శ్రీతిరువేంగళ నాధుడికి శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన కానుకల వివరాలు

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం లోపలి ప్రాకారం, ఉత్తరంవైపు గోడమీద తూర్పు చివరలో చెక్కి ఉన్న శాసనంపైనా, పైన చిన్నాదేవి శాసనందాని కిందుగా తిరుమలదేవి శాసనంలో చెక్కబడి ఉన్న అభిలేఖనం ఆధారంగా శ్రీకృష్ణదేవరాయలు శ్రీతిరువేంగళనాధునికి సమర్పించిన తిరువాభరణాల గురించి వివరిస్తున్నారు వేద ప్రభాస్. [/box]

[dropcap]తి[/dropcap]రుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయం పట్ల జరుగుతున్న రాజకీయ విన్యాసాలు, కొన్ని మీడియా ఛానెళ్ళలో రాజకీయ శక్తులు, మతవాదుల మధ్య కొనసాగుతున్న రచ్చ రచ్చలవుతున్న అర్థం లేని చర్చలు, ఫలితంగా ఈ నాడు ఏడుకొండలస్వామివారి దేవాలయం గురించి, చాలామంది భక్తులకి, అది.. స్థితిపరులకీ, కీర్తిమంతులకీ, మతపెద్దలకీ, రాజకీయనాయకులకి మాత్రమే… ఇంటి వెనుక దేవాలయం అయిపోయిందన్నభావనతో పాటు, తమ దేవుడి ఆలయం తమది కాకుండా పోతున్నదనే భావనా కలుగుతోంది. ఆ భయం వెంటాడుతోంది.

కలియుగ దైవమైన శ్రీనివాసుడు, భక్త జన హితుడు, భక్త సులభుడూ, కావటం వల్ల ఏ ఒక్క హిందువుకీ, ఆలయపరంగా జరుగుతున్న సంఘటనలవల్ల, ఆయనపై భక్తి, అణుమాత్రం కూడా తగ్గలేదు…. సరికదా..!.. దినదినానికీ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూనే వుంది. స్వామివారి సంగతి చూసుకోవడానికి తమకన్నా పెద్దవాళ్లున్నారు లెమ్మని సామాన్యభక్తులు  పక్కకి మళ్లిపోతున్నారు. వాళ్ళవల్ల కూడా కాకపోతే,శత్రుసంహారానికి ఆయనే తనచూపు సారిస్తాడని ఆ భక్తులకి అపారమైన విశ్వాసం. నేను, శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తుడిగా, చరిత్రపట్ల ఆసక్తి ఉన్న ఒక పాఠకుడిగా, శ్రీతిరువేంగళనాధుడికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన కానుకల సమాచారాన్ని కింద తెలియజేస్తున్నాను. శాసనాల రూపంలో, ఖచ్చితమైన సాక్ష్యాధారాలున్నసమాచారం ఇది.

తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రధాన ద్వారం దాటగానే, కుడిపక్కనున్న మంటపంలో స్వామికి అభిముఖంగా స్థాపించబడి ఉన్న విగ్రహాలు, శ్రీకృష్ణదేవరాయలు, దానికి కుడిపక్కన చిన్నాదేవి, ఎడమ పక్కన తిరుమలదేవి అనే అతని ఇద్దరు భార్యలవి. ఆ విగ్రహాలకు కుడిభుజాలమీద “చిన్నాదేవియరు, క్రిష్ణరాయమహారాయరు, తిరుమలదేవియరు అనే పేర్లు కన్నడభాషలో చెక్కినవి కనబడతాయి. ఇవి వారి అసలు రూపాలకు ప్రతీకలని చెప్పటం సరికాదుగానీ కృష్ణదేవరాయలు జీవించి ఉన్నపుడే, వీటిని రూపొందించడం జరిగిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అతడు శ్రీవేంకటేశుడికి పరమభక్తుడని మనకి ‘ఆముక్తమాల్యదచెపుతుంది. ఆ విగ్రహాల స్థానాన్నిబట్టి, చిన్నాదేవి అతని పట్టపురాణి అనీ, తిరుమలాదేవి రెండవ భార్య అనీ తెలుస్తుంది.

