనా చెయ్యగలగాలి. ప్రారంభంలో ఎంత జీతం ఇచ్చినా సర్దుకునేలా ఉండాలి.” అంటూ కొనసాగుతున్న ఆయన మాటల్ని వింటూ కూర్చున్నాడు రాఘవ.

“..మన విద్యాసంస్థ ఒక విశిష్టమైన ప్రపంచం. ఇందులోకి అడుగుపెడితే ఎవరికీ బయటికి వెళ్లాలనిపించదు. మనలోని కోరికలను తగ్గించుకుని జీవించటమెలాగో ఈ వృత్తి నేర్పుతుంది. ఉన్నంతలో తృప్తి పడేవాడు ఈ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా హాయిగా బ్రతగ్గలడని నా నమ్మకం. ఎక్కువ జీతం కోసమో, ఏదో పదవి కోసమో ఇక్కడ అడుగుపెడితే అది అతనికి దక్కదు. నిస్వార్థంగా పనిచేసుకుంటూ వెళుతుంటే మనకు అందాల్సినవి అందుతూ ఉంటాయి. అందుకు నేనే ఒక ఉదాహరణ. ఒక సాధారణ ఆచార్యుడిగా నేనిక్కడ ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు ఈ ఆవాస విద్యాలయానికి ప్రధానాచార్యులుగా పనిచేస్తున్నాను. నాకు తెలిసింది ఒక్కటే. మన పనిని మనం బాధ్యతగా చేసుకుంటూ పోవటమే. మరొక విషయం, నా పనిని మాత్రమే నేను చేస్తాను. ఇంకో పనిని నేను చెయ్యను అని కూడా అనుకోవటానికి వీలులేదు.” అంటూ తన మాటల్ని ఆపి రాఘవకేసి చూశారు ప్రధానాచార్యులు.

అవునన్నట్టుగా తలూపాడు రాఘవ.

“మనది ఆవాస విద్యాలయం. పాఠాలు బోధించటంతో పాటుగా మనం కొన్ని అదనపు బాధ్యతల్ని కూడా చెయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క ఆచార్యుడు ఒక్కొక్క అదనపు బాధ్యతను ఇప్పటికే చేస్తున్నారు కూడా. ఇంగ్లీషు మోహనరావు గారున్నారు కదా, ఆయన.. ఈ పిల్లల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక తీవ్రతరం అయ్యిందనుకోండి. ఆ విద్యార్థిని టౌనుకు తీసుకెళ్లి డాక్టరుకు చూపించి తీసుకొచ్చే బాధ్యత ఆయనది. అలాగే మన బయాలజీ మాస్టారు నిరంజన్‌ గారున్నారు కదా, ఆయన ఇక్కడి పిల్లల్లో ఎవరికైనా దగ్గు, జ్వరమూ, తలనొప్పి, కడుపునొప్పి అంటూ ఏదైనా సుస్తీ చేస్తే వెంటనే ఆయన వాళ్లకు మందుబిళ్లలిచ్చి ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇక కె.కె. గారున్నారు. సడెన్‌గా బళ్లో కరెంట్‌ పొయ్యిందనుకోండి. వెంటనే ఆయన జనరేటర్‌ను ఆన్‌ చెయ్యవలసి ఉంటుంది. వెళ్లి ఆన్‌ చెయ్యటమే కదా అనుకుంటే పొరబాటే అవుతుంది. జనరేటర్‌ ఎల్లవేళలా సరిగ్గా పనిచెయ్యటానికి అనువుగా దాన్ని ఎప్పుడూ కండీషన్‌లో పెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనదే. దానికి రిపేర్లు వస్తే చూసుకోవటం, ఆయిల్‌ అయిపోతే తెప్పించి స్టాక్‌ పెట్టుకోవటం.. ఇత్యాదివన్నీ ఆయనే చూసుకోవాలి. ఇక రాజారావుగారున్నారు, ఆయన దోబీ లెక్కలు చూసుకుంటారు. అంటే, ఇక్కడ చదువుకుంటున్న పిల్లల బట్టలు దోబీ వచ్చి తీసుకెళతాడు. మరి ఏఏ క్లాసు పిల్లలు ఎన్నెన్ని బట్టలు వేశారు, ఎన్నిసార్లు వేశారు ఇత్యాది లెక్కలన్నీ ఆయన చూసుకోవాలి. నెలయ్యాక లెక్క చూసి దోబీకి డబ్బు మొత్తం చెల్లించాలి కదా. ఇక సుందరం గారున్నారు.. నాయీ లెక్కలు చూసుకుంటారు. పిల్లలకు వెంట్రుకలు బాగా పెరిగితే ప్రతి ఆదివారం వచ్చే మంగలి చేత ఎవరెవరికి జుత్తు కత్తిరించాలి అని చూసుకుంటూ లెక్కలు రాసిపెట్టాలి. అర్థమౌతోందా రాఘవగారూ..” అంటూ రాఘవ వైపు చూశారు ప్రధానాచార్యులు.

అర్థమౌతోంది అన్నట్టుగా తలూపాడు రాఘవ.

“ఆ రకంగా మీకు భోజన విభాగపు బాధ్యతను అనగా వంటశాల వ్యవహారాలను అప్పగిస్తున్నాను. అందుకు మీరు పెద్దగా ఏమీ చెయ్యఖ్ఖర్లేదు. రేపు ఉదయం ఏం అల్పాహారం చెయ్యాలో ముందుగానే నిర్ణయించాలి. అది ఏమిటో రేపు ఉదయం ఆరుగంటలకు వంట మాస్టరుకు చెప్పి దానికి కావలసిన వస్తువులన్నింటినీ స్టోరు రూములో నుండి తీసివ్వాలి. ఏమేం కావాలన్నది వంటమాస్టరే చెబుతాడు. అవి మీరు తీసిస్తే చాలు. అలాగే మధ్యాహ్నం ఏం కూర వండాలి, ఏం వేపుడు చెయ్యాలి.. మీరే నిర్ణయించి వాటికి సంబంధించిన వస్తువుల్ని వంటమాస్టరుకు ఇవ్వాలి. అలాగే సాయంత్రం అల్పాహారమూ, రాత్రి భోజనానికి కూడా అన్నీ ముందుగానే నిర్ణయించి వంటమాస్టరుకు తెలియజేసి దానికి కావలసిన వస్తువుల్ని ఇవ్వాలి. అంతేకాదు, రాత్రి భోజనాలు పూర్తయ్యి నిద్రకు వెళ్లేలోపు ఆ రోజు దేనిదేనికి ఎంతెంత ఖర్చు అయ్యిందో అనగా ఉదాహరణకు బియ్యం ఎంత ఖర్చు అయ్యందీ, అన్ని కిలోలు నెంబర్ని రాయటం, దానికెదురుగా ఒకకిలో ధర ప్రకారం మొత్తం ఎంతయ్యింది ఆ మొత్తాన్ని వెయ్యటం.. ఇలా ప్రతి వస్తువూ ఎంత వాడారు, ఎంత ఖర్చు అయ్యింది సరాసరిగా వేస్తే సరిపోతుంది. దానికంటూ ఒక పుస్తకం ఉంటుంది. అందులో రాసి సంతకం చెయ్యాలి. ఆ బాధ్యతను మీకు అప్పజెబుతున్నాను. అది రేపటినుండే అమలు కావాలి. అర్థమైందా రాఘవ గారూ..” అంటూ తన మాటల్ని ఆపి అతని ముఖంలోకి చూశారు ప్రధానాచార్యులు.

అర్థమైందన్నట్టుగా నవ్వుతూ తలాడించాడు రాఘవ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here