Site icon Sanchika

జీవితమొక పయనం-4

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[రెండో రోజు ఉదయం 4.30 గంటలకల్లా నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తయారై యోగా హాల్‌కు వెళ్తాడు రాఘవ. ఐదు గంటలకి యోగా శిక్షకుడు వచ్చి, అందరినీ ఒక పద్ధతిలో, వరుసల్లో, మనిషికీ మనిషికీ మధ్య కొంత దూరం ఉండేటట్టుగా చూసుకుని కూర్చోమని చెప్తాడు. తన యోగా గురించి వివరంగా ఇంగ్లీషులో చెప్తాడు. తొలి పలుకుల అనంతరం పతంజలి ప్రార్థన, తేలికపాటి ఆసనాలు చేయిస్తాడు. తర్వాత ఓంకార ధ్యానం, ప్రాణాయామం. యోగా తరగతి పూర్తయ్యాక అర్థగంటపాటు భగవద్గీత శ్లోకాలను నేర్పుతారు. మళ్ళీ సాయంత్రం 4.30 గంటలకు యోగా క్లాస్ ఉంటుందని చెప్తాడు. గదికి వచ్చిన రాఘవ కాసేపు విశ్రాంతిగా పడుకుంటాడు. తను రాసిన ఉత్తరం ఈపాటికి అంది ఉంటుందనీ, ఇంట్లో వాళ్ళు కంగారు పడుతుంటారనీ అనుకుంటాడు. తర్వాత స్నానం, అల్పాహారం పూర్తి చేసి, టీ కప్పు తీసుకుని పక్కనే ఉన్న తోటలోకి వెళ్తాడు రాఘవ. అక్కడ ఓ ఉడుతని చూసి, దాన్నే చూస్తు ఉండిపోతాడు. ఇంతలో వరంగల్‌వాసి మాధవరెడ్డి గారక్కడికి వస్తారు. ఏం చూస్తున్నావని రాఘవని పలకరిస్తారు. ఆయనని చూస్తే గౌరవభావం కలుగుతుంది రాఘవకి, సాన్నిహిత్యం ఉన్నట్టు తోస్తుంది. ఏం లేదు బాబాయ్ అని జవాబు చెప్తాడు. ఒక అపరిచితుడు తనని బాబాయ్ అని పిలిచేసరికి ఆయనకి స్వల్పంగా కోపం వచ్చినా, రాఘవ పిలుపులోని అభిమానం, గౌరవం గ్రహించి ఊరుకుంటారు. ఆ ఉడుతలో నువ్వేం చూస్తున్నావని అడిగితే, వారధి నిర్మాణ సమయంలో ఉడుత చేసిన చిరుసాయం గుర్తొచ్చిందని రాఘవ చెప్తాడు. ఆ సంఘటన అవాల్మీకమని చెప్తూ, వాల్మీకి రాయనవి, రామాయణంలో చేర్చబడ్డవాటిని మరికొన్ని చెప్తారాయన. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు. ఆయన ఆశయాలను అభినందిస్తాడు రాఘవ. ఆ సాయంత్రం రెండవ ఉపన్యాసం అయ్యాక, రాఘవని ఆఫీసుకు రమ్మంటున్నారనే కబురు, తనతో ఒరిజినల్‌ ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్స్‌ తీసుకురమ్మన్న సూచన అందుతుంది. దానికి అనుగుణంగా తయారై సర్టిఫికెట్స్‌ఉన్న కవరును తీసి వెళ్ళి రిసెప్షన్‍లో ఉన్న వ్యక్తికి విషయం చెప్తాడు. అతను రాఘవను కూర్చోమని చెప్పి, సర్టిఫికెట్స్‌ తీసుకుని పరిశీలించి, తమ రికార్డులో నోట్‌ చేసుకుని, అటెండర్‌‍తో ఆఫీసరు గదిలోకి పంపిస్తాడు. తర్వాత ఆఫీసర్‍ రాఘవని గదిలోకి పిలిచి ఇంటర్వ్యూ చేస్తాడు. రాఘవ చెప్పిన జవాబులతో ఆయన సంతృప్తి చెందుతాడు. తాము కేవలం ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్స్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోమని, అభ్యర్థి ప్రవర్తననూ, కలివిడితనాన్ని తదితర అంశాలను పరిశీలిస్తామని చెప్పి రాఘవని పంపేస్తారాయన. – ఇక చదవండి.]

