Site icon Sanchika

జీవితమొక పయనం-7

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[యోగాశిక్షణకి వచ్చినవాళ్ళందరినీ ఒకరోజు ట్రెక్కింగ్‍కు తీసుకువెళ్తారు నిర్వాహకులు. పర్వతం వద్ద బస్సు దిగిన తర్వాత కేంద్రం మేనేజర్ అందరికీ సూచనలు చేసి, వారికి అక్కడి గైడ్‍కు అప్పజెప్పి, మళ్ళీ సాయంత్రం బస్సులతో వస్తామని చెప్పి వెళ్ళిపోతాడు. గైడ్ వాళ్ళందరిని పలకరించి, పర్వతం ఎలా ఎక్కాలో చెప్తాడు, కంగారు పడకుండా, నెమ్మదిగా శ్రమ లేకుండా ఎక్కమని చెప్తాడు. ఎక్కడెక్కడ ఆగాలో, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో చెప్తాడు. అందరూ బృందాలుగా విడిపోయి బయల్దేరుతారు. రాఘవ, మాధవరెడ్డి మాట్లాడుకుంటూ ఎక్కుతారు. మధ్యలో రాఘవ వెనక్కి తిరిగి చూడబోతే, అలా చూడవద్దని, అది మానసికంగా దెబ్బతీస్తుందని హెచ్చరిస్తాడు మాధవరెడ్డి. మధ్యలో ఒక గుహ కనబడుతుంది. అందులో ఒక వ్యక్తి తపస్సు చేస్తున్నాడనీ అందరూ నెర్రెలోంచి లోపలికి చూస్తారు. రాఘవ, మాధవరెడ్డి కూడా చూస్తారు, కానీ లోపల మనిషెవరూ ఉన్నట్టు అనిపించదు. మేకలు కాసే అతను కనబడితే, ఆతన్ని అడిగితే, ప్రచారంలో ఉన్న ఓ గాథని చెప్తాడతను. మరో రెండు గంటలు నడిచాకా, శిఖరాగ్రం చేరుకుంటారు. అక్కడ కాసేపు విశ్రమించాకా, అందరికీ ఆకలి వేస్తుంది. కాస్త దూరంగా ఓ షామియానాలో వంటలు చేస్తున్నట్లు గ్రహిస్తారు. భోజనాలూ, కాస్త విశ్రాంతి అయ్యాకా, టీ తాగి, పర్వతం మీద ఒక వ్యూ పాయింట్ వద్దకు తీసుకువెళ్తాడు గైడ్. అక్కడ్నించి చూస్తే, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలవడం స్పష్టంగా కనబడుతుంది. అద్భుతమైన త్రివేణీ సంగమంను చూసి ఆనందిస్తారు. తర్వాత ఆ పర్వతానికి సంబంధించిన రామాయణ గాథను వివరించి, దాన్ని ఆ ప్రాంతం వాళ్ళు ‘మరుండు వాళుం మలై’ (ఔషధ పర్వతం) అని పిలుస్తారని చెప్తాడు. ఎన్నో అనుభూతులతో బసకి చేరుతారందరూ. యోగా శిక్షణ శిబిరం ముగింపుకొస్తుంది. ఓ రాత్రి భోజనాలయ్యాక, అందరూ సమావేశమవుతారు. ఆర్గనైజర్‌ అంగీరస్‌ మాట్లాడి అందరినీ అభినందిస్తాడు. ఇక్కడ నేర్చుకున్నవన్నీ, ఇళ్ళకు వెళ్ళిన తరువాత కూడా పాటించాలని చెప్తాడు. ఇక్కడ నేర్చుకున్న వాటిని తమ కుటుంబ సభ్యులకు, మిత్రులకు నేర్పమని సూచిస్తాడు. సంస్థలో సేవాభావంతో ఉపాధ్యాయులుగా పనిచేయటానికి ఎంతో ఆసక్తితో ఎక్కడెక్కడి నుండో వచ్చారనీ, ఎవరెవరు ఎన్నుకోబడ్డారో తమ కమిటీ మధ్యాహ్నమే నిర్ణయించిందనీ, కానీ వాళ్లెవరో ప్రస్తుతం అనివార్య కారణాల వెల్లడించలేకపోతున్నామనీ, ఎంపికైన వారికి వ్యక్తిగతంగా ఉత్తరాల ద్వారా తెలియజేస్తామని చెప్తాడు. మర్నాడు అందరూ తమ ఊర్లకు బయల్దేరిపోవచ్చని అంటాడు. రాఘవ నిర్ఘాంతపోతాడు. ఇప్పుడేం చేయాలో తోచదు. మాధవరెడ్ది ధైర్యం చెబుతాడు. ఉద్యోగం తనకెంత అవసరమో రాఘవ చెప్తాడు. మాధవరెడ్డి కాసేపు ఆలోచించి వరంగల్‍లో తమ బావాగారు కార్యదర్శిగా ఉన్న ఓ ఆవాస విద్యాలయంలో అవకాశం ఉందేమో అడుగుతానని చెప్తాడు. ఆయనతో పాటు వరంగల్ వస్తానని రాఘవ అంటే, వద్దని చెప్పి, తాను వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడి ఉత్తరం రాస్తానని, అప్పుడు రమ్మని చెప్తాడు. – ఇక చదవండి.]

