జీవితమొక పయనం-16

0
2

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[రాఘవ ఆ ఆవాస విద్యాలయంలో చేరి మూడు నెలలకు పైనే అవుతుంది. ఓ ఆదివారం నాడు బాబాయ్ వాళ్ళింటికి వెళ్తామని అనుకుంటాడు. ప్రధానాచార్యుల వారి వద్ద అనుమతి తీసుకుని హనుమకొండ లోని మాధవరెడ్డి గారింటికి వెళ్తాడు. పిన్నీ బాబాయిలు ఆప్యాయంగా పలకరిస్తారు. వాళ్ళతో కబుర్లు చెప్పి, మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి, సాయంత్రం వరంగల్‌కి వచ్చి ఓ థియేటర్‍లో పాత సినిమా ఆడుతుంటే వెళ్తాడు. సినిమా పూర్తయ్యేసరికి రాత్రవుతుంది. తామరగుంత వెళ్ళాల్సిన బస్సులు ఎంతకీ రావు. చివరికి ఓ షేర్ ఆటోలో ఎక్కి తామరగుంట రోడ్డు మీద దిగుతాడు. బండి మీద ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని కాసేపు అక్కడే నిలుచుంటాడు. ఎంత సేపయినా ఎవరు రాకపోయేసరికి, నడవడం మొదలుపెడతాడు. కొంతదూరం నడిచాకా, కాస్త అలసట కలిగి, ఓ రాతి మీద కూర్చుంటాడు. అక్కడ వందలాది మిణుగురులు ఎగురుతూ, ఆ ప్రాంతాన్ని కాంతివంతం చేయడం చూస్తాడు. వాటి నుండి స్ఫూర్తి పొంది, ఆవాస నిలయం చేరుకుంటాడు. దసరా పండకి పాఠశాలకి సెలవలు ఇవ్వడంతో సొంతూరికి బయల్దేరుతాడు రాఘవ. ఈసారి ఇంటికి వెళ్ళడానికి అతనిలో ఏ సంకోచాలు లేవు. ఇదివరకులా నిరుద్యోగి కాదు, ఇప్పుడో ఉద్యోగం ఉంది. తన కాళ్ళ మీద తను నిలబడ్డాడనే ఆత్మస్థైర్యం ఉంది. ఇంటికి చేరాకా తల్లిదండ్రులని, తమ్ముడిని ప్రేమగా  పలకరిస్తాడు. మర్నాడు తన ఆత్మీయ నేస్తం శ్రీకర్‍ని కలుస్తాడు. సొంతూరికి దూరంగా, ఎక్కడో ఓ చిన్న ఉద్యోగంతో తృప్తి పడి ఆత్మవంచన చేసుకుంటున్నావని శ్రీకర్ అంటాడు. తనది ఆత్మవంచన కాదని, ఆత్మపరిశీలన అని చెప్తాడు రాఘవ. తన సామర్థ్యాలేమితో తనకి పూర్తిగా తెలుసనీ, అందుకే తనకి తెలిసిన మార్గాన్ని ఎంచుకున్నానని రాఘవ చెప్పగా, శ్రీకర్ నిట్టూరుస్తాడు. – ఇక చదవండి.]

31. పెళ్లికి నిరాకరణ

[dropcap]రా[/dropcap]ఘవ దసరా సెలవులకు ఇంటికొచ్చినప్పటినుండి ఎందుకో శంకరయ్య మనసు స్థిమితంగా ఉండటం లేదు. రాఘవ ఉద్యోగానికి వరంగల్‌ వెళతానని చెప్పి వెళ్లిన తర్వాత.. తమను పూర్తిగా మర్చిపొయ్యాడు. రోజులు గడిచేకొద్దీ అతని నుండి సమాచారమేదీ రాక తామెంత కంగారుపడ్డారో తమకు మాత్రమే తెలుసు. ఆ మాధవరెడ్డిగారి చిరునామా రాసుకోబట్టి సరిపోయింది కానీ, లేకపోతే కొడుకు ఆనవాలు తెలియకనే ఉండిపొయ్యేదేమో?