8. గుండె నిబ్బరం

[dropcap]రా[/dropcap]ఘవ కన్యాకుమారికొచ్చి నాలుగు రోజులయ్యాయి!

వచ్చినప్పటినుండి రోజూ ఉదయం 4.30 గంటల కల్లా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవటం; ఆ తర్వాత సమయసారణిని అనుసరించి తరగతులకు హాజరు కావటం జరుగుతోంది.

ప్రతిరోజు ఠంచనుగా ఈ క్రింది సమయసారణిని అమలుపరుస్తున్నారు.

ఉదయం 5.30 – 6.30 ప్రాతఃస్మరణం, ఆసనాలు;
6.30 – 7.00 ప్రాణాయామం, ఓంకార ధ్యానం;
7.00 – 7.30 గీతా శ్లోకాల పఠనం,
7.30 – 8.45 స్నానం, అల్పాహారం;
8.45 – 9.45 శ్రమదానం;
10.00 – 11.00 గ్రంథాలయ సందర్శనం;
11.00 – 12.00 మొదటి ఉపన్యాసం;
మధ్యాహ్నం 12.00 – మధ్యాహ్న భోజనం; విశ్రాంతి.
2.00 – 3.00 గీతా శ్లోకాల పఠనం;
3.00 – తేనీరు;
సాయంత్రం 3.20 – 4.20 రెండవ ఉపన్యాసం;
4.30 – 5.30 యోగా తరగతులు;
5.45 – 6.45 విరామం
6.45 – 7.30 భజనలు;
రాత్రి 7.40 – 8.40 రాత్రి భోజనం;
8.45 – 9.45 రాత్రి సమావేశం;
10.00 – లైట్స్‌ ఆఫ్‌!

ఇక ఉపన్యాస తరగతులలో భారతం, రామాయణం, భక్తితత్వం, మానవత్వం, రామకృష్ణులు, వివేకానందుల జీవిత చరిత్రలు మొదలైన విషయాలు ఉంటున్నాయి.

ప్రొ. ప్రభాకరంగారు, ప్రొ. రాజేంద్రన్‌గారు, ప్రొ. యామినీగారు, ప్రొ. బెన్నెట్‌గారు ఆంగ్లంలో చక్కటి విషయాలను అందిస్తున్నారు. రాఘవ వాళ్ల ఉపన్యాసాలకు బాగా అలవాటుపడ్డాడు.

ఉపన్యాసాలలో ఏవైనా అనుమానాలు కలిగితే మాధవరెడ్డితో చర్చిస్తున్నాడు. దాంతో అతనికి ఆయనతోటి సాన్నిహిత్యం మరింత పెరిగిందనే చెప్పాలి.

ఆ రోజు ఉదయం స్నానం పూర్తిచేసి, ఉతికిన బట్టలు ధరించి అల్పాహారానికి బయలుదేరాడు రాఘవ.

అప్పటికే అక్కడ చాలామంది కూర్చుని అల్పాహారం తింటున్నారు. వాళ్లల్లో బాబాయ్‌ కోసం వెతికాడు. కానీ ఆయన కనిపించలేదు.

‘తానైనా తినటం కొంత ఆలశ్యం చేస్తాడేమో కానీ, బాబాయ్‌ మాత్రం అన్నీ సమయానికి జరగిపోవాలని ఆశించే వ్యక్తి. సమయపాలన అన్నది బాబాయ్‌ నుండే నేర్చుకోవాలి. ఇదే కాదు, ఇంకా చాలా విషయాలు ఆయన్నుండి నేర్చుకోవాలి. ఆయన సాంగత్యం దొరకటం తన అదృష్టం’ మనసులో అనుకున్నాడు రాఘవ.

