జీవితమొక పయనం-8

0
2

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[యోగా శిక్షణా సమావేశం ముగుస్తుంది. తాము నిర్వహించిన పరీక్షలో మెరిట్ సాధించిన వారికి సర్టిఫికెట్‍లను అందజేస్తాను నిర్వాహకులు. శిక్షణార్థులను కొంతమందిని మాట్లాడకంటారు. కొందరు ఉత్సాహంగా మాట్లాడుతారు. మాధవరెడ్డి మాట్లాడి ఈ యోగా శిబిరం తనకు జీవితంలో మరువలేని అనుభవాలు మిగిల్చిందని చెప్తాడు. అందరూ తిరుగుప్రయాణాలకి సిద్ధం అవుతారు. మాధవరెడ్డి వెంటే ఉంటూ తన ఉద్యోగం విషయం ఆయన మర్చిపోకుండా చేయాలని అనుకుంటాడు రాఘవ. ఆయన బట్టలు ఉతుక్కుంటుంటే వెళ్ళి మాటలు కలుపుతాడు. తాను తిరువనంతపురంలో, బ్రేక్ జర్నీ చేసి, స్వామివారి దర్శనం చేసుకుందామనై అనుకుంటునట్టు చెప్తాడు. తాను కూడా వస్తానని చెప్తాడు రాఘవ. తరువాత ఊళ్లోకెళ్లి గాంధీ మంటపం, పార్వతి తపస్సు చేసిన దేవాలయం మొదలైనచి చూసి, బజారులోకి వెళ్ళి రకరకాలైన గవ్వలు, శంఖాలు, ఆల్చిప్పలు, అద్దాలతో కూడిన గవ్వల తోరణాలు కొంటారు. బాబయి చేతిలో కొంత డబ్బు తక్కువైతే, తన దగ్గర ఉన్న  150/- రూపాయలిస్తాడు రాఘవ. రాత్రి రైలెక్కి, మర్నాడు ఉదయం తిరువనంతపురంలో దిగుతారు. ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. తమ జన్మ ధన్యమైనట్టుగా భావిస్తూ గుడి బయటికి వచ్చి, నేరుగా రైల్వే స్టేషన్‍కి చేరుకుంటారు. తర్వాత వచ్చే రైలుకి టికెట్లు తీసుకుని బండెక్కుతారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తారు. రాఘవ దిగాల్సిన కాట్పాడి స్టేషన్ వస్తుంది. తన ఉద్యోగం గురించి మర్చిపోవద్దని మరోసారి బాబాయ్‍ని కోరి, రైలు దిగుతాడు రాఘవ. ఇంటికి వెళ్ళాలా వద్దా అని సంశయిస్తాడు. చివరికి చిత్తూరు చేరి, ఇంటికి వెళ్తాడు. ఆ పూట, మర్నాడు మధ్యాహ్నం వరకూ ఎవరితోనూ మాట్లాడడు. రెండో రోజు తాను కన్యాకుమారి నుంచి తెచ్చిన గవ్వల తోరణాన్ని గుమ్మానికి కడుతూంటే తండ్రి పలకరిస్తాడు. అప్పుడు జరిగినదంతా చెప్తాడు రాఘవ. తనకి ఉత్తరాలు వస్తాయని, పోస్ట్‌మాన్‍ని జాగ్రత్తగా తెచ్చివ్వమనీ, ఓ పది రూపాయలు బక్షీస్ కూడా ఇవ్వమని తండ్రికి చెప్తాడు. – ఇక చదవండి.]

16. ఉత్తరం అందింది!

[dropcap]రా[/dropcap]ఘవ ఆతృతగా వారంరోజులు ఎదురుచూసినా ఎక్కడ నుండీ అతనికి ఉత్తరం రాలేదు.

దాంతో అతణ్ణి మళ్లీ నిరాశా నిస్పృహలు ఆవరించాయి. బాబాయ్‌ తన విషయం పూర్తిగా మరిచిపోయాడనుకుని నిట్టూర్చాడు.

