జీవితమొక పయనం-12

0
2

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[చల్లా రవి అనే పిల్లవాడికి మెలకువ వస్తుంది. లఘుశంక కోసం బయటకు వెళ్లాలి. ఇంకో పిల్లాడిని నిద్ర లేపి తోడు రమ్మంటాడు. ఇద్దరూ వెనక వైపు వెళ్ళబోతారు. అంతలో కాలికేదో తగిలి ముందుకు పడబోయి నిలదొక్కుకుని కిందికి చూసిన రవికి హాలు మధ్యలో నేలమీద దుప్పటి పరుచుకుని నిద్రపోతున్న రాఘవ కనిపిస్తాడు. ఆచార్యకి ఫాన్ గాలి తగలక ఇక్కడ పడుకున్నారని వాడికి అర్థమవుతుంది. మోహనరావు వచ్చి తలుపు తట్టి, రాఘవని నిద్ర లేపి – పిల్లల్ని లేచి చదివించమంటాడు. పిల్లలు లేచి అధ్యయనం మొదలుపెడతారు. రాఘవ మొహం కడుక్కుని వచ్చి, వాళ్ళని గమనిస్తూ, తాను చెప్పబోయే పాఠాన్ని మరోసారి ప్రిపేరవుతాడు. తర్వాత యోగాసనాల సెషన్ మొదలవుతుంది. ప్రధానోపాధ్యాయులు కూడా ఆసనాలు వేయడం చూసిన రాఘవ ఆశ్చర్యపోతాడు. తర్వాత పిల్లల్ని ఆటలకు పంపుతారు. పిల్లలు ఆడుకుని వచ్చేసరికి రాఘవ, ఇతర టీచర్లు స్నానాలు చేస్తారు. రాఘవ తన స్థానం దగ్గరకి వచ్చే చూస్తే, తన పెట్టె, సామాన్లు కనిపించవు. ఏం జరిగిందో అర్థం కాదు. ఇంతలో అక్కడికొచ్చిన చల్లా రవి – తాము రాఘవ సామాన్లని మార్చినట్టు చెప్పి, ఆ చోటు చూపిస్తారు. ఎందుకిలా చేశారని అడిగితే, ఫాన్ గాలి అందక రాఘవ పడుతున్న ఇబ్బందిని గమనించామనీ, ఇక్కడైతే ఫాన్ గాలి బాగా వస్తుందని అంటాడు రవి. రాఘవ స్థానాన్ని రవి తీసుకుంటాడు. ఫాన్ గాలి లేకపోయినా తమకు ఇబ్బంది లేదని, తమకు అలవాటేనని అంటాడు. వారి అభిమానానికి ముగ్ధుడవుతాడు రాఘవ. బడిలో చేరి మూడు రోజులయ్యాకా, రాఘవని ప్రధానోపాధ్యాయులు పిలిపిస్తారు. ఆటస్థలంలో ఓ బల్ల మీద కూర్చున్న ఆయన – తన పక్కన కూర్చోమని రాఘవకి సూచిస్తారు. రాఘవ సంశయిస్తే, బడి వేళల్లో మాత్రమే తాను ప్రధానోపాధ్యాయుడినని, ఇప్పుడు తనతో సహజంగా ఉండొచ్చని అంటాడు. అధ్యాపకులందరికి చదువు చెప్పడమే కాకుండా మరో అదనపు బాధ్యత ఉంటుందని చెప్తారు. ఏయే అధ్యాపకుడు ఏయే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారో చెప్పి, రాఘవకి వంటశాల వ్యవహారాలను అప్పగిస్తారు. – ఇక చదవండి.]

23. బాబోయ్‌.. ఉప్మా!

[dropcap]రా[/dropcap]ఘవ, ఆవాస విద్యాలయంలో చేరి రెండు వారాలు దాటాయి. అటు తెలుగు ఉపాధ్యాయుడుగానూ, ఇటు భోజన విభాగపు బాధ్యతలనూ చక్కగా నిర్వర్తిస్తున్నాడు.

6,7 తరగతుల పిల్లలు రాఘవ చెప్పే పాఠాన్ని బాగానే అర్థం చేసుకుంటున్నారు. ఏవైనా ప్రశ్నలడిగితే చక్కగా సమాధానాలు చెబుతున్నారు. హోమ్‌ వర్క్ ఇస్తే రాసుకొస్తున్నారు. పద్యాలు నేర్చుకు రమ్మంటే కంఠతా పట్టుకొస్తున్నారు.

