జీవితమొక పయనం-15

0
2

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[మర్నాడు ఉదయం ప్రధానాచార్యులు రాఘవని పిలిపిస్తారు. గబగబా ఆయన గదిలోకెళ్తాడు రాఘవ. అతన్ని చూడగానే, ఆందోళనగా, మనం అనుకున్నంత పనీ అయ్యిందంటారాయన. ఏమైందని కంగారుగా అడుగుతాడు రాఘవ. ఈ వార్త చదవండంటూ, దినపత్రికని రాఘవ ముందు పెడతారాయన. ఓ పేరు మోసిన భూస్వామిని తీవ్రవాదులు హత్య చేశారనీ ఉంటుంది అందులో. నిన్న తమ వద్దకు వచ్చి అన్నం వడ్డించుకు తీసుకువెళ్ళిన వారి పనే ఇదని, పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తూ వస్తే, తాము దొరికిపోతామని, ఇక తమని ఆ భగవంతుడే కాపాడాలని ఆయన అంటారు. రాఘవ ఆయనకు ధైర్యం చెప్పి – వంటాయన వెంకటప్పయ్యని పిలిపించి – ఎవరైనా వచ్చి విచారణ జరిపితే – తమ వద్దకు ఎవరూ రాలేదనీ, తామెవరికి భోజనం పెట్టలేదని చెప్పాలని గట్టిగా చెప్తాడు. అదే మాట చాకలాయనకూ, అతని భార్యకు కూడా చెప్పమంటాడు. తరువాత రాజారావుని కలిసి జరిగినది చెప్పి, అతన్ని జాగ్రత్తగా ఉండమంటాడు. తాను అన్నలని కలిసిన సంగతి ఇద్దరు ముగ్గురు మిత్రులకి చెప్పానని రాజారావు చెబితే, రాఘవ వారందరినీ వ్యక్తిగతంగా కలిసి – నోరు జారవద్దని చెప్తాడు. అయితే ఆ సాయంత్రం వరకూ ఎవరూ ఎంక్వయరీకంటూ రాకపోయేసరికి హాయిగా ఊపిరి పీల్చుకుంటారందరూ. ఆ రాత్రి 2.20 ని॥ లకి తలుపు గట్టిగా చప్పుడైతే లేచి వెళ్ళి తీస్తాడు రాఘవ. తుపాకులతో గదిలోకి ప్రవేశించిన వాళ్ళని చూసి బిత్తరపోతాడు రాఘవ. వాళ్ళేదో హిందీలో అడుగుతుంటే హిందీ రాదంటాడు. ఇంతలో ఓ తెలుగు వ్యక్తి లోపలికి వచ్చి ప్రశ్నలు వేస్తాడు. రాఘవ వాళ్ళు అడిగిన వాటికి జవాబులు చెప్తాడు. వాళ్ళు పోలీసులని అర్థం చేసుకుంటాడు.  ఈ లోపు ప్రధానాచార్యులు కూడా అక్కడికి వస్తారు. ఆయన్నీ ప్రశ్నిస్తారు. సమీప గ్రామంలోని ఓ మోతుబరి రైతును తీవ్రవాదులు హత్య చేశారని, మీరు వాళ్ళకి భోజనం పెట్టారని తెలిసింది, నిజమేనా అని అడుగుతారు. కాదంటాడు రాఘవ. వాళ్ళు పదవ తరగతి పిల్లల్లో ఒడ్డూ పొడుగు బాగుండి, బలిష్టంగా పిల్లల్ని గుచ్చి గుచ్చి చూస్తారు. గంటన్నరసేపు వాళ్లు అక్కడే మకాం వేస్తారు. టీచర్లందరినీ విచారించారు, కానీ పిల్లలెవరినీ డిస్టర్బ్‌చెయ్యలేదు. వాళ్ళు తీవ్రవాదులు మళ్ళీ వస్తే పోలీసులకి చెప్పమనీ, భోజనాలు పెట్టడం వంటివి చేయద్దని హెచ్చరించి వెళ్ళిపోతారు. – ఇక చదవండి.]

29. మిణుగురులు

[dropcap]రా[/dropcap]ఘవ ఆ ఆవాస విద్యాలయంలో చేరి మూడు నెలలకు పైగానే అయ్యాయి. బాబాయ్‌ను కలిసి కూడా చాలా రోజులయ్యాయి.

గత నెలలో సెకండ్‌ సాటర్డే రోజున బాబాయ్‌ ఇంటికి వెళ్లటమే! ఆ తర్వాత మళ్లీ వెళ్లే సమయమే చిక్కలేదు.