ఎందుకో రాఘవ జీవితంలో ఏదీ సరిగ్గా జరగటం లేదు. డిగ్రీ అయితే చదివాడు కానీ ఒక మంచి ఉద్యోగం వచ్చే అదృష్టం లేకుండాపొయ్యింది. ఇంత చిన్న వయసులోనే ఎందుకో అతనిలో అంతటి నైరాశ్యం, విరక్తి గూడుకట్టుకున్నాయి. సకాలంలో ఏదీ జరగలేదనే కోపం, ఆవేశం.. అతనిలో అణువణువూ నిండిపోయి ఉంది. అందుకే వాడు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. తనే ఉద్యోగం వెతుక్కున్నాడు. ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలన్న తపనతో వాడు అంత దూరప్రాంతానికి వెళ్లిపోయాడు. ఆ వెళ్లటం వెళ్లటం తమకు దూరమైపోతున్నాడేమోనన్న భయాన్ని కలగచేశాడు.

దాంతో అతను అసలు జీవితం నుండి కూడా ఎక్కడ దూరమైపోతాడోనన్న దిగులు పట్టుకుంది శంకరయ్యకు. జీవితం పట్ల ఆశ, ఇష్టమూ కలగాలంటే అతనికి పెళ్లి చెయ్యటమొక్కటే మార్గమని భావించాడు. అందుకే తన బామ్మర్ది కూతురునిచ్చి పెళ్లిచేస్తే కొడుకు కంటి ముందరే ఉంటాడు. అంతేకాదు రేపు పిల్లలంటూ పుడితే సంసారం, కుటుంబం అన్న ఒక బాధ్యతా పెరుగుతుంది. అప్పుడు జీవితం పట్ల ఒక పట్టు, అవగాహన ఏర్పడతాయి. లేదంటే తెగిన గాలిపటంలా ఎటు పోతాడో, ఎక్కడ చిక్కుబడిపోతాడో తెలియదు. కనుక కొడుక్కు ఎలాగైనా పెళ్లి చెయ్యాలన్న తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడు శంకరయ్య.

ఆరోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక రాఘవ.. తమ పాఠశాల గురించి చెబుతూంటే ఆసక్తిగా వింటూ కూర్చున్నారు శంకరయ్య, వనజమ్మ.

కొంతసేపు గడిచాక.. “రాఘవా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని కోప్పడకుండా వింటావా?..” అన్నాడు ఉపోద్ఘాతంగా శంకరయ్య.

‘తననెందులోనో ఇరికించే పని మొదలుపెట్టాడు నాన్న. జాగ్రత్తగా ఉండాలి’ అనుకుని అలాగే అన్నట్టుగా తలూపాడు.

“నాకా వయసు పైబడుతోంది. ఈ మధ్యనే నేను కంటి ఆపరేషన్‌ చెయ్యించుకున్నాను. అప్పుడప్పుడూ గుండెల్లో కాస్త నొప్పిగా కూడా ఉంటోంది. మాత్రలు వేసుకుంటున్నాననుకో. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా? ఇలాగే చూస్తూ ఊరుకుంటే కాలం గడిచిపోతూ ఉంటుంది. అది ఎవరి కోసమూ ఆగదు, అంతే! తర్వాత బాధపడి ఏ ప్రయోజనమూ ఉండదు. కనుక ఏదైనా ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగితేనే బాగుంటుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమవుతోందా రాఘవా? నీ పెళ్లి గురించే చెబుతున్నాను..” కొడుకు ముఖంలోకి చూస్తూ అన్నాడు శంకరయ్య.

తన పెళ్లి ప్రసక్తి వచ్చేసరికి కోపం నషాళానికెక్కింది రాఘవకు. కానీ తండ్రి ఏం మాట్లాడుతాడో మాట్లాడనీ తర్వాత తన అభిప్రాయాన్ని చెబుదామని మిన్నకుండిపోయాడు.