అలాగే వంటమాస్టర్‌ వెంకటయ్యతో కూడా బాగానే సాన్నిహిత్యం ఏర్పడింది. అతను చక్కగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాడు. కానీ వెంకటయ్య మితభాషి. ఎదుటివాళ్లు పదిమాటలు మాట్లాడితే అతను ఒక్కమాట మాట్లాడుతాడు! అతను నవ్వటం అన్నది ఇప్పటిదాకా ఎవరూ చూళ్లేదు. అతనికి సహాయంగా.. కాయగూరలు తరిగివ్వటానికీ, పోపు పెట్టటానికీ, అన్నం వార్చటానికీ, పాత్రలు శుభ్రం చెయ్యటానికీ.. దోబీ అంకయ్య భార్య అతనికి అందుబాటులో ఉంటుంది. వంటపని పూర్తయ్యాక ఆమె, తన భర్తకు బట్టలుతకటంలో సాయపడుతుంది.

ఆరోజు స్నానం పూర్తిచేసి, పంచెను గోచీపెట్టి కట్టుకుంటున్నాడు రాఘవ.

ఇప్పుడతనికి ఎవరి సహాయమూ లేకుండానే పంచె కట్టుకోవటం సులభంగా వచ్చేసింది. లాల్చీ తొడుక్కుని జేబులో పెట్టుకోవలసిన పెన్ను, ఇతర కాగితాలనూ పెట్టుకుని పడకమీద కూర్చున్నాడు. జేబులోనుండి సమయసారిణిని తీసుకుని ఆరోజు తనకు ఏయే కాలాంశాలున్నాయో చూసుకుంటున్నాడు.

అంతలో.. చల్లా రవి అతని దగ్గరికొచ్చి, “ఆచార్జీ, గీ దినం అల్పాహారమేంది?” అని ప్రశ్నించాడు. వాడు అలా అడుగుతుంటే మరో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కూడా వాడి పక్కనే నిలబడి ఆసక్తిగా వినసాగారు.

“ఉప్మా..” బదులిచ్చాడు రాఘవ.

విద్యార్థులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఏదో సైగ చేసుకున్నారు. కొందరు మెల్లగా వెనకవైపుకు జారుకున్నారు.

కొందరు నోటుపుస్తకంలో నుండి కాగితాలను సర్రున చింపి, తమ పెట్టెల్లో నుండి ఊరగాయ బాటిళ్లను బయటికి తీసి పచ్చళ్లను పేపరుమీద వేసుకుంటున్నారు. ఉన్నట్టుండి మామిడికాయ ఊరగాయ వాసన గుప్పుమంది.

తలతిప్పి ఒక విద్యార్థికేసి చూశాడు. అదేంటన్నట్టుగా కనుబొమ్మలు ముడివేసి అడిగాడు.

“మామిడికాయ ఊరగాయ ఆచార్జీ, ఉప్మాకు బలేగుంటది. అందుకే ఏస్కుంటున్నము.” అన్నాడు.

ఇంకొకడు “ఆచార్జీ, టమేట పచ్చడి ఉప్మాకు ఇంకా రుసిగుంటంది. మీకూ ఇయ్యమంటరా?..” అని అడిగాడు.

“నాకొద్దు! నువ్వు వేసుకెళ్లు.” అని చెప్పి హాల్లోకి చూశాడు. దాదాపు విద్యార్థులందరూ భోజనశాలకు వెళ్లిపోయినట్టున్నారు. ఒకళ్లిద్దరు అప్పుడే మగ్గులు పట్టుకుని వెనక్కు పరుగెడుతున్నారు.

ఇంతలో అల్పాహారం సమయమైనట్టుగా గంటకొట్టారు. రాఘవ గబగబా భోజనశాలకు వెళ్లాడు.

ఆశ్చర్యం! ఆ రోజు దాదాపు సగం మంది పిల్లలు ఎటో మాయమైపోయినట్టున్నారు. కనిపించటం లేదు.

టీచర్లలో కూడా ఒక్కళ్లిద్దరు తప్ప మిగతావాళ్లు కనబళ్లేదు. ఏమయ్యారు వీళ్లు? ఎక్కడికెళ్లారు?