‘నిజమేలే, ఈ రోజుల్లో పక్కవాళ్ల గురించి పట్టించుకునేంత అక్కర ఎంతమందికుంటుందనీ? ఆయనకు నేను ఏమౌతాననీ? బాబాయ్‌ అని బంధుత్వాన్ని కలుపుకుని పిలిచినంత మాత్రాన సొంతమై పోతారా ఏంటీ? ఆ సమయానికి తనకు హామీ ఇచ్చాడు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఏంటో? బహుశా వాళ్ల బావగారు ఉద్యోగం లేదనేసరికి ఆ విషయం పనిగట్టుకుని మరీ రాయాలా అనుకున్నాడో, ఏమో? తన అదృష్టం అలా ఉంటే ఎవరిని తప్పుబట్టి ఏం ప్రయోజనం?’ అని పూర్తిగా ఆ విషయాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నించాడు.

రోజులు మళ్లీ మునుపటిలా భారంగా గడవసాగాయి. ఇల్లు, లైబ్రరీ, క్లబ్‌.. ఇవే రాఘవకు ప్రస్తుత కాలక్షేపాలయ్యాయి.

ఒకరోజు రాఘవ ఒంటి గంటకు లైబ్రరీ నుండి ఇంటికి తిరిగొచ్చాడు. బట్టలు మార్చుకుని లుంగీ కట్టుకుని ముఖం కడుకొచ్చాడు. అద్దం దగ్గరికెళ్లి దువ్వెన తీసుకుంటూ ఉంటే.. అక్కడ తన పేరుమీద ఒక ఎన్వలప్‌ కవరు కనిపించింది. ఎవరు రాశారా అని చూశాడు. బాబాయ్‌ పేరు కనిపించేసరికి ఆతృతగా దాన్ని చింపి లోపలున్న ఉత్తరాన్ని బయటికి తీసి చదవటం మొదలుపెట్టాడు.

హనుమకొండ,

05-06-92.

“చిరంజీవి రాఘవకు మీ బాబాయ్‌ ఆశీర్వదించి వ్రాయు ఉత్తరం.. ఇక్కడ నేను క్షేమం. అక్కడ నువ్వూ క్షేమమని తలుస్తాను. నీ దగ్గర నుండి తీసుకున్న రూ.150/- లు ప్రస్తుతము నీకు పంపటం లేదు. ఎందుకనగా నీవు ఇక్కడికి వచ్చుచున్నావు. నీవు వచ్చిన తర్వాత నీకు ఇవ్వవచ్చు కదా అనే ఆలోచనతో పంపటం లేదు. నీతో తెలిపినట్టుగా నిన్ననే మా గ్రామము వెళ్లి మా బావగారికి నీ వివరములు తెలిపినాను. ఆయన ప్రధానాచార్యులతో చర్చించి వారి ఆమోదమును తెలిపినారు. నీవు వెంటనే రాగలందులకు నన్ను వ్రాయమని తెలిపినారు. నీకు ఇక్కడ ఉండుటకు వసతి మరియు భోజనం ఏర్పాట్లు సమకూర్చుగలమని తెలిపినారు. అలాగే నెలకు 250/- రూపాయలు ఇవ్వటానికి కూడా అంగీకరించారు. అయితే దీనిని నీవు జీతంగా భావించకూడదు. నీ ఖర్చుల నిమిత్తం మాత్రమే ఈ మొత్తాన్ని ఇస్తున్నారని భావించాలి. ఇక్కడ కూడా సేవాభావముతోనే నీవు ఉద్యోగము చేయవలసి ఉంటుంది. అయితే కనీసము రాబోవు మార్చి, ఏప్రిల్‌ వరకు నీవు ఉద్యోగంలో ఉండవలసినదిగా కోరమని తెలిపినారు. ఆ తర్వాత నీ యొక్క ఉత్సాహముననుసరించి విద్యానికేతనం వాళ్లిచ్చే 30 రోజుల ఉపాధ్యాయ శిక్షణలో పాల్గొన్నచో రెగ్యులర్‌ ఉద్యోగము గురించి ఆలోచించగలమని తెలిపినారు. ఇక్కడున్న ఇతర అధ్యాపకులతో పాటుగా తెల్లపంచె మరియు తెల్ల లాల్చి పాఠశాల సమయమున వేసుకొనవలెను. మిగతా సమయములో ఇతర డ్రెస్సు వేసుకొనవచ్చును. బహుశా నీకు అభ్యంతరము ఉండదని తలంచుచున్నాను. ప్రస్తుతము నీ వద్ద పంచె లేకున్నచో నావద్ద నేను ఉపయోగించినవి వున్నవి. నీకు అభ్యంతరము లేకున్న వాటిని వాడవచ్చును. తెల్ల లాల్చీలు రెండు మాత్రము సమకూర్చుకొనగలవు. ఏదైనా ఇతర కారణముచేత రాలేకున్నచో వెంటనే తెలుపగలవు. నీకు పంపవలసిన రూపాయలు పంపగలను. మన యోగ శిక్షణ సమయమున నీవు నాపట్ల చూపిన ఆప్యాయత, చనువు నాకు చాలా ఆనందము కలిగించినది. ఈ ఉత్తరము ముట్టిన వెంటనే వీలుంటే, సమయము ఉంటే ఉత్తరము ద్వారా ఎప్పుడు వచ్చేది తెలిపినచో ఆ సమయమున ట్రైన్‌ వద్ద రిసీవ్‌ చేసికొనగలను. లేకున్నచో ఈ క్రింది విధముగా మా ఇంటికి చేరగలవు.

