[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]
[ఉత్తరం రాకపోయేసరికి నిరుత్సాహపడతాడు రాఘవ. ఉద్యోగం లేదేమో, అందుకే బాబాయ్ ఉత్తరం రాయలేదని అనుకుంటాడు. ఇల్లు, లైబ్రరీ, క్లబ్.. వీటితో కాలం గడుపుతాడు. ఇంతలో ఓ రోజు రాఘవకు బాబాయ్ నుంచి ఉత్తరం వస్తుంది. అక్కడి ఆవాస విద్యాలయంలో రాఘవకి ఉద్యోగం ఇవ్వడానికి ప్రధానాచార్యులు అంగీకరించారనీ, ఉత్తరం అందిన వెంటనే వరంగల్‍కి బయల్దేరి రమ్మని రాస్తాడు మాధవరెడ్డి. అక్కడ పాటించవలసిన నియమాలు, ధరించాల్సిన దుస్తుల గురించి వివరంగా రాసి, వరంగల్ వచ్చాకా తమ ఇంటికి ఎలా రావాలో కూడా తెలియజేస్తాడు. బయటకు వెళ్ళిన తండ్రి వచ్చాకా ఆయనకు ఆ ఉత్తరం చూపించి, వరంగల్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. అంత చిన్న ఉద్యోగానికి అంత దూరమెందుకు అని మొదట తల్లిదండ్రులు వద్దన్నా, రాఘవ మనసు గ్రహించి, పంపడానికి ఒప్పుకుంటారు. ట్రైన్ టికెట్స్ రిజర్వ్ చేయించుకుంటాడు రాఘవ. తెల్ల లాల్చీలు రెండు కుట్టించుకుంటాడు. తండ్రివి మూడు తెల్ల పంచలు తీసుకుంటాడు. బయల్దేరే రోజు వస్తుంది. బయల్దేరే రోజు ఉదయం స్నేహితులందరనీ కలిసి, వాళ్ళ అడ్రసులు తీసుకుంటాడు. వాళ్ళంతా అతనికి శుభకాంక్షలు చెప్తారు. వరంగల్‌కి వెళ్ళాల్సిన బండి తిరుపతికి వెళ్ళీ ఎక్కాలి. అందుకని మధ్యాహ్నం మూడు గంటలకే తల్లిదండ్రులతో కలిసి చిత్తూరు స్టేషన్‍కు వచ్చి తిరుపతికి రైలెక్కుతాడు రాఘవ. – ఇక చదవండి.]
18. విశాలమైన ఆవాస విద్యాలయం
[dropcap]వ[/dropcap]రంగల్‌లో రైలు దిగేసరికి ఉదయం తొమ్మిదిగంటలు పైగానే అయ్యింది. రైల్లో ఏమీ తినకపోవటం వల్ల రాఘవకు చాలా ఆకలిగా ఉంది. ఒకవైపు ప్రయాణపు బడలిక, మరొకవైపు ఆకలి.
సూట్‌కేస్‌ను పట్టుకుని స్టేషన్ బయటికొచ్చి ఎదురుగా కనిపించిన హోటల్‌కెళ్లి వేడివేడిగా రెండు ఇడ్లీలు తిన్నాడు. దాంతో అతనిలో నూతనోత్సాహం పుట్టుకొచ్చింది. చకచకా బిల్ కట్టేసి సూట్‌కేస్ తీసుకొని హోటల్ బయటికి నడిచాడు.
ఉత్తరంలో బాబాయ్ రాసిన చిరునామాను మరోసారి చదువుకుని సిటీబస్ ఎక్కి శంకర్‌నగర్ బస్టాపులో దిగాడు.
మెల్లగా నడుస్తూ ఇంటి నెంబరు సరిచూసుకుంటూ సరిగ్గా మరో పది నిమిషాలకంతా సరైన చిరునామాకు చేరుకున్నాడు.
ఇంటి బయట గేటు వేసి ఉంది. కాలింగ్ బెల్ నొక్కాడు. ఎవరో ఒక అమ్మాయి వచ్చి.. “ఎవరు కావాలి?” అని అడిగింది. “మాధవరెడ్డి గా..” అని అతను చెప్పటం పూర్తికాకుండానే “ఆ..ఆ.. ఇదే ఇదే!” అని చెప్పి లోపలికెళ్లిపోయింది.
“డాడీ, మీ కోసమే.. ఎవరో వచ్చారు.” అంటూ ఆ అమ్మాయి తన తండ్రికి చెబుతున్న మాటలు బయటికి వినిపించాయి.
లోపలికి వెళ్లాలా, వద్దా అన్న సంధిగ్దంలో గేటు బయటే ఆగిపోయాడు రాఘవ.
ఈలోపు మాధవరెడ్డి బయటికొచ్చి.. “ఓహ్, రాఘవా రా.. రా.. ఏంటి అక్కడే ఆగిపోయావు. లోపలికి రా..” అంటూ ఆయనే స్వయంగా వెళ్లి గేటు తీసి రాఘవను ఇంట్లోపలికి ఆహ్వానించాడు.