శాసనాల వివరాలు

1.స్వస్తిశ్రీ శాలివాహనశకం. 1434సంవత్సరంలో (అంటే క్రీ.శ.1512సంవత్సరం) ఆంగీరస శుధ్ధఫాల్గుణ పంచమి (మార్చి 5వ తేదీ) నాడు, శ్రీకృష్ణదేవరాయల చిన్నోంజి అమ్మవారు, తిరువేంగళనాధుని, ’ఆనవాల (అంటే ఆవు నుంచి అప్పుడే తీసిన గుమ్మపాలు) నైవేద్యమునకు 374 తూకాల పైడిగిన్నె సమర్పించేరని, ఆరోజు నాడే ఆయన మరొక భార్య తిరుమలదేవి కూడా అంతే బరువున్న మరొక బంగారం గిన్నెను సమర్పించేరనీ, శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయప్రాకారం మీద ఉన్న రెండు శాసనాలు చెపుతున్నాయి. అంతేకాదు పైడితట్ట ఒకదానికి 10 తూకాల లెక్కన, ఇద్దరూ సమర్పించాలని సంకల్పించేరు (ఇవి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం లోపలి ప్రాకారం, ఉత్తరంవైపు గోడమీద తూర్పు చివరలో చెక్కి ఉన్నవి. పైన చిన్నాదేవి శాసనందాని కిందుగా తిరుమలదేవి శాసనం చెక్కబడి ఉన్నాయి.)

2.స్వస్తిశ్రీ శాలివాహనశకం 1435వ సంవత్సరం (అంటే క్రీ.శ.1513 సంవత్సరం) శ్రీముఖ నామ సంవత్సరం, వైశాఖ బహుళ ద్వాదశి (మే 12వ తేదీన) నాడు సోమవారాన శ్రీకృష్ణదేవరాయలు, శ్రీతిరువేంగళనాధునికి సమర్పించిన తిరువాభరణాల స్వరూపాలు.

వింపుడు ధార 1 కి అడ్డిగలు-5, పిన్న అడ్డిగలు 4, కీడఅడ్డిగలు 8, అంతుఅడ్డిగలు 17, వాటన్నిటికీ పచ్చలు 178, వజ్రాలు 508, కెంపులు 177, పడల్లి పైడిధార 1, సహా తూకాలు 662 కి ఉడుధార 1 కఠారి ఒర 1 కి పాతవజ్రాలు 131, కెంపులు 331, నీలాలు 2 తోతూకాలు 175 ఇంకా కఠారికుచ్చు1కి ముత్యాలు 32000, కుచ్చుల మీద దొడ్డ ముత్యాలు 17, కుచ్చుమీది కుప్పి బట్టువకి కెంపులు 28, వీటికి తూకాలు 128, వుభయంకుచ్చుతో సహాతూకాలు 326, కఠారి 1కి నిచ్చళం, ఉడుధార 1కి అడ్డిగలు, 8టికి కెంపులు 43, పచ్చలు 15, వజ్రాలు 20, సహా తూకాలు 165, కి ఉడుధార 1నిచ్చళం, కఠారి వొఱ1 కి తూకాలు 132. ఇక కఠారి పరజు మీదకి కెంపులు 24, సన్నపు ముత్యాల కుచ్చు 1 సహా కఠారి 1ని మరి కఠారి వొఱ 1కి, కెంపులు 55,పచ్చ 1, వజ్రాలు 36టికి తూకాలు 8, పట.. 1టికి, ముత్యాలు 4, కుచ్చులు… వజ్రాలు 117,