ఆలోచిస్తూ.. భోజన మంత్రం కానిచ్చాడు. పదవ తరగతి విద్యార్థులు, మిగిలిన పిల్లలకు ఉప్మాను వడ్డించసాగారు.     ఒక విద్యార్థి రాఘవకు వడ్డించటానికొచ్చాడు. బక్కెట్‌లో నుండి గరిటెతో ఉప్మాను తీసి వడ్డించాడు. అది పళ్లెంలోకి పడలేదు. గరిటెను పైకెత్తి విదిలించాడు వాడు. అది రబ్బరు సాగినట్టుగా గరిటెనుండి పళ్లెంలోకి మెల్లగా జారసాగింది. గరిటె ఉప్మాను వడ్డించటానికి వాడికి రెండు నిమిషాలు పట్టింది.

ఉప్మాను చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టుకుని నమిలాడు, అంతే! పెదాలు రెండూ కరుచుకు పోయాయోమోనని అనుమానం వచ్చింది. ప్రధానాచార్యుల తీరు ఇక వర్ణనాతీతం. ఉప్మాతో కుస్తీ పడుతున్నారు.

పిల్లల గైర్హాజరుకు అసలు కారణం.. అప్పుడర్థమైంది రాఘవకు.

ఉప్మా అని ముందుగానే తెలుసుకుని ఎక్కడికో ఉడాయించారన్నమాట.

“ఎటెళ్లిపోయి ఉంటారు?” పక్కనున్న మోహనరావును అడిగాడు రాఘవ.

“ఇంకెక్కడికెళ్లగలరు? లోటాలెత్తుకుని వెనకున్న తైలంచెట్ల దగ్గర ఓ అర్ధగంట గడిపేసి తిరిగొస్తారు.” నవ్వుతూ అన్నాడతను.

‘అయితే వీళ్లకు ఉప్మా ఫోబియా బాగానే పట్టుకుందన్నమాట. దీన్ని ఎలాగైనా పోగొట్టాలి. ఒక చక్కటి రుచికరమైన అల్పాహారాన్ని వీళ్లకు పరిచయం చెయ్యాలి.’ అని నిర్ణయించుకున్నాడు.

వారమంతా ఉదయంపూట చేసే అల్పాహారాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. పులిహోర ఒకరోజు, ఇడ్లీ ఒకరోజు, ఊతప్పం ఒకరోజు, వారానికి రెండు రోజులు ఉప్మా, పోపన్నం ఒకరోజు, ఆదివారం పూరీకుర్మా. ఇదీ వారంరోజుల మెనూ. ‘రెండురోజులు ఉప్మా బదులు ఒకరోజు పొంగలిని పరిచయం చేస్తే ఎలా ఉంటుంది?’ ఆలోచించాడు రాఘవ.

నేరుగా ప్రధానాచార్యులు దగ్గరికెళ్లి.. “పిల్లలకు ఉప్మా అంటే అయిష్టంలా ఉంది ఆచార్యజీ. అందుకే ఒకరోజు దాని బదులు పొంగలి చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను.” అన్నాడు రాఘవ.

“ఏదో ఒకటి చెయ్యించండి, రాఘవగారూ. ఈ ఉప్మాను తినలేక ఛస్తున్నాం.” నిట్టూర్చాడు ప్రధానాచార్యులు.

“పైగా ఈరోజు ఉప్మా కాస్త పాకంలాగా తయారైనట్టుంది. అందుకే ఇష్టంగా తినలేకపోయినట్టున్నారు.”

“ఈ రోజే కాదు రాఘవగారూ, ప్రతిసారీ ఇలాగే చేస్తాడు మన వెంకటయ్య. ఉప్మా చెయ్యటం వెంకటయ్యకు సరిగ్గా రాదు. మరి ఆ పొంగలి తయారుచెయ్యటం ఎలాగో మీకు తెలుసా?” ఆసక్తిగా అడిగారు ప్రధానాచార్యులు.

“అది బ్రహ్మ విద్యేం కాదు ఆచార్యజీ. తేలికే!”

“ఆహా, అవునా? మరి దానికి ఏమేం దినుసులు అవసరమౌతాయో చెప్పండీ?..”