రాఘవ నవ్వుతూ గుమ్మం బయట చెప్పులు విడిచిపెట్టి సూట్‌కేస్‌తో సహా ఇంట్లోపలికి నడిచాడు.
“అయితే నిన్ననే బయలుదేరావన్నమాట. ఉత్తరం రాసుంటే స్టేషన్‌కొచ్చేవాణ్ణిగా.” అన్నాడు మాధవరెడ్డి.
“పర్లేదు బాబాయ్! నా దగ్గర మీ చిరునామా ఉందిగా. తెలుసుకొని రావటానికి ఇబ్బంది ఏముందనీ?” నవ్వుతూ అన్నాడు రాఘవ.
“అలా సోఫాలో కూర్చో. ముందు మంచినీళ్లు తాగు.” అంటూ తన కూతురికేసి చూశాడు. ఆ అమ్మాయి కూజాలో నుండి ఒక గ్లాసులో మంచినీళ్లు వొంపి రాఘవ చేతికిచ్చింది. తాగుతుంటే చల్లనినీళ్లు గొంతులోకి దిగుతూ ఎంతో హాయిగా అనిపించింది.
“ప్రయాణమంతా సాఫీగా సాగింది కదూ?” రాఘవను ప్రశించాడు మాధవరెడ్డి.
“ఆ.. ముందే టికెట్ రిజర్వు చేసుకున్నాగా బాబాయ్! ఇబ్బందేమీ కలగలేదు.”
“సరే ముందు వెళ్లి స్నానం చేసిరా. అలసటంతా ఎగిరిపోతుంది. తర్వాత భోజనంచేసి మనం తామరగుంటకు బయలుదేరుదాం. సరేనా?!” అన్నాడు మాధవరెడ్డి.
సూట్‌కేసును తెరిచి అందులో నుండి సబ్బు, తువ్వాలు, లుంగీ తీసుకున్నాడు. వాళ్లమ్మాయి స్నానాలగది ఎటో చూపించింది.
రాఘవ, పదే పది నిమిషాల్లో స్నానం పూర్తిచేసి, ఉతికిన బట్టలు ధరించి హాల్లోకొచ్చి కూర్చున్నాడు.
మాధవరెడ్డితో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఓ గంట తర్వాత మాధవరెడ్డి భార్య భోజనానికి రమ్మని ఆహ్వానించింది.
ఇద్దరూ భోజనం చెయ్యటం పూర్తిచేశాక, షెడ్‌లో ఉన్న బజాజ్ చేతక్ బండిని బయటికి తీసి స్టార్ట్ చేశాడు మాధవరెడ్డి.
రాఘవ తన సూట్‌కేస్‌ను ముందు భాగంలో పెట్టి, బ్యాగును భుజానికి తగిలించుకుని వెనక సీట్లో కూర్చున్నాడు.
“త్వరగా వచ్చేయండి.” మాధవరెడ్డి భార్య, భర్తను హెచ్చరించింది.
“రాఘవను వదిలిపెట్టి రావటమే, అక్కడ నాకింకేం పనుందీ..” అంటూ బండిని ముందుకు పోనిచ్చాడు మాధవరెడ్డి.
పది నిమిషాల తర్వాత బండి ములుగు రోడ్డుమీదికి మళ్లింది. అంతగా రద్దీలేని ఆ రోడ్డుమీద బండి మితమైన వేగంతో వెళ్లసాగింది.
రాఘవ అటుఇటు వేడక చూస్తూ, అక్కడివాళ్లను వింతగా పరిశీలిస్తూ, మౌనంగా కూర్చున్నాడు.
“రాఘవా.. మొత్తానికి నువ్వు మా కాకతీయ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టావయ్యా. అదృష్టవంతుడివి!”
“అవును బాబాయ్, ఆ అదృష్టాన్ని కల్పించింది మీరే. నా పట్ల ఇంత అభిమానాన్ని, ఆప్యాయతను కనబరచక పొయ్యుంటే ఇటువేపు నేను వచ్చే అవకాశమే లేదు బాబాయ్. ఇక్కడి చరిత్ర అంతా పుస్తకాల్లో చదువుకోవటమే!” మనస్ఫూర్తిగా అన్నాడు.
“చరిత్రలో శ్రీకృష్టదేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యమెంత గొప్పగా అనిపిస్తుందో, కాకతీయులు పరిపాలించిన ఈ కాకతీయ సామ్రాజ్యమూ అంతే గొప్పగా అనిపిస్తుంది నాకు! మా ఓరుగల్లు అన్నా, హనుమకొండ అన్నా, ఈ సువిశాలమైన ప్రాంతమన్నా నా గుండె గర్వంతో ఉప్పొంగుతుంది రాఘవా.” గొప్ప అనుభూతితో అన్నాడు మాధవరెడ్డి.