రెండవ పంక్తిలో… కి తూకాలు 87, భుజకీర్తిజోటు 1కి, ముత్యాలు 322, కెంపులు 360, నీలాలు 4, పాతవజ్రాలు 247, సహా తూకాలు 573టికి భుజకీర్తి జోడు 1కి నిచ్చళం, భుజకీర్తి జోడు 1కి తూకాలు 188 వుభయం , భుజకీర్తి జోళ్ళు 2 పట్ల 1కి, అడ్డిగలు 17, రావి ఆకు అడ్డిగలు 30కి ముత్యాలు 30, కెంపులు 210, వజ్రాలు 58, పచ్చలు 5, సహా తూకాలు 205 కి… 1 కి ముత్యాలు 122, కెంపులు 183, వజ్రాలు 104, రావి ఆకు వెండి ముత్యాలు 33 కి తూకాలు… తూకాలు 276 కి పట్టు 1, వ్భయం పట్టాలు2, ఉత్సహ దేవళ కిరీటాలు 3 కి ముత్యాలు 405, పాతవజ్రాలు 284, కెంపులు 822, వైఢూర్యం 1, నీలాలు 6, సహతూకాలు 380, కిరీటాలు అంత వరకు తమ సేవకు సమర్పించి అవధరించెరు.

మొత్తం బంగారు ఆభరణాలు (వాటి కోసం ఉపయోగించిన బంగారం, నేటి కాలపు విలువ సుమారుగా34 కోట్ల రూపాయలు )

  1. బంగారుగిన్నెలు 2 (ఒక్కొక్కదానిబరువు, నాటితూకం అంటే, నేటితులం అనుకుంటే 4కేజీలపై ఉంటుంది. అంటే ఒక దాని విలువ సుమారు 12 కోట్ల రూపాయలు అనుకోవచ్చు. రెండిటి విలువ 24 కోట్లుపైగానే ఉంటుంది. ఈ లెక్క తప్పుకావొచ్చు కానీ వాటి విలువ తక్కువగా చెప్పినదే)
  2. పైడి తట్టలు ( బంగారు పళ్ళేలు)-2 (ఒక్కొక్కటీ 10 తూకాలు అంటే 10 తులాలనుకుంటే 6 లక్షల విలువ కలవి కావొచ్చు.)
  3. వింపుడుధార1కి అమర్చిన స్వర్ణాభరణాలు 5 అడ్డిగలు, b. 4 పిన్నఅడ్డిగలు c. 8 కీడ అడ్డిగలు  d. 17 అంతుఅడ్డిగలు, పడల్లిపైడిధార 1కి, సహాతూకాలు 662కి (వీటి విలువ 2కోట్లు దాకా ఉండొచ్చు)
  4. ఉడుధార 1కి, కఠారిఒర1కి తూకాలు 175 (53 లక్షల విలువ కలవి కావొచ్చు.)
  5. కఠారికుచ్చు1కి కుచ్చులమీదదొడ్డముత్యాలుఅమరికకి, కుచ్చుమీది కుప్పి బట్టువ, అమరికకి తూకాలు 128 (39 లక్షల విలువ కలవి కావొచ్చు)
  6. వుభయంకుచ్చు తూకాలు 326 ( 98 లక్షల విలువ కలవి కావొచ్చు)
  7. కఠారి1కినిచ్చళం, ఉడుధార 1కి అడ్డిగలు,8 తూకాలు 165 (50 లక్షల విలువ కలవి కావొచ్చు)
  8. ఉడుధార 1నిచ్చళం, కఠారి వొఱ1కి తూకాలు 132,(40 లక్షల విలువ కలవి కావొచ్చు)
  9. కఠారి పరజు, సన్నపు ముత్యాల కుచ్చు 1 సహా కఠారి 1ని మరి కఠారి వొఱ 1కి తూకాలు 8 (3 లక్షల విలువ కలవి కావొచ్చు)
  10. పట.. 1టికి, కుచ్చులు ..కి తూకాలు 87 (26 లక్షల విలువ కలవి కావొచ్చు)
  11. భుజకీర్తిజోటు1కి సహా తూకాలు 573 (1 కోటి 72 లక్షలు కావొచ్చు)
  12. భుజకీర్తి జోడు 1కి నిచ్చళం,భుజకీర్తి జోడు 1కి తూకాలు 188 వుభయం (57 లక్షలు కావొచ్చు)
  13. భుజకీర్తి జోళ్ళు 2 ,పట్ల 1కి,అడ్డిగలు 17,రావి ఆకు అడ్డిగలు30కి సహా తూకాలు205 (62 లక్షలు కావొచ్చు)
  14. రావి ఆకు కి , పట్టు 1 కి,వ్భయం పట్టాలు2 కి తూకాలు276 (83 లక్షలు కావొచ్చు)
  15. ఉత్సహ(?) దేవళ(దేవతలలేదా మూర్తుల) కిరీటాలు3 కి సహ(సమానమైన)తూకాలు 380(1 కోటి 15 లక్షలు కావొచ్చు)