‘నిజానికి ఆయనతో మాట్లాడే అర్హత కూడా తనకు లేదు. ఆయనకున్న జ్ఞానం ముందు, అనుభవం ముందు తను చాలా అల్పజీవి. అలాంటిది తననూ ఒక మనిషిగా గౌరవించి, ఒక కొడుకులాగా అభిమానాన్నీ, ఆప్యాయతనూ కురిపిస్తున్న వ్యక్తి మాధవరెడ్డి గారు.’ అనుకుంటూ ఆయనకోసం వెతకసాగాడు రాఘవ.

‘ఒకవేళ గుడికేమైనా వెళ్లారేమో?’ అనుకుంటూ గబగబ గణపతి కోవెల దగ్గరకు వెళ్లాడు రాఘవ. ఆయన అక్కడా కనిపించలేదు.

ఎటూ ఇంత దూరం వచ్చాం కదా అనుకుని కళ్లు మూసుకుని భక్తితో గణపతికి మొక్కుకుని, నాలుగు గుంజిళ్లు తీసి, సాష్టాంగపడి నమస్కరించాడు. పళ్లెంలో నుండి ఇంత విబూదిని తీసుకుని తన నుదుటికి రాసుకున్నాడు.

అలా విబూది పెట్టుకుంటుంటే అతనికే ఆశ్చర్యం కలిగింది.

‘ఎలా ఉన్నవాడు తను ఎలా మారిపొయ్యాడు? గుడి అన్నా, దేవుడన్నా, తనకు ఒళ్లు మంట! ఊళ్లో ఉండగా ఏనాడూ గుడికి వెళ్లిన పాపాన పోలేదు. పండగలూ పబ్బాలూ వచ్చినప్పుడు చేతులెత్తి దేవునికి నమస్కరించిన సందర్భమే లేదు. ఎందుకో దేవుడంటే తనలో ఒక అసంతృప్తి. కానీ ఇక్కడికొచ్చి నాలుగు రోజులే అయ్యాయి. అంతలోనే తనలో ఎంత మార్పు?! దీనికి కారణం బాబాయే. ఇంతకీ ఆయన ఎటు వెళ్లినట్టు?’

గబగబ గ్రంథాలయంకేసి నడిచాడు రాఘవ. అక్కడా కనిపించలేదు.

దగ్గరలోని తోటలోకెళ్లి చూశాడు. ఊహూ.. అక్కడా లేడు.

‘ఎక్కడికెళ్లాడబ్బా? ఖాళీ సమయాల్లో ఆయన వెళ్లే ప్రాంతాలివేగా. ఇక్కడెక్కడా లేడంటే.. బయటికెళ్లాడేమో?

సరే ఎందుకైనా మంచిది ఒకసారి ఆయనుండే హాలుకు వెళ్లి చూద్దామని’ వెళ్లాడు. ఆయన దుప్పటి పరుచుకుని పడుకుని ఉండటం కనిపించింది. యోగా క్లాసుకు వచ్చినపుడు ఆయన్ను గమనించలేదు. ఎందుకిలా పడుకోనున్నాడు. ఏమైంది ఆయనకు?

దగ్గరికెళ్లి ఒంటిమీద చెయ్యేసి కుదుపుతూ.. “బాబాయ్‌.. బాబాయ్‌..” అని ఆదుర్దాగా పిలిచాడు.

“ఊ..” అని సన్నగా మూలిగాడే కానీ, ఏమీ బదులివ్వలేకపొయ్యాడు. నుడుటిమీద చెయ్యేసి చూశాడు రాఘవ. వేడిగా తగిలింది. అరే జ్వరం కాస్తున్నట్టుందే? అనుకుంటూ.. “బాబాయ్‌, ఒంట్లో బాలేదా? అసలేమైనా తిన్నారా?” అని అడిగాడు.

సమాధానం రాకపొయ్యేసరికి వేగంగా వంటగదికేసి పరుగెత్తాడు.