14. పద్మనాభస్వామి దర్శనం

[dropcap]యో[/dropcap]గా శిక్షణ శిబిరం ముగింపు సమావేశం!

తాము మూడు వారాలపాటు నిర్వహించిన యోగా శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసిందనీ, వాటిమీద తాము నిర్వహించిన రాతపరీక్షలో మెరిట్‌ సాధించినవారికి సర్టిఫికెట్లను, అందరికీ యోగ్యతా పత్రాలను ప్రదానం చేశారు నిర్వాహకులు.

చివరగా.. ఈ మూడు వారాల సమయంలో శిక్షణార్థులు తాము పొందిన అనుభవాలను పంచుకోవటానికి వేదిక మీదికి రావలసిందిగా ఆహ్వానించారు. చాలామంది ఉత్సాహంగా ఇంగ్లీషులో తమ పాండిత్యాన్నంతా ప్రదర్శిస్తూ ప్రసంగించారు. కొందరు యోగా శిక్షకులను, సంస్థను పొగడ్తలతో ముంచెత్తేశారు. రాఘవ అన్నీ వింటూ మౌనంగా ఉండిపోయాడు. ఎవరెవరి ప్రాంతీయ భాషల్లో వాళ్లు మాట్లాడవచ్చు, అని నిర్వాహకులు చెప్పేసరికి, మాధవరెడ్డి ఉత్సాహంగా లేచి వెళ్లి, ‘ఈ యోగా శిక్షణలో ఆసనాలతో పాటు, ఆధ్యాత్మికమైన విషయాలు వినటం, రాక్‌ మెమోరియల్లో ఒక రోజంతా గడపటం, ట్రెక్కింగులో భాగంగా త్రివేణీ సంగమాన్ని దర్శించటం.. జీవితంలో తాను మరిచిపోలేని విషయాలని చెప్పారు.

ఆయన ప్రసంగానికి అందరూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. మొత్తానికి సభ కోలాహలంగా ముగిసింది.

ఎవరెవరికి తమ తిరుగు ప్రయాణపు రైళ్లు సాయంకాలానికి ఉన్నాయో, వాళ్లందరికీ మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చెయ్యటం జరుగుతుందని కేంద్రం తెలిపింది.

కొందరు తమ ప్రయాణానికి ఇంకా చాలా సమయం ఉండటంతో రామేశ్వరం వెళ్లి రావటం మంచిదనీ, మళ్లీ ఇలాంటి అవకాశం రాదనీ భావించి చకచకా సూట్‌కేసులూ అవీ సర్దిపెట్టేసి రామేశ్వరం బయలుదేరి వెళ్లిపోయారు.

రాఘవక్కూడా రామేశ్వరం వెళ్లాలన్న కోరిక ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రయాణానికి మొగ్గు చూపించలేకపొయ్యాడు.

ఒకవేళ మాధవరెడ్డి వెళితే తానూ వెళ్లాలని మాత్రం నిర్ణయించుకున్నాడు. తాను బాబాయ్‌తో మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయని భావించాడు. బాబాయ్‌ పక్కనే ఉంటూ తన ఉద్యోగ విషయం అతను మరిచిపోకుండా అప్పుడప్పుడూ గుర్తుచెయ్యాలనుకున్నాడు.

గబగబా తన వస్తువులన్నీ సూట్‌కేసులో సర్దేసి మాధవరెడ్డి దగ్గరికి వెళ్లాడు. ఆయన పడక దగ్గర సూట్‌కేసు ఉంది, కానీ మనిషి మాత్రం కనిపించలేదు. ‘ఎటు వెళ్లుంటాడబ్బా?’ అని అనుకుంటూ ఒకళ్లిద్దర్ని అడిగాడు. బాత్‌రూమ్‌లో బట్టలు ఉతుక్కుంటున్నట్టుగా తెలుసుకుని అక్కడికి వెళ్లాడు.

“రా రాఘవా.. నీ ట్రైన్‌ ఎన్నింటికీ?” పంచెకు సబ్బు పెడుతూ అడిగాడు మాధవరెడ్డి.

“నేనేమీ బెర్త్‌ రిజర్వ్‌ చెయ్యించలేదు బాబాయ్‌! ఏ ట్రైన్‌ దొరికితే దాన్ని పట్టుకుని మారుతూ వెళ్లిపోవటమే! ఔనూ, మీ ట్రైన్‌ ఎన్నింటికీ?”

“నా ట్రైన్‌ రాత్రికి.. డైరెక్ట్‌ వరంగల్‌.”

“అయితే చాలా సమయముందిలే బాబాయ్‌.”

“అందుకేగా బట్టలు ఉతుక్కుంటున్నాను. మురికి బట్టలు పెట్టెలో కుక్కి తీసుకెళ్లటం ఇష్టంలేక ఉతుక్కుంటున్నాను. ఉతికి ఆరేస్తే ఎంత.. అర్ధగంటలో ఆరిపోవూ..” అన్నాడు ఉత్సాహంగా.