మరునాడు ఆదివారం. ‘బాబాయ్‌ వాళ్లింటికి వెళ్లొస్తే ఎలా ఉంటుంది?’ అని ఆలోచిస్తున్నాడు రాఘవ.

వెళ్లి వెంటనే తిరిగొచ్చెయ్యకుండా.. ఈసారి అటే ఏదైనా సినిమాకు వెళ్లొస్తే బావుణ్ణనిపించింది.

తాను సినిమాకు వెళుతున్నానని తెలిస్తే సుందరంగారు కూడా తయారవుతారు. అప్పుడు అతణ్ణీ వెంటబెట్టుకుని బాబాయ్‌ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అది తనకిష్టం లేదు. వాళ్లను ఇబ్బంది పెట్టటమూ భావ్యం కాదు. అందుకని తాను సినిమాకు వెళ్లే విషయాన్ని దాచిపెట్టి బాబాయ్‌ ఇంటికి వెళుతున్నట్టు మాత్రమే చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు.

అనుకున్నట్టే ఆదివారం ఉదయమే త్వరగా స్నానం పూర్తిచేసి ప్రధానాచార్యుల గదికెళ్లి తాను మాధవరెడ్డిగారిని కలవటానికి హనుమకొండకు వెళ్లి రావటానికి అనుమతి కోరాడు. ఆయన అందుకు సంతోషంగా వెళ్లి రమ్మని చెప్పాడు. ఆయన దగ్గర సెలవు తీసుకుని వంటశాలకెళ్లి గబగబ అల్పాహారం తిన్నాడు.

సరిగ్గా ఎనిమిది గంటలకు ఊళ్లో నుండి వరంగల్‌కు బస్సు బయలుదేరుతుంది. ఆ సమయానికి హరిజనవాడ బస్టాప్‌ దగ్గరుంటే బస్సును అందుకోవచ్చు, అనుకుంటూ.. రాఘవ వడివడిగా హరిజనవాడ వైపు నడక మొదలుపెట్టాడు.

ఆ సమయానికే అక్కడ ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు వరంగల్‌ బస్సుకోసం ఎదురుచూస్తున్నారు.

వాళ్లు రాఘవను చూసి పలకరింపుగా నవ్వారు. అందులో సుందరంగారు కూడా ఉన్నాడు. బహుశా సినిమాకే అయ్యుండొచ్చు! వారంవారం అతను సినిమా చూడకుండా ఉండలేడు. ఆఖరికి చూసిన సినిమానైనా రెండోసారి చూడ్డానికైనా వెనకాడడు. అంత పిచ్చి! ‘ప్రస్తుత యాంత్రికమైన జీవితంలో అదొక్కటే తనకు రిలీఫ్‌నిచ్చే విషయమని’ అతను పదేపదే చెబుతుంటాడు. ఏమిటో ఎవరి పిచ్చి వారికి ఆనందం!

ఈలోపు బస్సు రానే వచ్చింది. అందరూ గబగబా ఎక్కారు. బస్సు ఆ మట్టిరోడమీద మెల్లగా బయలుదేరింది.

గుంతల్లో దిగి లేస్తూ, మలుపుల్లో వాలుతూ, ఊగుతూ గంట తర్వాత హనుమకొండ స్టాపులో దిగాడు రాఘవ.

ఆ గంట ప్రయాణంతో అతని ఒళ్లంతా హూనమైపొయ్యింది. దిగి ఫుట్‌పాత్‌మీద కాళ్లూ చేతులూ విదిలించుకున్నాడు. కొంతసేపు అక్కడే ఆ స్టాపులోనే నిలబడ్డాడు. రెండు మూడు రిక్షాలు ఖాళీగా వెళుతూ అతణ్ణి చూసి “ఎక్కడికీ..? వొత్తారా..” అంటూ అడిగారు. రాఘవ రానని చెప్పాడు.

‘అయినా రిక్షాలో వెళ్లి మాత్రం తాను చెయ్యగలిగింది ఏముందనీ? అందుకే నడుద్దాం’ అని నిర్ణయించుకున్నాడు. ‘పైగా ఊరునీ చూసినట్టుంటుంది!’ అనుకుని నడవటం మొదలుపెట్టాడు.

ఒఠి చేతులతో బాబాయ్‌ ఇంటికి వెళ్లటం ఇష్టంలేక ఏం కొని తీసుకెళదామా అని ఆలోచిస్తుంటే దార్లో ఒకచోట అనాసపండ్లు అమ్మటం కనిపించింది. బేరమాడి రెండు పండ్లు కొన్నాడు.

