Site icon Sanchika

జ్యుయెల్ ఆఫ్ విదర్భ తాడోబా టైగర్ రిజర్వ్

[డా. నర్మద రెడ్డి గారి ‘జ్యుయెల్ ఆఫ్ విదర్భ తాడోబా టైగర్ రిజర్వ్’ అనే రచనని అందిస్తున్నాము.]

చక్కని అందమైన అడవిని చూడాలని ఎప్పటినుండో కోరిక ఉన్న మేము – పిల్లలకి నాలుగు రోజులు సెలవు రాగానే మహారాష్ట్రలోని చంద్రాపూర్‍కి 45 కిలోమీటర్లు దూరంలో ఉన్న తాడోబా టైగర్ రిజర్వ్‌కి వెళ్ళాలని ప్లాన్ చేశాం.

పులుల సంరంక్షనా కేంద్రమైన ఈ అభయారణ్యానికి నేను, మావారు, అజయ్ రెడ్డి, ప్రియాంక, సంగీత, అయాన్ష్, విశాల్, అర్పిత, వేద్ బయల్దేరాం. అందరం కలిసి రెండు కార్లలో వెళ్లాము. మొదటి రోజు హైదరాబాదు నుంచి బయలుదేరి నిర్మల్ వరకు వచ్చాము నిర్మల్‌లో రాత్రి మయూరి హోటల్‍లో విశ్రమించి మర్నాడు ఉదయం బయలుదేరి 5 గంటలు ప్రయాణం చేసి తాడోబాకి చేరాము.

ఈ ప్రాంతానికి తాడోబా అనే పేరు ఎందుకు వచ్చింది అంటే – ఇక్కడి స్థానికులు తరు అనే గ్రామ దేవతని కొలుస్తారు. ఈ ప్రాంతం ఆంబేరి నది పక్కన ఉంది. ఈ గోండు గిరిజన రాజు ఒక పులిని చంపాడు. అయితే ఆ పులిని చంపే ప్రయత్నంలో గాయపడి మరణిస్తాడు. గిరిజనులందరూ ఆయన పేరు, తమ దైవం తరు, ఆంబేరి నది పేరు కలిపి – ఈ ప్రాంతనికి తాడోబా అనే పేరు పెట్టారు.

పండుగ సమయంలో గిరిజనులు అందరూ తాడోబా చెరువు వద్దకు వచ్చి ఇక్కడ చెరువుని, తరు అనే గ్రామ దేవతను పూజిస్తారు. ఇదంతా దట్టమైన అడవి. ఎంత విశాలమైన అడవి అంటే 241.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దక్షిణా ఆఫ్రికా లోని కొన్ని ప్రాంతాల నుంచి పులులు ఇక్కడికి వలస వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. ఈ అభయారణ్యంలో అనేక వణ్యప్రాణులున్నాయి. ఆంబేరి నదికి నాలుగు పక్కలా డ్యామ్ ఉంది. కోల్స లేక్, జనూరియ లేక్, తాడోబా లేక్, మరో చెరువు నీటితో ఆంబేరి నది నిండుగా ఉంటుంది. ఏదాది పొడవునా నీటి సరఫరా ఉండడంతో ఇకో సిస్టమ్ అద్భుతంగా ఉండి, ఈ పారెస్ట్ అంతా కూడా చాలా బాగా పెరిగింది.

ఇకో సిస్టమ్ పెరగడానికి మరో కారణం ఇక్కడ చక్కగా సిమెంట్ తోటి కట్టలు కట్టి నీరు పారడానికి వీలు కల్పించారు. అందువల్ల చాలా రకాల వన్యప్రాణులు ఇక్కడ జీవిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ లీగ్స్ కూడా చిన్న చిన్నవి చాలా చోట్ల రిజర్వ్ చేసి పెట్టి ఉంచారు. జంతువులు నీరు తాగడానికి కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ చెట్లు ఇంత బాగా, ఇంత దట్టంగా పెరగడానికి కారణం ఈ వాటర్ సోర్స్ ఒక కారణం.

తాడోబా నేషనల్ పార్క్‌లో ఏయే జంతువులు ఉన్నాయంటే – పులులు, చిరుతలు, జింకలు, నక్కలు, అడవి కుక్కలు, డోలే ఇండియన్ ఫాక్స్, గౌర్ ఇండియన్ బైసన్, లేపడ్ క్యాట్ రెస్టీ, స్పాటెడ్ క్యాట్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవి కాకుండా హానీ బ్యాడ్జర్, బార్కింగ్ డీర్, మన్జాగ్ నెల్గాయి, సాంబార్, చీతల్, చౌచింగర్ వైల్పూర్.. వంటివి కూడా ఉన్నాయి. తాడోబాని ‘జ్యుయెల్ ఆఫ్ విదర్భ’ అని అంటారు. 2012లో కొంతమంది 21సార్లు ఆరుసార్లు సఫారీ యాత్ర చేసి 51 పులులు ఉన్నాయని రికార్డ్ చేశారు. కాని ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ 90 వరకు పులులు ఉన్నాయి. కొన్ని చనిపోయి ఉండవచ్చు, కొన్ని బ్రతికి ఉండవచ్చు. సంఖ్య పెరిగీ ఉండవచ్చు. కానీ 90 మాత్రం ఉన్నాయనే చెప్తున్నారు.