“బియ్యమూ, పెసరపప్పూ, జీడిపప్పూ, నెయ్యి…” అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు రాఘవ.

“ఆగండాగండి, జీడిపప్పూ నెయ్యా.. బాగానే ఖర్చు అయ్యేటట్టుందే?” అన్నారాయన.

“వద్దనుకుంటే జీడిపప్పును మానేయొచ్చు. నెయ్యి బదులు డాల్డా వాడొచ్చు.. అయినా దేని రుచి దానిదేనండీ. ఒక్కసారి రుచి చూశారంటే మరిక వదలరు మన పిల్లలు.” ఉత్సాహంగా చెప్పాడు రాఘవ.

“అయితే దాన్నొకసారి ఈవారంలో చెయ్యించండి, చూడ్దాం!” అన్నారు ఆసక్తిగా కోటేశ్వరరావుగారు.

“ఈవారంలో ఎందుకూ రేపే చెయ్యిస్తాను, ఆచార్యజీ!” రెట్టించిన ఉత్సాహంతో అన్నాడు రాఘవ.

“అలాగే కానివ్వండి.” అంటూ ఎలాగో అల్పాహారం తినటం పూర్తిచేసి అక్కణ్ణించి కదిలారు ప్రధానాచార్యులు.

మరునాడు ఉదయం.. రాఘవ, వంటమాస్టరు దగ్గరికెళ్లి.. “వెంకటయ్యా.. ఇవ్వాళ మనమొక కొత్త అల్పాహారం చెయ్యబోతున్నాం.” అంటూ ఉత్సాహంగా మాటల్ని మొదలుపెట్టాడు.

“ఆచార్జీ, సెయ్యటం నాకు తెలవాలిగా?” అన్నాడు వెంకటయ్య.

“ఎన్నో వంటకాలను ఎడమచేత్తో సునాయాసంగా వండి పారేసే మీరు, ఇది కష్టమని నేననుకోవటం లేదు వెంకటయ్య గారూ.. మీరు అపర నలుడూ, బ్రపర భీముడూ..” అంటూ ఏదో నోటికొచ్చినట్టు కాస్త పొగడుతూ మాట్లాడాడు రాఘవ.

“నన్ను జూస్తే మీకు భీముళ్లెక్క అగుపిస్తున్ననా ఆచార్జీ..” నవ్వుతూ అన్నాడు వెంకటయ్య.

మొదటిసారిగా అతని ముఖంలో నవ్వును చూశాడు రాఘవ. ఆ నవ్వులో ప్రత్యేకంగా కనిపించాడతడు.

“ఆకారంలో కాకపోవచ్చు వెంకటయ్యా.. పనిలో.. పనితనంలో.. చూడాలి మీ పాకశాస్త్ర నైపుణ్యాన్ని. ఆ కళలో మీకు మీరే సాటి. మీకు లేరు ఎవరూ పోటీ.” అన్నాడు నాటకీయంగా..

“పొగడ్డం ఆపి, ముందుగాల దాని పేరేంటో, గదెట్ట సెయ్యాలో, సెప్పుండ్రి!” అన్నాడు వెంకటయ్య తనూ నవ్వుతూ.

“చెబుతాను వినండి.” అంటూ ఎలా చెయ్యాలో చెప్పటం పూర్తి చెయ్యకమునుపే “ఓస్‌.. గిదేనా.. దీన్ని మేము ఇక్కడ పులగం అంటం ఆచార్జీ. దీన్ని వండటం నాకు తెలియకేం కాదు. ప్రధానాచార్యులు ఖర్సు ఎక్కువవుద్దని మొదట్లోనే ఆపించేశారుగా. అందుకే సెయ్యట్లేదు.” రాఘవకు పిర్యాదు చేస్తున్నట్టుగా అన్నాడు వెంకటయ్య.

“నిన్న ఆయనే చెయ్యించమన్నారు. ఆ మాటనే సుగ్రీవాజ్ఞగా భావించి ఇవ్వాళ నువ్వు అదరగొట్టేయ్‌! తర్వాత చూసుకుందాం.  పాపం అప్పుడప్పుడూ ఆయన నాలుకకూ కాస్త నెయ్యా, జీడిపప్పూ, బాదంపప్పూ.. తగలనివ్వు వెంకటయ్యా.”