“అంతే బాబాయ్‌! చాలామందికి రైళ్లు రాత్రికున్నట్టున్నాయి, ఎంచక్కా రామేశ్వరం వెళ్లిపోయారు బాబాయ్‌, మరి మీకు రామేశ్వరం వెళ్లే ఆలోచనేమీ లేదా? మీరు వెళ్లేటట్టుంటే నేనూ మీతోపాటు వస్తాను.”

“లేదు రాఘవా, నేను ఇదివరకే చూసేశాను. సముద్రం మీద రైలు ప్రయాణం భలే ఉంటుంది లే. కానీ, దాని బదులు ఇంకేదైనా పుణ్యక్షేత్రానికి వెళితే బావుణ్ణు అనుకుంటున్నాను..” అంటూ ఆలోచనలో పడ్డవాడిలా మౌనంగా బట్టల్ని నీళ్లల్లో జాడించి పైకి తీసి వాటిని పిండి కొమ్మలమీద ఆరేశాడు..

హాల్లోకి వస్తూ.. “బ్రేక్‌ జర్నీ చేస్తే ఎలా ఉంటుందీ అని ఆలోచిస్తున్నాను రాఘవా.” అంటూ అతని ముఖంలోకి చూశాడు. అంటే ఏమిటో అర్థం కాలేదు రాఘవకు.

“ఇప్పటివరకూ పద్మనాభస్వామిని దర్శించుకోలేదు. అందుకనీ రేపు ఉదయాన తిరువనంతపురంలో రైలు దిగి, స్వామివారి దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుందాని ఆలోచిస్తున్నాను. వెళితే స్వామిని చూశామన్న తృప్తీ కలుగుతుంది.” అన్నాడు మాధవరెడ్డి.

“ఇబ్బందేమీ ఉండదుగా బాబాయ్‌!”

“ఆ ఏముందీ రిజర్వేషన్‌ డబ్బు వృథా అవుతుంది, అయితే అవనీ. మళ్లీ ఇలాంటి సందర్భం రాదుగా.”

“నేనూ ఇప్పటివరకూ పద్మనాభస్వామిని చూళ్లేదు బాబాయ్‌..”

“అయితే ఇంకేం. రా, ఇద్దరమూ వెళ్లి స్వామివారిని దర్శించుకుందాం.”

“అలాగే బాబాయ్‌!”

“అయితే ఒకపని చేద్దాం. నువ్వూ నాతోపాటు నా ట్రైన్‌లోనే రా. ఇద్దరమూ తిరువనంతపురంలో దిగి స్వామివారిని దర్శించుకుందాం. ఆపైన ఇద్దరమూ మరేదైనా రైళ్లు పట్టుకుని నేను వరంగల్‌కూ, నువ్వు చిత్తూరుకూ వెళ్లిపోదాం. సరేనా?”

“అలాగే బాబాయ్‌!”

“అయితే ఈలోపు ఒకపని చేద్దాం! నా ట్రైన్‌కు ఇంకా బోలెడంత సమయముంది కాబట్టి, అలా మెల్లగా సరదాగా నడుచుకుంటూ ఊళ్లోకెళ్లి గాంధీ మంటపం, పార్వతి తపస్సు చేసిన దేవాలయం మొదలైనవాటిని చూసుకుని, అలాగే ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా ఏవైనా వస్తువులు కొనుక్కొద్దామా!” అంటూ రాఘవను ఉత్సాహపరిచాడు మాధవరెడ్డి.

“అలాగే వెళదాం బాబాయ్‌!” అని తానూ ఉత్సాహంగా బదులిచ్చాడు రాఘవ.

కొంతసేపటికి ఇద్దరూ ఊళ్లోకి బయలుదేరారు.

చక్కగా కబుర్లు చెప్పుకుంటూ గాంధీ మంటపం, కుమారి(పార్వతి) దేవాలయాన్ని దర్శించుకుని, సముద్ర తీరంలో కాసేపు గడిపి.. తిరిగొస్తూ.. షాపింగ్‌కు వెళ్లారు. రకరకాలైన గవ్వలు, శంఖాలు, ఆల్చిప్పలు, అద్దాలతో కూడిన గవ్వల తోరణాలు, ఇత్యాదివన్నీ కొన్నారు. ఒకచోట ఒకే ఫ్రేములో స్వామి వివేకానందుని చిత్రంతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌లో రాక్‌ మెమోరియల్‌ దృశ్యం అత్యంత రమణీయంగా ఉన్న దాన్ని కొనాలని మాధవరెడ్డి ఉబలాటపడ్డాడు. దాన్ని రూ. 150/- లకు బేరమాడాడు కూడా. కానీ అతని దగ్గర అంత డబ్బు లేదు. ఆ సమయంలో బాబాయ్‌ ఆసక్తిని గమనించిన రాఘవ తన దగ్గరున్న డబ్చునిచ్చి దాన్ని కొనేటట్టు చేశాడు.

మాధవరెడ్డి తాను కేంద్రానికి వెళ్లిన తర్వాత దబ్బు తిరిగిస్తానని చెప్పాడు. రాఘవ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా నవ్వి ఊరుకున్నాడు. తర్వాత ఇద్దరూ కేంద్రానికి చేరుకున్నారు.