1) ఒకవేళ బస్సులో వరంగల్లు చేరినచో హన్మకొండ బస్టాండులో దిగవలెను. దిగి..

2) ఒకవేళ ట్రైన్‌లో వచ్చినచో ట్రైన్‌ దిగి..

వెంటనే బయలుదేరగలవని ఆశించుచూ ఆశీస్సులతో…”

ఇట్లు

మాధవరెడ్డి

ఉత్తరం ఏకబిగిన చదవటం పూర్తయ్యేసరికి రాఘవ కళ్లల్లో నుండి కన్నీళ్లు ధారగా జారి నేలమీద పడ్డాయి.

బాబాయ్‌ను తానెంత తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఉత్తరం రాసిన తేదీని చూశాడు.

ఎప్పుడో పదిరోజుల క్రితం రాసింది అది. చేరటానికి ఇన్ని రోజులు పట్టిందన్నమాట.

తాను ఎదురుచూసిన ఉత్తరం రానే వచ్చింది. బాబాయ్‌ నుండే ఉత్తరం రావాలని తాను కోరుకున్నాడు. అలాగే అక్కణ్ణిండే మొదట వచ్చింది. ఇక తాను కన్యాకుమారికి వెళ్లవలసిన పనిలేదు. వరంగల్‌కు వెళ్లాలి. వెంటనే బయలుదేరాలి. ఆలస్యం చెయ్యకూడదు.. కళ్లు తుడుచుకుని నాన్న ఎక్కడికెళ్లాడని తల్లిని అడిగాడు.

తన పాత మిత్రుణ్ణి కలుసుకోవటానికి తాను పనిచేసిన ఆఫీసుకు వెళ్లాడని తెలిపింది.

రాఘవ భోజనం కూడా చెయ్యకుండా తండ్రి రాకకోసం ఆతృతగా ఎదురుచూడసాగాడు.

17. పుత్ర వాత్సల్యం!

ఆలస్యంగా ఇంటికొచ్చిన తండ్రి చేతికి తనకొచ్చిన ఉత్తరం అందించి ఆయన స్పందన కోసం ఆతృతగా ఎదురుచూడసాగాడు రాఘవ. ఆయన నిదానంగా ఆ ఉత్తరంలోని విషయాలను చదివి అర్థం చేసుకున్నాడు.

“చాలా సంతోషంగా ఉంది రా! ఎప్పటికైనా నీకొక మంచి ఉద్యోగం వస్తుందనే నమ్మకం నాకుండేది. అది ఇప్పుడు నెరవేరింది. ఇంతకీ నువ్వేం నిర్ణయం తీసుకున్నావు?” అంటూ కొడుకు ముఖంలోకి తేరిపార చూసాడు.