అర్ధగంటకు పైగా నడిచి బాబాయ్‌ ఇంటికి చేరుకున్నాడు. రాఘవను చూడగానే నవ్వుతూ ఆహ్వానించాడు మాధవరెడ్డి. “ఏం బాబూ, ఇన్నాళ్లకు గానీ ఇక్కడికి రావాలనిపించలేదా?” అంటూ నిష్ఠూరపొయ్యింది పిన్ని.

“అదేం లేదు పిన్నీ, పని సరిగ్గా ఉంటోంది. ఆదివారమైతే పిల్లల తల్లిదండ్రుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. కానీ ఇవ్వాళ ఎలాగైనా మిమ్మల్ని కలవాలనే వచ్చాను.” అంటూ తన చేతిలోని అనాసపళ్ల బ్యాగుని ఆమె చేతికిచ్చి “అనాస పళ్లు బాబాయ్‌, ఈ వయసులో మీరు తప్పక వీటిని రుచి చూడాలి.” అన్నాడు.

“ఎందుకు బాబూ ఇవన్నీనూ.. అనవసర ఖర్చు. రోజూ ఏదో ఒక పండు తింటూనే ఉంటాము.” అంది ఆమె.

ఆ తర్వాత బాబాయ్‌, రాఘవ మాటల్లో పడిపోయారు.

రాఘవ వచ్చాడని ఆ పూట వడా పాయసం చేసింది పిన్ని. తింటున్నప్పుడు వాళ్లు కనబరచిన ఆప్యాయతకు ఎంతగానో కరిగిపోయాడు రాఘవ. తర్వాత సినిమా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కణ్ణించి త్వరగా బయటపడ్డాడు.

తాను చూడాలనుకున్న సినిమాకు వెళ్లాలంటే వరంగల్‌కు వెళ్లక తప్పదనుకుంటూ..

టౌన్‌బస్సును పట్టుకుని థియేటర్‌కు చేరుకున్నాడు. కాసేపటికే సినిమా మొదలైంది. అది పాత పౌరాణిక సినిమా, పెద్ద సినిమా! క్రమంగా సినిమాలో లీనమైపొయ్యాడు.

సినిమా పూర్తయ్యేసరికి బాగా పొద్దుపోయింది. అక్కణ్ణించి సిటీబస్సు ఎక్కి తాను దిగాల్సిన బస్టాపు దగ్గర దిగాడు. తామరగుంట వెళ్లే బస్సుకోసం ఎదురుచూడసాగాడు.

ఐదుగంటల బస్సు వెళ్లిపోయినట్టుంది. దాని తర్వాత ఆరున్నరకు ఇంకో బస్సుంది. దాన్ని అందుకుంటే సరిపోతుంది, అనుకుంటూ ఆ బస్సుకోసం ఎదురుచూడసాగాడు.

అతను దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. కొంత దూరంలో ఒక తోపుడు బండిమీద మొక్కజొన్న పొత్తులు పేర్చుకుని ఒకావిడ నిప్పుల కుంపటిమీద వాటిని కాలుస్తూ అమ్ముకుంటోంది. కొనుక్కున్నవాళ్లు మొక్కజొన్న గింజల్ని కొరికి తింటూ వెళుతున్నారు. అవి కొనాలనుకున్నవాళ్లు అక్కడే ఆగి ఆమె కాల్చి ఇచ్చాక తీసుకొని వెళుతున్నారు. ఒక్కో మొక్కజొన్న పొత్తు రెండురూపాయలకు అమ్ముతోంది.

రాఘవకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మొక్కజొన్నలు తమవైపు కోళ్లకు, కుందేళ్లకు ఆహారంగా వేస్తారు. అంతే తప్ప, ఇలా మనుషులు కూడా దాన్ని తింటారని అతనికి అప్పుడే తెలిసింది. ఆశ్చర్యంగా ఆమెనే చూడసాగాడు.

ఆరున్నర కూడా దాటిపోతోంది. కానీ బస్సు జాడేలేదు. బాగా చీకటి పడిపోయింది. వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఆదివారం కావటంతో జనసంచారం తక్కువగా ఉంది. అప్పుడప్పుడూ ఒక టూ వీలర్‌, ఆటో వెళుతోంది, అంతే!