“సహజమే కదు బాబాయ్. తాను పుట్టిన గడ్డపై మమకారం ఉండని వ్యక్తులు ఎవరుంటారు చెప్పండీ?”
“కాకతి అన్న దేవతను కొలిచిన రాజులు కాకతీయులుగా ప్రసిద్ధి పొంది, ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు కాలంలో ఈ రాజ్యం ఎంతో సుభిక్షమైన పరిపాలనను అందుకుంది. ఇక రాణి రుద్రమ మగవాళ్లెవరికీ తీసిపోని విధంగా పరిపాలించిన మగువ. శత్రువులతో యుద్ధం చేసిన ధీర వనిత. అందుకే ఇక్కడి ఆడవాళ్లల్లో పౌరుషం కాస్త ఎక్కువే కనిపిస్తుంటుంది నాకు..” అంటూ చెప్పుకుపోతున్నాడు మాధవరెడ్డి. వింటూ ఊ కొడుతున్నాడు రాఘవ.
అర్ధగంట ప్రయాణం తర్వాత రోడ్డు పక్కన ఒక మట్టిరోడ్డు మీదికి బండిని తిప్పి ఒక చింతచెట్టు కింద బండిని ఆపాడు మాధవరెడ్డి.
“ఇక్కడ ఓ ఐదునిమిషాలు ఆగుదాం. లఘుశంక తీర్చుకుని మళ్లీ బయలుదేరుదాం.” అంటూ పక్కకెళ్లాడు మాధవరెడ్డి. విరబూసిన పొద్దు తిరుగుడు పువ్వులు సూర్యుణ్ణి కాక తననే చూస్తున్నట్టుగా భావించి పులకించిపోయాడు రాఘవ.
‘తాము వచ్చినంత దూరం ఎక్కడ చూసినా ఈ పంటే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ భూముల్లో ఇవి బాగానే పెరుగుతున్నాయి. వేరుసెనగ నూనె బదులు ఇక్కడివాళ్లు ఈ నూనెనే వంటల్లో కూడా వాడుతున్నారులా ఉన్నారు. అందుకే ఇందాక పిన్ని వడ్డించిన కూరలు అంత కమ్మగా ఉన్నాయి కాబోలు?’ అనుకున్నాడు రాఘవ.
చెట్టుచాటు నుండి వచ్చిన మాధవరెడ్డి.. “ఇక్కడ నేను ఆగటానికి ఇంకో కారణమూ ఉంది.” అంటూ ఆయన కాస్త ముందుకెళ్లి గొంతెత్తి.. “ఓ.. దేవిడూ.. దేవిడూ..” అని రెండుసార్లు గట్టిగా పిలిచాడు.
అది రాఘవకు ‘దేవుడూ’ అని పిలిచినట్టుగా అనిపించింది.
“అదేంటి బాబాయ్, దేవుడూ అని పిలుస్తున్నారు.” అన్నాడు అర్థంగాక.
రెండు నిమిషాలయ్యాక ఒక బక్కపల్చటి మనిషి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
అతని ఒంటిమీద చొక్కాలేదు, పంచె గోచీలా కట్టుకున్నాడు. తలకు పాగా చుట్టుకుని ఉన్నాడు.
దగ్గరికొచ్చి వంగి మాధవరెడ్డికి నమస్కారం చేస్తూ.. “దండాలు దొరా, మంచి ఎండనపడి అచ్చినట్టున్నరు, ఏమన్న కావల్న?” అని వినయంగా అడిగాడు.
“లేత కొబ్బరి కాయలు సూసి రొండు కొట్టక రాపో.. తాగనీకి..” అన్నాడు మాధవరెడ్డి.
“ఇందాక నువ్వు అన్నావే దేవుడని. అతనే మా దేవుడు. అతని పేరు డేవిడ్. డేవిడ్ అని స్పష్టంగా పిలిస్తే పలకడు. దేవిడూ అని పిలిస్తేనే పలుకుతాడు.” నవ్వుతూ అన్నాడు మాధవరెడ్డి.
“రాఘవా, మెయిన్‌రోడ్డు నుండి అదిగో దూరంగా అక్కడ కనిపిస్తోంది చూడూ ఆ కొబ్బరి తోట.. అక్కడిదాకా ఉన్నవి మన పొలాలే. అంతా ఒక వంద ఎకరాల దాకా ఉంటాయి. ఇటొక యాభై అరవై ఎకరాల్లో పొద్దు తిరుగుడు వేశాం. వెనకాల మొక్కజొన్నా, కొంత బంతిపూలూ వేశాం. అక్కడక్కడా కూరగాయలూ వేశాం. ఇంట్లో వంటకు వాడుతున్నవన్నీ ఇక్కడివే.” అని అంటూ ఉండగానే, దేవుడు అదే డేవిడ్.. “ఇగో దొరా.. గియ్యి తాగి సూడండ్రి తేనె లెక్కుంటాది.” అంటూ నాలుగు పెద్ద పెద్ద కొబ్బరి బోండాలతో ప్రత్యక్షమయ్యాడు.