“మీ మామ కూతురు మమత పదవ తరగతి వరకూ చదువుకుంది. ఇప్పుడు టైపు నేర్చుకుంటోందట. ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుందని మీ అమ్మ చెప్పింది. పెద్దలంటే భయమూ భక్తీ ఉన్నాయి. నువ్వు ఊ అన్నావంటే ముహూర్తాలు చూసి ఇంకో రెండుమూడు నెలల్లో నీకు పెళ్లి చేసెయ్యాలన్నది మా ఇద్దరి ఆలోచన.” అంటూ భార్యవైపు చూశాడు శంకరయ్య.

వనజమ్మ ఔనన్నట్టుగా తలూపింది.

కోపాన్ని బాగా అణచుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు రాఘవ.

“చూడు నాన్నా. నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఈపాటికే నాకొక గవర్నమెంటు ఉద్యోగం వచ్చుంటే మీ కోరికను తీర్చి ఉండేవాణ్ణి. కానీ అది జరగలేదు. ఇప్పుడు ఉద్యోగం ఉంది కదా అని మీరనవచ్చు. అది నిజమే. కానీ ఈ ప్రయివేటు వాళ్లిచ్చే రెండువందల యాభై రూపాయల జీతంతో నేను నా కుటుంబాన్ని పోషించగలనా చెప్పండి. రేపు మీ కోడలు ‘తనకు అది కావాలి, ఇది కావాలి’ అని నోరు తెరిచి అడిగిందనుకో, నేను తీర్చగలనా? తీర్చలేననుకో.. అప్పుడు, ‘అయితే నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు?’ అని మొహమ్మీదే అడిగిందనుకో! ఎంత అవమానం? ఆలోచించండి. అందుకే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. అప్పటిదాకా నా పెళ్లి ప్రసక్తి తీసుకురాకండి.” అని స్థిరంగా అన్నాడు.

“అది కాదురా, ఈ రోజుల్లో గవర్నమెంటు ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటానంటే అది సాధ్యమయ్యే పనేనేరా. ఉద్యోగం లేకపోయినా ఎంతమంది పెళ్లిళ్లు చేసుకోవటం లేదు. అయినా నీకేదైనా అవసరమైతే ఆదుకోవటానికి మేము లేమట్రా..”

“అవసరానికి ఒకరి ముందు చెయ్యి చాపటం నాకు ఇష్టం లేదు నాన్నా..”

“పోనీ, వద్దు. ఎవరినీ అడగొద్దు. ఒక తండ్రిగా నన్ను అడగటానికి నీకేమైనా అభ్యంతరమా ఏం?”

“అదే, ఇందాకా చెప్పాను కదు నాన్నా, నాకు ఎవరినీ అడగటం ఇష్టముండదనీ.”

“ఏం నా పెన్షనులో కొంత నా కొడుక్కు ఇవ్వటానికి నాకు హక్కు లేదా? ఇక నీ జీతం ఉండనే ఉంది. అవసరానికి ఈ ఇల్లుంది, ఇంకేం కావాల్రా? పాపం మీ మామ నీ సమాధానం కోసం కాచుక్కూర్చున్నాడు. వాళ్లనలా ఏళ్ల కొద్దీ ఎదురుచూసేలా చెయ్యటం అంత మంచిది కాదురా.” కొడుకును ఎలాగైనా ఒప్పించాలన్న ఆలోచనతో అన్నాడు శంకరయ్య.

“నాన్నా, మామ కూతురి గురించి నా అభిప్రాయమేమిటో నేను చెప్పలేను. నాకోసం వాళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదని చెప్పేయండి. ఏదైనా మంచి సంబంధం వస్తే వాళ్లమ్మాయికి చేసెయ్యమనండి. నాకు పెళ్లి అంటే ఇష్టంలేదు.”