ఆ రాత్రి భోజనమయ్యాక.. రైల్వేస్టేషన్‌ చేరుకుని వాళ్లు ఎక్కాల్సిన రైలెక్కారు. మరుసటిరోజు ఉదయం తిరువనంతపురం స్టేషన్‌లో రైలు ఆగింది. మాధవరెడ్డి, రాఘవలిద్దరూ తమతమ సూట్‌కేసులు పట్టుకుని ప్లాట్‌ఫామ్‌పై దిగారు.

స్టేషన్‌ బయటికొచ్చి రిక్షా మాట్లాడుకుని నేరుగా పద్మనాభస్వామి ఆలయం ముందు దిగారు. ఇద్దరూ కోనేట్లో స్నానం చేశారు. తమ తమ సూట్‌కేసుల్ని క్లోక్‌రూమ్‌లో భద్రపరిచి పూజాసామగ్రి కొనుక్కున్నారు.

ఆ కొట్టతను రాఘవను విచిత్రంగా చూస్తూ.. మలయాళంలో ఏదో అభ్యంతరం తెలిపాడు. మాధవరెడ్డితో కూడా ఏదో అన్నాడు. అతనేం అంటున్నాడో మొదట ఇద్దరికీ అర్థం కాకపోయినా తర్వాత విషయం తెలిసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

సారాంశం ఏమిటంటే.. ప్యాంటు, చొక్కాలు తొడుక్కున్న భక్తుల్ని గుళ్లోకి అనుమతించరట. పంచె ధరించి ఒంటిమీదున్న చొక్కాను తీసేసి గుళ్లోకి వెళ్లాలిట. లేకపోతే లోపలికి వెళ్లలేరని చెప్పాడు.

రాఘవకేం చెయ్యాలో అర్థంకాలేదు. ఈలోపు మాధవరెడ్డి తన ఒంటిమీదున్న చొక్కాను తీసేసి చేతిమీద వేసుకున్నాడు.

అప్పుడు ఆ కొట్టువాడే ఒక సలహా ఇచ్చాడు. దూరంగా ఉన్న ఒక కొట్టును చూపిస్తూ.. అక్కడికెళ్లి పది రూపాయలు డిపాజిట్‌ కడితే పంచెను అద్దెకిస్తారనీ, ఆ పంచెను ప్యాంటుమీదనే ధరించి, చొక్కాను తీసి భుజమ్మీద వేసుకుని గుళ్లోకి వెళ్లమని సలహా ఇచ్చాడు. రాఘవ అక్కడికి వెళ్లి అలాగే చేశాడు.

“రాఘవా, ఎంత బాగుందీ పద్ధతి. భక్తితో గుడికి వచ్చేవాళ్లు తప్పనిసరిగా పాటించాల్సిన నియమం ఇది. మనిషి ఎంత నాగరికతను ఒంటబట్టించుకున్నా గుళ్లు గోపురాల్లాంటి భక్తి సంబంధమైన ప్రదేశాలలో ఆధునిక దుస్తులు ధరించి దైవ దర్శనం చేసుకోవటం మహా పాపం. మనిషిలో భక్తిభావనలు లేకపోతే ఎలా? మనవైపు మనుషులు గుళ్లకు ఎలా వస్తున్నారో చూస్తున్నాంగా. గుళ్లను కూడా విహారయాత్రా స్థలాలుగా మార్చేస్తే ఎలా? బహుశా కేరళ, తమిళనాడుల్లో గొప్ప గొప్ప దేవాలయాల్లో ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారులా ఉన్నారు. గుడికి వస్తే మనలో భక్తిభావనలు వెల్లివిరియాలి. అంతేకానీ వికారాలు పుట్టకూడదు. సరే, పదపద దర్శనానికి ఆలస్యమవుతుంది.” అంటూ గబగబా ముందుకెళ్లాడు మాధవరెడ్డి. కాళ్లకు పంచె అడ్డు తగులుతుంటే రాఘవ వేగంగా నడవలేక మెల్లగా నడుస్తూ మాధవరెడ్డిని అనుసరించాడు.

వాళ్లు అనుకున్నంతా అయ్యింది. దర్శనం ఆలస్యం కాసాగింది. ఆ రోజు వచ్చిన భక్తులు తక్కువమందే అయినా వెంటనే వాళ్లకు స్వామి దర్శనం కాలేదు. అందుకు కారణం ఏమిటో తెలియటం లేదు.

ఆ తర్వాత విషయం మెల్లగా బయటపడిరది. మహారాష్ట్ర మంత్రి స్వామి దర్శనానికి వచ్చారట. సంతోషం!

కానీ ఆలస్యానికి ఆయన మూర్ఖత్వమే కారణమట. ఆయన తన సెక్యూరిటీని వెంటబెట్టుకుని వచ్చాడట. వాళ్లందరూ దర్శనానికి వెళ్లాలని ఉబలాట పడ్డారు. కానీ వాళ్ల కోరిక నెరవేరలేదు. మంత్రితో సహా అందరినీ గుడి బయటే ఆపేశారట.