“నేనేమన్నా కాదంటనా ఆచార్జీ. గాయనే డబ్బూ.. ఖర్సూ.. అంటూ నా సేతులు కట్టిపడేస్తే ఇగ నేనేం సెయ్యనూ?”

“అదీ సరేలే! ఇవ్వాళ నేను చెబుతున్నాగా. నువ్వు అదరగొట్టు. నెయ్యి వాసన ఆయన్ను ఉన్నపళాన ఇక్కడికి రప్పించాలి.” వెంకటయ్యను ఉసిగొల్పాడు రాఘవ. దాంతో ఎంతో ఉత్సాహంగా పాత్రను పొయ్యిమీదికి ఎక్కించాడు వెంకటయ్య.

అల్పాహారం పూర్తయ్యే సమయానికి.. “ఒరేయ్‌.. ఇవ్వాళ కొత్త అల్పాహారం అదిరిపొయ్యింది. మీరందరూ తప్పకుండా వచ్చి రుచి చూడండి” అంటూ పిల్లలందరిలోనూ జిహ్వార్తిని నింపాడు రాఘవ.

దాంతో అల్పాహారం గంట కొట్టగానే.. అందరూ తమ తమ కంచాలను పట్టుకుని భోజనశాలకు పరుగుపెట్టారు.

పొంగలి వడ్డిస్తుంటే తేలి వచ్చే నెయ్యి వాసనకు అందరిలోనూ నోట్లో నీళ్లూరసాగాయి.

భోజన మంత్రం అయ్యాక పొంగలి మీద దాడిచేశారు విద్యార్థులు. నిజం చెప్పొద్దూ. వెంకటయ్య బాగానే చేశాడు. ఒక్కొక్కరు రెండోమారు కూడా పెట్టించుకుని తిన్నారు. దాంతో చాలామందికి పొంగలి రెండోమారు అందక ఖాళీ అయిపొయ్యింది.

ప్రధానాచార్యులు చేతులు కడుక్కుని వస్తూ.. “రాఘవగారూ. మీరు ఇవ్వాళ చెయ్యించిన అల్పాహారం నిజంగా చాలా రుచికరంగా ఉంది. కానీ ఇది వారం వారం చేసుకునే వంటకంలా నాకనిపించటం లేదు. నెలకోమారు చేసుకుందాం లే!” అన్నారు.

“మరీ నెలకోసారి అంటే పాపం పిల్లలు నిరాశపడిపోతారేమో. పోనీ వారం విడిచి వారం చెయ్యిస్తాను, అనుమతించండి.”

“అలాగే కానివ్వండి.” అని నవ్వుతూ ముందుకు కదిలారు ప్రధానాచార్యులు కోటేశ్వరరావుగారు.

22. 24. తేళ్ళ పుట్ట?

ఒకరోజు.. మధ్యాహ్నపు తరగతులు ఇంకా ప్రారంభం కాలేదు. గంట కొట్టటానికి ఇంకా చాలా సమయముంది. అప్పటికే భోజనాలు పూర్తిచేసిన ఉపాధ్యాయులు తమతమ నిలయాల్లో పరుపులమీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు.

జూన్‌ నెలాఖరుకొచ్చినా ఎండ తీవ్రత ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. పాఠశాల ముందున్న ఇసుక మైదానం నుండి వేడిగాలులు బలంగా వీస్తున్నాయి. ఆ ఉక్కపోతకు తట్టుకోలేక పిల్లలు ఫ్యాన్లకింద చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు.

రాఘవ కూడా తన పడకమీద పంచె లాల్చీ తోటే పడుకుని ఏదో ఆలోచిస్తున్నాడు.

ఇంతలో.. చల్లా రవి ఖాళీ మగ్గు చేతబట్టుకుని రాఘవ దగ్గరికొచ్చి.. “ఆచార్జీ ఎళ్లొస్తాను..” అంటూ మగ్గును చూపించాడు. వెళ్లమన్నట్టుగా సైగ చేశాడు రాఘవ. చిన్నపిల్లలు వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ‘రెంటికి’ వెళుతూంటారు. వాళ్లకు నియంత్రణ అంటూ ఉండదు అనుకుంటూ.. “తోడుకు ఎవరినైనా తీసుకెళ్లరా!” అన్నాడు రాఘవ.