“ఒరేయ్‌, నాకొక అనుమానం కలుగుతోంది. నీకు పెళ్లి అంటే ఇష్టం లేదా, లేక మీ మామ కూతురంటే ఇష్టంలేదా? అది చెప్పు ముందర?” అంటూ నిలదీశాడు శంకరయ్య. మౌనం వహించాడు రాఘవ.

“ఒకవేళ మీ మామ కూతురంటే ఇష్టంలేకపోతే చెప్పేయి, మానేద్దాం. బలవంతం ఏమీ లేదు. ఇంకో అమ్మాయిని చూద్దాం. ఇంకా బాగా చదువుకున్న అమ్మాయిని చూద్దాం. దొరక్కపోతుందా, ఏం? నువ్వు పెళ్లికి ఒప్పుకోవటం ముఖ్యంరా.”

తండ్రి తన ముందరి కాళ్లకు బంధం వేస్తున్నట్టుగా గ్రహించాడు రాఘవ.

ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. “చూడు నాన్నా, ఈ జీతంతో నేను పెళ్లి చేసుకోలేను. మా విద్యా సంస్థ వచ్చే వేసవి సెలవుల్లో హైదరాబాదులో కొత్తవాళ్లకు ట్రైనింగు ఇచ్చి పర్మనెంటు చేస్తుందట. అంతేకాదు పర్మనెంటు అయినవాళ్లకు జీతం కూడా పెంచుతుందట. అప్పుడు ఈ విషయం గురించి ఆలోచిద్దాం. అంతవరకూ నా పెళ్లి ప్రసక్తి తీసుకురాకండి. అంతేకాదు, మీకు కొడుక్కు పెళ్లి చెయ్యాలన్న ముచ్చట ఉంటే తమ్ముడికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లిచేసి దాన్ని తీర్చుకోండి. అంతేకానీ, నన్ను విసిగించకండి, నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, అంతే!” అని చెప్పి అక్కణ్ణుండి లేచి బయటికెళ్లిపోయాడు రాఘవ.

చేసేదేమీలేక దీర్ఘంగా నిట్టూర్చాడు శంకరయ్య, కళ్లనీళ్లు పెట్టుకుంది వనజమ్మ.

32. చెవిలో పురుగు

దసరా సెలవులు ముగిశాక మళ్లీ తామరగుంటకు చేరుకున్నాడు రాఘవ.

అప్పటికి మోహనరావు, కె.కె. ఇద్దరు తప్ప తక్కిన టీచర్లందరూ పాఠశాలకు చేరుకున్నారు. ప్రధానాచార్యులు, వంటమాస్టరు వెంకటయ్య, అంకయ్యలు ముందురోజే వచ్చేశారట.

పాఠశాల పునఃప్రారంభమై రెండు రోజులవుతున్నా పిల్లలు మాత్రం వంద శాతం హాజరు కాలేదు. తర్వాత వచ్చే సోమవారానికి పిల్లలందరూ పాఠశాలకు చేరుకుంటారని అనుకుంటున్నారు. దాంతో ఈపాటికే వచ్చేసిన పిల్లలకు బాగా ఆటవిడుపు దొరికిందనే చెప్పాలి. సంఖ్య తక్కువగా ఉండటంతో అధ్యయనం తరగతులు కూడా వెంటనే ప్రారంభించలేదు ప్రధానాచార్యులు.

మొదటిరోజు సాయంత్రం పాఠశాల అయ్యాక ఉపాధ్యాయులందరూ కె.సి.కెనాల్‌ దగ్గరకు వ్యాహ్యాళికి బయలుదేరారు. ఎవరూ ఊహించని విధంగా అవ్వాళ ప్రధానాచార్యులు కూడా వాళ్లతో పాటు బయలుదేరారు. రాఘవ ఆశ్చర్యపోయాడు.

“ఏం మీకేమైనా అభ్యంతరమా రాఘవగారూ..” అని నవ్వుతూ ప్రశ్నించారు ప్రధానాచార్యులు.