మంత్రి కాదు.. వాళ్ల బాబైనా సరే, ప్యాంటూ షర్టూ తీసేసి సంప్రదాయం ప్రకారం దర్శనానికి వెళ్లవలసిందేనని, ఎవరికీ మినహాయింపులు ఉండవనీ, దేవుని ముందు అందరూ సమానమేననీ, సంప్రదాయం సంప్రదాయమేనని దేవస్థానం వాళ్లు నొక్కి వక్కాణించటంతో మరో గత్యంతరం లేక తన బట్టలు మార్చుకుని పంచెను మాత్రమే ధరించి, సెక్యూరిటీని బయటే ఉండమని చెప్పి, మంత్రి మాత్రం ఒంటరిగా దర్శనానికి వచ్చారట.

తిరువనంతపురం దేవస్థానం వాళ్లు అలా కఠినంగా తమ నిర్ణయాలను పాటించటం మాధవరెడ్డికి ఎంతో ముచ్చటను కలిగించింది. రాఘవ కూడా వాళ్లను మెచ్చుకోకుండా ఉండలేకపొయ్యాడు. కొంతసేపటికి క్యూ లైను మెల్లగా కదిలింది.

అసహనాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ముందుకు కదిలారు మాధవరెడ్డీ, రాఘవలిద్దరూ. స్వామి సన్నిధికి చేరుకున్నారు.

స్వామివారిని మూడు గవాక్షాల ద్వారా దర్శించుకోవాలి. మొదటి గవాక్షం నుండి చూస్తుంటే.. విష్ణుమూర్తి శేషపాన్పుమీద కళ్లెదుటే పవళించినట్టున్నాడు. ఆదిశేషుడి పడగ నీడలో సేద దీరుతున్న ఆ దివ్యరూపం రమణీయం, కమనీయం. బంగారు కిరీటధారియై నిమీలిత నేత్రాలతో కనిపిస్తున్న స్వామి రూపం కనులారా దర్శించుకున్నారు. కుడిచేయి చాపిన ఆ వైనం ఎంత వయ్యారంగా హొయలు పోతున్నదో?! స్వామివారి ముఖారవిందాన్ని ఆయన వామహస్తం లోని విరిసిన నిజారవిందం పరికిస్తున్న తీరు అమోఘం.

ఇక రెండవ గవాక్షం ద్వారా నాభి నుండి విరిసిన కెందామరలో కూర్చున్న విధాత రూపం ఆసాంతం మనోహరం. చివరి గవాక్షంలో కాళ్లు చాపి పడుకున్న స్వామి వామపాదం కాస్త పైకి మడిచి కుడి పాదంపై ఆనినట్టున్న ఆ రెండూ బ్రహ్మ కడిగిన పాదాలే కదా తాము చూస్తున్నదీ అన్న విస్మయంలో కళ్లార్పడమే మరిచిపోయారిద్దరూ. పెనవేసుకున్న ఆదిశేషునిపై వాల్చిన స్వామి మేనును ఎంత చూసినా తనివి తీరటం లేదు.

స్వామి సంపూర్ణ దర్శనంతో తమ జన్మ ధన్యమైనట్టుగా భావిస్తూ గుడి బయటికి నడిచారిద్దరూ.

15. మాటలు లేని మౌనం

పద్మనాభస్వామి దర్శనం చేసుకుని ఇద్దరూ నేరుగా రైల్వేస్టేషన్‌ చేరుకున్నారు.

తర్వాతి రైలుకు టికెట్లు తీసుకుని రైలెక్కారు. మాధవరెడ్డి వరంగల్‌కు, రాఘవ కాట్పాడికి తీసుకున్నారు. సీట్లు దొరక్కపోయినా ఎలాగో లగేజీ బెర్తుమీద సర్దుకుని కూర్చున్నారు.

ఇద్దరూ మాట్లాడుకుంటూ కాలం గడిపారు. మాటల మధ్యలో రాఘవ మళ్లీ తన ఉద్యోగ ప్రసక్తి తీసకొచ్చాడు.

తాను తప్పక సహాయపడగలనని రాఘవకు హామీ ఇచ్చాడు మాధవరెడ్డి. దాంతో అతనిలో ఆశ బలపడి ఓ నమ్మకమేర్పడింది.

ఎన్నో గంటలు గడిచిపోయాయి.. రైలు పరుగెడుతూనే ఉంది..

..తర్వాతి స్టేషన్లోనే రాఘవ దిగాలి.

తన లగేజీనంతా సర్దుకుని మాధవరెడ్డి వైపు చూశాడు.

“బాబాయ్‌, నా విషయం మర్చిపోరు కదూ?!” అంటూ చివరిసారిగా మరోసారి గుర్తుచేశాడు.

మాధవరెడ్డి చిన్నగా నవ్వుతూ.. “లేదు, మరిచిపోను రాఘవా. రేపు మా బావగారి ఊరు ‘తామరగుంట’కు వెళ్లి నీ ఉద్యోగ విషయం మాట్లాడుతాను. కచ్చితంగా నీకు ఉద్యోగం ఇవ్వమనే అడుగుతాను. ఆయనే ఆ పాఠశాలకు కార్యదర్శి కనుక, తప్పక ఇస్తాడనే నమ్ముతున్నాను. ఆయన మాటివ్వగానే వెంటనే నీకు నేను ఉత్తరం రాస్తాను. సరేనా?” అని అభయమిస్తున్నట్టుగా అన్నాడు.