అతను అప్పుడే తోట దగ్గరికెళ్లటం, చెట్టెక్కటం, కొబ్బరికాయలు తెంపుకు రావటం అంతా క్షణాలలో జరిగిపోయింది. అతణ్ణే ఆశ్చర్యంగా చూడసాగాడు రాఘవ.
అతను బోండాల్ని కత్తితో చెక్కి చెరొకటీ ఇచ్చాడు. స్ట్రా లేకుండా తాగటం రాఘవకు చాతకాలేదు. మాధవరెడ్డి చక్కగా బోండాన్ని నోటికి ఆనించి పైకెత్తి గుటగుటా తాగేశాడు.
రాఘవ కొంత మీద ఒలకబోసుకుని ఎలాగో తాగాడనిపించుకున్నాడు. చాలా తియ్యగా ఉన్నాయి నీళ్లు. తియ్యటి లేత కొబ్బరినీళ్లు కడుపులో పడేసరికి ఎండ వేడిమికి కాస్త ఉపశమించినట్టుగా అనిపించింది.
మరో నాలుగు కొబ్బరి బోండాల్ని కట్టిచ్చాడు డేవిడ్. దాన్ని ముందుభాగాన తగిలించుకుని మళ్లీ స్కూటర్‌ని స్టార్ట్ చేశాడు మాధవరెడ్డి.
మరో అర్ధగంట ప్రయాణించాక ప్రధాన రహదారి నుండి ఎడమవైపునున్న సింగిల్‌రోడ్డు మీదికి మళ్లింది చేతక్.
అక్కడక్కడా గతుకులతో ఉన్న మట్టిరోడ్డుమీద బండిని నడపటం కష్టంగా ఉంది మాధవరెడ్డికి. పైగా ఎదురుగా ఏదైనా జీపో, ఆటోనో, ఎడ్లబండో వస్తే ఆ సింగిల్‌రోడ్ మీద పక్కకు నడపటం మరింత కష్టంగా ఉంది.
“రాఘవా, నీకు బండి నడపటం వచ్చా?” అడిగాడు మాధవరెడ్డి.
“రాదు బాబాయ్, సైకిల్‌ను నడుపుతాను అంతే!” సిగ్గుపడుతూ చెప్పాడు రాఘవ.
“ఈ రోడ్డుకు ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియటం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా బావగారికి చెబుతూనే ఉన్నాను, రోడ్డును వెడల్పు చెయ్యమని. ఏదీ చేస్తేగా..” అంటూ నిట్టూర్చాడు.
ఎలాగో తంటాలు పడి బండి నడుపుతూ.. మరో అర్ధగంట తర్వాత రోడ్డుకు ఎడమవైపున వరుసగా పదీ పదిహేను ఇండ్లున్న చోట బండిని ఆపి ఆలోచనలో పడ్డాడు మాధవరెడ్డి.
“ఏంటి బాబాయ్, ఏమిటాలోచిస్తున్నారు? ఏదైనా సమస్యా?” అనుమానంగా అడిగాడు రాఘవ.
“అదేం లేదులే. ఈ హరిజనవాడ ఇండ్లమధ్య నుండి వెళితే మనం సరాసరి పాఠశాల దగ్గరకెళ్లిపోవచ్చు. కానీ నేను ఆ హెడ్మాస్టరుతో ఇప్పటిదాకా ప్రత్యక్షంగా మాట్లాడలేదు. నాకు ఆయన కొత్త. సరే, ఒక పని చేద్దాం. ఇటు ఊళ్లోనుండి నేరుగా మా బావ గారింటికి వెళదాం. నువ్వు వాళ్లిల్లు చూసినట్టూ ఉంటుంది. అట్టే మా బావగారితో మాట్లాడి ఆయన్నూ వెంటబెట్టుకుని పాఠశాలకు వెళదాం. సరేనా!” అంటూ బండిని మళ్లీ రోడ్డుమీదికి మళ్లించి ఊళ్లోకి పోనిచ్చాడు మాధవరెడ్డి.
వెళుతున్న దారిలో రహదారికి ఎడమపక్కగా ‘తామరగుంట’ అన్న ఊరి పేరున్న బోర్డు బాగా దుమ్ముపట్టి కనిపించింది.
ఐదు నిమిషాల్లో ఒక ఇంటి ముందుకెళ్లి బండిని ఆపాడు మాధవరెడ్డి. బండికి తగిలించి ఉన్న కొబ్బరి బోండాలను చేతిలోకి తీసుకుని, “రా రాఘవా, స్కూట్‌కేస్ ఇక్కడే ఉండనీ. ఐదు నిమిషాల్లో బావగారికి నీ విషయం చెప్పి బయలుదేరేద్దాం. లోపలికి రా!” అంటూ ఇంట్లోపలికి దారితీశాడు మాధవరెడ్డి.