“వరంగల్‌కు వెళతాను నాన్నా. వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్లీ నాకు మరో అవకాశం వస్తుందో రాదో తెలియదు. పైగా కన్యాకుమారి నుండి ఉత్తరం వచ్చి ఉంటే వెళ్లటానికి ఆలోచించాలి కానీ, వరంగల్‌కు వెళ్లటానికి ఆలోచించాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. ఈ ఉత్తరంలో నా భవిష్యత్తు పట్ల ఒక భరోసా కూడా కనిపిస్తోంది నాన్నా. అంతేకాదు నాకు వసతి, భోజనంతో పాటు ఎంతో కొంత డబ్బు కూడా నా ఖర్చులకోసం ఇస్తామంటున్నారు. కన్యాకుమారి వాళ్లు డబ్బు విషయమే ప్రకటనలో తెలపలేదు. ఇదొక లాభపడే విషయం. కాబట్టి నేను ఇంకో రెండుమూడు రోజుల్లో బయలుదేరుతాను నాన్నా. ఈలోపు రెండు తెల్ల లాల్చీలు కుట్టించుకోవాలి. అలాగే వరంగల్‌కు టిక్కెట్‌ రిజర్వ్‌ చెయ్యాలి, డబ్బుంటే ఇవ్వు నాన్నా.” అన్నాడు రాఘవ.

శంకరయ్య డబ్బివ్వగానే బజారుకు బయలుదేరి వెళ్లాడు.

అతను అటు వెళ్లగానే భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడ్డారు.

“వాడికి ఉద్యోగం రావటం సంతోషించే విషయమే. కానీ, ఇలా చాలీచాలని జీతం కోసం అంతంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉందంటారా?” అంటూ భర్తను అడిగింది వనజమ్మ.

దానికి సమాధానమేమీ చెప్పకుండా మౌనం వహించాడు శంకరయ్య.

“ఆ మాత్రం జీతంతో వాడికి ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోతుందా, ఏంటీ?” తన మాటల్ని కొనసాగించింది వనజమ్మ. దీనికీ ఏ సమాధానమూ చెప్పకుండా మిన్నకుండిపొయ్యాడు శంకరయ్య.

“ఇలా అన్నిటికీ బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉంటే ఎలాగండీ? ఎలాగో ఒకలా వాడి ప్రయాణాన్ని ఆపితేనేగా?!” కోపంతో అంది వనజమ్మ.

శంకరయ్య దీర్ఘంగా నిట్టూరుస్తూ.. “మౌనం కాదే, ఆలోచిస్తున్నాను. ఈ ముదిమి వయసులో వాడు మన దగ్గర లేకుండా ఎక్కడో దూరంగా ఉండటం నాకూ ఇష్టం లేదు. అందుకే, నాకొక ఆలోచన కలిగింది. వాడికొక పెళ్లి అంటూ చేస్తే బుద్ధిగా ఇక్కడే ఉంటాడేమోనని అనుకుంటున్నాను.”

“అదీ మంచిదే! కానీ, ఉద్యోగం లేదన్న ఒకే కారణంగా వాడిప్పటివరకూ దగ్గరి సంబంధాలన్నీ దూరం చేసుకున్నాడుగా?”

“ఔను, ఇప్పుడు వాడికి 35 ఏళ్లు కూడా దాటిపొయ్యేలా ఉన్నాయి. ఇక వాడికి తగ్గ అమ్మాయి దొరుకుతుందన్న ఆశ కూడా అడుగంటిపోతోంది. ఈ పరిస్థితుల్లో వాడిప్పుడు మననుండి దూరంగా వెళ్లిపోతే ఇక వాడికి పెళ్లంటూ అవుతుందా? అన్న బెంగ కూడా నాకు లేకపోలేదు.” అన్నాడాయన.

“ఔనండీ, నాకూ అదే భయంగా ఉంది. మీరే వాడికి ఎలాగో నచ్చచెప్పండి.” ప్రాధేయపడుతున్నట్టుగా అంది వనజమ్మ.