సమయం ఏడయ్యింది. ఎవరో అంటున్నారు.. ‘ఒక్కోసారి కొన్ని బస్సుల్ని ఏదో కారణంచేత క్యాన్సిల్‌ చేస్తారట’. దాంతో ఎవరికి తోచినట్టుగా వాళ్లు తమ తమ గమ్యస్థానాలకు వెళ్లిపోతున్నారు.

కొందరు రిక్షాలమీద, కొందరు ఆటోరిక్షాలమీద వెళ్లిపోతున్నారు. రాఘవ వెళ్లాల్సిన ఊరికి అప్పుడప్పుడూ ఆటోరిక్షాలు వెళ్తుంటాయి. కానీ ఆ సౌకర్యం చాలా తక్కువే. అక్కడికి బస్సులో మాత్రమే వెళ్లాలి. ‘ఛ, మరేదైనా బస్సు వేస్తే బాగుండేది.’ అని మనసులో విసుక్కున్నాడు.

కొంతసేపటికి ఆ దారిన ఒక ట్రాక్టర్‌ వెళ్తూ కనిపించింది. అందులో వెళదామా అనుకున్నాడు. అయితే అది ఎక్కడికి వెళుతుందో ఎలా తెలుస్తుంది. అయినా అతను ఆపలేదు. ట్రాక్టర్‌ సర్రుమంటూ వెళ్లిపొయ్యింది. రాఘవకేం చెయ్యాలో తోచలేదు.

ఇంతలో..

ఎవరో తన వెనక నిలబడినట్టుగా అనుమానం కలిగింది. ఠక్కున వెనక్కు తిరిగి చూశాడు. మొరటుగా ఉన్న వ్యక్తి నిలబడున్నాడు. అతను రాఘవకేసే చూస్తూన్నాడు. కాస్త తూలుతున్నట్టుగా కూడా ఉన్నాడు. అతడి వాలకం చూస్తుంటే ఏ డెకాయిట్‌లాగానో అనిపిస్తున్నాడు.

ఇంతకీ అతను తాగుబోతా? తిరుగుబోతా? లేదూ దొంగా? అయినా తనదగ్గర విలువైన వస్తువులేవీ లేవే. అంటే బంగారంలాంటివేమీ లేవు. పోనీ డబ్బులైనా ఉన్నాయా అంటే.. అదీ ఎక్కువేమీ లేదు. రెండు వందలుంటాయేమో అంతే!

రాఘవ రెండడుగులు ముందుకేశాడు. ఆ అపరిచితుడూ అతని వెనకే నడిచాడు.

‘అనుమానం లేదు. వాడు దొంగే. తన దగ్గరనుండి ఏదో తస్కరించాలని చూస్తున్నాడు. దొంగతనం చేస్తే పర్వాలేదు. ఆ ప్రయత్నంలో తనను హత్య చేస్తే?..’ అన్న అనుమానం పట్టుకుంది.

అతణ్ణి పరీక్షించాలని రాఘవ మళ్లీ ముందుకు రెండడుగులు వేశాడు. అతనూ వెనకే వచ్చాడు.

రాఘవకు గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఆ బస్టాపులో మనుషులు పెద్దగా లేరు. తనలా బస్సుకోసం ఎదురు చూసేవాళ్లు ఎవరూ లేరు. ఆ మొక్కజొన్నలు అమ్మే ఆమె, దూరంగా ఒక రిక్షావాడూ ఉన్నారంతే.

మళ్లీ వెనకున్న వాణ్ణి ఓరకంటితో చూశాడు. క్రూరంగా వున్న అతడి ముఖం చూసి రాఘవలో వణుకు మొదలైంది.

సరిగ్గా అప్పుడు ఒక షేర్‌ ఆటో వచ్చి రాఘవ ముందు ఆగింది. అందులో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఆటో డ్రైవరు అతనివైపు చూస్తూ.. ఎక్కడికెళ్లాలి? అన్నట్టు సైగచేశాడు. ‘తామరగుంట’ అన్నాడు రాఘవ.

“ఊళ్లోకెళ్లదు. రోడ్డుమీదే దిగి పోవాలి.” అన్నాడు ఆటోడ్రైవరు.

మరో దారిలేదు.. ఠక్కుమని అందులోకి ఎక్కి కూర్చున్నాడు. ఆటో వేగంగా కదిలి ముందుకెళ్లిపోయింది.

హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని సీట్లో వెనక్కు వాలి కూర్చున్నాడు రాఘవ.

కొంతసేపటికి తామరగుంటకు వెళ్లే రోడ్డు దగ్గర ఆటో ఆపి “దిగండి..” అన్నాడు డ్రైవరు.