“రా అన్న.. గిప్పుడేనా రావటం? బండి సద్దు ఇనబడగానే ఎవలబ్బా అచ్చిందీ అనుకుంటి.. బాగున్నవా, వొదినె, బిడ్డా బాగున్నరా” అంటూ ఒక లావుపాటి స్త్రీ మాధవరెడ్డిని ఆప్యాయంగా పలకరించి ఇంట్లోపలికి తీసుకెళ్లింది.
“అందరూ బాగానే ఉన్నారు!” అంటున్న మాధవరెడ్డి వెనకే రాఘవ కూడా ఇంట్లోపలికి నడిచాడు.
“బావా.. ఇదేనా రావటం?” అంటూ రమణారెడ్డి కుర్చీలో కూర్చున్నట్టుగానే మాధవరెడ్డిని పలకరించాడు.
“ఆ.. మీరందరూ బాగున్నారా బావా?” అంటూ పలకరించి కొబ్బరిబోండాల్ని గోడవారగా పెట్టాడు మాధవరెడ్డి.
“అన్న, సల్లంగ తాగనీకి గింత నిమ్మరసం పిండియ్యనా?!” అంటూ అడిగింది ఆమె.
“నిమ్మరసం వద్దుకానీ, కాస్త మజ్జిగ ఉంటే ఇవ్వు.” అని తన చెల్లెలికి చెప్పి రమణారెడ్డి వైపుకు తిరిగి.. “నేను చెప్పానుగా బావా, మన ఆవాస విద్యాలయంలో టీచరుగా ఒక కుర్రాడికి ఉద్యోగం కావాలని, అది ఇతనికే!” అంటూ రాఘవను చూపించాడు.
రాఘవ ఆయనకు చేతులు జోడించి వినయంగా నమస్కరించాడు.
“మంచిది, అలా కూర్చో బాబూ! ఏం చదువుకున్నావు?” అని ప్రశ్నించాడాయన.
“బి.కాం డిగ్రీ అండి!” చెప్పాడు రాఘవ.
“నేను ప్రధానాచార్యులతో మాట్లాడాను. ఆయనా సరేనన్నారు. ఇతణ్ణి తీసుకుని అక్కడికే వెళ్లలేకపోయారా?”
“ఇతనికి మనిల్లు తెలిస్తే మంచిదని తీసుకొచ్చాను. పైగా ఆ హెడ్మాస్టరు నాకు కొత్త. మీరొచ్చి చెబితే సరిపోతుంది.”
ఈలోపు మాధవరెడ్డి చెల్లెలు రెండు పెద్దగ్లాసుల నిండుగా చిక్కటి మజ్జిగ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది.
ఒద్దికగా కూర్చుని మజ్జిగ తాగుతున్న రాఘవను చూసి ముచ్చటేసి, “ఏ ఊరు బాబూ మంది?” అని అడిగింది.
“చిత్తూరండీ.”
“మనం తిరపతి వెళతాంగా. ఆ ఊరున్న జిల్లానే..” చెప్పాడు మాధవరెడ్డి.
“అబ్బో, చానా దూరమేనే.. కొలువు సెయ్యనీకి గింత దూరం అచ్చినావా?” అని అతణ్ణి ఆశ్చర్యంగా అడిగింది.
“అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం గానీ, ముందు బడికాడికెళదాం పద బావా!” అంటూ పైకి లేచాడు రమణారెడ్డి.
వాళ్లింట్లో ఉన్న బండిని బయటికి తీసి ముందు ఆయన బయలుదేరితే, ఆ వెనకే మాధవరెడ్డి రాఘవను కూర్చోబెట్టుకుని అనుసరించాడు.
దగ్గరి దారి గుండా పాఠశాలను సమీపిస్తుంటే.. ఆ పరిసరాలను వింతగా చూడసాగాడు రాఘవ.
సుమారుగా పాతికెకరాల స్థలంలో కట్టినట్టున్నారు పాఠశాలను. పాఠశాలను హరిజనవాడకు అభిముఖంగా నిర్మించారు. ఊళ్లోకెళ్లే రోడ్డు నుండి హరిజనవాడ మీదుగా పాఠశాల వరకూ చక్కటి రహదారి వేశారు. దాన్ని పాఠశాల చివరివరకూ కొనసాగించారు.
రహదారికిరువైపులా పెద్దపెద్ద నీలగిరి చెట్లు పెరిగి రహదారిని పూర్తిగా నీడతో కప్పేశాయి. దూరం నుండి చూస్తే చెట్ల వెనుక పాఠశాల దోబూచులాడుతున్నట్టుగా ఉంటుంది. ఒక వైపున మాత్రం చెట్టు చెట్టుకూ మధ్యన కరెంటు స్తంభాలు నాటి ట్యూబులైట్లు అమర్చారు.