“చూద్దాం, నా ప్రయత్నం నేను చేస్తాను. తర్వాత వాడి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.” అంటూ నిట్టూర్చాడు ఆయన.

కొడుక్కు పెళ్లి కాదేమోనన్న నిరాశలో దుఃఖం పొంగుకొచ్చింది వనజమ్మకు. కారుతున్న కన్నీటిని పైటకొంగుతో తుడుచుకుంది.

రెండురోజుల తర్వాత రాఘవ టైలర్‌ కుట్టిచ్చిన లాల్చీలను ఇంటికి పట్టుకొచ్చాడు.

ఆ సమయంలో శంకరయ్య ఈజీచెయిర్లో పడుకుని ఏదో ఆలోచిస్తున్నాడు.

వనజమ్మ వసారాలో కూర్చుని విస్తరాకులు కుడుతోంది. రాఘవ ఇంట్లోకొచ్చి లాల్చీ తొడుక్కుని అద్దంలో తనను తాను చూసుకోసాగాడు. టైలర్‌ తను కోరుకున్నట్టుగా కుట్టినందుకు సంతోషించాడు. మళ్లీ దాన్ని విప్పదీసి మడిచి సూట్‌కేసులో పెట్టాడు.

“నాన్నా.. నాన్నా.. నీవి బాగున్నవి రెండు పంచెలుంటే ఇవ్వు నాన్నా.” అని తండ్రిని అడిగాడు.

పెట్టెలో మడిచిపెట్టిన పంచెల్లో నుండి నాలుగు పంచెల్ని తెచ్చి కొడుక్కు ఇచ్చి.. “ఇవి సరిపోతాయేమో చూడూ..” అన్నాడు శంకరయ్య.

“ఇన్నెందుకు నాన్నా, రెండు చాలవూ?..” అన్నాడు రాఘవ.

“మరీ రెండేం చాలుతాయిరా. నాలుగన్నా లేకపోతే ఎలా? అప్పటికప్పుడు కావాలంటే ఎవర్ని అడుగుతావు?”

“సరే, మూడు పట్టుకెళతాలే..” అని తనకు నచ్చిన మూడు పంచెలను తీసి సూట్‌కేసులో సర్దాడు.

“రాఘవా.. నువ్వు వరంగల్‌కు వెళ్లక తప్పదంటావా?” దీనంగా కొడుకు ముఖంలోకి చూస్తూ అడిగాడు శంకరయ్య.

“అదేంటి నాన్నా, అలా అడుగుతున్నావు? బెర్తు కూడా రిజర్వ్‌ చేసుకున్నాగా. ఇప్పుడెందుకిలా అడ్డుపుల్ల వేస్తున్నావు?”

“అడ్డుపుల్ల కాదురా. ఆలోచించే అడుగుతున్నాను. 250/- రూపాయల జీతానికి అంతదూరం వెళ్లాలా అని అడుగుతున్నాను. అంత జీతానికి ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకోవచ్చుగా..” కొడుకు ముఖంలోకి చూస్తూ అనునయంగా అన్నాడు శంకరయ్య.

“ఆ, చేశానుగా! హోటల్లో బిల్‌ రైటర్‌గా, టైల్స్‌ కంపెనీలో సేల్స్‌మేన్‌గా, చిట్‌ఫండ్‌ కంపెనీలో గుమాస్తాగా అన్ని పనులూ చేశానుగా. చాలు నాన్నా చాలు! అలాంటివి చేసి చేసి విసిగిపోయాను. పనెక్కువ, జీతం తక్కువ. కనీసం జాబ్‌ శాటిస్‌ఫాక్షన్‌ కూడా ఉండదు. ఏదో గౌరవప్రదమైన టీచరుగా వీళ్లు నాకొక మంచి అవకాశం ఇస్తామంటున్నారు. వీళ్లూ తక్కువ జీతమే కదా ఇస్తున్నారని మీరు అనవచ్చు. కానీ వాళ్లు నేను ఉండటానికి వసతీ, భోజన సదుపాయాలు వంటివి కూడా ఏర్పాటుచేస్తామంటున్నారు. వాటికంతా లెక్కేయండి, ఎంత అవుతుందో? పైగా పర్మనెంట్‌ అయ్యే అవకాశాలనూ కల్పిస్తామంటున్నారు. ఇంకేం కావాలి చెప్పండి నాన్నా.. అవన్నీ కాదు కానీ, నాన్నా, నాకు కొన్నాళ్లు ఇక్కడనుండి, ఈ వాతావరణం నుండి, ఈ ఊరు నుండి దూరంగా వెళ్లిపోయి, కొత్త ప్రదేశంలో కొన్నాళ్లుండి రావాలనిపిస్తోంది. అందుకే వెళుతున్నాను. దయచేసి నన్ను అడ్డుకోవద్దు నాన్నా, ప్లీజ్‌!” తండ్రికి నచ్చచెబుతున్నట్టుగా అన్నాడు రాఘవ.