రాఘవ కిందికి దిగి “ఎంత?” అన్నాడు

“వంద!” అన్నాడు డ్రైవరు. “ఎక్కువే, తగ్గించు.” అన్నాడు రాఘవ.

“ఊహూ గిట్టదు. నా బండే గనక లేకపోతే మీరిక్కడి దాకా కూడా వచ్చుండలేరు” అన్నాడు డ్రైవరు.

“పోనీ, వంద తీసుకుంటున్నావు, నన్ను ఊళ్లో దింపొచ్చుగా!” అన్నాడు వంద నోటు ఇస్తూ.

“ఊళ్లోకి ఎళ్లనని అక్కడే చెప్పాను.” అంటూ వందను తీసుకుని చక్కా పోయాడు డ్రైవరు.

ఆటో కనుమరుగయ్యేంతవరకూ అక్కడే నిలబడ్డాడు రాఘవ. కొంతసేపటికి ఆ ఆటో శబ్దమూ పలచబడిపోయి నిశ్శబ్దం ఆవరించింది. ఎవరైనా టూవీలర్‌పై ఇటు తిరిగితే వాళ్లను లిఫ్ట్‌ అడిగి హరిజనవాడ దగ్గర దిగుదామని ఆగాడు.

ఎంతసేపైనా ఒక్క వాహనమూ రాలేదు. పగటిపూట ఎన్నో వాహనాలు సర్రుసర్రుమని వెళ్లే ఆ దారిమీద ఇప్పుడు ఒక్క వాహనమూ కనిపించలేదు. ఎంతసేపు నిలబడ్డా తన పరిస్థితి ఇంతే కాబోలనుకున్నాడు.

అక్కడే ఆగేదానికన్నా మెల్లగా నడుచుకుంటూ వెళుతుంటే ఏదైనా వాహనమొస్తే సాయం అడిగి ఎక్కుదాం అని నిర్ణయించుకున్నాడు.

కానీ ఆ కటిక చీకటిలో ఒంటరిగా నడవటానికీ అతనికి భయమేస్తోంది. అమావాస్య రోజులు. ‘గీయ్‌..’ మన్న కీచురాళ్ల రొద తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. తనకు తాను ధైర్యం చెప్పుకునేందుకు తనకు బాగా నచ్చిన ఒక సినిమా పాటను పాడుతూ.. అడుగులు ముందుకు వెయ్యసాగాడు. పాట తర్వాత పాట. అలా పాడుకుంటూ ముందుకు నడుస్తున్నాడు.

ఒకచోట ఆగి తను వచ్చిన దిక్కుగా వెనక్కు తిరిగి చూశాడు. చీకట్లో ఏ దారీ కనిపించలేదు. ఎంత దూరం వచ్చాడో, ఇక ఎంత దూరం వెళ్లాలో కూడా తెలియటం లేదు. సరే ఏదైతే అదవుతుందని మళ్లీ నడక మొదలుపెట్టాడు.

అంతలో ఉన్నట్టుండి ఏదో ఆకారం తనకేసి దూసుకొస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినిపించింది. అదేమిటో పసిగట్టలేకపోయాడు. మనిషా, జంతువా, వాహనమా? ఏమీ అర్థం కాలేదు. పక్కకు తప్పుకుందామనుకునేంతలో అది తన దగ్గరకు రానే వచ్చేసింది.

ఎటు కదిలితే ఏమవుతుందోనన్న కంగారుతో కళ్లు మూసుకుని ఉన్నచోటే నిలబడిపొయ్యాడు. దూసుకొచ్చిన ‘అది’ కూడా తన ముందు నిలబడిపోయినట్టుంది. అడుగుల శబ్దం ఆగిపోయింది. కానీ తన ముఖంలోకి బుస్సు బుస్సుమని గాలి వదులుతోంది. అదేమిటా అని కళ్లు తెరిచి చూశాడు. తనకు దగ్గరగా రెండు కళ్లు కనిపించాయి.

దేనివవి? పులివా? ఏనుగువా? ఎలుగుబంటివా?.. ఏదీ కాదు, ఎద్దువి. ఒక నల్లెద్దు ఎక్కడో చేలోపడి మేసి ఇంటికి తిరుక్కున్నట్టుంది. ఎవరి అదిలింపుకో బెదిరి ఇలా పరుగెత్తుకొచ్చి తనముందు నిలబడిపొయ్యింది. గుండె చిక్కబట్టుకుని మెల్లగా పక్కకు తప్పుకుని ముందుకు నడిచాడు. అది కూడా అతణ్ణి ఏమీ చెయ్యకుండా తన దారిన తను వెళ్లిపోయింది.