రత్న సముదాయం వివరాలు (వీటి విలువ,నేడు అంచనాలకు కూడా అందనిది)

  1. 1. ముత్యాలు-32,916. 2. వజ్రాలు- 3.కెంపులు-2233.4.పచ్చలు-398.5.నీలాలు-12 6.వైఢూర్యం 1

రాయలసీమను రత్నాల సీమగా తన కాలంలో మార్చి అంగళ్ళలో రత్నాలు అమ్మేలా పాలించిన కృష్ణదేవరాయలు శ్రీవేంకటేశ్వరస్వామికి  ఎంతో భక్తిశ్రధ్ధలతో సమర్పించిన ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, కెంపులు, నీలాలు, పచ్చలు, వైఢూర్యం వంటి వాటి విలువలని లెఖ్ఖ వెయ్యాలంటే ఈనాటి రత్నపరీక్షకులకి అది ఒక అగ్నిపరీక్షే అవుతుంది. ఆభరణాల రూపురేఖలు, భారాలు, వాటిపేర్లను బట్టి ఖచ్చితంగా ఈనాడు తెలుసుకోవటం ఆనాటి శాసనాలలో ఉపయోగించిన భాషపరంగా ఇబ్బంది కలిగించే అంశమవుతోంది… కనుక, నా గణితంలో చాలా దోషముండొచ్చుగానీ, వాటి కోసం ఆనాడు వినియోగించిన బంగారం  విలువ మాత్రం నేడు (అవి ఉన్నట్టయితే) చాలా అధికంగానే ఉంటుంది.

మరికొన్ని శాసనాల ప్రకారం, రాయలు 8సార్లు తనదేవేరులతో సహా తిరుపతి వెళ్ళి, శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం చేసుకున్నట్టు, ప్రతీసారి స్వామివారికి అమూల్య ఆభరణాలు, మాన్యాలు దానం చేసినట్టు తెలుస్తుంది. అతని భార్యలు కూడా అఖండదానాలే చేసేరు. 30000 వరహాలతో, అతడు శ్రీవారికి కనకాభిషేకం జరిపినట్టు, 30000 వరహాల బంగారంతో శ్రీవారి విమానానికి పూత పూయించినట్టూ తెలుస్తుంది.

మహారాష్ట్ర నాయకుడు ‘రంఘోజీబాంస్లే కూడా శ్రీవేంకటేశ్వరస్వామివారి పూజాపునస్కారాలకి, శాశ్వత నిధులని అమర్చి వెళ్ళేడు. అంత మాత్రమే కాదు స్వామి వారికి ఎన్నో విలువైన ఆభరణాలను అర్పించేడు. ఒక అత్యంత విలువైన ’పచ్చని ఒక పెట్టెలో అమర్చి మరీ స్వామివారికి సమర్పించేడు. మైసూరు, గద్వాల పాలకులు కూడా స్వామివారికి విలువైన నివేదనలే చేసేరు.

ముందు ఒక భక్తుడిగా నేను ఆలయ నిర్వాహకులని అడిగేదొక్కటే.. ఆభరణాలన్నీభద్రంగా ఉన్నాయనే చెపుతున్నారు. కమిటీలు అన్నీ ఆ మాటే చెప్పేయంటున్నారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలను, రంఘోజీ భాంస్లే సమర్పించిన వాటిలోని పచ్చనీ.. ఆ శ్రీనివాసుడి భక్తులకి మీరు చూపించగలరా..? అన్నదే నా ప్రశ్న.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here