కొడుకు అంత గట్టి నిర్ణయం తీసుకున్నాక తను ఇక ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదనీ, అది అతని నిర్ణయానికి విరుద్దంగా భావిస్తాడనీ, అది అతని ఉత్సాహాన్ని దెబ్బతీస్తుందనీ భావించి.. “అలాగే రాఘవా, నీ ఇష్టప్రకారమే కానివ్వు. సంతోషంగా వెళ్లి ఉద్యోగంలో చేరు.” అని నవ్వుతూ బదులిచ్చాడు శంకరయ్య.

తండ్రి మాటలతో రాఘవ ముఖంలో నవ్వు తొంగి చూసింది. “నాన్నా, రేపు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బయలుదేరితే సరిపోతుంది కదా?” అని అడిగాడు.

“తిరుపతిలో రైలు ఎన్నింటికి?” అడిగాడు శంకరయ్య. చెప్పాడు రాఘవ.

“ఓయబ్బో. సాయంత్రం ఎప్పుడో ట్రైను. నువ్వు మూడు గంటలకు ఇక్కణ్ణించి బయలుదేరినా సరిపోతుంది. అయినా ఒక అడుగు ముందుగా వెళ్లటమే మంచిదనుకో. నువ్వు అనుకున్నట్టే భోజనం చేశాకే బయలుదేరు.” అన్నాడు శంకరయ్య.

మరునాడు ఉదయం రాఘవ తాను వరంగల్‌ వెళుతున్న విషయాన్ని తన స్నేహితులకు చెప్పి వాళ్ల చిరునామాలన్నీ తీసుకున్నాడు. వాళ్లందరూ కూడా అతనికి శుభాకాంక్షలు తెలిపారు.

ఆ మధ్యాహ్నం భోజనం అయ్యాక ప్రయాణానికి సిద్దమయ్యాడు రాఘవ.

శంకరయ్య తన భార్య చేతికి ఐదు వందలు డబ్బిచ్చి దాన్ని కొడుకు చేతికివ్వమని చెప్పాడు.

రాఘవ దానికంత ప్రాధాన్యం ఇవ్వకుండా డబ్బును తీసి జేబులో పెట్టుకున్నాడు.

“రాఘవా, వెళ్లిందే ఉత్తరం రాయి. అక్కడ జాగ్రత్త నాయినా. నువ్వు మళ్లీ ఎప్పుడొస్తావు?” దీనంగా అడిగింది వనజమ్మ.

“ఏముందమ్మా, మూడునెలలకు ఒకసారి సెలవులుంటాయి. దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులు. కానీ అమ్మా, ఈసారి వేసవిసెలవులకు నేనిక్కడికి రాలేకపోవచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయ శిక్షణ కోసం నేను హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉంటుంది.”

“సరే రాఘవా జాగ్రత్త! ఎన్ని పనులున్నా ఉత్తరాలు రాయటం మాత్రం మరిచిపోకేం.” మళ్లీ గుర్తుచేశాడు శంకరయ్య.

“అలాగే నాన్నా!” అన్న కొడుకుతోపాటు స్టేషన్‌కెళ్లి రైలెక్కించి వచ్చారు ఆ దంపతులు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here