క్రమంగా గుండె దడ తగ్గి మామూలు స్థితికొచ్చింది.

నడవటం ఆపి రోడ్డు పక్కన ఒక పెద్ద బండరాయి కనిపిస్తే కాసేపు దానిమీద కూర్చుందామనుకుని దగ్గరికెళ్లాడు.

చదునుగా ఉన్నచోట కూర్చున్నాడు. తల పైకెత్తి ఆకాశంలోకి చూశాడు. అక్కడక్కడా నక్షత్రాలు మినుక్కు మినుక్కు మంటున్నాయి. వాటిపైనే దృష్టిని నిలిపి అలాగే చూస్తుంటే ఒక నక్షత్రం వెలుగుతూ ఆరుతూ ఎగురుతూ.. అతని సమీపానికి వచ్చినట్టుగా అనిపించింది. చెయ్యి చాచి దాన్ని అందుకోబోయాడు. కానీ అది తప్పుకుని దూరంగా ఎటో ఎగిరిపోయింది.

అంతలో ఇంకో నక్షత్రం అతనికి సమీపంగా వచ్చింది. దాన్నైనా పట్టుకుందామని ప్రయత్నించేంతలో అదికూడా అతని నుండి దూరంగా వెళ్లిపోయింది. ఈసారి చటుక్కున తన దగ్గరికొచ్చిన ఒక నక్షత్రాన్ని అందిపుచ్చుకున్నాడు.

మెల్లగా పిడికిలి తెరుస్తూ.. కానీ పూర్తిగా తెరవకుండా చేతిలోనిది ఏమిటో పరిశీలించాడు. అది నక్షత్రం కాదు, మిణుగురు పురుగు. తన అరచేతిలో చిక్కుకుని వెలుగుతూ ఆరుతూ.. నక్షత్రంలా మినుక్కు మినుక్కు మంటోంది.

పూర్తిగా అరిచేతిని తెరిచాడు. అది వెలుగుతూ ఆరుతూ.. ఎటో ఎగిరిపోతోంది..

ఆ బండమీదికెక్కి నిలబడ్డాడు. వెనకున్న పొలాలకేసి చూసి ఆశ్చర్యపోయాడు.

అక్కడ.. ఒకటి కాదు రెండు కాదు.. వందలాది మిణుగురులు.. గుంపులు గుంపులుగా ఎగురుతూ.. తన సమీపానికొచ్చి.. చుట్టూ తిరుగుతూ.. మెల్లగా ఎటో ఎగిరిపోతున్నాయి. పైపైకి అలా అలా వంకర టింకరగా ఎగురుతూ.. మెలికలు తిరుగుతూ.. చెట్లమీదా, కొమ్మలమీదా, ఏది కనిపిస్తే దానిమీద క్షణమాత్రం వాలి విశ్రాంతి తీసుకుని మళ్లీ పైకి ఎగురుతూ.. చూడటానికి ఆదెంతో రమణీయంగా అనిపించింది!

కటిక చీకట్లో వెలుతురు పువ్వుల్లా.. ఆ మిణుగురులు ఏం చెబుతున్నాయి?

ఇందాకా అతను ఒంటరినని భయపడ్డాడు. కానీ, ఆ మిణుగురులు ‘తాము అతనికి తోడున్నామని ధైర్యం చెబుతున్నట్టుగా’ అనిపించింది. వాటిమధ్య అతను ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు.

బండరాయి మీదనుండి కిందికి దిగాడు. నడక మొదలుపెట్టాడు. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు పడుతుంటే కాసేపటికంతా పాఠశాలకు చేరుకున్నాడు.

హాల్లోకి అడుగుపెడుతుంటే “ఆచార్జీ అచ్చేశారా? ఇయ్యాలదాకా మీరు రాకపోయేసరికి మీకేమైందో, ఏమోనని ఎంత భయపడ్డానో తెలుశాండీ.” అంటున్న చల్లా రవిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వాడి తల నిమురుతూ ఉండిపొయ్యాడు రాఘవ.

30. మనసులోని మాట

పాఠశాలకు దసరా సెలవులు ప్రకటించారు.

రాఘవ తన సొంతూరుకు వెళుతున్నాడు. రైల్లో బెర్తుమీద పడుకుని ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాడు.