అక్కడున్న వ్యక్తితో తన మిత్రునికి ఒంట్లో బాగాలేదనీ, ఒక గ్లాసుడు వేడినీళ్లుంటే ఇవ్వమనీ చెప్పి, ఒక పళ్లెంలో నాలుగిడ్లీలూ కాస్త సాంబారు పోయించుకుని మళ్లీ బాబాయ్‌ దగ్గరికొచ్చాడు.

“బాబాయ్‌, లేచి కూర్చో! ఇదిగో, వేడివేడిగా ఈ ఇడ్లీలు తిని, ఈ వేడినీళ్లు తాగండి!” అన్నాడు.

మాధవరెడ్డి మెల్లగా లేచి కూర్చున్నాడే కానీ ఇడ్లీలు తినబుద్ధి కావటం లేదు. కడుపులో తిప్పుతోంది. వాంతి వచ్చేలా ఉంది అనుకుంటూ ఉండగానే దాన్ని నియంత్రించుకోలేక వాంతి చేసుకున్నాడు. రాఘవ గబుక్కున తన రెండు చేతులను ఆయన నోటి ముందు ఉంచాడు. ఆయన వాంతి చేసుకుని కాస్త ఉపశమించాక రాఘవ చేతుల్ని శుభ్రం చేసుకోవటానికి బయటికి వెళ్లాడు.

మాధవరెడ్డి అతని చర్యకు చలించిపొయ్యాడు. ‘అతనెవరు? తనకూ అతనికీ ఉన్న సంబంధం ఏమిటీ? ఎందుకు తనపై ఇంతటి ఆప్యాయతను కురిపించాడు.?’ సహజమైన అతని ప్రవర్తనకు ఆయన ఎంతగానో ఆనందించాడు.

రాఘవ తిరిగొచ్చి మాధవరెడ్డిని చూస్తూ “బాబాయ్‌, నేవెళ్లి డాక్టర్‌ను పిలుచుకొస్తాను?” అని అక్కణ్ణించి కదలబోయాడు.

మాధవరెడ్డి చటుక్కున అతని చెయ్యి పట్టుకుని ఆపి, అతని కళ్లల్లోకి చూశాడు. ఆ కళ్లల్లో కనిపించే ఆతృతనూ, అభిమానాన్నీ చూసి చిన్నగా నవ్వుతూ.. “ఇప్పుడు నాకేమైందని ఇంతగా కంగారు పడుతున్నావు?” అని అడిగాడు.

“బాబాయ్‌, మీకు ఒంట్లో జ్వరం కాస్తున్నట్టుంది, నేను వెళ్లి ఆఫీసులో చెప్పి డాక్టర్‌ను పిలుచుకొస్తాను!” అన్నాడు రాఘవ.

“అఖ్ఖర్లేదు అలా కూర్చో! ఈ మాత్రం జ్వరానికే అంతగా బెంబేలు పడిపోతే ఎలా?”

“బెంబేలు పడక! నాకన్నా ఎంతో ఉత్సాహంగా చలాకీగా ఉండే మీరు.. ఇలా పడకేస్తే కంగారుగా ఉండదా ఏంటీ?”

“ఇది మామూలు జ్వరమేలే! మాత్రలేమీ అఖ్ఖర్లేదు. ముందు నువ్వలా కూర్చో!”

“మామూలు జ్వరమా?” అనుమానంగా అడిగాడు రాఘవ.

“ఆ, చోటు మారిందిగా, నీళ్లూ మారాయి. అది ఒక్కసారిగా పడిశానికి దారిదీసింది. దాంతోపాటు జ్వరమూ పట్టుకుంది. అంతేకాదు, నిన్న నేనొక పని చేశానులే!” నవ్వుతూ అన్నాడు మాధవరెడ్డి.

‘కొంపదీసి ఎవరికీ తెలియకుండా బాబాయ్‌ మద్యం కానీ తాగాడా ఏంటీ?’ మనసులోనే కలవరపడ్డాడు రాఘవ.

“నిన్న సాయంత్రం నేను సముద్రతీరానికి వెళ్లానులే.” అసలు విషయం చెప్పాడు మాధవరెడ్డి.