రైలు మెల్లగా కాట్పాడి స్టేషన్లో ఆగింది. రైలు దిగి కిటికీ దగ్గరికెళ్లి మాధవరెడ్డిని చూస్తూ చేతిని ఊపాడు రాఘవ.

ఎందుకో అప్రయత్నంగా రాఘవ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతని సున్నితమైన మనసును అర్థం చేసుకున్న మాధవరెడ్డి రాఘవ చేతిమీద చెయ్యేసి మృదువుగా నొక్కాడు. ఆ చర్య రాఘవకు ఎంతో ఓదార్పును కలిగించింది.

రైలు మళ్లీ బయలుదేరింది. పెదాలపై చిరునవ్వును తెచ్చుకుని ఆయనకేసి చూస్తూ చేతిని ఊపాడు రాఘవ.  ఆయనా చేతిని ఊపాడు.

రైలు మెల్లగా కదిలి వెళ్లిపోయింది. కొంతసేపటికల్లా స్టేషను ఖాళీ అయిపొయ్యింది. ఒక బెంచీమీద మౌనంగా కూర్చున్న రాఘవ.. అలాగే చాలాసేపు ఉండిపొయ్యాడు.

‘తను ఇప్పుడేం చెయ్యాలి? ఎక్కడికెళ్లాలి? మళ్లీ తన సొంత ఊరికే వెళ్లాలా? అలా వెళ్లటం ఎంత అవమానకరం? తాను ఇల్లొదిలిపెట్టి వెళ్లిపోతున్నానని ఉత్తరం రాసి పెట్టి, తాను ప్రయోజకుణ్ణి అయ్యాకనే తిరిగొస్తానని చెప్పి, ఇప్పుడు నెల తిరక్కుండానే ఇలా ఇంటికెళితే ఇంట్లోవాళ్లు నవ్వుకోరూ? ఇంతేనా ఇతని పట్టుదల అని తెలిసినవాళ్లు ఎగతాళి చెయ్యరూ?

ఛ! తనది ఎంత దయనీయ, నిస్సహాయ పరిస్థితి? ఇంటికెళ్లకుండా ఇంకెక్కడికైనా వెళితే?.. ఎక్కడికెళ్లాలి, ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి? అంతా అగమ్యగోచరం. ఏమీ అర్థంకాని పరిస్థితి.

దారం తెగిన గాలిపటంలా తను ఎటు పడితే అటు వెళ్లటం ఎంతవరకూ సమంజసం?

అలాకాక అవమానాన్ని దిగమింగుకొని కొన్నాళ్లు ఎలాగో ఒకలా గడపగలిగితే?.. కన్యాకుమారి నుండైనా ఉత్తరం రావొచ్చు, లేదూ బాబాయ్‌ దగ్గర నుండైనా ఉత్తరం రావొచ్చు.

ఎక్కణ్ణుండి మొదట ఉత్తరం వచ్చినా తను అక్కడికి వెంటనే వెళ్లిపోవటం జరుగుతుంది. ఆగిపోవటమన్నది జరగదు. కానీ.. బాబాయ్‌ దగ్గర్నుండి ఉత్తరం వస్తేనే మంచిది, ఎందుకంటే తాను తన సొంత రాష్ట్రంలోనే ఉండొచ్చు. పైగా బాబాయ్‌లాంటి ఒక మంచిమనిషి ఆదరణా దొరుకుతుంది. పరాయి ప్రాంతాలకు వెళ్లాల్సిన పని ఉండదు.’

..ఇలాగంతా ఆలోచించి తన సొంత ఊరికి వెళ్లటానికే నిర్ణయించుకుని చిత్తూరుకు రైలు టిక్కెట్టును కొనుకున్నాడు రాఘవ. రైల్లో ఒక స్థిర నిర్ణయానికొచ్చాడు.

ఎవరైనా తెలిసినవాళ్లు తనను ఎగతాళి చేసినా, ఎద్దేవా చేసినా, అవమానకరంగా మాట్లాడినా వాళ్లను నాలుగు జాడించి వదలటం, దుమ్ము దులపటమే జరుగుతుంది! ఈ విషయంలో తాను ఇక ఎవరినీ సహించి, ఉపేక్షించడమంటూ ఉండదు, తన జోలికి ఎవరొచ్చినా వాళ్ల కత ఇక అంతే!.. అని మొండిగా నిర్ణయించుకుని చిత్తూరులో రైలు దిగాడు.

రిక్షా మాట్లాడుకుని వీధి మొదట్లోనే దిగాడు. సూట్‌కేస్‌ చేత బట్టుకుని, వడివడిగా అడుగులు వేస్తూ ఇంట్లోకి దారితీశాడు.

ఆ సమయంలో అతని తల్లి వంటగదిలో ఏదో పనిలో ఉంది. తండ్రి ఈజీచెయిర్లో పడుకుని కునుకు తీస్తున్నట్టున్నాడు. తమ్ముడు కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లినట్టున్నాడు.

హాల్లోకి వెళ్లి సూట్‌కేస్‌ను గోడవారగా పెట్టాడు. ఆ అలికిడికి శంకరయ్య కళ్లు తెరిచి కొడుకును చూశాడు.