“అయ్యో, ఎంతమాట ఆచార్యజీ. మా మాటలూ, జోకులూ మీకు నచ్చుతాయా అని ఆలోచిస్తున్నాను, అంతే!” అని నసుగుతూ అన్నాడు రాఘవ.

“నేనూ మీ వయసు నుండి ఈ వయసుకు వచ్చినవాణ్ణే కదా రాఘవగారూ, నచ్చకుండా ఎలా ఉంటాయి? కాకపోతే నా రాక మీకే కొంత ఇబ్బందిని కలిగిస్తుందేమోననుకుంటున్నాను.” అంటూ రాఘవ ముఖంలోకి తేరిపార చూశారు ప్రధానాచార్యులు.

“అటువంటిదేమీ లేదు ఆచార్యజీ..” అని నవ్వుతూ ప్రధానాచార్యుల వైపు చూశాడు రాఘవ.

“రాఘవగారూ మీకు కొత్త కానీ, మన ప్రధానాచార్యులగారు అప్పుడప్పుడూ మాతో వచ్చి కలుస్తూ ఉంటారు.” చెప్పాడు సుందరం.

“ఓ అలాగా, వారు రావటం ఇదే మొదటిసారి అనుకున్నాను.” అన్నాడు రాఘవ.

“కాదు..” అంటూ ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటూ ముందుకు నడవసాగారు.

ఇంతలో రైతులు పొలం పనులు పూర్తిచేసుకుని ఇండ్లకు తిరిగి వెళుతూ ఎదురుపడ్డారు.

దాదాపు అందరూ ప్రధానాచార్యులకు చేతులు జోడించి నమస్కరించారు. కొందరు “బాగున్నారా ఆచార్జీ..” అంటూ ఆయన్ను పలకరించారు. ఆయనా అడిగివాళ్లందరికీ సమాధానాలిస్తూ ముందుకు నడిచాడు.

“రాఘవగారూ.. రైతులు నిష్కల్మషులు, నిరాడంబరులు. నిజానికి వీళ్లంతా ఎలాగెలాగో ఉండవలసిన వాళ్లు.”

“అవును ఆచార్యజీ. వీళ్ల అమాయకత్వం, అజ్ఞానం, అవిద్య.. వీళ్లను ఈ స్థాయిలోనే ఉంచేసిందేమోనని భావిస్తున్నాను.”

“సరిగ్గా చెప్పారు. ఆదినుండి కూడా వీళ్లకు శ్రమించటమొక్కటే తెలుసు. ఇక దేనిమీదా వీళ్లకు మోజు లేదు. వీళ్లకు నలుగురికీ పెట్టటమే తెలుసు. నలుగురి ముందూ చెయ్యి చాచటం తెలీదు. ఆ పరిస్థితే వస్తే చావనైనా చస్తారు కానీ, దేహీ అని మాత్రం ఎవరినీ అడుక్కోరు. మంచి మనసున్న మారాజులు ఈ రైతన్నలు..”

“అవును. అలాంటి రైతులను ఇప్పుడెవరూ పట్టించుకోకపోవటమే బాధాకరం. రైతు దేశానికి వెన్నెముక అదీ ఇదీ అంటూ ఏవేవో పోలీకలు చెబుతారుకానీ, వాళ్లకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది.” నిట్టూరుస్తూ అన్నాడు రాఘవ.

“వాళ్లకే కనుక అన్ని సౌకర్యాలూ కల్పిస్తే.. ఈ ప్రపంచానికంతా అన్నం పెట్టగలరు. కానీ దురదృష్టం.. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రకృతి – వాళ్లపట్ల చిన్నచూపు చూస్తూనే ఉంది.”

అలా మాట్లాడుకుంటూ కె.సి.కెనాల్‌ దగ్గరికొచ్చి ఒకచోట అందరూ కూర్చున్నారు.