ఇక్కడ్ ‘మధుక ఇండికా’ అనే ఒక అందమైన చెట్టుని మేము చూశాము. వీటినే మట్టర్ ట్రీస్ అని కూడా అంటారు. దీనికి చక్కటి తెల్లటి పువ్వులు పూస్తాయి. ఆ పూలతోనే స్థానిక గిరిజనులందరు మహోవ అనే ఒక హోం మేడ్ ఆల్కహాల్‌ని తయారు చేస్తున్నారు. మహోవా పూలకు మత్తు కల్గించే లక్షణం ఉంది. దీనివల్ల ఇక్కడ ఆ డ్రింక్‍ని తయారు చేస్తున్నారు. ఇంకోటి చూసాను అంటే ఘోస్ట్ ట్రీస్. అంటే దయ్యపు చెట్లు అంటారు మన తెలుగులో. ఇవి చాలా పెద్దగా,ఎత్తుగా పెరిగి ఉన్నాయి. పులులు ఈ చెట్టుకి బాగా అలవాటయ్యి, అవి వాటి గోళ్ళని ఈ చెట్టుతో షార్పింగ్ చేసుకుంటాయట. ఇక్కడికి వచ్చి అవి తమ గోళ్ళను చెట్టుకు రుద్దితే గోళ్ళు పదునవుతాయట. ఈ చెట్లనే రాక్ బేస్డ్ ట్రీస్ అని కూడా అంటారు. లెపర్డ్ అన్ని కూడా హిల్ ప్లేసెస్‌ని బాగా ఇష్టపడతాయట. కొన్ని క్రొకోడైల్స్ కూడా ఇక్కడ వింటర్ సీజన్లో ఈ చెరువుల పక్కన కనిపిస్తున్నాయట. ఈ ప్లేస్‌ని ప్యారడైజ్ అంటారు.

నేను ఓ చక్కటి కింగ్ ఫిషర్ బర్డ్‌ని చూశాను. దాని ఫోటో కూడా తీశాను. ఇక్కడ 200 రకాల జాతులు పక్షులు ఉన్నాయి. ఫిష్ ఈగిల్, క్రెస్టెడ్ సర్పెంట్ ఈగిల్, చేంజబుల్ హాక్ ఈగిల్, ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్, ఉడ్ పెకర్స్, వార్‍బ్లర్స్, పికాక్స్ తదితర పక్షులున్నాయి. ఇవే కాకుండా 74 రకాల సీతాకోకచిలుకలు కూడా ఈ తాడోబాలో ఉన్నాయి.

మేము టైగర్ ట్రీస్ జంగిల్ లాడ్జ్ అనే చోట బస చేశాము. ఇది చాలా బాగుంది. ఇందులో ఒక్కొక్క రూమ్‌లో ఒక్కొక్క వైల్డ్ లైఫ్ కి సంబంధించి, ఫారెస్ట్‌కు సంబంధించిన చక్కటి పెయింటింగ్స్ ఉన్నాయి. మనం అడవిలోనే ఉన్నామా అన్నంత ఫీలింగ్ కలిగిస్తుంది.

ఈ తాడోబాలో అందమైన ప్రకృతి మనకి స్వాగతం పలుకుతుంది. పచ్చని చెట్లు తలలూపుతూ మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. లోకాన్నే మైమరిపించే అంత చక్కటి సౌందర్యం! అలా కూర్చుని చూస్తూ మనం ఇక్కడ ఉన్నామా పైన ఎక్కడో స్వర్గ లోకంలో ఉన్నామా అన్నంత భావన కలుగుతుంది, ఇవన్నీ చూస్తూ చక్కగా మా పిల్లలతోటి స్విమ్మింగ్ చేసేసి ఆ రోజు రాత్రికి లాడ్జ్‌లో విశ్రమించాం. మర్నాడు ఉదయం సుమారు 8:30 కల్లా బ్రేక్‌ఫాస్ట్ చేసి కయకింగ్‌కి బయలుదేరాము.