ఇరవైఐదు రోజుల తర్వాత కొడుకును చూడగానే ఆయన గుండెల్లో ఏదో తెలీని అలజడి రేగింది. కానీ ఆ వెంటనే ఎంతో మనశ్శాంతిగానూ అనిపంచింది. కళ్ల కొలకుల్లో నుండి కన్నీటి బిందువులు జారి క్రిందపడ్డాయి.

దాన్ని రాఘవ చూసే అవకాశమే లేదు. అతను విసురుగా పక్క గదిలోకెళ్లి తలుపు మూసుకుని గెడియ పెట్టుకున్నాడు.

ఆ శబ్దానికి వంటింట్లో ఉన్న రాఘవ తల్లి వనజమ్మ, “ఏమండీ..” అంటూ హాల్లోకొచ్చి భర్తను చూసి “గదిలోకెళ్లింది ఎవరండీ..” అని గట్టిగా తన మాటల్ని పూర్తిచెయ్యక మునుపే శంకరయ్య తన పెదాలపై వేలిని ఉంచి పెద్దకొడుకు వచ్చాడన్నట్టుగా సైగ చేశాడు.

దాంతో ఆమె మరేమీ మాట్లాడకుండా వంటగదిలోకెళ్లి తన పనిలో మునిగిపోయింది. గదిలోకెళ్లిన రాఘవ మళ్లీ గది తలుపును తెరవ లేదు. వాళ్లూ అతణ్ణి పిలవలేదు. మధ్యాహ్నం భోజన సమయానికి తల్లి గది దగ్గరికెళ్లి రాఘవను భోజనానికి రమ్మని పిలిచింది. లోపల నుండి ఏ శబ్దమూ రాకపోయేసరికి ఆమె మళ్లీ పిలిచే సాహసం చెయ్యలేదు.

శంకరయ్య మాత్రం కొడుకు తిరిగొచ్చాడన్న ఆనందంతో ఆ పూట తృప్తిగా భోజనం చేశాడు. భోజనానంతరం భార్యాభర్తలిద్దరూ హాల్లో కూర్చుని ఏవేవో గుసగుసలాడుకోసాగారు.

రాఘవ తానుగా మాట్లాడేంతవరకూ అతణ్ణి ఏమీ ప్రశ్నించవద్దనీ, ఏవేవో ప్రశ్నలడిగి విసిగించవద్దనీ, ఇంట్లో ఒకరితో ఒకరు గట్టిగట్టిగా మాట్లాడటం లాంటివి చెయ్యవద్దనీ, అతను ఏమైనా కావాలని అడిగితే వెంటనే దాన్ని అందివ్వమనీ, ఆలస్యం చెయ్యవద్దనీ.. ఇలా ఏవేవో హెచ్చరికలు జారీచేశాడు శంకరయ్య. అన్నిటికీ తలూపింది వనజమ్మ.

ఇంతలో.. కోచింగ్‌కు వెళ్లిన రాఘవ తమ్ముడు చిన్నా (మురళి) భోజనానికి ఇంటికొచ్చాడు.

రాఘవ వచ్చినట్టు అతనికి గుసగుసగా విషయం చెప్పి అతణ్ణి ప్రస్తుతం ఏమీ పలకరించవద్దనీ, రాత్రికి పలకరించమని సూచించాడు తండ్రి. అలాగే అన్నట్టు తలూపి భోజనం చేసి మళ్లీ కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లిపోయాడు.

మధ్నాహ్నం మూడు గంటల సమయంలో.. పక్క గది తలుపు తీస్తున్న శబ్దం వినబడగానే ఈజీచెయిర్లో పడుకుని ఉన్న శంకరయ్య ఠక్కున కళ్లు తెరిచి చూశాడు.

నేలమీద పడుకోనున్న వనజమ్మ లేచి కూర్చుని భర్తకేసి చూసింది. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్న ఆ దంపతులు ఏమీ మాట్లాడకుండా మౌనం వహించారు.

రాఘవ గదిలో నుండి బయటికొచ్చి నేరుగా పెరట్లోకెళ్లి ముఖం కడుక్కొచ్చాడు. శంకరయ్య భార్యకేసి చూస్తూ.. వెళ్లి కొడుక్కు అన్నం పెట్టమన్నట్టుగా సైగచేశాడు.

“అన్నం పెట్టనా రాఘవా..” అంటూ కొడుకును అడిగింది వనజమ్మ.

“అఖ్ఖర్లేదు, నేనే పెట్టుకుని తింటాను.” అని విసురుగా వంటింట్లోకెళ్లి తనే కంచంలో వడ్డించుకున్నాడు రాఘవ. చూస్తూ మౌనం వహించింది వనజమ్మ.

భోజనంచేసి మళ్లీ తన గదిలోకెళ్లిపోయాడు రాఘవ. ఆ రోజంతా అతను గదిలోనుండి మళ్లీ బయటికి రాలేదు. ఎవరూ అతణ్ణి పలకరించనూలేదు. మౌనంగా ఉండిపోయారందరూ.

మరుసటిరోజు ఉదయం రాఘవ స్నానంచేసి తనే వడ్డించుకుని టిఫిన్‌ తింటున్న సమయంలో మురళి, రాఘవను పలకరించాడు. ముక్తసరిగా జవాబిచ్చాడు రాఘవ.