‘అబ్బ ఎంత బాగుంది ఈ పాఠశాల? పాఠశాల ముందుభాగాన ఎంత పెద్ద ఆటస్థలం ఉంది. యూ ఆకారంలో నిర్మించబడి ఉన్న ఈ ఆవాస విద్యాలయం లాంటి విద్యాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. రేపటి నుండి తానిక్కడ ఉద్యోగం చెయ్యబోతున్నాడు. ఈ విద్యాలయం ఇక తనకూ సొంతమే.’ ఇలాగంతా ఆలోచిస్తూ వింతగా ఆ పరిసరాలనే గమనిస్తూ వస్తున్నాడు రాఘవ.
అప్పుడు మధ్యాహ్న భోజనం సమయం అయినట్టుంది. పిల్లలు భోజనశాలలో వరుసగా కూర్చుని భోజనం చేస్తున్నారు.
చూస్తూ ఉండగానే రెండు బండ్లూ పాఠశాల ఈ చివరి భాగం నుండి కార్యాలయం ముందుకు చేరుకుని అక్కడ ఆగాయి. రాఘవ కిందికి దిగి ముందరున్న సూట్‌కేసును అందుకున్నాడు. ముందుగా రమణారెడ్డిగారు, ఆయన వెనక మాధవరెడ్డి, చివరగా రాఘవ హెడ్మాస్టరు గదిలోకి దారితీశారు.
గదిలోకి అడుగుపెడుతున్న బావా బామ్మర్థులను చూసి తన సీటునుండి లేచి నిలబడి, రెండు చేతులూ జోడించి నమస్కరించాడు పాఠశాల హెడ్మాస్టరు. వాళ్లిద్దరూ కూడా ఆయనకు ప్రతి నమస్కారం చేశారు.
అక్కడున్న కుర్చీలలో అందరూ కూర్చున్నాక, రాఘవ మాత్రం నిలబడే ఉన్నాడు. హెడ్మాస్టరు అతణ్ణి చూస్తూ “మీరూ కూర్చోండి.” అన్నాడు. “పర్వాలేదు లెండి.” అని నిలబడే ఉన్నాడు రాఘవ.
మాధవరెడ్డి కల్పించుకుని, “పర్వాలేదు కూర్చో రాఘవా!” అన్నాక మరేమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు.
రమణారెడ్డి నవ్వుతూ.. “నేను గతవారం మీతో చెప్పానుగా. మా బావగారి స్నేహితుడొకరికి, ఇక్కడ ఆచార్యుడిగా ఉద్యోగం కావాలని. ఇతనికే!” అనగానే రాఘవ లేచి నిలబడి హెడ్మాస్టరుకు నమస్కరించాడు.
ఆయన తలూపి కూర్చోమన్నట్టుగా నవ్వుతూ చెయ్యి ఊపాడు. రాఘవ మళ్లీ కూర్చున్నాడు. ‘ఇక్కడ టీచర్‌ను ఆచార్యులు అంటార’ని అర్థమైంది రాఘవకు.
“ఇవ్వాళ ఉదయమే ఊర్నుండి వచ్చాడట. బావ వెంటబెట్టుకొచ్చాడు. ఇక్కడ వదిలి వెళదామని వచ్చాను.”
“మంచి యువకుడండీ. ఆధునిక భావాలున్న వ్యక్తి. గొప్ప ఆలోచనాపరుడు. పురాణాల పట్ల చక్కటి అవగాహన ఉన్న యువకుడు.” ఇంతకన్నా ఎక్కువ చెప్పినా బావుండదని మౌనం వహించాడు మాధవరెడ్డి.
“అయితే మన సంస్థకు తగిన వ్యక్తి అని చెప్పండి. ఇంకేం, చక్కగా ముందుకు దూసుకెళ్లిపోతాడు.” అన్నారు ప్రధానాచార్యులు (హెడ్మాస్టరు).
“మరే, మీ ఆధ్వర్యంలో మన పాఠశాలకు ఉపయోగపడే విధంగా ఇతణ్ణి మలుచుకోండి. ఇకనుండి ఇతను మీ వ్యక్తి. ఇతని మంచీ చెడ్డలన్నీ మీకే వదిలిపెడుతున్నాను.” అన్నాడు రమణారెడ్డి.
“అయ్యో, ఎంతమాట! అలాగే. చాలా సంతోషం. ఇప్పటినుండి ఇతను మా ఆచార్యుడు. మాలో ఒకరు. సరేనా!” అని హామీ ఇచ్చారు ప్రధానాచార్యులు.
తర్వాత పాఠశాల గుమస్తాను పిలిచి, “ఈ కొత్త ఆచార్యజీని వశిష్ఠ నిలయానికి తీసుకెళ్లి, అక్కడ ఖాళీగా ఉన్న ఒక పడకను చూపించి రా.. ఆయన తన వస్తువుల్ని సర్దుకుంటారు.” అనగానే గుమస్తా రాఘవను “రండి..” అని బయటికి తీసుకెళ్లాడు.