“అలాగే ఆచార్జీ. రారా బత్తినీ..” అంటూ తన మిత్రుణ్ణి పిలవగానే, వాడు రవి వెనకే బయటికి దౌడు తీశాడు.

విశ్రాంతిగా పడుకున్న రాఘవకు.. చల్లని ఫ్యాను గాలికి మెల్లగా కళ్లు మూతలు పడసాగాయి.

ఇంతలో తోడుగా వెళ్లిన రవి స్నేహితుడు బత్తినిగాడు.. పరుగు పరుగున రాఘవ దగ్గరికొచ్చాడు.

“ఆచార్జీ ఆచార్జీ.. తేలు, తేలు..” అని వగరుస్తూ చెప్పాడు. దాంతో నిద్రమత్తంతా వదిలిపోయింది రాఘవకు.

“ఏదీ, ఎక్కడ్రా..” అంటూ గాబరా పడుతూ లేచి కూర్చున్నాడు.

“బయట.. రెంటికెళ్లిన చోట..” అంటూ చేతిని బయటికి చూపించాడు.

“రవి ఏడ్రా..” ఆదుర్దాగా అడిగాడు రాఘవ.

“అక్కడే ఉన్నాడు ఆచార్జీ..” చెప్పాడు వాడు.

“తేలు దగ్గర వాణ్ణి ఒక్కణ్ణీ వదిలిపెట్టి నువ్వెందుకొచ్చావు రా ఇక్కడికి? అది వాణ్ణి ఏంచేస్తుందో ఏమో? వాణ్ణీ వెంటబెట్టుకుని వచ్చేయొచ్చుగా!” అన్నాడు రాఘవ కంగారుపడుతూ.

“వాడి పని ఇంకా పూర్తికాలేదన్నాడు ఆచార్జీ.”

“ఏడ్చినట్టే ఉంది. పద పద, వాడెక్కడున్నాడో చూపిద్దువు గానీ!” అంటూ రాఘవ బయటికి దారితీశాడు.

ఈలోపు ఈ విషయం కాస్తా పిల్లలందరి చెవులకూ సోకినట్టుంది. వీళ్ల వెనకే వాళ్లూ ఒక్కొక్కరుగా వెంబడించసాగారు.

వీళ్లు వెళ్లేసరికి రవిగాడు ఒక కట్టెపుల్ల తీసుకుని అక్కడక్కడా ఉన్న చీమల పుట్టల్లోకి దోపి కెలుకుతున్నాడు.

“ఇటే ఎళ్లినట్టు అనిపించింది రా. అగ్గో..అగ్గో..” అంటూ వాడికి తేలు కనిపించినట్టుంది, దాన్ని చంపటానికి అటు ఉరికాడు. ఔను, అది తేలే! రాఘవ కూడా చూశాడు. కానీ అది చిన్నాచితకా సైజులో లేదు. చాలా పెద్దదిగా ఉంది.

అది సరసరమని ప్రాకుతూ అక్కడున్న ఒక చీమలపుట్టలోకి దూరి మాయమైపొయ్యింది. పిల్లలందరూ ఆ చీమలపుట్ట చుట్టూ చేరి వేడుక చూడసాగారు. రవిగాడు ఊరుకోకుండా తన చేతిలోని పుల్లను పుట్టలోకి దోపి అటుఇటు తిప్పాడు.

రెండు నిమిషాలకంతా పుట్ట లోపలికెళ్లిన తేలు బయటికొచ్చింది. దాన్ని చూసిన వెంటనే ఎవరో.. “అయ్యబాబోయ్‌, అది తేలు కాదొరే, మండ్రగబ్బ!” అంటూ అరిచారు. అంతే! దాన్ని చంపే పనిలో పడ్డారు పిల్లలందరూ.

ఈలోపు జరగాల్సిన ప్రమాదం జరగనే జరిగింది. పుట్టలోంచి ఒకటి కాదు రెండుకాదు, పదులకొద్దీ మండ్రగబ్బలు బయటికి వరుసకట్టాయి. దాన్ని చూడగానే రాఘవ ఒళ్లు గగుర్పాటుకు లోనైంది!