ఐదునెలల క్రితం కన్యాకుమారి నుండి చిత్తూరుకు తిరుగు ప్రయాణమై వెళుతుంటే అసంతృప్తితో వేగిపోయాడు. అప్పుడతనికి తన ఊరికి తిరిగి వెళ్లటం ఎంత మాత్రమూ ఇష్టంలేదు. కానీ అదే రాఘవ, ఇప్పుడు వరంగల్‌ నుండి చిత్తూరుకు వెళుతుంటే ఎంతో సంతృప్తిగా ఉన్నాడు. ఆనాడు అతను విధిలేక, వేరే మార్గం తెలియక చిత్తూరుకు తిరుగు ప్రయాణం కావలసి వచ్చింది. కానీ బాబాయ్‌ పుణ్యమా అంటూ.. ఇవ్వాళ అతనికంటూ ఒక ఉద్యోగం ఉంది. ఆ సంతోషంతో అతను తమ సొంత ఊరికి వెళుతున్నాడు.

‘తామరగుంటకొచ్చిన ఈ ఐదు నెలల్లో తన జీవితంలో ఏనాడూ పొందని ఆనందాన్ని చవిచూశాడు. ఒక్కక్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు. మనిషికి అంతకన్నా కావాల్సింది ఇంకేముంది? ఖాళీ సమయం అంటూ దొరికితే ఏవేవో పిచ్చిపిచ్చి ఆలోచనలు మనిషిని చుట్టుముడతాయి. కానీ దానికి ఆస్కారం ఇవ్వకుండా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకూ ఏదో ఒక పనిమీద నిమగ్నమై ఉండటానికి మించిన ఆనందం మరొకటి ఉండదు కదా?!

ఉద్యోగం తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, మనోవికాసాన్ని కలిగించాయి. ఇప్పుడు తాను సిగ్గుతో కుంచించుకుపోవలసిన పనిలేదు. గర్వంగా తలెత్తుకుని తిరగవచ్చు. అందరితోనూ తలెత్తుకుని మాట్లాడొచ్చు.’ ..ఇలాగంతా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు.

మరుసటిరోజు.. ఇంట్లోకి అడుగుపెడుతుంటే ఏదో తెలియని ఆనందం అతణ్ణి నిలువెల్లా ముంచెత్తింది. ఎదురొచ్చిన తల్లిదండ్రుల్ని నవ్వుతూ పలకరించి స్నానానికి వెళ్లాడు. అటు తర్వాత అక్కడి విషయాలను తల్లిదండ్రులతో పంచుకున్నాడు.

చిన్నా గ్రూపు 1 పరీక్షలో ప్యాసై ఇంటర్వ్యూకు ప్రిపేర్‌ అవుతున్నట్టు రాఘవతో చెప్పాడు. “నువ్వు తప్పకుండా గెజిటెడ్‌ ఆఫీసరువు అవుతావు.” అని ఆనందంగా చెప్పాడు రాఘవ. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు మురళి.

ఆ మరునాడు రాఘవ తన ఆత్మీయ స్నేహితుడు శ్రీకర్‌ను కలుసుకున్నాడు. చాలాకాలం తర్వాత కలిసినందుకు ఇద్దరూ ఎంతో సంతోషించారు.

కొంతసేపయ్యాక – “రాఘవా, నిజంగా నీకు అక్కడ సంతృప్తికరంగా ఉందా?”అని సూటిగా ప్రశ్నించాడు శ్రీకర్‌.

“ఆ.. అక్కడ నాకేం తక్కువ. చక్కటి ఉద్యోగం, ఉండటానికి చోటు, భోజన సౌకర్యం, ఖర్చుకు డబ్బులు, ఎప్పుడైనా సినిమాకు వెళ్లాలనుకుంటే వెళతాను. ఇంకేం కావాలి?” భుజాలెగరేస్తూ అన్నాడు రాఘవ.

అతని చేష్టలకు శ్రీకర్‌ నిట్టూర్చాడు. “అయితే సంతృప్తిగానే ఉన్నానంటావు?” అన్నాడు చివరగా.

“అవును, సంతృప్తిగానే ఉన్నాను.” తనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు రాఘవ.

“ఎంత అల్ప సంతోషివై పొయ్యావు రాఘవా?” స్నేహితుడి కళ్లల్లోకి చూస్తూ అన్నాడు శ్రీకర్‌.

“అల్పమో, స్వల్పమో.. ఆ మాత్రం సంతోషాన్నైనా దక్కించుకోగలగటం నా అదృష్టంగానే భావిస్తున్నాను.”

“ఎంత ఆత్మవంచన చేసుకుంటున్నావు?” నిర్లిప్తంగా అన్నాడు శ్రీకర్‌.