పరిస్థితిని అర్థం చేసుకుని మరేమీ ప్రశ్నించకుండా ఉండిపోయాడు మురళి. గబగబ టిఫిన్‌ తిని బయటికెళ్లిపోయాడు రాఘవ. అలా వెళ్లినవాడు మళ్లీ మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటికి తిరిగొచ్చాడు.

అప్పుడూ అతణ్ణి ఎవరూ ఏమీ ప్రశ్నించలేదు. అతనూ ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. వంటింట్లోకెళ్లి భోజనం చేసి మళ్లీ గదిలోకెళ్లి తలుపు గెడియ పెట్టుకున్నాడు.

ఆ సాయంత్రం హాల్లో శంకరయ్య భాగవతం చదువుతుంటే రాఘవ హాల్లోకొచ్చాడు. కొడుకు రావటాన్ని గమనించి, తన గొంతును తగ్గించి చదవసాగాడు శంకరయ్య.

రాఘవ నేలమీద కూర్చుని సూట్‌కేస్‌ను తెరిచి మురికి బట్టలన్నీ తీసి పక్కనపెట్టాడు. డిగ్రీ సర్టిఫికెట్లను తీసి ఇంకో పక్కగా పెట్టాడు. ఖాళీ అయిన సూట్‌కేసును తీసుకెళ్లి శుభ్రంగా బయట విదిలించి వచ్చాడు. కన్యాకుమారిలో తను కొన్న శంఖం గవ్వల తోరణాన్ని తీసి గుమ్మానికి కట్టే ప్రయత్నం చేశాడు.

“అరె భలే ఉందే. ఎంతకు కొన్నావురా దాన్ని?..” అంటూ కొడుకును ప్రశ్నించాడు శంకరయ్య. ఆయన మాటలకు వంటగదిలో నుండి బయటికొచ్చింది వనజమ్మ. దాన్ని చేత్తో తాకి చూస్తూ మురిసిపోయింది. భలే అందంగా ఉందని మెచ్చుకుంది.

“యాభై రూపాయలు..” మెల్లగా బదులిచ్చాడు రాఘవ.

“అరే, భలే చీపే. ఎక్కడా?”

“కన్యాకుమారిలో..”

“ఔనా, ఇంకో రెండు తెచ్చుంటే నీ గదికీ, పూజగదికీ కూడా వ్రేలాడ దీశామంటే భలే ఉండేది.”

“ఔను, ఒక్కటే తెచ్చాను, ఇంకో రెండు తెచ్చి ఉండాల్సింది.”

“మరే!.. అయితే నువ్వు, కన్యాకుమారికి వెళ్లావన్నమాట! ఒరేయ్‌ రాఘవా, నువ్వు వెళ్లేముందు నాకొక్క మాట చెప్పుంటే.. నేనూ వచ్చి ఉండేవాణ్ణిగా! ఇదివరకెప్పుడూ నేను కన్యాకుమారిని చూడలేదు రా!” అనేసరికి చివుక్కున తల పైకెత్తిన రాఘవకు తండ్రి ముఖంలో నిజాయితీ, అమాయకత్వమూ కనిపించి పొంగుకొచ్చిన కోపం ఒక్కసారిగా నీరుగారి పొయ్యింది.

“ఏదీ అక్కడి విషయాలు చెప్పూ.. గాంధీ మంటపం, పార్వతి తపస్సు చేసిన దేవాలయం అన్నీ చూశావా?”

“నేను ఉద్యోగం నిమిత్తం కన్యాకుమారికి వెళ్లాను నాన్నా. వెళ్లినచోట యోగాసనాల మీద శిక్షణ కూడా ఇచ్చారు. ఇదిగో సర్టిఫికెట్‌.” అంటూ అక్కడి వాళ్లిచ్చిన సర్టిఫికెట్‌ను తండ్రి ముందుకు చాపాడు రాఘవ.

ఆయన ఆ సర్టిఫికెట్‌ను పరిశీలనగా చూస్తూ..

“ఓహో, వివేకానంద కేంద్రానికి వెళ్లావా? చాలా గొప్ప సంస్థరా అది! మరి అందులో ఉద్యోగం రావటం అంటే మాటలా. ఎంతో అదృష్టం ఉండాలి!” అన్నాడు సంతృప్తిగా.

“కానీ.. వాళ్లు ఏ విషయమూ చెప్పకనే అందరినీ వెనక్కు పంపించేశారు నాన్నా. సెలెక్ట్‌ అయినవాళ్లకు ఉత్తరం పంపుతామన్నారు. అపుడు వెళ్లి జాయిన్‌ అయితే సరిపోతుందట.”

“అలాగా, నీకు తప్పక వస్తుందిలే!” అన్నాడు ధీమాగా.

“నాన్నా, పోస్ట్‌మేన్‌ కనిపిస్తే చెప్పి ఉంచు. మనకు పోస్ట్‌ వస్తే జాగ్రత్తగా తెచ్చివ్వమను. రేపో ఎల్లుండో ఉత్తరం తెచ్చిచ్చినప్పుడు ఆయనకు ఓ పది రూపాయలు భక్షీస్‌ కూడా ఇవ్వు నాన్నా.”

“అలాగే లేరా, ఇస్తాలే..” అన్నాడు శంకరయ్య.

(ఇంకా ఉంది)

Exit mobile version