అన్ని మండ్రగబ్బల్ని ఒకేసారి చూసేసరికి పిల్లల్లోనూ భయాందోళనలు ఎక్కువై వాటిని చంపటానికి తయారయ్యారు. కొందరు భయస్థులు తమతమ నిలయాల వైపు పరుగందుకున్నారు.

“రేయ్‌, రేయ్‌, వాటిని ఏం చెయ్యకండ్రా, చాలా ప్రమాదం! అందరూ ఇటు వచ్చేయ్యండి.” అరవసాగాడు రాఘవ.

ఈలోపు అక్కడికి రాజారావు, సుందరం, మోహనరావు మొదలైన ఆచార్యులందరూ వచ్చేశారు.

చుట్టూ మనుషుల హడావిడీ, తమలో ఒకరికి జరిగిన హానీ.. వీటితో ఆ మండ్రగబ్బలు తమ కొండేల్ని పైకెత్తుకుని ఎవరు దొరుకుతారా, వాళ్లను కాటేద్దామా.. అన్న ఆలోచనతో వేగంగా అటుఇటు ప్రాకుతున్నాయి. “ఎవరూ వాటి జోలికి వెళ్లకండి. దూరంగా వచ్చేయండి. వాటికి ఏ హానీ జరగకూడదు. చేశారా, మనకు ప్రమాదం! అది రెచ్చిపోయి మన నిలయాల వరకూ వచ్చేస్తాయి. తర్వాత వాటిని చంపటం కష్టమవుతుంది. దూరంగా వచ్చేయండి, వాటిని ఏమీ చెయ్యకండి..” అంటూ పిల్లలందరినీ హెచ్చరిస్తూ గట్టిగట్టిగా అరుస్తున్నాడు మోహనరావు.

దాంతో వాటినుండి చాలా దూరంగా వచ్చేశారు పిల్లలు. అవి వృత్తాకారంలో రెండు మీటర్ల వరకూ ఆవేశంతో కొండేల్ని పైకెత్తుకుని దాడికి ప్రయత్నించాయి. కానీ, ఎవరూ దాని చేతికి చిక్కలేదు. పైగా వాటికి హాని చెయ్యకుండా మిన్నకుండిపోయారు. దాంతో అవి తమ కోపాన్ని తగ్గించుకుని అటుఇటు తిరగాడసాగాయి.

“రేయ్‌, అందరూ వాళ్ల వాళ్ల నిలయాల్లోకి వెళ్లండి. ఇంకొక మూడురోజుల వరకూ ఇటువైపుకు ఎవరూ రాకండి, తెల్సిందా!” అంటూ పిల్లలందరినీ హెచ్చరించాడు మోహనరావు.

“ఒకేసారి ఇన్ని మండ్రగబ్బల్ని నేనెప్పుడూ చూళ్లేదండీ. తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.” అన్న రాఘవతో కలిసి నడుస్తూ.. “అవి ఆ చీమల పుట్టను తమ నెలవుగా చేసుకున్నట్టున్నాయి. ఈ ఎండ వేడికి భరించలేక ఒక మండ్రగబ్బ బయటికొచ్చి మనవాడి కంట్లో పడ్డట్టుంది. దాంతో వీడేమో దాన్ని రెచ్చగొట్టి, మిగతావాటినీ బయటికొచ్చేలా చేశాడు. ఏది ఏమైనా దానికి అపకారం చెయ్యకపోవటమే మేలు. అంతేకాక ఇంకో మూడు నాలుగురోజుల వరకూ అటువైపుకు వెళ్లకపోవటమే మంచిది.” అని తమ నిలయంలోకి వెళ్లిపోయాడు మోహనరావు.

ఈ లోపు ప్రధానాచార్యులకు విషయం తెలిసి రాఘవ ఉండే నిలయానికి ఆయనే నేరుగా వచ్చి విషయం తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నాడు.

“రేయ్‌ రవీ, ఈ హడావిడిలో నువ్వసలు కాళ్లు కడుక్కున్నావట్రా..” అని ఆయన అడిగేసరికి, అప్పుడే ఆ విషయం గుర్తుకొచ్చినవాడిలా మగ్గు తీసుకుని నీటితొట్టె వైపు పరుగుపెట్టాడు వాడు.

దాంతో అందరూ గొల్లున నవ్వారు. ఆయనా నవ్వుకుంటూ కార్యాలయం వైపు నడిచారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here