“ఆత్మవంచన కాదు శ్రీకర్‌, ఆత్మపరిశీలన! ఏం చెయ్యమంటావు? నేను కన్న కలల్ని సాధించుకోవటం నాకు అసాధ్యం అయినపుడు అడ్జెస్ట్‌ కావటం తప్ప మరో మార్గం లేదు. నీకు తెలియనిదేం కాదు, మనది మధ్య తరగతి కుటుంబం! ఈ తరగతిలోని వాళ్లకు కోరికలు, ఆశలు అస్సలు ఉండకూడదు. ఉంటే దాన్ని సాధించుకునేందుకు చాలా కష్టపడాలి. అందుకు చదువే చక్కటి పునాది. కానీ, ఆ చదువునే నేను సాధించలేకపొయ్యాను. చదువులో నేనేమంత బ్రిలియంట్‌ను కానని నీకూ తెలుసు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను టెన్త్‌ ఫెయిలయ్యి, ప్యాసయ్యాను. ఇంటర్‌లో తీసుకున్న ఇంగ్లీషు మీడియం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి పడేసింది. కానీ ఎలాగో కస్టపడి ప్యాసయ్యాను. బ్యాంకులో ఉద్యోగం చెయ్యాలన్నది నా బలమైన కోరిక. అందుకే డిగ్రీలో బి.కాం.తీసుకున్నాను. కానీ ఆ బి.కాం డిగ్రీని ప్రాపర్‌ గైడెన్స్‌ లేక దాన్ని ఐదేళ్లలో పూర్తిచెయ్యవలసి వచ్చింది. ఈలోపు ఇంగ్లీషు, తెలుగు టైపురైటింగ్‌ కూడా ప్యాసయ్యాను. కానీ ఏం లాభం, ఏ శిక్షణా తీసుకునే స్థోమత లేనప్పుడు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులు కాగలమా? అందుకే ఎందులోనూ ఉత్తీర్ణత సాధించలేకపొయ్యాను. ప్రభుత్వ ఉద్యోగాలపై ఏమాత్రం నమ్మకం ఉంచలేకపోయిన నేను.. చివరకు మానాన్న వాలంటరీ రిటైర్‌మెంట్‌పై ఆశలు పెట్టుకున్నాను. కానీ ఈనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అది కూడా అడియాశలయ్యాయి. అప్పుడు ఒక నిరుద్యోగిగా నేనెంతటి మానసిక క్షోభను అనుభవించానో మాటల్లో చెప్పలేను.

ఈ పరిస్థితుల్లో నేనిలాగే ఉండిపోతే ఎందుకూ కొరగానివానిగా తయారవటం ఖాయం. అందుకే మార్గాలు అన్వేషించాను. నాకు చేతనైన పనిని చేజిక్కించుకున్నాను. ఇప్పుడు చెప్పు శ్రీకర్‌, ఇది ఆత్మవంచన ఎలా అవుతుంది?”

“మనలాంటి నిరుద్యోగులకు స్వయం ఉపాథి పథకాలంటూ ఉన్నాయిగా, వాటిని ఉపయోగించుకుని ఉండొచ్చుగా?!”

“శ్రీకర్‌, ఒక్క విషయం గుర్తుంచుకో. నాది వ్యాపార మనస్తత్వం కాదు. నాకు ఆ దక్షత లేదు. ప్రభుత్వమిచ్చే లక్షరూపాయల లోను తీసుకుని వ్యాపారం మొదలుపెట్టాలి. వ్యాపారం జరిగినా జరగకపోయినా బ్యాంకు వాళ్లకు ఇన్‌స్టాల్‌మెంట్స్‌ కట్టాలి. షాపుకు అద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, అబ్బో.. ఇంకా ఎన్నో.. వాటిని ఊహించుకోవాలంటేనే భయమేసింది. అందుకే దాని జోలికి నేను వెళ్లలేదు.. చివరికి, నాకు తెలిసిన మార్గాన్ని నేను ఎంచుకున్నాను. ముందుకు వెళుతున్నాను. కొన్నాళ్లయినా ఈ వాతావరణానికి దూరంగా ఉందామని నిర్ణయించుకున్నాను, అంతే!” తన మాటల్ని పూర్తిచేసి గోడకు జారగిలబడి కూర్చున్నాడు రాఘవ.

దీర్ఘంగా నిట్టూరుస్తూ తనూ గోడకు జారగిలబడి కూర్చున్నాడు శ్రీకర్‌.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here