“నాకూ చెప్పి ఉంటే నేనూ వచ్చి ఉండేవాణ్ణిగా!” నిరుత్సాహంగా అన్నాడు రాఘవ.

“ఒంటరిగా వెళ్లాలనుకున్నాను, వెళ్లాను.”

“అయితే సముద్రతీరానికి వెళ్లగానే, ఆ చల్లదనానికి మీకు చలువ చేసిందన్నమాట!”

“కాదు, అక్కడ ఇంకొక పనికూడా చేశానులే!”

మళ్లీ మద్యం ఆలోచన వచ్చింది రాఘవకు.

“ఏం చేశారో ముందు ఆ విషయం చెప్పండి.” అంటూ అనుమానంగా బాబాయ్‌కేసి చూశాడు.

“కన్యాకుమారిలో చూడదగిన ముఖ్యమైన విషయమేమిటో నీకు తెలుశా?” రాఘవను ప్రశ్నించాడు మాధవరెడ్డి.

“బాబాయ్‌, ఇడ్లీలు తింటూ మాట్లాడండి, లేకపోతే అవి చల్లారిపోతాయి.”

“ముందు నేనడిగిన ప్రశ్నకు జవాబివ్వు. ఇక్కడ చూడదగిన ముఖ్యమైన విషయమేమిటో చెప్పు చూద్దాం?..” అంటూ పళ్లెంలో ఉన్న ఒక ఇడ్లీ ముక్కను తుంచి సాంబారులో అద్ది నోట్లో పెట్టుకున్నాడు.

“వివేకానందుడు ధ్యానం చేసిన పెద్ద రాతిగుండు. అదే రాక్‌ మెమోరియల్‌!”

“అది కూడా ఒకటనుకో! మరొకటి.. సూర్యోదయాస్తమయాలు..”

“ఆ..” అర్థంకాక నోరు వెళ్లబెట్టాడు రాఘవ.

“అంటే.. సూర్యుడు ఉదయించటం, అస్తమించటం.. అన్నమాట. వాటిని ఇక్కడ తప్ప మరింకెక్కడా నువ్వు అలాంటి అద్భుతాన్ని చూడలేవు!”

“అంత అద్భుతంగా ఉంటుందా?” కళ్లు విప్పార్చి అడిగాడు రాఘవ.

“ఈ ఆదివారం నీకు ప్రత్యక్షంగా చూపిస్తానుగా!” తలాడిస్తూ అన్నాడు మాధవరెడ్డి.

“సరే, చూపిద్దురులే కానీ.. అక్కడ ఏం చేశారో అది చెప్పండి ముందు!”

“నిన్న సాయంత్రం సూర్యాస్తమయ దృశ్యం చూశాక.. స్నానం చేశాను!”

“ఓస్‌ అంతేనా.. ఆ మాత్రం దానికే జలుబు, జ్వరం పట్టుకునేశాయా?”

“నేను స్నానం చేసింది ఇక్కడ కాదు, సముద్రంలో.. సముద్ర స్నానం అన్నమాట!”

“ఆ..”

“ఆ.. కొత్త చోటూ, కొత్త నీళ్లూ, సముద్ర స్నానమూ.. అన్నీ కలిసి నాకింతటి ఉపద్రవాన్ని తెచ్చిపెట్టాయన్నమాట!”

“సరే, మీరు అల్పాహారం తింటూ ఉండండి, నేను వెళ్లి జ్వరం మాత్రలు పట్టుకొస్తా!” అంటూ మళ్లీ లేవబోయాడు.

“కూర్చో, లేవకు! నా దగ్గర జ్వరం మాత్రలు లేవనా నీ ఉద్దేశం. అన్నీ ముందు ఏర్పాట్లు చేసుకునే వచ్చా! చూడూ.. నాకు జ్వరం వస్తే వచ్చుండొచ్చు. కానీ నేను దానికి భయపడే ప్రసక్తే లేదు. అదే నాకు భయపడాలి! అదే నాకు లొంగాలి. తగ్గటానికి ఏ మాత్రలూ వేసుకోను. అది నన్నేం చేస్తుందో అదీ చూస్తా! ఇదే దానికి నా సవాల్‌!! మధ్యాహ్నానికల్లా నేనూ నీతోపాటు యోగా క్లాసుకు వస్తానో లేదో చూడు..” అని ఎంతో ఆత్మవిశ్వాసంతో అన్నాడు మాధవరెడ్డి.