“అలాంటి రైతుల కష్టాలు కడగండ్లపై చాలా సినిమాలే వచ్చాయి. అలాంటి ఒక సినిమాను నేనీమధ్య మరాఠీలో చూశాను. నిజానికి భాష రాకపోయినా అది నన్నెంతగానో కదిలించింది.” అన్నారు ప్రధానాచార్యులు.

“ఆ సినిమా పేరేంటి ఆచార్యజీ.” అడిగాడు మోహనరావు.

“ఏంటో నాకు ఆ సినిమా పేరు గుర్తులేదు. కానీ దాన్నిచూశాక నాకొక్కటే అనిపించింది. రైతు ఏ ప్రాంతంవాడైనా వాళ్లు అనుభవించే కష్టాలలో ఏ మాత్రం తేడాలు లేవనీ. రైతుల కష్టాలు అన్ని చోట్లా ఒకటేననీ.” అంటూ ఉండగానే ఆయన గొంతు మూగబోయింది. అక్కడున్న వాళ్లందరిలోనూ ఏదో స్తబ్ధత ఏర్పడింది.

“ఏటికి ఎదురీది.. ఎయి పుట్లు పండిరచి..” అంటూ రాఘవ ఒక పాట అందుకుని చక్కటి ఫీల్‌తో పాడాడు.

అతను పాడుతున్నంతసేపు మౌనంగా ఉండి తర్వాత చప్పట్లు చరిచారు ప్రధానాచార్యులు. మిగతావాళ్లు జత కలిపారు.

“ఆచార్యజీ, మన రాఘవగారు చక్కటి గాయకులు కూడానూ. సినిమా పాటల్ని బాగా పాడతారు. రాఘవగారూ ఇంకో పాట పాడండి.” అని దామోదరం అనగానే “ఔను, బాగా పాడారు. వింటూంటే ఏదో తెలియని బాధను మనసును మెలి పెట్టేసింది. ఇంకో పాట పాడండి రాఘవగారూ..”అని ప్రధానాచార్యులు అనగానే మరో పాటను అందుకున్నాడు రాఘవ.

పాటను ఆసాంతం విని అందరూ అతణ్ణి ప్రశంసించారు.

ఉన్నట్టుండి ఈమారు రాఘవ ఒక తమిళపాటను అందుకున్నాడు. భాష అర్థం కాకపోయినా అతని గానాన్ని మైమరచి విన్నారందరూ. అతను పాడటం ఆపాక అందరూ మళ్లీ చప్పట్లు చరిచారు.

“రాఘవగారూ మీకు తమిళం కూడా వచ్చా? చాలా బాగా పాడారు.” మనస్పూర్తిగా ప్రశంసించారు ప్రధానాచార్యులు.

“ఏదో కొంచెం కొంచెం వచ్చు ఆచార్యజీ..” అంటూ సిగ్గుపడ్డాడు రాఘవ.

చీకటి పడుతూ ఉండగా అందరూ పాఠశాలకు బయలుదేరారు.

“ఖాళీ సమయాల్లో మన పిల్లలకు ఏవైనా భక్తి పాటల్ని నేర్పండి రాఘవగారూ.. ఇది నా విన్నపం.”

“తప్పకుండా ఆచార్యజీ.” అంటూ మనస్పూర్తిగా అంగీకరించాడు రాఘవ.

పాఠశాలకు తిరిగొచ్చి మంచినీళ్లతో స్నానం చేశాక ఎంతో హాయిగా అనిపించింది రాఘవకు.

ఆ రాత్రి భోజనాలయ్యాక త్వరగా నిద్రలోకి జారుకున్నాడు. బాగా నిద్రపట్టేసింది రాఘవకు.

దూరంగా ఎవరో ఏడుస్తుంటే రాఘవకు మెలకువ వచ్చింది. టైమెంతో చూశాడు. రెండు గంటలు కావస్తోంది.