కయకింగ్‌లో మా పిల్లలందరూ చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్క బోర్డు తీసేసుకొని మొత్తం లేక్ అంతా తిరిగేసి వచ్చారు. అవన్నీ ఫొటోస్ తీసుకుంటూ 10:30 వరకు అక్కడే ఉన్నాం. తర్వాత టైగర్ రిజర్వ్‌కి వెళ్ళాం. తాడోబా గేట్ వద్దకు వెళ్ళగానే మాకు అక్కడ ఒక సఫారీ దొరికింది. సఫారీలో 5000 రూపాయలకి 5 మంది, 6, 8 మందిమి కూడా కూర్చోవచ్చు. ఆ సఫారీలో ఎక్కి మేమంతా అడవిలోకి వెళ్ళాము. అడివిలో మాకు సాంబార్ అంటే ఒక రకం జింక కనబడింది. అది చక్కగా ఆకుల్ని నములుతూ – నా రాజ్యంలోకి ఎవరు వచ్చారా అన్నట్టు మమ్మల్ని చూసింది. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. కొంచెం ముందుకు వెళ్ళాకా, అలనాడు సీతారామచంద్రులు వనవాసంలో ఉండగా, సీతకు కనిపించిన బంగారు వన్నె చక్కటి జింకలా,  ఓ బంగారు రంగు లేడిని ఇక్కడ చూసాం. అవి గుంపులు గుంపులుగా కనిపించాయి. ఈ గుంపు ఆడ జింకల గుంపు. మగ జింకలన్నీ మరో గుంపు. ఆ జింకలన్నీ గుంపులు గుంపులుగా వెళ్తూ కనిపించాయి. చాలా చక్కటి దృశ్యం. అక్కడే 15 – 20 నిమిషాలు ఆగి, వాటిని చూసి ఆనందించాం. ఈ చిన్న లేడీ కోసం రామాయణం కథ అంత జరిగింది కదా అని నెమరు వేసుకున్నాం.

మా జీపు ముందుకు కదిలింది. జీప్ లోపలికి వెళ్తుంటే ఎవరో ఒకరు డ్రైవర్‍కి ఫోన్ చేసి తాము అక్కడ ఒక టైగర్‍ని చూసామనీ, ఒక లెపర్డ్‌ని చూసామనీ, అది రోడ్డు దాటుతూ కనిపించిందని చెప్పారు. వెంటనే మా జీప్‍ని ఆ  వైపు పోనిచ్చాడు.

 

ఈ మధ్యలో మేము చాలా ముంగీసల్ని, కోతుల్ని, ఇంకా అడవి పందిని ఇలా కొన్ని వన్యప్రాణులను చూశాం. చివరికి పులి కనబడిన ప్రాంతానికి వెళ్ళాము.  పిల్లలూ, మేము కూర్చుని చూస్తుండగానే పులి రోడ్డు మీదికి వచ్చింది. అలా ఒక రెండు కిలోమీటర్లు మమ్మల్ని చేజ్ చేస్తున్నట్టుగా.. అంటే మమ్మల్ని తరుముతున్నట్టుగా అది మా ముందుకు వస్తూ ఉంది. మా డ్రైవర్ మెల్లగా వెనక్కి పోతూ, దగ్గర దగ్గర 45 నిమిషాలు నడిపాడు. అది నా రాజ్యంలోకి మీరు వచ్చారా అని మా అందరిని చూస్తూ గుర్రుపెడుతూ.. అలా చూస్తున్నప్పుడు – ఒక్కోసారి మీదికి గెంతుతుందేమో అని భయపడ్డాం. అదేమో చక్కగా ఠీవిగా రోడ్డు మధ్యలో ఒకటే లైన్లో నడుస్తూ మా జీప్‌ని తరిమింది. అలా మేము వెనక్కి పోతూ పోతూ ఉన్నాము, అది అలాగా చూస్తూ చూస్తూ ముందుకు వస్తూనే ఉంది. 40 నిమిషాల తర్వాత దానికి ఏమనిపించిందో తెలియదు, మెల్లగా అడవిలోకి వెళ్ళిపోయింది. కానీ ఇందులో కూడా చాలా రిస్కు ఉన్నట్టుగా అనిపించింది. అది ఒక్క నిమిషం గట్టిగా ఆలోచించి మీదకి వస్తే అంత ఓపెన్ టాప్, పిల్లలందరూ ఉన్నారు, ఏమైపోతామో అని భయం వేసింది. అయినా అది ఒక దృశ్యమాలిక అయింది మాకు. ఈ కాలంలో పులులు అసలు కనిపించవు అని చాలామంది చెప్పారు. అయినా మా అదృష్టం. అలా రోడ్డు మీద ఆ పులిని చూస్తూ చూస్తూ వెనక్కి వెనక్కి వెళ్ళటాం చాలా ఎగ్జై టింగ్‌గా, హ్యాపీగా అనిపించింది.

మా ప్రయాణానికో చక్కటి పరమార్థం దొరికిందని సంతోషంతో గేట్ వద్దకి వచ్చాము. అక్కడ ఉన్న అందరికీ మేము పులిని చూశాము, పులిని చూశాము అని కేకలు వేస్తూ చెప్పేశాం. తరువాత ఆ ఫారెస్ట్‌కి బై బై చెప్పేసి – సఫారీకి తీసుకెళ్ళిన డ్రైవర్‍కి కొద్దిగా టిప్ ఇచ్చి మేము మా బసకి వచ్చి విశ్రమించాము.

మర్నాడు తిరుగు ప్రయాణం. చక్కని అనుభూతులతో ఇల్లు చేరాము.

Exit mobile version