సూట్‌కేసును పట్టుకుని నడుస్తూ పరిసరాలను గమనించాడు రాఘవ. పాఠశాల ప్రారంభంలోనే కార్యాలయం ఉంది. తర్వాత వరుసగా ఐదుగదులు తరగతుల్లాగా ఉన్నాయి. ఒక్కో గదిముందు అది ఏ తరగతో తెలిపే బోర్డు తెలుగులో రాసి ఉంది. ఆ తర్వాత ఉన్నవి హాస్టలు గదుల్లా ఉన్నాయి. అన్నీ విశాలంగానే ఉన్నట్టున్నాయి. ఒక్కో హాలుకూ ఒక్కో ప్రసిద్ధ పురాణ గురువు పేరు బోర్డుపై వ్రాసి వ్రేలాడదీయబడి ఉంది.
గుమస్తా ఒక హాల్లోకి వెళుతూ.. “ఇటు రండి.” అంటూ లోపలికి తీసుకెళ్లాడు. హాల్లోపల అటుఇటు పదేసి చొప్పున పడకలు కనిపించాయి. నేలకు మూడు నాలుగు అడుగుల ఎత్తులోనే ఆ పడకలున్నాయి. ఒక్కో పడక పక్కన గోడకు సిమెంటుతో కట్టిన అల్మైరాలు కనిపిస్తున్నాయి.
ఆ అల్మైరాల్లో ట్రంకు పెట్టె, పుస్తకాలు, సబ్బుపెట్టె, అద్దమూ, స్కూలు బ్యాగు.. ఇలా ఏవేవో వస్తువులు అడ్డదిడ్డంగా పడిఉన్నాయి. హాల్లో పిల్లలెవరూ లేరు. అందరూ భోజనానికి వెళ్లినట్టున్నారు.
రెండు వరుసలకూ మధ్యన చివరగా గోడకు ఆనుకుని ఒక పడక ఖాళీగా కనిపించింది.
గుమస్తా అక్కడికెళ్లి, “ఇదే సార్ మీ పడక. మీ వస్తువుల్ని ఈ అల్మైరాలో సర్దుకోండి.” అని చెప్పి వెళ్లిపోయాడు.
నిజానికి అతను చూపించింది ఖాళీ పడకను మాత్రమే. అనగా ఒక వెడల్పైన కడప బండరాయి అది. అన్ని పడకల మీదా పరుపులున్నాయి. దీనిపైన మాత్రం పరుపు లేదు. ఎందుకు లేదో తెలియదు. ఆ కడపరాయి మీద కూర్చుని సూట్‌కేస్ తెరిచి రోజూ వాడే అవసరమైన వస్తువులన్నీ బయటికి తీసి పెట్టసాగాడు.
ఇంతలో అక్కడికి మాధవరెడ్డి వచ్చాడు. ఆయన్ను చూడగానే రాఘవ లేచి నిలబడ్డాడు.
“ఎలా ఉంది రాఘవా, పాఠశాల?” నవ్వుతూ అడిగాడాయన.
“పాఠశాల చాలా అద్భుతంగా ఉంది బాబాయ్! ఇటువంటి చోట నేను ఉద్యోగం చెయ్యబోతున్నాను అనుకుంటుంటేనే చాలా ఆనందంగా ఉంది. మీ మేలును నేను ఎన్నటికీ మరిచిపోలేను, బాబాయ్!” అన్నాడు రాఘవ మనస్పూర్తిగా.
“సరే, అయితే నేనిక వెళ్లిరానా. ఏ ఆదివారమైనా హనుమకొండకు రా. ఆ పూట మా ఇంట్లో భోజనంచేసి సాయంత్రానికల్లా మళ్లీ తిరిగొచ్చేయొచ్చు. ఇక్కడ నీకు ఏ ఇబ్బందీ ఉండదు అనుకుంటున్నాను. ఏదైనా అవసరమొస్తే ప్రధానార్యులను అడుగు, సరేనా?!” అంటూ ఆయన బయటికి దారితీశాడు.
రాఘవ ఆయన వెనకే వెళ్లి వీడ్కోలు చెప్పాడు.
తిరిగొచ్చి సూట్‌కేసులో నుండి మరికొన్ని వస్తువులను బయటపెట్టసాగాడు.
ఇంతలో ఒక కుర్రవాడు లోపలికి అడుగుపెట్టి రాఘవను చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు.
వాడు మెల్లగా నడుచుకుంటూ వచ్చి.. “నమస్కారం ఆచార్జీ. నా పేరు చల్లా రవి. ఆరో తరగతి సదువుతున్నాను. నాది ఈ నిలయమే! మీరేనా మా నిలయానికచ్చిన కొత్త బాధ్యులు?” అని ప్రశ్నించాడు.