ఆ ఏడుస్తున్నవాడు తమ విద్యార్థేనని నిర్థారించుకుని గబగబా తలుపు తీసుకుని బయటికొచ్చాడు. కణ్వ నిలయం బయట లైటు వెలుగుతోంది. ఒక విద్యార్థి చెవినొప్పికి తట్టుకోలేక నేలమీద పడి దొర్లుతున్నాడు. పాపం, రాజారావు వాడి అవస్థనూ, ఏడుపునూ చూసి కంగారుపడుతున్నాడు. ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూస్తున్నాడు. కొంతమంది పిల్లలు వాడి చుట్టూచేరి వాణ్ణి సముదాయించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ వాడు ఉన్నట్టుండి గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు.

వాడి ఏడుపు శబ్దం విని ప్రధానాచార్యులు కూడా నిద్రలేచి గబగబా అక్కడికి వస్తున్నారు.

“రాజారావుగారూ ఏమైందట వాడికి?” అని అడిగారు ప్రధానాచార్యులు.

“ఏంటో తెలియటం లేదు ఆచార్యజీ. చెవి పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏదో దూరిందని చెబుతున్నాడు. చీమ దూరిందేమోనని చెవిలో నీళ్లుపోసి కాసేపు మూసి ఉంచమన్నాను. కానీ వాడు నీళ్లు పొయ్యకనే గట్టిగట్టిగా ఏడుస్తున్నాడు. చెవిని మూసి ఉంచలేకపోతున్నాడు. ఏమిటో ఏమీ అర్థం కావటం లేదు.” ఆదుర్దాగా అన్నాడు రాజారావు.

“సమయానికి మన నిరంజన్‌గారు కూడా లేరు చూశారా. ఉండి ఉంటే దానికి సరైన మందేమిటో ఆయనకు తెలిసి ఉండేది. సరే. నా గదిలో ఇయర్‌ డ్రాప్స్‌ ఉందేమో చూసొస్తాను.” అంటూ ఆయన గబగబా తన గదికేసి నడిచారు.

రాఘవ ఆ విద్యార్థికేసి వెళ్లాడు. టార్చిలైట్‌ వంటిదేమైనా ఉందాని అడిగాడు. ఒక విద్యార్థి తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ లైటు వేసి చూసేందుకు కూడా ఆ పిల్లవాడు సహకరించటం లేదు. చెవిని పట్టుకోగానే ఏడుపు మరింత పెంచేస్తున్నాడు.

రాఘవ గబగబా వెంకటయ్య గదికెళ్లి అతణ్ణి నిద్రలేపాడు. “వెంకటయ్యా, ఒక గరిటెలో కొద్దిగా మంచినూనె తీసుకుని వేడిచేసి అందులో రెండు వెల్లుల్లిపాయలు వేసి పట్టుకురా. తొందరగా తీసుకురా.” అని మళ్లీ ఆ విద్యార్థి దగ్గరికొచ్చాడు.

అప్పటికే ప్రధానాచార్యులు రిక్తహస్తాలతో వచ్చి ఇయర్‌ డ్రాప్స్‌ లేనందుకు తెగ బాధపడిపోతున్నారు.

ఈలోపు వెంకటయ్య రాఘవ చెప్పినట్టుగా మంచినూనె కాచి తీసుకొచ్చాడు. రాఘవ ఆ విద్యార్థిని మాట్లాడిస్తూ.. నూనె వేడి తగ్గాక వాడి చెవిలో రెండు చుక్కలు వేసి దూది అడ్డుపెట్టాడు. అయినా వాడు ఏడుస్తూనే ఉన్నాడు.

కొంతసేపటికి కాస్త ఉపశమనం కలిగినట్టుంది. వాడు ఏడుపును ఆపాడు.

నిజానికి వాడి చెవిలో ఏ పురుగూ దూరలేదనీ, అది చెవిపోటనీ చెప్పాడు రాఘవ.

పిల్లవాణ్ణి రాజారావుకు దగ్గరగా పడుకోబెట్టుకోమని చెప్పారు ప్రధానాచార్యులు.

అందరూ ఎవరి నిలయాలకు వాళ్లు వెళ్లిపొయ్యారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here