ఆయన గుండెనిబ్బరానికి ఆశ్చర్యాంగా నోరు వెళ్లబెట్టి ఆయన్నే చూస్తూ ఉండిపొయ్యాడు రాఘవ.

9. అందమైన సూర్యోదయం

ఆ రోజు ఆదివారం. యోగా, రామాయణం, భారతం తరగతులు మొదలైన వాటన్నింటికీ విశ్రాంతినిచ్చారు.

ఉదయాత్పూర్వం 4.30 గంటలు కావస్తున్నది. అప్పటికే రాఘవ నిద్రలేచి మాధవరెడ్డి ఉన్న హాలుకు వెళ్లాడు. అక్కడ దాదాపు సగంమంది నిద్రపోతున్నారు. మిగతా సగంమంది మేల్కొని సముద్రతీరానికి వెళ్లటానికి తయారవుతున్నారు.

తాను ముందుగా నిద్రలేచి బాబాయ్‌ను నిద్ర లేపుదామనుకున్న రాఘవ, అప్పటికే ఆయన నిద్రలేచి తనకోసం ఎదురుచూస్తూ కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.

“ఇంకో ఐదునిమిషాలు చూసి నేనే నీ దగ్గరికి వద్దామనుకున్నాను. ఈలోపు నువ్వే వచ్చేశావు, గుడ్‌! ఇలాగే ఉండాలి, యువతరం.” నవ్వుతూ అన్నాడు మాధవరెడ్డి.

“చాల్లే బాబాయ్‌, మీరెప్పుడూ ఇంతే! అన్నింట్లోనూ నాకన్నా మీరే ముందుంటారు. నేనొచ్చి మిమ్మల్ని నిద్రలేపి ఆశ్చర్యపరుద్దాం అనుకున్నాను. కానీ ఏదీ.. నాకన్నా ముందే మీరు నిద్ర లేచేశారుగా!” బుంగమూతి పెట్టి అన్నాడు రాఘవ.

“రాఘవా, ఇవ్వాళ అనే కాదు, రోజూ నేను నాలుగ్గంటలకల్లా నిద్ర లేస్తాను. అది నా అలవాటు. ఆ అలవాటు నాకు ఇప్పటిది కాదు, నలభై ఏళ్లుగా ఉంది. సరే సరే ఇక బయలుదేరు, వెళుతూ మాట్లాడుకుందాం.” అంటూ లేచి బయటికి దారితీశాడు.

రాఘవ ఆయన్ను అనుసరించాడు.

“అంత త్వరగా నిద్రలేచి ఏం చేస్తారు బాబాయ్‌!” కుతూహలంగా అడిగాడు రాఘవ.

“చెయ్యాలంటే పనులా లేవు. బోలెడన్ని ఉన్నాయి. అసలు మన పనులకు నిద్ర కదూ అడ్డు వస్తున్నది.”

“అంటే మనం రాత్రీపగలూ పనులు చేస్తూనే ఉండాలంటారా?”

“ఉండకూడదా? పగలు మాత్రమే పనిచేసి రాత్రుల్లో నిద్రపోయే అలవాటు మనకు మొదటి నుండీ వచ్చేసింది. అందుకే మనం రాత్రులన్నీ నిద్రకే కేటాయిస్తాం. ఇంకో విషయం చెప్పనా, వయసును బట్టి మనం నిద్రపోయే సమయాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువసేపు నిద్రకు కేటాయిస్తే.. ఎందుకూ పనికిరాని మొద్దుల్లా తయారవుతాం. నాకు తెలిసి మనకు ఐదు లేక ఆరు గంటల సమయం నిద్ర చాలనుకుంటాను. ఆపైన నీకిష్టమైన పని నువ్వు చేసుకోవచ్చు!”