అతని అణకువైన పరిచయానికి ముచ్చటేసింది రాఘవకు. కానీ అతని ప్రశ్న మాత్రం అర్థంకాలేదు.
“ఇయ్యాల కొత్తగా అచ్చింది మీరే కదా ఆచార్జీ, గయితే మీరే మా నిలయం బాధ్యులు?” అని ఆనందంగా బదులిచ్చాడతను.
ఈలోపు ఒకరొకరుగా ఆ నిలయానికి చెందిన పిల్లలు గోలగోలగా మాట్లాడుకుంటూ లోపలికొచ్చి తమతమ అల్మైరాల్లో కంచాలను బోర్లించి పెట్టి పక్కవాళ్లతో ఏదో గుసగుసగా మాట్లాడుకోసాగారు.
వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకుంటున్నారు కానీ, ఎవరూ రాఘవతో మాట్లాడలేదు. బహుశా రాఘవ ఎటువంటి వ్యక్తో తెలియక మౌనం వహించినట్టున్నారు.
ఇందాకా రాఘవకు పరిచయమైన చల్లా రవే అందరితోనూ ఏదో చెబుతున్నాడు. అందరూ ఆసక్తిగా రాఘవను చూడసాగారు.
బయటికి తీసిన వస్తువుల్ని అల్మైరాలో సర్దబోయి చేతిని తాకి చూశాడు. అంగుళం మందాన దుమ్ము పేరుకుని కనిపించింది. అది గమనించిన చల్లా రవి వేగంగా బయటికెళ్లి కర్మాచార్యుణ్ణి (పనిమనిషిని) వెంటబెట్టుకొచ్చాడు.
ఆమె చీపురు చేతబట్టుకొచ్చి శుభ్రంచేసి వెళ్లింది. తర్వాత రాఘవ తన వస్తువుల్ని సర్దుకునే పనిలో పడ్డాడు.
మళ్లీ గుమస్తా వచ్చి, “ఆచార్యజీ.. మిమ్మల్ని ప్రధానాచార్యులు రమ్మంటున్నారు.” అని చెప్పాడు.
గుమస్తా వెనకే వెళ్లాడు రాఘవ.
ప్రధానాచార్యుల గదిలో అప్పటికే ఏడెనిమిది మంది టీచర్లు తెల్లటి లాల్చి పైజమాలతో కుర్చీలలో కూర్చుని కనిపించారు. వాళ్లందరూ ఆ పాఠశాలలో పనిచేసే ఆచార్యులు. ధవళ వస్త్రాలలో వాళ్లను చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపించింది రాఘవకు.
“రండి, వీరే మన పాఠశాలకొచ్చిన కొత్త ఆచార్యులు. పేరు రాఘవ. ఇవ్వాళే మన పాఠశాలలో చేరారు. ఆరు, ఏడు తరగతులకు తెలుగు, సాంఘికశాస్త్రం చెప్పబోతున్న తెలుగు ఆచార్యులు. అలాగే వశిష్ఠ నిలయానికి బాధ్యులు కూడా.” అని చెప్పటం పూర్తవగానే మిగతా ఆచార్యులు అందరూ లేచి రాఘవకు నమస్కరించారు. రాఘవ కూడా వాళ్లకు ప్రతి నమస్కారం చేశాడు.
“మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి..” అనగానే ఒక్కొక్క ఆచార్యుడూ లేచి తన పేరూ, ఏ సబ్జెక్ట్ చెబుతున్నాడో చెప్పి కూర్చున్నాడు.
“మీ గురించీ చెప్పండి.” అని ప్రధానాచార్యులు అనగానే..”నా పేరు రాఘవ. మాది చిత్తూరు. నాకు తెలుగంటే ప్రాణం. ఇక్కడ మీ అందరితోపాటు కలిసి నేనూ పనిచేయబోతున్నందుకు ఆనందంగా ఉంది.” అని చెప్పి మౌనం వహించాడు.
“మంచిది! చూడండి రాఘవగారూ. మీరు చాలాదూరం నుండి ప్రయాణం చేసి అలిసిపొయ్యుంటారు. ఇవ్వాళ తరగతులేవీ తీసుకోనఖ్ఖర్లేదు. రేపు మీకు సమయసారిణిని(టైంటేబుల్) అందిస్తాం. ఆ ప్రకారం మీరు తరగతులకు వెళితే సరిపోతుంది. వెళ్లి భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. రేపటినుండి విధుల్లో చేరుదురు గానీ.. సరేనా?” అని ప్రధానాచార్యులు అనగానే అందరూ పైకిలేచి బయటికి దారితీశారు.
రాఘవ కూడా లేచి తమ నిలయం వైపు నడిచాడు.
అప్పుడు మధ్యాహ్నపు క్లాసుల నిమిత్తం బడి గంటలు మోగుతున్న శబ్దం వినిపించింది.
(ఇంకా ఉంది)