“ఆ బాగానే ఉంది. మనం పనులు మొదలుపెడితే నిద్ర చెడగొడుతున్నారని ఇరుగుపొరుగువాళ్లు వచ్చి గొడవ పడటానికా?”

“పనులు అంటే రోజూవారి చేసే పనులు కావు. నువ్వు ఉద్యోగార్థివి కాబట్టి కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కు సంబంధించిన బుక్స్‌ చదువుకోవచ్చు. అలాగే విద్యార్థులు వాళ్లవాళ్ల చదువులకు సంబంధించిన పరీక్షలకు ప్రిపేర్‌ కావచ్చు. నిజం చెప్పాలంటే ఉదయం నాలుగ్గంటలన్నది చూశావూ, దాన్ని ‘బ్రహ్మ ముహూర్తం’ అంటారు. ఆ సమయంలో నువ్వు ఏ పనిచేసినా విజయవంతం అవుతుంది.”

“మేము సరే బాబాయ్‌, ఆ సమయంలో లేచి, మీరేం చేస్తారనీ?”

“ఆ సమయంలో నేను కొంతసేపు ఆధ్యాత్మిక, భక్తి సంబంధమైన పుస్తకాలను చదువుతాను. తర్వాత కొంతసేపు ఏదైనా రాసుకుంటాను. ఆ తర్వాత గంటసేపు యోగాసనాలు వేస్తాను..”

“రాస్తాను అంటున్నారు, ఏం రాస్తారు బాబాయ్‌.. కథా?”

“అలాంటిదే అనుకో.. అయితే అది కల్పిత కథ కాదు, నా జీవిత కథ, నా ఆత్మకథ!”

“ఓ.. ఆటోబయోగ్రఫీ అన్నమాట. భలే భలే!! దాన్ని నాకివ్వు బాబాయ్‌, నేను చదివి మళ్లీ మీకు తిరిగిచ్చేస్తాను.”

“అది ఇంకా పూర్తి కాలేదు. పైగా అది ఇతరులు చదువుకోవటానికి కాదు! నేను చదువుకోవటానికి మాత్రమే.”

“అదేంటి బాబాయ్‌, మీకు మాత్రమేనా, ఇంకెవరూ చదవకూడదా?”

“నేనేమీ అంత గొప్పవ్యక్తిని కాను, నా ఆత్మకథను నలుగురూ చదవి మెచ్చుకోవాలనీ నాకు లేదు.”

“నో బాబాయ్‌, ఆత్మకథలు గొప్పవ్యక్తులే రాయాలన్న అభిప్రాయం తప్పు. ఎవరి ఆత్మకథలైనా గొప్పవే. ఏ రెండు ఆత్మకథలూ ఒకేలా ఉండవు. ఎవరి జీవితం వాళ్లవి. అలా మీ జీవితమూ మరి కొందరికి ఆదర్శప్రాయంగా ఉండొచ్చు. పైగా మీ జీవన శైలీ, నాటి సమాజ స్థితిగతులూ, ప్రజా సంబంధాలు.. ఇత్యావదివన్నీ మీరు చూసిన కోణంలో రాయటంవల్ల ఆ కోణమూ అందరికీ తెలుస్తుందిగా! కనుక మీరు రాయండి. మీకోసమని రాయకుండా, ఇతరుల కోసమని కూడా అనుకుని రాయండి.”

రాఘవ వైపు ఆత్మీయంగా చూశాడు మాధవరెడ్డి. ఇద్దరూ మాట్లాడుకుంటూ సముద్రతీరానికి చేరుకున్నారు.

అప్పటికే తీరంలో అక్కడక్కడా ప్రజలు తమకు అనుకూలమైన ప్రదేశం చూసుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

ఆశ్చర్యమనిపించింది రాఘవకు. ‘ఇంతమంది వచ్చారంటే ఇక్కడి సూర్యోదయానికి చాలానే ప్రాధాన్యత ఉన్నట్టుంది. అదేంటో ఇవ్వాళ తనూ చూడాలి.’ అని మనసులో అనుకుంటూ చకచకా అడుగులు ముందుకు వేశాడు.

వాళ్లిద్దరూ పెద్దపెద్ద రాతిగుండ్లు ఉన్న ప్రదేశానికి వెళ్లి.. అక్కడున్న ఒక రాతిగుండు మీదకెక్కి కూర్చున్నారు.

సమయం గడిచేకొద్దీ తూర్పున జేవురు రంగులో కిరణాలు చొచ్చుకురాసాగాయి.

వెలుతురు క్రమంగా వృద్ధి చెందసాగాయి.

అందరి చూపులూ తూర్పుకు మళ్లాయి. అక్కడున్నవాళ్ల మాటలు ఆగిపోయి నిశబ్దం అలుముకుంటోంది.

అప్పుడు తూర్పు దిక్కున సముద్రంలో ఒక అద్భుతం చోటుచేసుకుంది.

సముద్రం నుండి మొదట ఒక సన్నని గీతలా వృత్తాకారంలో సూర్యుడు ఉదయించసాగాడు.

భూమి నుండి పైకొచ్చే బంతిలా సముద్రం నుండి సూర్యుడు మెల్లమెల్లగా పైకి రాసాగాడు.

కళ్లప్పగించి చూస్తున్నాడు రాఘవ. సముద్రం నుండి దినకరుడు పైకొచ్చేకొద్దీ వెలుతురు క్రమంగా పెద్దది కాసాగింది. కిరణాలు నిట్టనిలువుగా మొదలై క్రమంగా ఏటవాలుగా దూసుకురాసాగాయి.

అబ్బ! ఎంత అందంగా ఉంది. అది అందమా, కాదు అడ్భుతం. భూమిమీద నివసించే జీవరాశులకు ప్రకృతి ప్రసాదించే అద్భుత రమణీయ కమనీయ దృశ్యం.

సూర్యోదయాన్నే మైమరచిపోయి చూడసాగాడు రాఘవ.

అతనే కాదు, అక్కడున్న వాళ్లందరూ కళ్లార్పకుండా ఆ దృశ్యానే చూడసాగారు. కళ్లార్పితే ఎక్కడ అది కనుమరుగై పోతుందేమోనన్న ఆసక్తితో నిశ్చేష్ఠులై చూస్తున్నారు.

క్రమంగా ప్రభాకరుడు కొంత పైకొచ్చాడు. ఇప్పుడు మరింత అద్భుతమైన దృశ్యం అక్కడ ఆవిష్కృతమైంది.

అదెలా ఉందంటే నీళ్లలో నుండి మొలిచిన కమలంలా వెలిగిపోతున్నాడు రవి.

“జీవితం ధన్యమైంది బాబాయ్‌!” పులకించిపోతూ అన్నాడు రాఘవ.

“ఊ.. కన్యాకుమారిలో సూర్యాస్తమయాలు రెండూ అద్భుతంగానే ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు తూర్పున పైకి వచ్చాడా, సాయంత్రం పడమరన.. అంటే వ్యతిరేక దిశలో నిల్చుంటే అప్పుడు ఇదే సముద్రంలో సూర్యుడు మునిగిపోతూ కనిపిస్తాడు. అంటే సముద్రం నుండి ఉద్భవించి సముద్రంలోనే అస్తమిస్తాడన్న మాట. ఇలాంటి అరుదైన, అద్భుతమైన దృశ్యం మనం ఇంకెక్కడా చూసే అవకాశం లేదు రాఘవా.” అంటూ అతను చెప్పటం పూర్తికాక మునుపే..

“బాబాయ్‌, మనం సూర్యుడు అస్తమించటమూ చూద్దాం బాబాయ్‌!” ఆసక్తిగా అన్నాడు రాఘవ.

“చూద్దాం, కేంద్రానికి వెళ్లి మళ్లీ సాయంత్రం ఇక్కడికొచ్చి ఆ అందాన్ని కూడా తిలకిద్దాం లే. సరేనా?”

అలాగే అన్నట్టుగా ఉత్సాహంగా తలూపాడు రాఘవ.

(ఇంకా ఉంది)

Exit mobile version